అది ‘కమ్మ’రావతి కాదు..అమరావతే!

634

300 రోజుల ఉద్యమంలో మెరుపులు- మరకలు
కమలం కప్పగంతులకు తెరపడేదెన్నడు?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని ఏపీలో… రాజధాని నగరంగా అమరావతి నగరాన్ని ఎంపిక చేశారు. దాని శంకుస్థాపన కార్యక్రమానికి దేశ ప్రధాని, కేంద్రమంత్రులు, న్యాయమూర్తులతోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. అంటే ఇంతమంది వచ్చినందున, బుద్ధి-బుర్ర ఉన్న ఎవరయినా రాజధాని నగరం అక్కడే ఉంటుందనుకోవడం సహజం. అంతకుముందు విపక్షనేతగా ఉన్న జగన్ కూడా, అమరావతిలోనే రాజధానిని స్వాగతిస్తున్నామని నిండు సభలో స్పష్టం చేశారు. ఆ తర్వాత కొత్త నగర నిర్మాణానికి కేంద్రం కూడా నిధులిచ్చింది. ఆ పరిసర ప్రాంతాల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ భ వనాలు, ప్రైవేటు యూనివర్శిటీలకూ స్థలం కూడా మంజూరు చేశారు. అందులో కొన్ని ప్రైవేటు యూనివర్శిటీలూ వచ్చాయి. హైకోర్టు, సచివాలయం-అసెంబ్లీ- ఉద్యోగుల క్వార్టర్లు కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇన్ని వేల ఎకరాలన్నీ ప్రభుత్వం భూసేకరణలో కొనుగోలు చేసినవి కాదు. రైతుల నుంచి సేకరించినవి. దానికోసం వారికి కొన్ని రాయితీలు ఇచ్చింది. ప్రతి ఏటా కౌలుకు నిధులు కూడా కేటాయించింది. ఇదీ స్ధూలంగా అమరావతి నగర నిర్మాణ కథ!

అమరావతిలో రాజధానిని స్వాగతించిన వైసీపీ- దాని అధికార మీడియా, మరోవైపు అందులోని అక్రమాలను ప్రస్తావించింది. అందులో తప్పులేదు. అది రాజకీయపార్టీగా దాని హక్కు. మంత్రులు-టీడీపీ ఎమ్మెల్యేలు-వారి బంధువులు బినామీల పేరుతో, రైతుల నుంచి తక్కువ ధరకు వందల ఎకరాలు కొనుగోలు చేశారని వైసీపీ-దాని మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. రాజధాని ఎక్కడో ముందే తెలుసుకుని, బినామీలతో భూములు కొనుగోలు చేయించిందని ఆరోపించింది.  సాక్షిలో అయితే సర్వే నెంబర్లు సహా ప్రచురించింది. వాటిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది.

నిజంగా బినామీల పేర్లతో, భూమలు కొనుగోలు చేసి ఉంటే వారు శిక్షార్హులే. ఆ అక్రమార్కుల సంగతి తేల్చాల్సిందే.  అయితే ప్రభుత్వ సంస్థలకు ఎక్కువ రేట్లకు అమ్మిన అవే భూములు, ప్రైవేటు వ్యక్తులకు మాత్రం కారుచౌకగా ఇచ్చారని, అందులో కమ్మ వర్గానికి చెందినవే ఎక్కువ ఉన్నాయన్న వైసీపీ ఆరోపణలను మాత్రం,  టీడీపీ ఖండించలేకపోయింది. న్యాయమూర్తులకు తక్కువ ధరకు ఇచ్చారన్న, వైసీపీ ఆరోపణల్లో పెద్దగా పస కనిపించలేదు. ఎందుకంటే జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సహా ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌లకూ ప్రభుత్వం భూమి కేటాయించింది.

సరే..  అక్కడ ఇంత జరిగిన తర్వాత రాజధాని అమరావతి బదులు, విశాఖలో ఉండాలన్న జగన్ ప్రభుత్వ ప్రయత్నాలపై, అమరావతి రైతులు 300 రోజుల నుంచి వివిధ రూపాల్లో శాంతియుత ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. అక్కడి రైతులను మంత్రులు బూతులు తిడుతున్నా, పెయిడ్ ఆర్టిస్టులని దూషిస్తున్నా రైతులు సహనం పాటిస్తున్నారు. బీజేపీ కూడా రైతుల ఆందోళనలో పాల్గొంది. రాజధాని అమరావతిలోనే ఉండాలని ఆ పార్టీ తీర్మానం కూడా చేసింది. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తర్వాతనే ఆ పార్టీ పిల్లిమొగ్గలు వేస్తోంది. జీవీఎల్ అయితే, అమరావతిపై నిర్ణయం కేంద్ర పరిథిలో లేదని చాలాసార్లు చెప్పగా.. కన్నా-పురందీశ్వరి లాంటి నేతలు మాత్రం పార్టీ వైఖరికే కట్టుబడ్డామని చెప్పారు. ఇప్పుడు అమరావతి రైతుల ఆందోళనలో కమలదళాలు ఎక్కడా కనిపించడం లేదు. మరి ఆ పార్టీ, మొహమాం ముసుగు ఎప్పుడు తీస్తుందన్నది వేరే కథ.

