అధికారం దుర్వినియోగం చేస్తే వారిని కూడా తొల‌గించ‌వచ్చు!

728

అధికారం దుర్వినియోగం చేస్తే..`సుప్రీం`న్యాయ‌మూర్తిని కూడా తొల‌గించ‌వచ్చు!

శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య మన రాజ్యాంగం సున్నితమైన సమతౌల్యం ఉండేటట్టు చేస్తుంది. ఇందులో ఏదీ ఒకదానిని ఒకటి అధిగమించకుండా చూస్తుంది. పార్లమెంట్‌ చట్టాలను రూపొందిస్తుంది. కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ ఆ చట్టాలను విశ్లేషిస్తుంది. బ్రిటిష్‌ ప్రభుత్వ విధానంలోని మంత్రిమండలి విధానాన్ని మనం స్వీకరించాం. అధికారాల విభజన, న్యాయ సమీక్ష వ్యవస్థను అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. రాజ్యాంగ నాలుగో భాగంలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాల ఆలోచన ఐరిష్‌ రాజ్యాంగం నుంచి తెచ్చుకున్నాం.

వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన తరువాత, మన దేశ సామాజిక, మత పరిస్థితులను; అవిద్య, దారిద్య్రం వంటి అంశాలకు అన్వయించుకుంటూ మన రాజ్యాంగ నిర్మాతలు ఒక విస్తృత రాజ్యాంగాన్ని అందించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ సభ సలహాదారు బీఎన్‌ రావు, ముసాయిదా సంఘం అధ్యక్షుడు, భారతజాతి రాజ్యాంగ పితగా గౌరవించే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ల సేవలను స్మరించుకోవాలి.

న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని పరిరక్షించేందుకుగాను న్యాయమూర్తుల నియామకం గురించి రాజ్యాంగ పరిషత్‌లో కొన్ని అభిప్రాయాలు వ్యక్తమైన సంగతి ఆసక్తికరంగా ఉంటుంది. ఉన్నత న్యాయస్థానాలలో జరిగే నియామకాలు భారత ప్రధాన న్యాయమూర్తి సమ్మతితో జరగాలన్నది అందులో ఒకటి. కానీ దీనిని డాక్టర్‌ అంబేడ్కర్‌ చాలా గట్టిగా నిరాకరించారు. ప్రధాన న్యాయమూర్తి చాలా సమర్థుడైన వ్యక్తేనని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నప్పటికీ, ఆయనకు కూడా మనుషులందరికీ ఉండే భావాలే ఉంటాయని అంబేడ్కర్‌ అభిప్రాయపడ్డారు.

భారత ప్రధాన న్యాయమూర్తి నియామకాన్ని మూడింట రెండువంతుల సభ్యుల అంగీకారం ద్వారా ఖరారు చేసే అధికారాన్ని పార్లమెంట్‌కు కట్టబెట్టాలంటూ మరొక ప్రతిపాదన కూడా వచ్చింది. దీనిని కూడా అంబేడ్కర్‌ నిరాకరించారు. రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ కారణాలు ఆ అధికారాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని అంబేడ్కర్‌ విశ్లేషించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగింపు విధానం గురించి ఆర్టికల్‌ 124(4) వివరిస్తుంది. దీనినే అభిశంసన అని పిలుస్తారు. ఇందుకు పార్లమెంట్‌ ఉభయ సభలలో మూడింట రెండువంతులకు తగ్గకుండా సభ్యుల మద్దతు ఉండాలి.

అలాగే ఓటింగ్‌ తప్పనిసరి. అనుచిత ప్రవర్తన, అసమర్థత కారణాలుగా వారిని తొలగించడానికి అవకాశం ఉంది. హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆ రాష్ట్ర గవర్నర్, న్యాయమూర్తిని నియమిస్తున్న ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రతించిన తరువాత రాష్ట్రపతి చేపడతారు. హైకోర్టు న్యాయమూర్తి తొలగింపు విధానం కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే తీరులోనే ఉంటుంది. దీనిని గురించి ఆర్టికల్‌ 217(1) వివరిస్తుంది.

సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల తొలగింపు కోసం 1968లో పార్లమెంట్‌ న్యాయమూర్తుల దర్యాప్తు చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం పరిధిలో 1969లో వారి తొలగింపు విధివిధానాలను రూపొందించింది. వందమంది లోక్‌సభ సభ్యులు, లేదా 50 మంది రాజ్యసభ సభ్యులు స్పీకర్‌ లేదా చైర్మన్‌ల వద్ద తొలగింపు కోసం తీర్మానాన్ని ప్రతిపాదించవచ్చు. పరిశీలన తరువాత ఆ తీర్మానాన్ని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఆ తీర్మానాన్ని కనుక అనుమతిస్తే ఈ అంశాన్ని ముగ్గురు సభ్యులతో కూడిన ఒక సంఘానికి నివేదిస్తారు.

ఇందులో ఒక సభ్యుడిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల నుంచి ఎంపిక చేస్తారు. ఒకరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నుంచి ఎంపిక చేస్తారు. రాజ్యాంగ నిపుణుడని స్పీకర్‌ లేదా చైర్మన్‌ భావించిన వ్యక్తిని మూడో సభ్యునిగా ఎంపిక చేస్తారు. ఈ సంఘం దర్యాప్తు పూర్తి చేసి, నివేదిక సమర్పించిన తరువాత సదరు న్యాయమూర్తి దోషి అని తేలితే అప్పుడు తొలగింపు తీర్మానాన్ని పరిగణనలోనికి తీసుకుంటారు.

అయితే ఈ పద్ధతి పూర్తిగా నిష్ఫలమైనదని గతానుభవం రుజువు చేసింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత రెండు సందర్భాలలో మాత్రమే న్యాయమూర్తులను అభిశంసించాలని కోరడం జరిగింది. వారు– సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి. రామస్వామి, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సౌమిత్రా చటర్జీ. ఇందులో జస్టిస్‌ రామస్వామి మీద ప్రవేశపెట్టిన తొలగింపు తీర్మానం వీగిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ ఓటింగ్‌కు గైర్హాజరు కావడమే ఇందుకు కారణం. ఇక లోక్‌సభ ఓటింగ్‌కు చేపట్టడానికి ముందే జస్టిస్‌ సౌమిత్రా చటర్జీ పదవికి రాజీనామా చేశారు.

కేశవానందభారతి వర్సెస్‌ కేరళ ప్రభుత్వం (ఏఐఆర్‌ 1973 ఎస్‌సీ 1461) కేసులో స్వతంత్ర న్యాయవ్యవస్థ రాజ్యాంగ మౌలిక లక్షణాలలో ఒకటని 13 మంది సభ్యుల ధర్మాసనం తేల్చి చెప్పింది. న్యాయమూర్తుల నియామకంలో ప్రతిభ కాకుండా మిగిలిన అంశాలు నిర్వహించిన పాత్ర అప్రాధాన్యమైనదని చెప్పలేం. కొన్ని కేసులలో రాజకీయ ప్రమేయం, ప్రాంతీయ, మతపరమైన మనోభావాలు ప్రధానంగా ప్రభావం చూపాయి. ప్రఖ్యాత భారత రాజ్యాంగ వ్యాఖ్యాత గ్రన్‌విల్లే ఆస్టిన్‌ కూడా నియామకాలలో పైకి చెప్పని ఉద్దేశాలు ఉన్నాయనే చెప్పారు.

కోర్టులలో కేసులు పేరుకు పోవడానికి కారణం తృప్తికరంగా లేని న్యాయమూర్తుల నియామకం కారణమని ఎంసీ సెతల్వాడ్‌ నాయకత్వంలోని మొదటి లా కమిషన్, భారత మాజీ అటార్నీ జనరల్‌ అభిప్రాయం. ఇలాంటి లోపాలు ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థ ఒడిదుడుకులకు లోను కాలేదు. కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య వైరుధ్యం పొడసూపినా, లేదా కార్యనిర్వాహక శాఖలోనే అంతర్గత విభేదాలు వచ్చినప్పటికీ వివాదాలు బయటకి పొక్కలేదు. ఇలాంటి చిన్న చిన్న విభేదాలను ఆ విధానం తనలోనే దాచేసుకుంది.

న్యాయమూర్తుల నియామకం విధానం 1950 నుంచి 1993 వరకు తృప్తికరంగానే సాగింది. ఈ కాలంలో భారత ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయానికి ఆమోదం లభించని సందర్భాలు ఏడు కనిపిస్తాయి. సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1993 (4) ఎస్‌సీసీ 441) కేసులో జస్టిస్‌ ఏ ఎం అహ్మదీ ఇచ్చిన మైనారిటీ తీర్పులో ఇందుకు సంబంధించిన గణాంకాలు కనిపిస్తాయి.

