రమణపై తమ్ముళ్ల తిరుగుబాటు
బాబుపై మరోసారి లేఖాస్త్రం
ఆర్ధిక పరిస్థితులే అసలు సమస్యట
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

తెలంగాణ గడ్డపై కళ్లు తెరచిన తెలుగుదేశం పార్టీ..ఇప్పుడు అదే తెలంగాణలో కన్నుమూసే విషాదకర పరిస్థితికి చేరింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా పూర్తిగా పీకేసినట్లుగానే కనిపిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, తెలంగాణలో పార్టీని అనాధను చేశారన్న ఆగ్రహం, ఎన్టీఆర్ కాలం నుంచి కొనసాగుతున్న తమ్ముళ్లలో కట్టలు తెంచుకుంటోంది. ఓటుకు నోటు కేసు తర్వాత, తమ అధినేత.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భయపడి పార్టీని వదిలేసి పోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రనేతలంతా ఎవరి దారి వారు చూసుకుని వెళ్లిపోగా, ఉన్న వారి భవిష్యత్తు ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ అసమర్థ నాయకత్వం పుణ్యాన, కొస ప్రాణంతో ఉన్న పార్టీ.. పూర్తిగా సమాధి కావడానికి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న కాలయాపన విధానమే కారణమని తమ్ముళ్లు ధ్వజమెత్తుతున్నారు.

తాజాగా.. రమణను మార్చాలని తెలంగాణ టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ నేతలు మరోసారి చంద్రబాబుకు లేఖాస్త్రం సంధించారు. ఈ విధంగా టీటీడీపీ నేతలు బాబుకు లేఖ రాయడం ఇది రెండోసారి. నిన్ననే వారు తమ లేఖను బాబుకు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఎవరినీ కలవడం లేదని సిబ్బంది చెప్పడంతో, లేఖను ఆయన పీఏకు ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ సంస్థాగత విషయాలు చర్చించాలని వారంతా లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితి అటు రమణకు సైతం పార్టీ కార్యాలయంలో సిబ్బంది ముందు ఇబ్బందికరంగా మారింది.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో అన్ని పార్టీలు తమ అభ్యర్ధిని ప్రకటించి, ఆ మేరకు ప్రచారంలో ఉన్నాయి. కానీ తమ పార్టీ మాత్రం ఇంతవరకూ అభ్యర్ధిని ప్రకటించలేదని తమ్ముళ్లు, రమణపై మండిపడుతున్నారు. అటు ఆరు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలపైనా, రమణ ఇప్పటిదాకా చర్చించలేదు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందా? లేదా అన్న దానిపైనా స్పష్టత ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు.

ఈ విషయంలో రమణ చెబుతున్న దానికీ, చంద్రబాబు చేస్తున్న ప్రకటనలకూ పొంతన ఉండటం లేదంటున్నారు. ఏ నిర్ణయమయినా చంద్రబాబును అడిగే తీసుకుంటానని రమణ, పార్టీ నేతలకు స్పష్టం చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం.. తెలంగాణకు సంబంధించిన వ్యవహారాల్లో, మీరే సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ నేతలకు చెబుతున్నారు. ప్రతి దానికీ నా నిర్ణయం కోసం ఎదురుచూడవద్దని, మీరే నిర్ణయం తీసుకోమని స్పష్టం చేస్తున్నారు. దీనితో ఎవరి మాట నమ్మాలో అర్ధం కావడం లేదని నేతలు వాపోతున్నారు. లాక్‌డౌన్ మొదలయినప్పటి నుంచీ, బాబు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. అయినా, ఒక్కసారి కూడా తమతో భేటీ కాలేదని తమ్ముళ్లు చెబుతున్నారు.