ఇక ఇప్పుడు అమరావతి చుట్టూ అల్లుకున్న కులం కథలోకి వెళ్దాం. సంఖ్యాబలం తక్కువయినప్పటికీ, అమరావతి పరిసర ప్రాంతాల్లో కమ్మవారి పట్టు-ప్రభావం ఎక్కువ కాబట్టి, టీడీపీ రాజధానిని అక్కడే ఎంచుకున్నది వైసీపీ-దాని సోషల్ మీడియా దళాల అసలు అనుమానం. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం కూడా కమ్మ వర్గం నడిపిస్తుందే తప్ప, అందులో మిగిలిన వారెవరూ లేరన్నది మరో ప్రచారం. తెరపైకి వస్తున్న నాయకులంతా ఆ వర్గానికి చెందిన వారే కాబట్టి, అలాంటి ప్రచారం జరగడం సహజం. కానీ, రాజధాని కోసం భూములిచ్చిన వారిలో కమ్మ వారి శాతం తక్కువ కాగా, కమ్మేతరులు ఇచ్చిన భూములే ఎక్కువ న్న వాస్తవం, బయట ప్రపంచానికి తెలిసింది బహు తక్కువ.

ఇప్పుడు రాజధాని నగరం.. అక్కడ ఉండదంటున్న ప్రభుత్వం ముందు, రైతులు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం లేదు. మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం ఇచ్చిన రైతులకు, ప్రభుత్వం ఆర్ధికంగా బాగానే లబ్థి చేకూర్చింది. నిజానికి కర్నూలు రాజధాని నగరంగా ఏర్పడినప్పుడు గానీ, శ్రీశైలం వంటి భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందు గానీ, అంత భారీ ప్యాకేజీ ఇచ్చిన చరిత్ర లేదు. ఆ విషయంలో అమరావతి రైతులు వందరెట్ల మేళ్లు పొందారు. అందుకే … రైతులు భూములు ఉచితంగా ఏమైనా ఇచ్చారా? భారీ ప్యాకేజీ, కమర్షియల్ ప్లాట్లు, కౌలు తీసుకుంటున్నారు కదా? ఇన్ని తీసుకుని ఏదో త్యాగం చేశామని ఆందోళనలు ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నలను,  వైసీపీ వర్గాలు విస్తృతం చేస్తున్నాయి. అందులో నిజం లేకపోలేదు.

కానీ, రాజధానిగా ప్రకటించకముందే అక్కడ భూములకు మంచి గిరాకీ ఉంది. పైగా రాజధానికి భూములిచ్చిన తర్వాత, ప్రభుత్వం వాటిని చదును చేసింది. ఇప్పుడు ఏ భూమి ఎవరిదో తేల్చుకోవడం అసంభవం. ఇప్పుడు అక్కడ రాజధాని నగరం లేదంటే, భూములిచ్చిన రైతుల జీవనాధారం ఏమిటన్నది ప్రశ్న. ఏదేమైనా.. ఏ కులానికి చెందిన రైతులయినా, భూములిచ్చింది చంద్రబాబునాయుడుకో, లోకేష్‌కో, హెరిటేజ్‌కో కాదు. ప్రభుత్వానికి!  ఒప్పందం జరిగింది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి-రైతులకే తప్ప.. పార్టీలకూ రైతుల మధ్య కాదన్నది, మనం మనుషులం అన్నంత నిజం. పాలకుల ఆలోచనా విధానం-నిర్ణయాలు కూడా ఆ కోణంలేనే ఉండాలి.

ఆ కోణం లేకపోగా, కులం కోణాన్ని తెరపైకి తీసుకురావడమే వివాదానికి కారణం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన అమరావతిని.. ‘కమ్మరావతి’గా ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ  మైండ్‌గేమ్ ఎన్నికల ముందు, ఆ తర్వాత చాలాకాలం పనిచేసింది. భూములన్నీ కమ్మవారికి దోచిపెట్టడానికే.. అక్కడ రాజధానిని తీసుకువచ్చారన్న ప్రచారాన్ని గురజాల నుంచి ఇచ్చాపురం వరకూ.. అనంతపురం నుంచీ నెల్లూరు వరకూ తీసుకువెళ్లడంలో, వైసీపీ వ్యూహబృందం విజయం సాధించింది. దానిని తిప్పికొట్టడంలో టీడీపీ వైఫల్యం చెందింది. వైసీపీ ఆరోపణలకు తగ్గట్లుగానే టీడీపీ సర్కారు కూడా, తన కులానికి చెందిన వారికే అన్ని రంగాల్లో పట్టం కట్టింది. ఫలితంగా వైసీపీ వ్యూహబృందం ఆరోపణలను, ఇతర ప్రాంతాలకు ప్రజలు సులభంగా నమ్మేశారు. మిగిలిన కులాలలో కమ్మ వ్యతిరేక భావన నాటేందుకు వైసీపీ వ్యూహబృందం ఆ రకంగా విజయం సాధించింది.

