విభజన కాకుండానే రికార్డుల విధ్వంసమా?

830

ఏపీ రికార్డులు కూడా ధ్వంసం చేస్తారా?
హక్కుల కమిషన్ తీరుపై అభ్యంతరాలు
ఏపీలో హక్కుల కమిషన్ నియమించని ఏపీ
హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయని జగన్ సర్కార్
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ ఇంకా విభజన జరగలేదు. కోర్టు ఆదేశాలతో ఒక్క తెలంగాణ రాష్ట్రమే, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసింది. కానీ ఇంతవరకూ ఏపీ సర్కారు హక్కుల కమిషన్‌ను నియమించలేదు. ఉద్యోగుల విభజన జరగలేదు. అయినప్పటికీ తెలంగాణ హక్కుల కమిషన్ కార్యాలయంలోనే, ఏపీ మానవహక్కుల కమిషన్ కొనసాగుతోంది. ఏపీ హక్కుల కమిషన్ కార్యాలయ చిరునామా కూడా, హైదరాబాద్‌లోని గృహకల్ప కార్యాలయంలోనే ఉండటం మరో విచిత్రం. ఇప్పటికీ హక్కుల ఉల్లంఘనపై ఏపీ నుంచి వచ్చే ఫిర్యాదులన్నీ, తెలంగాణ హక్కుల కార్యాలయమే తీసుకోవడం మరో విచిత్రం. ఇన్ని విచిత్రాల నడుమ.. కార్యాలయంలోని అనవసరమైన రికార్డులను ధ్వంసం చేస్తున్నట్లు, తెలంగాణ హక్కుల కమిషన్ పత్రికా ప్రకటన ఇవ్వడం వివాదానికి దారితీస్తోంది. కమిషన్ కార్యాలయ విభజన పూర్తికాకుండానే, రికార్డుల ధ్వంసం చేసేందుకు జారీ చేసిన ప్రకటనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ‘పాత రికార్డులకు సంబంధించిన తుది ఆదేశాలు మినహా, మిగిలిన రికార్డులను ధ్వంసం చేస్తాం. రికార్డుల ప్రకాక్షళనలో భాగంగా దీనిని చేపడుతున్నాం. అభ్యంతరాలేమైనా ఉంటే, 15 రోజుల్లోగా హెచ్చార్సీ కార్యదర్శిని సంప్రదించాలి’- ఇదీ తెలంగాణ మానవ హక్కుల కమిషన్ తాజాగా ఇచ్చిన పబ్లిక్ నోటిఫికేషన్. పైగా రికార్డుల ప్రక్షాళన రెగ్యులేషన్స్ -2013 ప్రకారం 2003 నుంచి 2017 వరకూ రికార్డులను రీస్టోర్ చేసినట్లు తెలిపింది. ఇదీ.. తెలంగాణ హెచ్చార్సీ ఇచ్చిన పత్రికా ప్రకటన!రికార్డుల ప్రక్షాళన కోసం, దీనిని చేపడుతున్నట్లు ప్రకటించడం వరకూ బాగానే ఉంది. అయితే, ఆ రికార్డుల ధ్వంసంలో ఏపీకి సంబంధించిన రికార్డులు కూడా ఉన్నాయా? లేవా అన్న దానిపై స్పష్టత ఇవ్వకపోవడమే, గందరగోళానికి దారితీసింది. ఎందుకంటే ఇప్పటివరకూ.. ఏపీ హక్కుల కమిషన్ కార్యాలయంతోపాటు, ఏపికి సంబంధించిన రికార్డులు కూడా తెలంగాణ హెచ్చార్సీ కార్యాలయంలోనే ఉన్నాయి. ఇప్పటిదాకా ఉద్యోగుల విభజన జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులే కొనసాగుతున్నారు.

పైగా.. గత 9 నెలల నుంచి ఏపీలో హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులన్నీ, తెలంగాణ హెచ్చార్సీ కార్యాలయమే స్వీకరిస్తోంది. మరి ఆ ప్రకారంగా.. తెలంగాణ హెచ్చార్సీ కార్యాలయంలోనే, ఏపీకి సంబంధించిన రికార్డులు కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. తాజా నోటిఫికేషన్ అనుసరించి, రికార్డులు ధ్వంసం చేసే వాటిలో.. ఏపీకి సంబంధించిన కేసుల తాలూకు రికార్డులు కూడా ఉంటాయా? ఉండవా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

ఇంతవరకూ ఏపీకి హక్కుల కమిషన్ నియమించపోయినప్పటికీ, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఫిర్యాదుదారులు, ఇప్పటికీ హైదరాబాద్ గృహకల్పలో ఉన్న తెలంగాణ హెచ్చారీ కార్యాలయానికే వచ్చి అర్జీలు ఇస్తున్నారు. వాటిని అధికారులు స్వీకరించి, రశీదులు కూడా ఇస్తున్నారు. ఏపీలో సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ కేసు, శిరోముండనం కేసుకు సంబంధించిన ఫిర్యాదులు కూడా, ఈ కార్యాలయంలోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ఏపీ మాన వ హక్కుల కమిషన్ కార్యాలయ బోర్డును తొలగించారు. అది మీడియాలో రావడంతో.. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ హక్కుల కమిషన్ కార్యాలయం పేరిట, రెండు బోర్డులు విడిగా ఏర్పాటుచేశారు. అయితే రెండు రాష్ట్రాల హక్కుల కమిషన్ కార్యాలయాల చిరునామా అదే కావడం ఆశ్చర్యం.

