జగన్‌కు ఝలక్!

851

కోరి కష్టాలు తెచ్చుకున్న జగన్
సీఎం సీటుకే ఎసరు తెస్తున్న పిటిషన్
జగన్ అంచనాలు తల్లకిందులు
ఒక్కతాటిపైకి వచ్చిన న్యాయవ్యవస్థ
జగన్ తీరును ఖండించిన ఢిల్లీ బార్ అసోసియేషన్
అదే బాటలో అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేయన్
ర హస్యాలు లీక్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

151 సీట్ల తిరుగులేని మెజారిటీతో అధికారం కైవసం చేసుకున్న యుశ్రారైకా పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి,  ఇప్పుడు తన మొండితనంతో కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి ఎన్వీ రమణపై ఆరోపణతో, జగన్ రాసిన లేఖ ఇప్పుడు ఆయన సీటుకే ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. చీఫ్ జస్టిస్‌కు జగన్ లేఖ రాయడం రాజ్యాంగ విరుద్ధమే కాకుండా, కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది కాబట్టి, ఆయనను తక్షణం సీఎం పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలయిన పిటిషన్ ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తునే ప్రమాదంలో పడేసింది. ఇది ఆయన స్వయంకృతమే.ఇది కూడా చదవండి: జడ్జి రమణపై…జగన్ ‘జంగ్’!
జగన్మోహర్‌రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగించాలని జీఎస్ మణి, ప్రవీణ్‌కుమార్ యాదవ్ అనే సీనియర్ న్యాయవాదులు,  తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ రమణకు వ్యతిరేకంగా రాసిన లేఖను విడుదల చేయడాన్ని, వారు తమ పిటిషన్‌లో ప్రస్తావించారు. మరోవైపు జగన్ లేఖ, దాని విడుదల తీరుపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా తీవ్రపదజాలంతో విరుచుకుపడింది. న్యాయ వ్యవస్థపై పెత్తనం చేసే ప్రయత్నంలో భాగంగానే.. జస్టిస్ రమణపై సీఎం జగన్ లేఖ రాశారని మండిపడింది.

రమణతోపాటు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై జగన్ ఫిర్యాదు చేసి, లేఖలు రాయడం గర్హనీయమని ఖండించింది. ఇది న్యాయవ్యవస్థ స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేందుకు, జరిగిన కుట్రగానే భావిస్తున్నామని పేర్కొంది. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందనున్న జస్టిస్ రమణ అత్యంత సమర్ధతగల, నిజాయితీపరుడయిన న్యాయమూర్తి అని స్పష్టం చేసింది. అటు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేయన్ కూడా, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ బాట పట్టింది. జగన్ తీరు న్యాయవ్యవస్థను బెదిరించేలా ఉందని, ఇది రాజ్యాంగ-న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకోవడమేనని, అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ జోసఫ్ అరిస్టాటిల్ ఖండించారు. జగన్ చర్య అవాంఛనీయమని, న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేదని వ్యాఖ్యానించారు.
తాజా పరిణామాలు పరిశీలిస్తే.. భారత న్యాయవ్యవస్థ అంతా ఒక్కతాటిపైకి వచ్చినట్లే కనిపిస్తోంది. తమపై రాజకీయ వ్యవస్థ పెత్తనం చేయడాన్ని, న్యాయవ్యవస్థ జీర్ణించుకోలేకపోతోందని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ లేఖలో వాడిన పదజాలం స్పష్టం చేస్తోంది. ఇలాంటి చర్యలను ఇప్పుడే ఎదుర్కొనకపోతే, భవిష్యత్తులో న్యాయవ్యవస్థ అందరికీ చులకన అవుతుందని, న్యాయమూర్తులను విలువ ఉండదని భావించినట్లు బార్ అసోసియేషన్ స్పందన స్పష్టం చేస్తోంది. ప్రధానంగా.. వివిధ ఆరోపణలతో జైల్లో ఉన్న ఒక రాజకీయ నాయకుడు, సుప్రీంకోర్టు- హైకోర్టు న్యాయమూర్తులపైనే ఫిర్యాదు చేయడాన్ని, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ జీర్ణించుకోలేకపోయినట్లు కనిపిస్తోంది. ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తే, దేశంలో ఇక ఏ న్యాయమూర్తి స్వేచ్ఛగా తీర్పులివ్వకపోగా, తమపై సుప్రీంకోర్టుకు ఎలాంటి ఫిర్యాదులు వెళతయోనన్న భయంతో బతికే పరిస్థితి ఏర్పడుతుందని ముందుగానే ఊహించినట్లు స్పష్టమవుతోంది.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో, తాను లక్ష్యంగా చేసుకున్న జస్టిస్ రమణ నైతిక-సాంకేతిక ఇబ్బందులలో ఇరుక్కుంటారని జగన్ అంచనా వేశారు. ప్రధానంగా ఆయనకు చీఫ్ జస్టిస్ పదవి దక్కదని ఇప్పటికీ ఊహిస్తున్నారు. కానీ ఇది అటు తిరిగి ఇటు తిరిగి, తన పదవికే ఎసరు తెచ్చేలా చేస్తుందని అంచనా వేసినట్లు లేదు. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ చురుకుగా, క్రియాశీలకంగా పనిచేస్తుంది. గతంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ రమణ వ్యవహార శైలిపై, ఢిల్లీ బార్ అసోసియేషన్‌కు బాగా అవగాహన ఉంది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు, రమణ అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అవి ప్రజల అభిమానం కూడా చూరగొన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో, ఢిల్లీ బార్ అసోసియేషన్ ఏకోన్ముఖంగా జగన్ చర్యను ఖండించడం, జస్టిస్ రమణకు నైతిక స్ధైర్యం కలిగించే అంశమే.

సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయవాదుల పిటిషన్ నేపథ్యంలో, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లంరెడ్డి కూడా ఇరుకున పడాల్సి వచ్చింది. చీఫ్ జస్టిస్‌కు సీఎం రాసిన లేఖ వివరాలను, ఆయనే మీడియాకు విడుదల చేశారు. ప్రభుత్వ  రహస్యాలను కాపాడతానని  రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం జగన్.. లేఖ వివరాలు వెల్లడించి, దానిని ఉల్లంఘించారన్నది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయన ఎదుర్కోనున్న ప్రధాన అభియోగం.  అసలు చీఫ్ జస్టిస్‌కు ముఖ్యమంత్రి రాసిన లేఖ, ప్రభుత్వ సలహాదారుకు ఎలా వచ్చింది? ఆయన ఏ అధికారంతో వాటిని విడుదల చేశారన్న అభియోగం ఇటు కల్లం రెడ్డికి సంకటప్రాయమే. పాపం.. ఏదో ప్రభుత్వ ఉద్యోగం చేసుకుని, సలహాదారుగా ప్రశాంతంగా కాలం గడపుతున్న కల్లం రెడ్డి చివరకు ఈ వివాదంలో చిక్కుకున్నారు.