అయితే ఈ విషయంలో పార్టీ నాయకత్వం.. కావాలనే తప్పించుకు తిరిగే ధోరణి అవలంబిస్తున్నట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలు, సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగూ గెలిచే పరిస్థితి ఉండదు కాబట్టి, పోటీ చేసి డబ్బులు ఖర్చు చేయడం ఎందుకన్న ఆలోచనతో, నాయకత్వం ఉన్నట్లు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో పార్టీ నాయకత్వం ఆంధ్రాలోనే డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేనందున, ఇక తెలంగాణలో ఖర్చు పెడుతుందనుకోవడం అత్యాశేనంటున్నారు.

‘ఒకవేళ గ్రేటర్ ఎన్నికల్లో కూడా పార్టీ నయాపైసా ఇచ్చే అవకాశం లేదు. ఇక్కడ పార్టీపై మా సార్‌కు ఆసక్తి లేదు. నిజంగా ఆసక్తి, పట్టుదల ఉంటే రెండు నెలల ముందునుంచే ఎన్నికలపై దృష్టి పెట్టేవారు. ఆయన ఎన్నికల సమయంలో ఎంత వేగంగా పనిచేస్తారో, ఎంత వేగంగా ఆలోచిస్తారో మేం చూశాం కదా? ఇప్పుడు ఏం చేయాలన్నా డబ్బు ఖర్చు పెట్టాలి. అదే గతం మాదిరిగా అన్ని వ్యవహారాలు బాబు చేతిలో ఉంటే, ఇప్పటి పరిస్థితి వేరుగా ఉండేది. సర్వే సంస్థలను ఎన్నికలకు మూడు నెలల ముందే దించేవారు.పరిశీలకుల హడావిడి, నాయకుల మీడియా సమావేశాలు ఉండేవి. అంటే దీన్నిబట్టి రెండు విషయాలు అర్ధమవుతున్నాయి. ఒకటి ఆయనకు తెలంగాణలో ఎన్నికలపై ఆసక్తి లేకపోయినా ఉండాలి. లేదా ఆర్ధికపరమైన నిర్ణయాలు ఆయన చేతిలో లేకపోయినా ఉండాలి. ఇప్పుడు ఈ కీలకమైన వ్యవహారాలన్నీ సారు చూడటం లేదంటున్నారు. గాలి వచ్చినప్పుడే గెలుస్తామన్న ధోరణి కనిపిస్తోంద’ని ఓ కీలక నేత వ్యాఖ్యానించారు.

రమణను తొలగించాలని నేతలంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నా, బాబు స్పందించకపోలడంపై పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. బహుశా మిగిలిన వారికి పగ్గాలు అప్పగిస్తే.. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారన్న భయంతోనే, నిర్ణయాన్ని నానుస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘మా సార్ కు బలమైన బీసీ కులానికి చెందిన నాయకుడు కావాలి. కానీ అతడు బలంగా ఉండకూడదు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకుండా, తనపైనే ఆధారపడే నాయకుడు కావాలి. ఈ అర్హతలున్న నాయకుడి కోసమే, మా సార్ కొత్త అధ్యక్షుడిని ప్రకటించడం లేదనిపిస్తోంద’ని ఓ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

కొత్తకోట దయాకర్‌రెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి వంటి సీనియర్లలో ఒకరికి, అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందన్న సూచన చాలాకాలం నుంచీ వినిపిస్తోంది. ఓసీలకు ఇవ్వాలనుకుంటే దయాకర్‌రెడ్డి, రావులలో ఒకరికి ఇవ్వడం మంచిదని, బీసీలకు ఇవ్వాలనుకుంటే అరవిందకుమార్ గౌడ్‌కు ఇవ్వడం ఉత్తమమంటున్నారు. అదేవిధంగా ప్రత్యర్ధులపై విరుకుపడే నోరున్న న ర్శిరెడ్డి లాంటి నేతకు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే మంచిదని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చినా, వారు సొంత ఖర్చులతోనే పార్టీ నడిపించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కాగా దుబ్బాక ఉప ఎన్నికలో రమణను, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నర్శిరెడ్డి లేదా కాట్రగడ్డ ప్రసూనను రంగంలోకి దింపాలన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి బాబు ఏ నిర్ణయం తీసుకుంటారో?

 

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner