టీఆర్‌ఎస్ ఇమేజీకి..‘వర్షం’ డ్యామేజీ

484

‘కారు’ మబ్బులు.. విమర్శల ‘వర్షం’
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఇస్తాంబుల్‌గా మార్చేస్తాం.. మరో లండన్ చేసేస్తాం.. విశ్వనగరంగా మారుస్తాం.. ప్రపంచంలో నెంబర్ వన్ సిటీగా మారుస్తాం.. 640 కోట్లు ఖర్చు పెట్టాం.. ఇవన్నీ ఎక్కడో ఎప్పుడో విన్నట్లు ఉన్నాయి కదూ?.. కేసీఆరో, కేటీఆరో, ఇంకెవరో మంత్రులో ఇప్పటికి కొన్ని వందల డజన్ల సార్లు చెప్పినట్లు అనిపిస్తోంది కదూ? యస్.. మీరేమీ పొరపాటునో, గ్రహపాటునో వినలేదు. మీరు విన్నది, గుర్తు చేసుకుందీ నిఝంగా నిజం! సాక్షాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, అనేక సందర్భాల్లో చేసిన బాసలే ఇవి. ఇచ్చిన ప్రసంగాలే అవి!

అది ఎంత నిజమో..  ఇప్పుడు మీరు చూస్తున్న వర్షనగరమూ’ అంతే నిజం. ఒక్కరోజు కురిసిన రాకాసి వర్షానికి, రాజధాని నగర రాదార్లు గోదార్లయ్యాయి. మొసళ్లు రోడ్లపైకి వచ్చాయి. చిన్నారులతోపాటు, కార్లు జలసమాధి అయ్యాయి. రోడ్లమీద ఉండాల్సిన నీళ్లు వంటింట్లోకి చేరాయి. కాలనీలు చిన్నపాటి చెరువులయ్యాయి. మొత్తంగా విశ్వనగరం విషాదనగరమయింది. దీనికి కారణం కొంత మానవ స్వయంకృతమయితే, మిగిలిన పాపాలన్నీ  పాలకుల ఖాతాలోనివే. లోతట్టు ప్రాంతాలు, నాలాలని తెలిసి కూడా అక్కడే ఇళ్లు కట్టుకున్న జనంలో.. ఇన్ని భారీ వర్షాలు, ఇంత ప్రాణనష్టం  కూడా మార్పు తీసుకురాలేపోయాయి. కళ్లెదుటే కొట్టుకుపోతున్న కుటుంబాల ఆర్తనాదాలు కూడా,  అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించలేకపోతున్నాయి. ఇది నిస్సందేహంగా ప్రజల స్వయంకృతమే.

 మరి ప్రభుత్వానికయితే బాధ్యత ఉంది కదా? వారిని బలవంతంగానయినా ఖాళీ చేయడం పాలకుల బాధ్యత కదా? అయినా ఓట్ల కోసం వారికి ఇంటి నెంబర్లు, రేషన్‌కార్డులిస్తున్న పాపం పాలకులదే కదా? కోట్లాదిరూపాయలతో వేస్తున్న రోడ్లన్నీ ఒక్క వర్షానికే కొట్టుకుపోతున్నాయంటే, వాటి నాణ్యతపై నిఘా పెట్టడంలో సర్కారు విఫలమయినట్లే అర్ధం. సెప్టెంబర్ 18న కురిసిన వర్షం మిగిల్చిన కాళరాత్రిని, ‘సిటి’జనులు ఇంకా మర్చిపోకముందే.. మరో జలప్రళయం నగరాన్ని నరకం చేయడాన్ని ప్రజలు తాళలేకపోతున్నారు. సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షానికి, మల్కాజిగిరి దీనదయాళ్‌నగర్‌లో ఓ బాలిక, మరో ఘటనలో మరో మహిళ కొట్టుకుపోయిన విషాదం మరువకముందే ఇంకో ఉత్పాతం. కలసి వెరసి.. టీఆర్‌ఎస్ సర్కారుపై పెరుగుతున్న వ్యతిరేకత.

హైదరాబాద్ నగరంలో 16.4 కి లోమీటర్ల మేర నాలాలు విస్తరిస్తామని కేటీఆర్ మొదట్లో హామీ ఇచ్చారు. ఇంకా ఆ లక్ష్యానికి 60 శాతం అడుగుల దూరంలో ఉన్నారు. అంటే గమ్యాన్ని ముద్దాడేందుకు ఇంకెన్ని దశాబ్దాలు పడతాయో ఎవరికీ తెలియదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి పాలకులు వేసిన కిర్లోస్కర్ కమిటీ.. 170 కిలోమీటర్ల మేర ఉన్న 71 నాలాలు విస్తరించాలని, అందుకోసం 10 వేల ఆక్రమణలు తొలగింపుతోపాటు, వీటికి 6700 కోట్లు ఖర్చు అవుతుందని  నివేదించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఆ కమిటీ కొండెక్కింది.

