‘దేవుడి’ సన్నిధిలో దైవజ్ఞసమ్మేళం!

700

స్వరూపుల వారి సేవలో సర్కారు శాఖ
ఆ సాములోరి స్పెషాలిటీ ఏమిటో?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఆయన నడిచే దేవుడు. శంకరాచార్య అంశలో విశాఖలో కళ్లు తెరచిన ఓ మహా తపస్వి. తన కఠోర తపస్సుతో.. ఒక నేతను పాలకుడిగా మార్చిన దైవాంశ సంభూతుడు. మరి అంతటి మహాత్ముడిని సేవించి తరించడం పాలకుల విధి. కర్తవ్యం. బాధ్యత కూడా! పాలకుల సేవిస్తున్నారంటే, భృత్యులు కూడా వారిని అనుసరించాల్సిందే. అందుకేనేమో.. తెలుగడ్డపై ఎంతోమంది పీఠాధిపతులు, వారి ఆశ్రమాలు ఉన్నప్పటికీ, సదరు స్వామి వారి పీఠంలోనే సర్కారీ శాఖ అధికార కార్యక్రమం నిర్వహించి తరించిపోయింది.

అసలు కథేమిటంటే.. సర్కారు ఏలుబడిలోని దేవదాయ ధర్మదాయ శాఖ కొద్దిరోజుల క్రితం,  ‘జగన్గురు’వయిన.. జగద్గురు స్వరూపానంద స్వామి వారి విశాఖ చినముషిడివాడ శారదాపీఠంలో ‘దైవజ్ఞ సమ్మేళం’ జరిగింది. దీనిని రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడెమీ నిర్వహించింది. దీనికి దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర ఆజాద్,  రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడెమీ డైరక్టర్ కృష్ణశర్మ, దేవాలయ పాలనా సంస్థ డైరక్టర్ ద్రోణంరాజు రామచంద్రరావు హాజరయ్యారు. సరే..  రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడెమీ డైరక్టర్ కృష్ణశర్మ అంటే పూర్వాశ్రమంలో.. ఆ ఆశ్రమంలో అర్చక స్వామి కాబట్టి.. సాములోరి  సన్నిధిలో ఈ పవిత్ర కార్యక్రమం నిర్వహిద్దామన్న ఆలోచన ఉండవచ్చు. తప్పులేదు. తనకు పదవి ఇప్పించినందుకు ఆపాటి కృతజ్ఞత, గురుభక్తి ప్రదర్శించడంలో ఆక్షేపణ ఏమీ కాదు. అది వేరే విషయం.

ఈ సందర్భంగా స్వామివారు పంచాంగాలపై పంచాయతీలు వద్దని, పండుగలు నిర్ణయించే అంశంలో పంచాంగ కర్తలంతా.. ఏకాభిప్రాయానికి రావాలని హితవు పలికారు. అంతవరకూ బాగానే ఉంది. పండుగల తేదీపై పండితుల మధ్య, చాలా ఏళ్ల నుంచి పంచాయతీ నడుస్తోంది. కాబట్టి స్వామి వారి హితోక్తులు వారిపై ప్రభావం చూపిస్తే, ఇకపై పండితులంతా స్వామి వారు సెలవిచ్చినట్లు.. ఒకే తేదీ ప్రకటిస్తారని ఆశించడంలో తప్పులేదు.

కానీ..  రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడెమీ వారు,  విశాఖలోని ‘జగన్గురువు’ గారి పీఠంలోనే ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహించాలన్న ప్రశ్నలు,  కొత్తగా తెరపైకి వచ్చాయి. రాష్ట్రంలో చాలామంది పీఠాథిపతులున్నారు. ఆశ్రమాలూ ఉన్నాయి. కానీ, సర్కారు వారు కేవలం స్వరూపానందుల వారి ఆశ్రమంలోనే, ఈ  దైవజ్ఞసమ్మేళం నిర్వహించారన్న ప్రశ్నలు హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్నాయి. ఇలాంటి ప్రమోషన్ వ్యవహారాల వల్ల.. ఎవరి బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రయత్నిస్తున్నారన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. దేవదాయ శాఖ ఉన్నతాధికారులకంటే, సర్కారు వారి సేవలో తరించక తప్పదు. కానీ, ఒక ప్రైవేటు పీఠాథిపతి పీఠంలోనే అధికారిక కార్యక్రమం నిర్వహించి, స్వామి వారి సేవలోనూ తరించడం ఏమిటన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే స్వామి వారి పీఠం ముందున్న.. పోలీసు పోస్టు, బుగ్గకారు, సెక్యూరిటీ వాతావరణం చూస్తే, అదేదో ఒక మంత్రి గారి బంగ్లా వాతావరణం దర్శనమిస్తుంది. ఇప్పుడిక సర్కారీ శాఖలు కూడా అక్కడికే తరలివెళితే.. ఇక దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయం కూడా అక్కడే పెడితే నిక్షేపంలా ఉంటుందన్నది కొందరి వ్యాఖ్య. ఎందుకంటే.. ఇప్పటి వరకూ ఏ దేవదాయ కమిషనరు కూడా ఇప్పటివరకూ ఒక పీఠంలో అధికార కార్యక్రమాలు నిర్వహించడం గానీ, కార్యక్రమాల రూపకల్పన, నిర్ణయాలలో ఏ ఒక్క పీఠాధిపతి ఆశ్రమానికి అధికారులు వెళ్లి వారి అనుమతి తీసుకున్న దాఖలాలు, చరిత్ర ఎన్నడూ లేదు. ఎలాగూ ఆ సంప్రదాయాన్ని మొదలుపెట్టారు కాబట్టి, ఆ కార్యాలయాలేవో పీఠంలోనే ప్రతిష్ఠిస్తే అధికారులకు సమయం, ఇంధన ఖర్చులూ మిగిలిపోతాయి కదా అన్నది బుద్ధిజీవుల ఆలోచన.ఎలాగూ విశాఖకు రాజధానిని తరలిస్తున్నందన, కమిషనర్, జేసీ, ఏసీల కార్యాలయాల వరకూ పీఠంలోనే పెడితే.. వారికి దిశానిర్దేశం ఇచ్చేందుకు, స్వామి వారికి కూడా కొంత సౌకర్యంగానే ఉంటుంది కదా? ఏమంటారు? పాలకులు ఈ దిశగా ఆలోచిస్తే, ఒక్క ఎండోమెంటు శాఖ మాత్రమే కాకుండా.. అనంతకోటి  భక్తుల జన్మలు కూడా చరితార్ధమవుతాయి. ఓసారి ఆలోచించి చూద్దురూ?!