పాస్టర్లకు..ప్రేమతో..

702

ఏపీలో దళిత బాలికలపై పెరుగుతున్న పాస్టర్ల అత్యాచార యత్నాలు
మొన్న గాజువాక.. నిన్న తిరుపతి
మాజీ ఐపిఎస్ ట్వీట్ తర్వాతనే కదలిక
‘దిశ’ లేని ఏపీ సర్కార్
మతమార్పిళ్లపై దళితులలో మారుతున్న ఆలోచనలు
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

పండితురాలు నందమూరి లక్ష్మీపార్వతి చెప్పినట్లు.. హిందూమతంలో చేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలనలో, దళిత మహిళలపై పాస్టర్లు చేస్తున్న అత్యాచారాల సంఖ్య పెరుగుతుండటం, మహిళాలోకానికి కలవరం కలిగిస్తోంది. విశాఖ పీఠాథిపతి స్వరూపానంద సరస్వతి.. సీఎం జగన్‌తో మూడుసార్లు గంగలో మునక వేయించి, హిందూమతంలోకి తీసుకువచ్చారని పండితురాలు పార్వతమ్మ ఇటీవలే ప్రకటించారు. అయినప్పటికీ జగన్‌పై క్రైస్తవ ముద్ర వేయడం దారుణమని, ఆవేదన వ్యక్తం చేశారు. అటు రోజా కూడా జగన్ పాలనలో హిందువులంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. అంటే జగన్ క్రైస్తవుడు కాదు. ఫక్తు హిందూ అని చెప్పడమే, ఈ మహిళానేతల కవిహృదయం కావచ్చు. మంచిదే. జగన్‌పై అలాంటి ప్రచారానికి తెరపడి, ఆయన అందరివాడయితే, రాష్ట్ర ప్రజలకూ సంతోషమే.

కానీ, ఏపీలో ఇటీవలికాలంలో నిర్నిరోధంగా జరుగుతున్న పాస్టర్ల అత్యాచారాలపై.. సర్కారు నుంచి ఎలాంటి చర్యలు కనిపించకపోవడం, హిందూ సంస్థల ఆగ్రహానికి దారితీస్తోంది. నిజంగా హిందువు సీఎంగా ఉంటే మహిళలు, దళితులపై పాస్టర్ల అత్యాచారాలు నిర్నిరోధంగా జరుగుతాయా? అన్న ప్రశ్నలు హిందూ సమాజం నుంచి వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం విశాఖ జిల్లా గాజువాకలో ఒక పాస్టర్.. ప్రార్ధన పేరిట ఒక దళిత బాలికపై అత్యాచార యత్నం ఘటన, స్థానిక దళితులకు ఆగ్రహం కలిగించింది. ఈ ఘటనలో పాస్టర్‌పై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. దళితులను మతం మారుస్తున్న పెద్దలు.. ప్రార్ధనల పేరిట అదే దళిత బాలికలపై, అత్యాచారాలకు ఒడిగడుతున్న వైనం.. దళితవర్గాల్లో కొత్త ఆలోచనలకు బీజం వేసింది.

అనేక ప్రలోభాలతో మతం మారుస్తున్న పాస్టర్లు, చివరకు తమ పిల్లలపైనే అత్యాచారానికి పాల్పడుతుండటాన్ని, దళితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితంగా.. క్రైస్తవంలో చేరాలంటూ తమపై వస్తున్న ఒత్తిళ్లపై తమ నిర్ణయాన్ని పునరాలోచించుకునేందుకు, ఈ ఘటన బీజం వేసింది. మతం మారితే జీవితాలు మార్చేస్తామని, పిల్లలకు ఉచితంగా ఖరీదైన విద్య అందిస్తామన్న ప్రలోభాలవైపు, దళితులు ఇప్పటివరకూ ఆశగా చూసేవారు. ఇప్పటివరకూ ఇలాంటి ప్రలోభాలతోనే, గ్రామాల్లో పాస్టర్లు తమ జాతికి చెందిన వారిని మతం మార్చారని, హిందూ- మాల, హిందూ మాదిగ నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఆ తర్వాత ప్రలోభాలకు లొంగి, మతం మారిన తమ ఆడపిల్లలపై పాస్టర్లు, ప్రార్ధనల పేరుతో.. లైంగిక వేధింపులు, అత్యాచారయత్నానికి ఒడిగడుతున్న వైనంపై, దళితుల్లో కొత్త ఆలోచన మొదలయినట్లు కనిపిస్తోంది. తాము ప్రలోభాలకు లొంగడం వల్లనే, తమ బిడ్డలపై ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయన్న వాస్తవం.. ఇలాంటి ఘటనలతో తమ జాతికి అర్ధమయిందని చెబుతున్నారు. పాస్టర్లు అత్యాచారం చేయడానికే.. దళితులను మతం మార్చేందుకు ఎంపిక చేసుకున్నట్లుందన్న వ్యాఖ్యలు, హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్నాయి.