మళ్లీ తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత, వోయాంట్స్ కన్సల్టెన్సీకి ఆ బాధ్యత అప్పగించింది. ఆ కమిటీ చేసిన సర్వేలో.. 28 వేల ఆక్రమణలు తొలగించాలని, 390 కిలోమీటర్ల మేర నాలాలు విస్తరించాలని, అందుకు 12 వేలు కోట్లు ఖర్చవుతుందని నివేదిక ఇచ్చింది. చివరాఖరకు 12,182 ఆక్రమణలున్నట్లు తేల్చింది. 390 కిలోమీటర్ల మేర ఉన్న నాలా ఉండగా, అందులో పైకప్పులున్నవి చాలా తక్కువ. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆక్రమణలు పెరిగాయన్నమాట. మరి జీహెచ్‌ఎంసీ ఏం చేస్తుందన్నది ప్రశ్న.

ఇప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న  సోమేష్‌కుమార్.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు,  పౌరులకు ఓ విచిత్రమైన సవాల్ విసిరారు. ఎవరైనా సరే.. గుంతలు పడిన రోడ్లు చూపిస్తే బహుమానం ఇస్తామన్నారు. అంటే హైదరాబాద్ రోడ్డు వంగి ముద్దుపెట్టుకోవాలన్నంత అందంగా.. చాలా సొంపుగా ఉంటాయని, అసలు గుంతలే ఉండవన్నది ఆయన కవి హృదయమన్నమాట. ఆయన సవాలుకు జవాబుగా, విపక్షాలు గుంతలుపడ్డ చోట నిలబడి ఫొటోలు దిగడంతో, సోమేష్‌కుమార్ ఇక ఆ సవాలు ముచ్చటే మర్చిపోయారు.

ఇప్పుడు మళ్లీ వందేళ్ల తర్వాత వచ్చిన జలప్రళయం రాజధానిని ముంచేసింది. జనజీవనాన్ని భయకంపితులను చేసింది. మళ్లీ.. ‘కఠిన చర్యలు’, ‘హామీ’ల వర్షం, ‘తగిన జాగ్రత్తలు’ అనే  పాలకుల పడికట్టు పదాలు, మామూలుగానే వినిపిస్తున్నాయి తప్ప, ఆచరణ శూన్యం. సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకూ వర్షాఘానికి బలవుతున్న నగర ప్రజలు, సహజంగానే టీఆర్‌ఎస్ సర్కారుపై నిప్పులు కురిపిస్తున్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాలపై ఆగ్రహావేశంతో రగిలిపోతున్నారు. ప్రభుత్వం తమను కష్టాల కడలి నుంచి కాపాడటంలో విఫలమయిందని భావిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు-కార్పొరేటర్లు చోద్యం చూస్తున్నారని, అధికారులు తమను గాలికొదిలేశారన్న నిర్ణయానికి వచ్చారు.  ఖచ్చితంగా ఇవన్నీ,  రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ప్రభావం చూపేవే.

ప్రజల ఆగ్రహజ్వాల,  ఖచ్చితంగా అధికార పార్టీకి ప్రమాదఘంటికనే. ప్రభుత్వ అసమర్ధ నిర్వాకం వల్లనే,  తాము గంటలపాటు కరెంటు-నిత్యావసర వస్తువులకు దూరమయ్యామని, రోజంతా నరకయాతన అనుభవించామన్న చేదు జ్ఞాపకాలు, విషాద దృశ్యాలు అప్పటివరకూ జనం గుర్తుంచుకుంటే..  ‘కారు’ ఒక్క అడుగు కూడా ముందుకేయడం కష్టం. ఈ అసంతృప్తి అగ్నికి విపక్షాలు,  ఎన్నికల వరకూ ఆజ్యం పోయకుండా ఉంటారనుకోలేం. అప్పటికీ నష్టనివారణకు దిగకపోతే నగరంలో షి‘కారు’కు…  కష్టమే! సహజంగా వర్షాలొస్తే పాలకులకు పండుగ. జనం కష్టాలు మర్చిపోతారు. కానీ రాజధాని నగరంలో వర్షాలొస్తే, పాలకుల ఇమేజీ దారుణంగా  డ్యామేజీ అవుతూనే ఉంటుంది. ఇప్పుడూ అదే జరుగుతోంది.