తెలుగువాడికి తెలుగు వాడే తెగులు!

188

జస్టిస్ రమణపై యుద్ధంలో జగన్‌కు సలహాదారు తెలుగువాడే
ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నదీ ఆయనే
50 ఏళ్ల తర్వాత వచ్చే ‘చీఫ్ జస్టిస్’అవకాశం పోగడతారా?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

జస్టిస్ ఎన్.వి. రమణ. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి. అంతకుముందు, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ పనిచేశారు. అంతకంటే ముందు ఏపీ అడ్వకేట్ జనరల్‌గానూ పనిచేశారు. అన్నీ కలసివస్తే, రెండవ స్థానంలో ఉన్న ఆయనే, తర్వాత భారత అత్యున్నత న్యాయస్థానమయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతారు.దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు మాదిరిగా… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలయిన.. ఒక తెలుగు న్యాయవాది ప్రస్ధానం, సుప్రీంకోర్టు వరకూ చేరడం తెలుగువాడికే గర్వకారణంగా భావించాలి. ఒక్క రమణ మాత్రమే కాదు. ఆ స్థాయికి- ఆ స్థానానికి చేరిన ఏ తెలుగువారిని చూసినా సగటు తెలుగువాడు గర్వించాల్సిందే. గర్వించాలి కూడా.అయితే అది తమిళ సంస్కృతి. తమిళుడు ఉన్నత స్థాయికి చేరడానికి తమిళులంతా రాజకీయ విబేధాలు మరిచి పనిచేస్తారు. మరి తెలుగువాడు? అందుకు పూర్తి విరుద్ధం! తెలుగువాడికి తెలుగువాడే శత్రువు మరి!! జస్టిస్ రమణ వ్యవహారమే అందుకు నిలువెత్తు నిదర్శనం.

జస్టిస్ ఎన్వీ రమణ త్వరలో చీఫ్ జస్టిస్ కానున్నారు. ప్రస్తుత సీజే బోబ్డే తర్వాత, సీనియారిటీ లిస్టులో ఆయనే ఉన్నారు. ఆ తర్వాత జస్టిస్ నారీమన్, జస్టిస్ లలిత్ సీనియారిటీ జాబితాలో ఉన్నారు. సాధారణంగా అయితే, జస్టిస్ రమణ ఎలాంటి అడ్డంకులు లేకుండా చీఫ్ జస్టిస్ కావాలి. కానీ, ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తూ, రాసిన లేఖ న్యాయవ్యవస్థను కుదిపేస్తోంది. జస్టిస్ రమణ, మాజీ సీఎం చంద్రబాబు కోసం.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారన్నది, జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రధాన ఫిర్యాదు. దానిని ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం రెడ్డి, మీడియా సమావేశం పెట్టి మరీ వివరాలు ప్రకటించారు. జగన్ చర్యను అటు ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్, అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఇది న్యాయవ్యవస్థ-రాజ్యాగంపై జగన్ చేస్తున్న దాడిగా అభివర్ణించాయి. ఇదీ ఇప్పటివరకూ జస్టిస్ రమణకు సంబంధించి అందరికీ తెలిసిన కథ.ఇది కూడా చదవండి: జగన్‌కు ఝలక్!

అసలు తెరవెనుక నడుస్తున్న- నడిపిస్తున్న కథ మరొకటి ఉంది. అది కూడా తెలుగు కోణమే.అప్పట్లో న్యాయమూర్తిగా పనిచేసిన ఓ పెద్దాయన కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-డైరక్షన్‌లోనే.. జస్టిస్ రమణకు వ్యతిరేకంగా జగన్ హీరో అవతారమెత్తారన్నది, ఇప్పుడు అనేక వర్గాల్లో జరుగుతున్న చర్చ. పూర్వాశ్రమంలో ఇద్దరూ.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉన్నత స్థానాల్లో చేరిన వారే. పైగా ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం. ఇప్పుడు రిటైరయిన ఆ పెద్దాయన జగన్మోహన్‌రెడ్డి పంచన చేరారు. ఆయన తనయుడితో కలసి, జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీలో మంత్రాంగం చేస్తున్నారన్నది బహిరంగం. అసలు జగన్మోహన్‌రెడ్డి.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు రమణకు వ్యతిరేకంగా రాసిన లేఖ వెనుక, కర్త-కర్మ అంతా ఆ పెద్దమనిషేనన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ.