ఈ కేసునే సెకెండ్‌ జడ్జస్‌ కేసు అని పేర్కొంటూ ఉంటారు. జస్టిస్‌ జేఎస్‌ వర్మ వివరించిన మేరకు, ఈ తీర్పు ప్రకారం మెజారిటీ విశ్లేషించినదేమిటంటే, న్యాయమూర్తిగా నియమించడానికి సిఫారసు చేయదలిచిన వ్యక్తులలో ప్రతికూల లక్షణాలు ఉంటే వాటిని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లడమనే పాత్రకు మాత్రమే కార్యనిర్వాహక వ్యవస్థ పరిమితం కావాలి. దీనితో కార్యనిర్వాహక వ్యవస్థ పాత్ర నిష్ఫలమైంది.

కొలీజియం న్యాయమూర్తుల నియామకంలో చట్టబద్ధమైన అధికారం కలిగిన సంస్థ అయింది. కొలీజియం సిఫారసులను కొట్టివేసే అధికారం ఏ కోర్టుకు లేదు. కోలీజియం సిఫారసుల మేరకు నియామకాలు జరపడానికే న్యాయ సమీక్షకు ఉన్న అధికారం పరిమితమైంది. న్యాయమూర్తుల నియామకంలో మంత్రి మండలి రాష్ట్రపతికి సలహా ఇవ్వడం కూడా లాంఛనంగా మారింది. కొలీజియం సిఫారసులను కార్యనిర్వాహక వ్యవస్థ రాష్ట్రపతికి తెలియ చేస్తే ఆయన నియామకాలు చేపడతారు.

ఇందులో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే సెకెండ్‌ జడ్జస్‌ కేసులో మెజారిటీ తీర్పును రచించిన జస్టిస్‌ జేఎస్‌ వర్మ తరువాత తన అభిప్రాయం మార్చుకున్నారు. న్యాయమూర్తుల నియామకాలను జాతీయ జ్యుడీషియల్‌ కమిషన్‌ చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఉప రాష్ట్రపతి/ప్రధాని/ భారత ప్రధాన న్యాయమూర్తి తదితరులు ఇందులో సభ్యులుగా ఉండాలని ఆయన చెప్పారు.

అసలు ఎలాంటి న్యాయమూర్తులు దేశానికి కావాలి? రాజ్యాంగ పరిషత్‌లో ప్రసంగించినప్పుడు నెహ్రూ, ఆ న్యాయమూర్తులు అత్యంత విజ్ఞానవంతులు కావాలని అభిప్రాయపడ్డారు. ప్రతి ప్రజాస్వామిక దేశంలోను పాలన పాలించేవారి అనుమతితో సాగుతుంది. అమెరికాలో న్యాయమూర్తుల నియామకానికి సెనేట్‌ ఆమోదం అనివార్యం. కానీ ఇక్కడ కార్యనిర్వాహక వ్యవస్థ పూర్తిగా దూరంగా ఉండిపోయింది.

దీనితో జవాబుదారీ తనం గురించిన ప్రశ్న తలెత్తింది. పార్లమెంట్‌ చేసిన నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ చట్టం, 2014 దీని ఫలితమే. దీనిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు వ్యతిరేకించారు. న్యాయమూర్తుల నియామకంలో న్యాయవ్యవస్థదే పై చేయి అన్న సంగతి సెకెండ్‌ జడ్జస్‌ కేసుతోనే నిర్ధారణ అయిందని నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్, జస్టిస్‌ గోయెల్, జస్టిస్‌ మదన్‌ బి లోకూర్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ మెజారిటీ తీర్పులో పునరుద్ఘాటించారు.

కొలీజియం పని విధానాన్ని మెరుగు పరచడానికి తీసుకోవలసిన చర్యల గురించి ఆలోచించవలసిందని కోరుతూ 16–12–2015న రాజ్యాంగ ధర్మాసనం ఒక ఆదేశాన్ని జారీ చేసింది. సీనియర్‌ న్యాయవాదులు, న్యాయ నిపుణుల సలహాలను కూడా కోరారు. ఈ సలహాలను గ్రంథస్థం చేయడానికి ఒక సంఘాన్ని కూడా నియమించారు. న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం ఈ వాస్తవాలను పరిగణనలోనికి తీసుకోవాలని భావించారు. అవి– అర్హత ప్రమాణం, నియామక విధానంలో పారదర్శకత, సరైన విధాన అవగాహన నిర్వహణకు ఒక సచివాలయం ఏర్పాటు.

