ఆ రెండు పత్రికలకు ఏమైంది?

622

-(రవీంద్ర ఇప్పల)

నిన్న రాత్రి 9 గంట‌ల‌కు ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పున ఎంతో ముఖ్య‌మైన ప్రెస్‌మీట్ జరిగింది. అంత‌కు ముందు ఈ విష‌య‌మై వివిధ చాన‌ళ్ల‌లో బ్రేకింగ్ న్యూస్‌గా ఊద‌ర‌గొట్టారు. తీరా ప్రెస్‌మీట్ స్టార్ట్ అయిన త‌ర్వాత ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌కుండా నిమ్మ‌కుండి పోయాయి.

టీడీపీ అనుకూల చాన‌ళ్లు ఎటూ ఆ ప్రెస్‌మీట్‌ను ప‌ట్టించుకోలేదు. ప‌ట్టించుకోవ‌ని కూడా అంద‌రికీ తెలిసిందే. కానీ జ‌గ‌న్ స‌ర్కార్‌తో స‌ఖ్య‌త‌గా మెలుగుతాయ‌ని పేరున్న చాన‌ళ్లు కూడా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డానికి భ‌య‌ప‌డ్డాయి. సుప్రీంకోర్టు జ‌డ్జితో పాటు హైకోర్టు జ‌డ్జీల‌పై ప్ర‌భుత్వ స‌ల‌హాదారు అజ‌య్‌క‌ల్లం ప్రెస్‌మీట్ కావ‌డంతో … ఎందుకొచ్చిన గొడ‌వ‌ని ఎవ‌రికి వాళ్లు స‌ర్దుకున్నారు.

ఈ నేప‌థ్యంలో తెల్లారి చూస్తే ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ల్లో అజ‌య్‌క‌ల్లం ప్రెస్‌మీట్‌కు సంబంధించిన స‌మాచారమే లేదు. అలాగే ఈ రెండు ప‌త్రిక‌లను సీపీఐ అనుబంధ ప‌త్రిక విశాలాంధ్ర ప‌త్రిక అనుస‌రించి వార్త‌ను కిల్ చేయ‌డం ఆత్మ‌హ‌త్యాస‌దృశ్యంగా చెప్పొచ్చు. చంద్ర‌బాబుతో బంధం సీపీఐని ఎలాంటి దుస్థితికి దిగ‌జార్చిందో ఇదే నిద‌ర్శ‌నంగా నిలిచింది.ఇది కూడా చదవండి: హవ్వ..ఇదేం జర్నలిజం?

సాక్షితో పాటు ప్ర‌జాశ‌క్తి, ఆంధ్ర‌ప్ర‌భ త‌దిత‌ర ప‌త్రిక‌లు ఈ వార్త‌ను ఇవ్వ‌డం నిజంగా అభినంద‌నీయం. ఇదిలా ఉండ‌గా జ‌గ‌న్ న్యాయ పోరాటానికి అనూహ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వెన్నుద‌న్నుగా నిలిచారు. టీఆర్ఎస్ సొంత ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో అజ‌య్‌క‌ల్లం ప్రెస్‌మీట్‌కు అగ్ర‌స్థానం క‌ల్పించ‌డం ద్వారా …ఈ వ్య‌వ‌హారంలో జ‌గ‌న్‌కు కేసీఆర్ మ‌ద్ద‌తుగా నిలిచార‌ని స్ప‌ష్ట‌మైంది.“న్యాయ పోరాటం” శీర్షిక‌తో న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌లో బ్యాన‌ర్ వార్త ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే సాక్షి కంటే మిన్న‌గా న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌లో వార్తా కథ‌నాన్ని హైలెట్ చేశారు. ఈ క‌థ‌నానికి న‌మ‌స్తే తెలంగాణ‌లో ఇచ్చిన స‌బ్ హెడ్డింగ్‌లు, జ‌గ‌న్ లేఖ‌లోని ముఖ్యాంశాల‌ను ప్ర‌ధానంగా ఇవ్వ‌డాన్ని బ‌ట్టి …కేసీఆర్ వైఖ‌రి ఏంటో మ‌రోసారి రుజువైంది.