సదరు పెద్దాయన.. పూర్వాశ్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబానికి సన్నిహితంగా మెలిగేవారు. గండిపేటలో అన్నగారికి న్యాయసలహాదారుగా కూడా వ్యవహరించారు. దగ్గుబాటి-దివంగత నందమూరి హరికృష్ణ- వైఎల్పీతో కలసి ఉండేవారు. వారితో ఆయనకు సాన్నిహిత్యం ఉండేది. హరికృష్ణను బాబు క్యాబినెట్ నుంచి తొలగించడం ఆ పెద్దాయనకూ రుచించలేదు. అప్పట్లో దగ్గుబాటి- చంద్రబాబుకు పొసగేది కాదు కాబట్టి.. సదరు పెద్దాయన కూడా, సహజంగానే దగ్గుబాటి ఆలోచనల మేరకు చంద్రబాబుకు వ్యతిరేకంగా మారారు. ఆగస్టు సంక్షోభం తర్వాత చంద్రబాబు-దగ్గుబాటి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా, సదరు పెద్దాయనకు అడ్వకేట్ జనరల్ ఇవ్వాలన్నది ఒక షరతు. అయితే, అప్పటికి ఆయన వయసు ఇంకా చిన్నదే కావడం వల్ల, బాబు ఆ పదవి ఇవ్వలేదు. అందుకు ఆ పెద్దాయన కూడా అంగీకరించారు. సరే.. తర్వాతి కాలంలో ఆయన జడ్జి, ఇంకా పెద్ద హోదాలో పనిచేశారు. అది వేరే విషయం!

అయితే చంద్రబాబు వల్లనే ఆయనకు, అప్పట్లో అనేక పదవులు దక్కిన మాట నిజం. అయినప్పటికీ, అవన్నీ దగ్గుబాటి వల్లనే వచ్చాయని ఆయన భావించేవారు. ఆ భావజాలంతోనే ఆయన బాబుకు వ్యతిరేక దిశలో ఉండేవారన్నది అప్పటి ఆయన సన్నిహితుల కథనం. అయితే సదరు పెద్దాయనకు మంచిపేరే ఉంది. ఆయనపై ఎలాంటి ఆరోపణలూ లేవు. హుందాగా వ్యవహరిస్తారన్న పేరుంది. పైగా విపరీతమైన దైవభక్తి కూడా. మరిప్పుడు జస్టిస్ రమణకు వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారాన్ని, తెరవెనుక ఉండి ఎందుకు నడిపిస్తున్నారు? అన్నది సహజంగా అందరికీ వచ్చే సందేహం. కారణం.. ఆయన అనుకున్న స్థానానికి చేరుకోలేకపోవడం, తనకంటే జూనియర్ అత్యున్నత స్థానానికి చేరటం. అయితే ఆ పెద్దాయన తన లక్ష్యం చేరుకోకపోవడానికి, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కారణం. ఇదీ ఆ పెద్దాయన కథ.

అంత పెద్దాయన, హటాత్తుగా జగన్ శిబిరం నుంచి.. జస్టిస్ రమణకు వ్యతిరేకంగా కథ నడిపించడంపైనే, న్యాయవాద వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. పైగా 50 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు తర్వాత.. మళ్లీ ఆ స్థానంలో ఒక తెలుగువాడు వస్తుంటే, సంతోషించాల్సిందిపోయి, సాధారణ స్థాయి వ్యక్తుల మాదిరిగా వ్యవహరించి అడ్డుకోవడంపై తెలుగువారితో పాటు.. సొంత సామాజికవర్గంలోనే విస్మయం వ్యక్తమవుతోంది. జస్టిస్ రమణ ఎలాంటి వారన్నది పక్కకుపెడితే.. ఒక తెలుగువాడు చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశాన్ని, సాటి తెలుగువాడే అడ్డుకోవడం ఏమిటన్న చర్చ ఆ సామాజికవర్గంలోనే జరుగుతోంది.

తెలుగువాడైన ప్రధాని పివి నరసింహారావుపై, నంద్యాలలో పోటీ పెట్టకూడదని అప్పట్లో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం తెలుగుజాతిని మెప్పించింది. నిజానికి అప్పట్లో నరసింహారావుపై టీడీపీ పోటీ పెడితే, ఆయన గెలవడం కూడా కష్టమే. అయినా.. తొలిసారి ఒక తెలుగువాడు ప్రధాని అయినప్పుడు, ఆయనపై పోటీ పెట్టకుండా గౌరవించాలన్న ఏకైక నిర్ణయమే.. ఎన్టీఆర్‌ను తెలుగుజాతి దృష్టిలో ఉన్నతుడిని చేసింది. మరి ఇప్పుడు అలాంటి అరుదైన అవకాశం చీఫ్ జస్టిస్ రూపంలో వచ్చినప్పుడు.. ఎన్టీఆర్ ద్వారానే ఈ స్థాయికి వచ్చిన ఆ పెద్దాయన, ఆ సంప్రదాయాన్ని అమలుచేసేందుకు సహకరించకుండా, అడ్డుకోవడంపై కమ్మ సామాజికవర్గంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.