నిజానికి అమరావతి రాజధాని కోసం భూములిచ్చినవారిలో కమ్మేతరులే ఎక్కువ. ఇటీవల దీనిపై దళిత సంఘాలు, ఆ వివరాలను కోర్టుకూ సమర్పించాయి. అమరావతిలో రాజధానికి భూములిచ్చిన వారిలో.. దళితులు-గిరిజనులు  32 శాతం మంది ఉన్నారు. ఇక తర్వాత స్థానం రెడ్లది.  రాజధాని కోసం రెడ్లు ఇచ్చిన భూములు 23  శాతం. కమ్మ వారిది ఆ తర్వాత స్థానం. వారు ఇచ్చిన భూములు 18 శాతం. బీసీలు 14, కాపులు 9, మైనారిటీలు 3, ఇతరుల ఒక్క శాతం భూమి ప్రభుత్వానికి ఇచ్చారు. అంటే ఎక్కువ భూములిచ్చి నష్టపోయింది.. దళిత-గిరిజనులేనన్నది సుస్పష్టం

పైగా 95 శాతం చిన్న కారు రైతులే, సర్కారుకు భూములిచ్చారన్నది మరో నిజం. కేవలం ఒక్క ఎకరం ఉన్న  20,490 మంది రైతులు, 10,035 ఎకరాల భూమిని సర్కారుకు ఇచ్చారు. 20-25 ఎకరాలున్న 12 మంది రైతులు, 269 ఎకరాలిచ్చారు. ఇక 25 ఎకరాలకు పైనున్న ఐదుగురు రైతులు మాత్రమే, 151 ఎకరాలు ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీన్ని బట్టి చిన్నకారు, మధ్య తరహా రైతులే ఎక్కువ భూములివ్వగా, భూస్వాముల సంఖ్య కేవలం 17 మాత్రమేనని స్పష్టమవుతోంది.

అందులో కూడా ప్రచారంలో ఉన్న, కమ్మ వర్గం ఇచ్చిన భూములు కేవలం 18 శాతమే. దీన్నిబట్టి ఇప్పుడు జరుగుతున్నది ‘కమ్మ’రావతి ఉద్యమం కాదని, అమరావతి ఉద్యమమేనని.. మెడమీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. అయితే, ఈ అంశంలో వస్తున్న ఆరోపణలను ఖండించి, వాస్తవాలు వెల్లడించడంలో కమ్మ వర్గంతోపాటు, ఆ కులానికి  ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ కూడా  విఫలమయింది. ఎంతసేపూ ఒక నారాయణ, మరో పుల్లారావు, ఇంకో సుబ్బారావును కాపాడే ప్రయత్నమే చేసింది. ఫలితంగానే అది ‘కమ్మరావతి’ అన్న ప్రచారానికి అవకాశం ఇచ్చినట్టయింది.

ప్రస్తుతం అమరావతి కథకు సంబంధించిన పరిణామాలన్నీ.. కేవలం చంద్రబాబునాయుడు లక్ష్యంగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. రైతుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తుండటం, అమరావతి అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా చేయడం వల్ల జగన్ సర్కారు.. అమరావతి కోసం ఏం చేసినా దాని వచ్చే కీర్తి అంతా బాబు ఖాతాకే వెళుతుందన్న రాజకీయ కోణంలో మౌనంగా ఉన్నట్లు అర్ధమవుతుంది. అంటే అమరావతి అంశానికి.. చంద్రబాబు కొంత మైనస్- మరికొంత ప్లస్‌గా మారారన్నది అర్ధమవుతూనే ఉంది.

ఇప్పుడు  రాజధాని కోసం భూములిచ్చిన వారిలో… కమ్మ రైతుల కంటే రెడ్లే ఎక్కువ ఉన్నందున, మరి దానిని రాజకీయ రొచ్చు భాషలో ‘రెడ్లావతి’ అని అనలేం. ఎందుకంటే వారికంటే, దళిత-గిరిజన రైతులు ఎక్కువ శాతం భూములిచ్చారు కాబట్టి! సరే.. భూములకు- కులాలకు సంబంధం లేదు కాబట్టి.. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సింది పాలకులే కాబట్టి, ఈ చచ్చు పుచ్చు ఇచ్చకాలకు తెరదించి, పాలకులు వారికి న్యాయం చేసే పని మొదలుపెట్టడం మంచిది.