గాజువాకలో దళిత బాలికపై పాస్టర్ పాశవిక దాడి చేసిన దారుణం మర్చిపోకముందే.. వాటికన్ సిటీగా పేరున్న తిరుపతిలో, మరో పాస్టర్ ఒక యువతిపై అత్యాచార యత్నం చేయడం కలకలం సృష్టించింది. 20 ఏళ్ల యువతిపై దేవసహాయం అనే పాస్టర్, లైంగిక వేధింపులు-అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాధితులురాలు ఈస్ట్ పోలీస్‌స్టేషన్, దిశ పోలీసుస్టేషన్‌లో, తనపై అత్యాచారయత్నం చేసిన పాస్టర్ దేవసహాయంపై ఫిర్యాదు చేసింది. తాము పదిరోజుల నుంచి దిశ పోలీసుస్టేషన్ చుట్టూ తిరుగుతున్నా, పట్టించుకోవడం లేదని బాధితురాలు, ఆమె స్నేహితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ ఘటనపై పోలీసులు స్పందించని వైనంపై నిరసన వ్యక్తమయింది. అటు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు కూడా రంగంలోకి దిగారు. పాస్టర్‌పై దిశ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలిపై రెండుసార్లు అత్యాచారయత్నం జరిగిందని ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి ఆరోపించారు. పైగా దిశ స్టేషన్ ఎస్‌ఐ హైమావతి, బాధితురాలితో అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఈలోగా పాస్టర్ చేసిన అత్యాచార యత్నంపై పోలీసుల మౌనాన్ని మాజీ ఐపిఎస్ నాగేశ్వర్‌రావు ట్వీట్ చేయడంతో, పోలీసు యంత్రాంగం అనివార్య పరిస్థితిలో స్పందించాల్సి వచ్చింది.


దీనితో ఏఎస్పీ సుప్రజ రంగంలోకి దిగడంతో, ఎట్టకేలకూ పోలీసులు కదిలారు. చివరకు గాజులమండ్యం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వాయువేగంతో స్పందించి.. కేసు నమోదు చేయాల్సిన దిశ పోలీసుస్టేషన్ అధికారులు, మీనమేషాలు ఎందుకు లెక్కబెడుతున్నారన్నది ప్రశ్న. కేవలం మహిళలపై అత్యాచారాలు నిరోధించేందుకు, నిందితులను శిక్షించేందుకు మాత్రమే ఏర్పాటుచేసిన దిశ పోలీసుస్టేషన్లు.. తమకు అప్పగించిన బాధ్యత కూడా నిర్వర్తించకపోతే, ఇక ఆ వ్యవస్థపై ఎవరికి నమ్మకం ఉంటుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


రాష్ట్రంలో దళితులపై పాస్టర్ల అత్యాచారాలు, రోజురోజుకూ పెరిగిపోతున్నా.. పోలీసులు వారిపై వెంటనే చర్యలు తీసుకునేందుకు, భయపడుతున్నారన్న విమర్శలు, హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో ఏ ప్రభుత్వంలోనయినా ఇలాంటి ఘటనలు జరిగితే, పోలీసులు వాయువేగంతో స్పందించేవారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అధికారులు కూడా.. పాస్టర్లపై చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందోనన్న భయంతో ఉన్నారని, హిందూ సంస్థల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతర్వేది వ్యవహారంలో కూడా, రథాన్ని తగులబెట్టిన వారిని ఇప్పటిదాకా గుర్తించలేని పోలీసులు.. చర్చిపై రాళ్లేశారన్న ఫిర్యాదు మేరకు, డజన్ల మందిపై కేసులు పెట్టి, అరెస్టు చేసిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. బాలికలపై అత్యాచార యత్నానికి పాల్పడిన.. ఇద్దరు పాస్టర్లపై దిశ చట్టం కింద కేసు నమోదు చేస్తేనే, లక్ష్మీపార్వతి చెప్పినట్లు.. జగన్మోహన్‌రెడ్డిని హిందూ సమాజం హిందువుగా భావిస్తుందని, హిందూ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. మరి పండితురాలు పార్వతమ్మ, ‘జగన్గురువు’ స్వరూపా సాములోరు ఏం చెబుతారో చూడాలి!