నిజానికి, ఏపీకి హక్కుల కమిషన్ నియమించనందున, తమ వద్దకు వచ్చే ఫిర్యాదుల వివరాలను తెలంగాణ హెచ్చార్సీ అధికారులు, ఏపీ ప్రభుత్వానికి పంపించాలి. వాటిని ఏం చేయాలన్న దానిపై వివరణ కోరాలి. కానీ ఈ రెండింటిలో ఏదీ జరిగినట్లు కనిపించడం లేదంటున్నారు. ఏపీ నుంచి వచ్చే ఫిర్యాదులన్నీ కట్ట కట్టి పక్కన పెడుతున్నారు. అయితే, ఇటీవల మాలహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుమార్‌రాజా తెలంగాణ హెచ్చార్సీ చైర్మన్‌కు ఒక లేఖ రాశారు. మీరు ఏపి నుంచి వస్తున్న అర్జీలు, ఆ ప్రభుత్వానికి పంపిస్తున్నారా? లేదా? ఆవిధంగా ఏపి అర్జీలు కూడా తీసుకోమని మీకేమైనా ఆదేశాలున్నాయా? అని ప్రశ్నిస్తూ రెండుపేజీల లేఖ రాశారు. ఇదీ ప్రస్తుతం హెచ్చార్సీలో జరుగుతున్న పరిణామాలు.

ఉమ్మడి రాష్ట్రంలో నిస్సార్ అహ్మద్ కక్రూ చైర్మన్, కాకుమాను పెద పేరిరెడ్డి, మిరియాల రామారావు కమిషన్ సభ్యులుగా ఉన్నప్పుడే.. 2013లో రెగ్యులేషన్స్ రూపొందించి, జీఓ ఎంఎస్ నెంబర్ 555తో గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అందులో .. హెచ్చార్సీ ఎలా పనిచేయాలన్న నిర్దేశం ఉంది. నిజానికి కక్రూ చైర్మన్‌గా ఉన్నప్పటికీ, ఆయన ఎక్కువకాలం సీట్లోనే ఉండేవారు కాదు. తీర్పులు-విచారణలన్నీ, కాకుమాను పెద పేరిరెడ్డి చూసేవారు. ఆ తర్వాత ఆయనే యాక్టింగ్ చైర్మన్ అయ్యారు. అది వేరే విషయం. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన తెలంగాణ హెచ్చార్సీ కూడా.. ఆ మేరకు రెగ్యులేషన్స్ రూపొందించి, ప్రభుత్వానికి పంపి, గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకూ అలాంటి చర్యలు చేపట్టకుండానే, రికార్డుల ధ్వంసంపై నోటిఫికేషన్ ఎలా ఇస్తారన్న ప్రశ్నలు న్యాయవాదుల నుంచి వినిపిస్తున్నాయి. అది కూడా ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న హెచ్చార్సీని విభజించకుండా చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి, ఒక పిటిషనర్ వేసిన కేసు మేరకు… ఏపీలో మానస హక్కుల కమిషన్ ఏర్పాటుచేయాలని, దాని కార్యాలయం కూడా ఏర్పాటుచేయాలని.. హైకోర్టు గత ఏడాది అక్టోబర్ 31న ఏపీ సర్కారును ఆదేశించింది. అందుకు ఏపీ ప్రభుత్వం రెండు నెలల గడువు కోరింది. అయితే హైకోర్టు మాత్రం నాలుగు నెలల గడువు ఇచ్చింది. అప్పుడు హెచ్చార్సీ ప్రక్రియ పూర్తయిందని తమకు చెప్పాలని ఆదేశించింది. హెచ్చార్సీ లేనందున, ఆ కేసులు కూడా తమ వద్దకు రావడంతో పనిభారం పెరిగిపోయిందని వ్యాఖ్యానించింది. అందుకు స్పందించిన అడ్వకేట్ జనరల్ శ్రీరాం.. మూడు నెలల్లోగా కమిషన్‌ను తిరిగి ఏర్పాటుచేస్తామని చీఫ్ జస్టిస్ సీజే మహేశ్వరి, జస్టిస్ కె.విజయలక్ష్మితో కూడిన ధర్మాసనానికి చెప్పారు. అయితే.. హైకోర్టు ఆదేశాలను, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి యధావిధిగా బేఖాతరు చేశారు. దీనిపై మళ్లీ అదే పిటిషనర్.. సర్కారుపై కోర్టు ధిక్కరణ కేసు వేశారు. తొలుత బెజవాడలోని ఆర్ అండ్ బీ కార్యాలయాన్ని కార్యాలయంగా ఎంచుకున్నట్లు ప్రచారం జరిగింది. అది కూడా ఏ కారణం వల్లనో వెనక్కి పోయింది. ఏపీలో హెచ్చార్సీ ఏర్పాటుచేయమని ఆదేశించి నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకూ ఆ ఊసే లేకపోవవడం కచ్చితంగా ధిక్కారమేనని న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు. చివరకు హైకోర్టు ఆదేశాలు కూడా అమలుచేయకపోతే, ఇక ఎవరికి చెప్పాలన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మండలి చైర్మన్ టీడీపీకి చెందిన వ్యక్తి ఉన్నందున, ఆయన పదవీకాలం ముగిసేవరకూ.. హక్కుల కమిషన్‌ను ఏర్పాటుచేయకూడదన్న భావనతో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే నిజమయితే వచ్చే ఏడాది కూడా ఏపీలో హక్కుల కమిషన్ ఏర్పాటు కల్లగానే మారడం ఖాయం.