“ఏపీలో సంచ‌ల‌నం, హైకోర్టు జ‌డ్జిల తీరుపై జ‌గ‌న్ స‌ర్కార్ ధ్వ‌జం , న్యాయ వ్య‌వ‌స్థ‌లో టీడీపీ నేత చంద్ర‌బాబు జోక్యం, కోర్టుల్ని వాడుకుని మా స‌ర్కారును అస్థిర‌ప‌రిచే కుట్రః జ‌గ‌న్” అంటూ స‌బ్ హెడ్డింగ్‌ల‌ను ఇచ్చారు. ఇక సుప్రీం చీఫ్ జస్టిస్‌కు జ‌గ‌న్ రాసిన లేఖ‌లోని ప్ర‌ధాన అంశాల‌ను కూడా మొద‌టి పేజీలో ఆక‌ర్ష‌ణీయంగా , ఆక‌ట్టుకునేలా ఇచ్చారు. ఆ వివ‌రాల‌ను కూడా చూద్దాం. ముందుగా న‌మ‌స్తే తెలంగాణ‌లో రాసిన ఇంట్రో గురించి తెలుసుకుందాం.

“ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంచ‌ల‌న సన్నివేశం చోటు చేసుకుంది. ఏపీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తితో పాటు హైకోర్టులోని కొంద‌రు జ‌డ్జిల వ్య‌వ‌హార‌శైలిపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తింది. రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం ఏపీ ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని ఆరోపించింది” అని రాసుకెళ్లారు.

“ప్ర‌జ‌ల చేత ఎన్నికైన ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డానికి టీడీపీ నేత చంద్ర‌బాబు ….అత్యున్న‌త వ్య‌వ‌స్థ వ్య‌వ‌స్థ అయిన హైకోర్టు హైకోర్టును వాడుకుంటున్నారు. చంద్ర‌బాబు ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు చివ‌రికి జ‌డ్జిల రోస్ట‌ర్‌ను మార్చారు. కీల‌క‌మైన కేసుల‌ను జ‌స్టిస్ ఏవీ శేష‌సాయి, జ‌స్టిస్ ఎం.స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి, జ‌స్టిస్ డీవీఎస్ఎస్ సోమ‌యాజులు, జ‌స్టిస్ డీ.ర‌మేశ్‌ల‌కు కేటాయించారు” అని సుప్రీం సీజేకు రాసిన లేఖ‌లో ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అని ఇచ్చారు.

“టీడీపీ నేత చంద్ర‌బాబు న్యాయ వ్య‌వ‌స్థ‌లో జోక్యం చేసుకుంటున్నార‌ని , ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జ‌డ్జి ఎన్వీ ర‌మ‌ణ ఇందుకు స‌హ‌క‌రిస్తున్నార‌ని పేర్కొంది. ఫ‌లితంగా రాష్ట్ర హైకోర్టులోని కొంద‌రు జ‌డ్జిలు ఒక్క‌టై చంద్ర‌బాబు కోరుకున్న‌ట్టుగా, తెలుగుదేశం పార్టీకి మేలు చేసేట్టుగా ఆదేశాలు, తీర్పులు ఇస్తున్నార‌ని తెలిపింది” అని లేఖ‌లోని వివ‌రాల‌ను ప్ర‌ధానంగా ఇచ్చారు.

“సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి స‌హా ప‌లువురు జ‌డ్జిల పేర్ల‌తో ఉన్న ఈ ఫిర్యాదు న్యాయ‌, రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. స్వతంత్ర భార‌త‌దేశ చ‌రిత్ర‌లో హైకోర్టు, సుప్రీంకోర్టు జ‌డ్జిల‌పై ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం ఇలా ఫిర్యాదు చేయ‌డం ఇదే ప్ర‌థ‌మం” అని న‌మ‌స్తే తెలంగాణ త‌న అభిప్రాయాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పింది.

ఏపీ హైకోర్టు , సుప్రీంకోర్టు జ‌డ్జీల‌పై సీఎం జ‌గ‌న్ సుప్రీం చీఫ్ జ‌స్టిస్‌కు లేఖ రాయ‌డం ఎంతో సాహ‌సోపేత‌మైన చ‌ర్య‌గా రాజ‌కీయ‌, న్యాయ‌రంగానికి సంబంధించిన నిపుణులు చెబుతున్న విష‌యం తెలిసిందే.

అలాంటి సాహ‌సోపేతమైన జ‌గ‌న్ పోరాటానికి కేసీఆర్ త‌న ప‌త్రిక‌లో ప్ర‌చురించిన వార్త‌తో నైతిక మ‌ద్ద‌తు ప్ర‌క‌టించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌త్రిక‌లు రాజ‌కీయ ఎజెండాతో న‌డుస్తున్న ప‌రిస్థితుల్లో తాజాగా జ‌గ‌న్ న్యాయ‌పోరాటంపై కేసీఆర్ వైఖ‌రిని జ‌నం పాజిటివ్ కోణంలో అర్థం చేసుకుంటున్నారు.

1 COMMENT