అయితే కొలీజియం వ్యవహార సరళి, ఉన్నత న్యాయస్థానాలలో న్యాయమూర్తుల నియామకం గురించి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ కొలీజియం సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జె. చలమేశ్వర్‌ భారత ప్రధాన న్యాయమూర్తికి సెప్టెంబర్, 2016లో ఒక లేఖ రాశారు. దేశంలో సాగుతున్న పాలన, శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య రాజ్యాంగం నిర్దేశించిన సున్నిత సమతౌల్యం మీద అది చూపుతున్న ప్రభావం గురించి కొన్ని సంక్లిష్ట ప్రశ్నలను ఆ లేఖ లేవనెత్తింది.

పత్రికలలో వెలుగు చూసిన మేరకు ఆ లేఖలో ఆయన కొలీజియం పద్ధతి పారదర్శకంగా లేదని పేర్కొన్నారు. అయితే ఆ న్యాయమూర్తి లేవనెత్తిన అంశాలను పరిష్కరించారో లేదో మాత్రం తెలియదు. కొలీజియం వ్యవహారాలేవీ ప్రజలకు తెలియవు. ఆఖరికి కొలీజియంలో సభ్యులు కాని ఉన్నత న్యాయమూర్తులకు కూడా అక్కడ జరిగిన చర్చల వివరాలు తెలియవు.

సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తులు, కొలీజియంలో కూడా సభ్యులు అయిన జస్టిస్‌ చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్‌ గొగొయ్, జస్టిస్‌ మదన్‌ బి లోకూర్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌లు 12–1–2018న విలేకరుల సమావేశంలో గళం విప్పడం దేశంలో సంచలనమైంది. ఈ నలుగురిలో సీనియర్‌ చలమేశ్వర్‌ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇందులో జస్టిస్‌ గొగొయ్‌ తరువాత భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలు ఉన్నవారు. ఆ నలుగురు రెండు మాసాల క్రితం ప్రధాన న్యాయమూర్తికి ఉమ్మడిగా రాసిన లేఖ ప్రతిని కూడా విలేకరులకు అందించారు.

కొలీజియం వ్యవస్థలోని దోషాల గురించి ఆ లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి సహేతుకత లేకుండా కేసులను ధర్మాసనాలకు కేటాయిస్తున్న తీరును గురించే వారు ప్రధానంగా లేఖలో ఆరోపణలు చేశారు. ఆ తరువాత కూడా కొన్ని పరిణామాలు జరిగాయి. సీపీఐ నాయకుడు డి. రాజా వెళ్లి చలమేశ్వర్‌ను ఆయన నివాసంలో కలుసుకోవడం గురించి కొన్ని పత్రికలు విమర్శించాయి.

ఆ తరువాత అసలు న్యాయవ్యవస్థను అపఖ్యాతి పాలు చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ ఆరెస్సెస్‌ కార్యకర్త ఒకరు పత్రికా ప్రకటన ఇచ్చారు. ఇంకా సీపీఎం నాయకుడు యేచూరి ఉన్నత న్యాయస్థానంలో పనితీరు దిగజారడం, న్యాయమూర్తుల మధ్య విభేదాల గురించి గళమెత్తడంతో అసలు ప్రధాన న్యాయమూర్తి మీద అభిశంసన తీసుకురావడానికి సంకేతమనే అనుమానాలు కలిగించింది.

(27–1–2018న హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ మేధావుల ఫోరమ్‌ సభలో చదివిన ఉపన్యాసం)

-జస్టిస్‌ ఎం.ఎన్‌. రావ్‌
వ్యాసకర్త హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి

2 COMMENTS

  1. What i don’t realize is actually how you’re now not really much more smartly-liked than you may be right now. You’re so intelligent. You understand therefore significantly on the subject of this topic, made me in my view believe it from so many various angles. Its like men and women are not fascinated unless it is one thing to do with Woman gaga! Your own stuffs excellent. All the time care for it up!