బీజేపీ మదిలో సీజేగా మరో ప్రముఖుడు?
అయినా ఇంకా బీజేపీ పల్లకీ మోస్తారా?
అధినేత తీరుపై తమ్ముళ్ల అసంతృప్తి
      ( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అప్ప ఆర్భాటమే తప్ప బావబతికుంది లేదన్నట్లు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎంత తాపత్రయపడినా, తల్లకిందులు తపస్సు చేసినా.. ‘కమలం కవల నేతలు’ ఆయనను దగ్గరకు రానీయరు. ఇది ఇప్పటి పరిణామాల బహిరంగ రహస్యం. తాజాగా జస్టిస్ రమణకు వ్యతిరేకంగా.. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి లేఖ రాసిన నేపథ్యంలో, ఇప్పటివరకూ బాబు స్పందించకపోవడమే ఆశ్చర్యం. చిన్న చిన్న అంశాలకే ప్రకటనలు, ట్వీట్ల ద్వారా  స్పందించే చంద్రబాబు- ఆయన తనయుడు లోకేష్.. అత్యంత కీలకమైన ఈ అంశంపై మాత్రం మౌనం వహించడం విశేషమే కాదు. ఆశ్చర్యమే!

దానితో ఆయన జస్టిస్ రమణ వ్యవహారంలో,  ఎటు వైపున్నారన్న సందేహం తెరపైకొచ్చింది.  మరికొద్ది నెలల్లో జస్టిస్ రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆయనపై ఆరోపణలు చేస్తూ.. సుప్రీంకోర్టు సీజేకి ఇచ్చిన ఫిర్యాదు, దేశంలో సంచలనం సృష్టించింది. దానిపై అన్ని వర్గాల్లో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. పైగా చంద్రబాబు.. జస్టిస్ రమణ ద్వారా, హైకోర్టు న్యాయమూర్తిని ప్రభావితం చేస్తున్నారని కూడా ఫిర్యాదు చేశారు. అయితే, దీనిపై యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వర్ల రామయ్య వంటి సీనియర్లు స్పందించారు. జైలుకు వెళ్లొచ్చిన ఒక నిందితుడు, న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడం ఏమిటని నిప్పులు చెరిగారు.

కానీ, ఈ అంశంపై అటు చంద్రబాబు గానీ, ఆయన తయుడయిన లోకేష్ గానీ ఎక్కడా స్పందించకపోవడం, పార్టీ వర్గాలను విస్మయపరిచింది. ప్రతి అంశంపై రోజుకు రెండు మూడు ట్వీట్లు, ప్రకటనలు చేసే ఆ ఇద్దరు.. జిస్టిస్ రమణ వ్యవహారంపై, మౌనంగా ఉండటమే నేతలను విస్మయపరుస్తోంది. పోనీ.. అది న్యాయవ్యవస్థకు సంబంధించినది కాబట్టి మౌనంగా ఉన్నారనుకున్నా.. సీఎం ఫిర్యాదులో బాబు ప్రస్తావన కూడా ఉంది. కనీసం దానిపై కూడా స్పందించకుండా, బాబు మౌనంగా ఉండటంపై తమ్ముళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా తమ అధినేత లక్ష్యంగా జరుగుతున్న పరిణామాలని, ఆయన భుజంపై తుపాకీ పెట్టి ఢిల్లీకి గురిపెట్టారని తెలిసి కూడా, బాబు మౌనంగా ఉండటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

బహుశా ఈ వ్యవహారంలో.. కేంద్రంలోని బీజేపీ జోక్యం ఉందని భావిస్తున్నందుకే, బాబు మౌనంగా ఉంటున్నారన్న మరికొన్ని వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. పైగా..చీఫ్ జస్టిస్ పదవికి బీజేపీ పరిశీలనలో రమణ కాకుండా, మరో ఒకరిద్దరు న్యాయమూర్తులు ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. బహుశా ఈ సమాచారం తెలిసిన బాబు.. అందుకే  ఈ వ్యవహారంపై స్పందించకుండా, వ్యూహత్మకంగా మౌనంగా ఉన్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకవేళ తాను స్పందిస్తే.. కచ్చితంగా రమణకు అనుకూలంగా-జగన్‌కు వ్యతిరేకంగానే గళం విప్పాల్సి ఉంటుంది. అప్పుడు వైసీపీకి అది మరో ఆయుధమవుతుంది. ఇన్ని కోణాలు పరిశీలించిన తర్వాతనే, బాబు మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని సీనియర్లు చెబుతున్నారు.

ఆరోపణల నేపథ్యంలో రమణ అవకాశం కోల్పోతే, అది ఒక తెలుగువాడికి దూరమయిన అవకాశంగానే భావించాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ తెరవెనుక చక్రం తిప్పుతోందన్న చర్చ జరుగుతోంది. అయినా, ఒక రాజకీయపార్టీ అధినేతగా స్పందించాల్సిన చంద్రబాబు, మౌనంగా ఉండటం కేవలం బీజేపీకి భయపడేనంటున్నారు. గతంలో సుప్రీంకోర్డు జడ్జీలు ప్రెస్‌మీట్ పెట్టిన అంశం, ఆ తర్వాతి పరిణామాలపై కాంగ్రెస్ స్పందించిన విషయాన్ని, టీడీపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో తమ అధినేత… బీజేపీ అనుకూల వైఖరి ప్రదర్శిస్తుండటాన్ని, తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. వ్యవసాయ బిల్లును విపక్షాలన్నీ వ్యతిరేకించగా, తమ పార్టీ మాత్రం వైసీపీతో కలసి సమర్ధించడంతో ప్రజలు-కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్లాయంటున్నారు. అదేవిధంగా గతంలో రఫెల్ కుంభకోణంపై గర్జించిన చంద్రబాబు..తర్వాత అభినందించడంపై, బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి ఎద్దేవా చేయడంతో, పార్టీ పరువు-అధినేత విశ్వసనీయత పోయిందని తమ్ముళ్లు వాపోతున్నారు.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner