హైద‌రాబాద్ : గ‌త రెండు రోజుల నుంచి కురుస్తున్న కుండ‌పోత వాన‌ల‌కు తెలంగాణ త‌డిసి ముద్దైంది. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో రాష్ర్ట ప్ర‌భుత్వం ఇవాళ‌, రేపు సెల‌వులు ప్ర‌క‌టించింది. అత్య‌వ‌స‌ర‌మైతేనే ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. పిల్ల‌లు, వృద్ధులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది. పాత భ‌వ‌నాల‌ను త‌క్ష‌ణ‌మే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాల‌కు వెళ్లాల‌ని తెలిపింది. రాష్ర్ట వ్యాప్తంగా క‌లెక్ట‌ర్ల‌ను, పోలీసు శాఖ‌ను ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం చేసింది.

రాష్ట్రంలో వర్షాలు, వరదలు కనీవినీ ఎరుగని బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హుటాహుటిన రంగంలోకి దిగారు. రాజధాని హైదరాబాద్‌లో గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా వర్షపాతం నమోదైనట్టు తెలుసుకొన్న ఆయన అర్ధరాత్రి వరకు వర్షాల పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను అప్రమత్తంచేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్నివిధాలా సన్నద్ధంచేసి తక్షణం సహాయచర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అప్పటికప్పుడే అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్షాల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. మరోవైపు డీజీపీ ఎం మహేందర్‌రెడ్డితోనూ సీఎం మాట్లాడారు. ముంపు, లోతట్టు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. సీఎం ఆదేశానుసారం డీజీపీ.. అన్ని జిల్లాల ఎస్పీలతో మాట్లాడారు. ముంపు ప్రాంతాల ప్రజలకు సహాయకార్యక్రమాలపై తక్షణ చర్యలకు ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితస్థానాలకు తరలించాలని నిర్దేశించారు.

రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితిపై విద్యుత్‌ సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎండీ ప్రభాకర్‌రావు అర్ధరాత్రి 12 గంటల సమయంలో హుటాహుటిన విద్యుత్‌ సౌధకు చేరుకొని గ్రిడ్‌ సమస్య తలెత్తకుండా రక్షణ చర్యలు చేపట్టారు. మరోవైపు పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్ని మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లతో ఫోన్‌లో మాట్లాడారు. పట్టణాలు, నగరాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయచర్యలు చేపట్టాలని, సమాంతరంగా పునర్నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించాలని ఆదేశించారు. హైదరాబాద్‌ నగరంలో పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా దృష్టిసారించారు. మేయర్‌, జీహెచ్‌ఎంసీ అధికారులను అప్రమత్తంచేశారు.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner