హవ్వ..ఇదేం జర్నలిజం?

474

జస్టిస్ రమణపై ఆరోపణ మీడియాకు వార్త కాదా?
ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కనిపించని ఏపీ సర్కారు ప్రెస్‌మీట్
చెప్పడానికేనా రాజగురువుల నీతులు?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

చెప్పడానికే నీతులు. వారిద్దరూ సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నామని, గుండె ధైర్యం ఉన్న సంస్థ తమదేనని చొక్కాలు చించుకుంటారు.. జర్నలిజం విలువలు పడిపోతున్నాయని, టన్నుల కొద్దీ కన్నీరు కార్చే తెలుగు మీడియాకు చెందిన, ఇద్దరు ఆసాములు కట్టుకున్న నైతిక విలువల మడిబట్టలు, ఏ గంగలో కలిసిపోయాయి? సర్కారు మీద కోర్టులు వేసే అక్షింతలను తాటికాయంత అక్షరాలతో పతాకశీర్షికలెక్కించే, ‘రాజగురువుల’ ముద్దుల పత్రికలు.. అదే సర్కారు,  అదే కోర్టు న్యాయాధిపతులపై ఆరోపణలు చేస్తే అచ్చొత్తని పక్షపాతానికి ఏ పేరుపెట్టాలి? ఈ అనైతిక జర్నలిజం విలువలకు ఎవరు పాతరేయాలి? అంటే మీడియా యజమానులకు రుచించని వార్తలు, పాఠకులు చదవడానికి వీల్లేదా?

ఆ ప్రకారంగా ప్రపంచంలోని ప్రజలందరి పక్షాన, మీడియా యజమానులే ఆలోచిస్తారా?.. సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై.. ప్రభుత్వ సలహాదారు అజయ్‌కల్లం రెడ్డి, ప్రెస్‌మీట్‌లో చేసిన బహిరంగ ఆరోపణల తాలూకు వార్త….  ఈనాడు, ఆంధ్రజ్యోతి అనే రెండు మోతుబరి మీడియా సంస్థలకు చెందిన వాటిలో,  భూతద్దం వేసి వెతికినా కనిపించని తర్వాత.. మెడమీద తల ఉన్న ఎవరికయినా వచ్చే సందేహాలే ఇవి!

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ .. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారని.. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు.. జస్టిస్  రమణ ద్వారా న్యాయవ్యవస్థలో జోక్యం చేస్తున్నారన్న మరో ఆరోపణ చేశారు. ఇవన్నీ ఎవరో నాలుగు గోడల మధ్య చేసినవికావు. పరిశోధనాత్మక కథనాలూ, అల్లికలూ, వంటలూ  కావు. సాక్షాత్తూ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం రెడ్డి మీడియా ముఖంగా చేసిన ఆరోపణలే. మరి ఒక సీఎం దేశ అత్యున్నత న్యాయస్ధానమైన సుప్రీంకోర్టు జడ్జిపై,  ఇంత తీవ్రమైన ఆరోపణలు చేయడం సంచలనమే కాదు. విభ్రాంతికరమైన వార్తనే.

సహజంగా అయితే.. ఈ వార్తను మెదడున్న ఏ పత్రికయినా పతాకశీర్షికగా ఎక్కిస్తుంది. ఇక చానెళ్ల సంగతయితే చెప్పాల్సిన పనే లేదు. రోజులో సగ భాగం… మళ్లీ కొత్త వార్తా వంటకం దొరికే వరకూ, ఈ సంచలన వార్తను చూపిందే చూపిస్తాయి.  దానిపై ప్రత్యేక కథనాలు అందిస్తాయి. అది అనుకూలమయినా, వ్యతిరేక కోణంలో అయినా! దీనికి ‘జర్నలిజం విలువలు’ అనే పెద్ద పెద్ద మాటలు కూడా అవసరం లేదు.

కానీ విచిత్రం, విస్మయం, విభ్రాంతి కలిగించే విషయమేమిటంటే… జర్నలిజంలో నైతిక విలువలపై అపార ప్రేమ కురిపించే,  ఈనాడు-ఆంధ్రజ్యోతి అనే రెండు మోతుబరి మీడియాలో.. జస్టిస్ రమణపై సర్కారు చేసిన ఆరోపణ-ప్రెస్‌మీట్ వార్త,  ఎక్కడా కనిపించకపోవడమే విడ్డూరం. నిజానికి ఈ రెండు పత్రికలకు సంబంధించిన వెబ్‌సైట్‌లో కూడా, శనివారం రాత్రి వరకూ  జస్టిస్ రమణకు సంబంధించిన వార్త భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు. ఇంకా పేరన్న టీవీ చానెళ్లలోనూ ఈ వార్త ఎక్కడా కనిపించలేదు.

జగన్మోహన్‌రెడ్డి సర్కారు.. న్యాయవ్యవస్థతో కయ్యం పెట్టుకుంటోందని ఒకరు, అది సత్సంప్రదాయం కాదని మరొకరి మీడియాలో నిత్యం హితోక్తులు వినిపిస్తుంటాయి. ఆ మేరకు ఎడిటోరియల్ పేజీలలో వ్యాసాలు కూడా కనిపిస్తుంటాయి.  మరి  అదే ఒరవడిలో.. జగన్ ఈ విధంగా, సుప్రీంకోర్టు జడ్జి రమణపైనా ఆరోపణలు చేసి, ఏకంగా సీజేకే ఫిర్యాదు చేశారన్న వార్త.. ఒక్క ముక్క కూడా రాకపోవడం చూస్తే,  చెప్పడానికే నీతులన్న సామెత గుర్తుకురాక మానదు.ఇది కూడా చదవండి: జడ్జి రమణపై…జగన్ ‘జంగ్’!

అంటే మీడియా ఆసాములు ఆలోచనల ప్రకారమే ప్రపంచం నడవాలి. అందుకు విరుద్ధంగా జరిగితే సదరు ఆసాములు సహించలేరు. భరించలేరు. అసలు ఆ వార్తను ప్రపంచానికే చూపించరు. అదే.. తమకు ఇంపుగా ఉన్న వార్తలు, తమకు నచ్చినట్లు కనిపించే సంఘటనయితే, లోకమంతా చాటింపు వేస్తారు. అంటే మీడియా ఆసాముల దయ-పాఠకుల ప్రాప్తమన్నమాట! జస్టిస్ రమణతో సదరు మీడియా ఆసాములకు.. పూర్వాశ్రమంలో వ్యక్తిగత స్నేహమో, మరేదో సంబంధమో, ఇంకేదో పరిచయాలో  ఉండవచ్చు. దానికి అనేక కోణాలు కారణమూ కావచ్చు. అంతా తెలుగుజాతికి సంబంధించిన వారే కాబట్టి…  ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందర్భంలో పరిచయాలు ఉండవచ్చు. దాన్ని తప్పు పట్టలేం. కానీ, ఆ మోహమాటం వార్తల్లో చూపించకూడదు కదా? దేని దారి దారిదే అన్నట్లు ఉండాలి కదా? ఆయనపై ఎవరైనా ఆరోపణలు చేస్తే.. ఆరోపణలు చేసిన వారి స్థాయి ప్రకారం, ఆ వార్తకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, అసలు వార్తనే లేకుండా చేయడమే విడ్డూరం.

అయితే.. ప్రభుత్వ సలహాదారు అజయ్‌కల్లం రెడ్డి చేసిన ఆరోపణలో,  హైకోర్టుకు చెందిన కొందరు న్యాయమూర్తుల పేర్లు ఉటంకించారు. వారిపై ఫిర్యాదు కూడా చేశారు. కానీ, తమ సామాజికవర్గానికి చెందిన వారిపై మాత్రం,  ఎక్కడా ఫిర్యాదు చేయకపోవడాన్ని విస్మరించకూడదు. రేపు ఒక చంద్రబాబునాయుడో, ఒక శైలజనాధో, ఆ సామాజికవర్గానికి చెందిన వారిపై.. జగన్ మాదిరిగానే, సుప్రీంకోర్టు సీజేకు ఫిర్యాదు చేస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి? పోనీ.. ఫలానా కులాల వారిపై ఫిర్యాదు చేసిన జగన్మోహన్‌రెడ్డి.. తమ సామాజికవర్గానికి చెందిన వారిపై మాత్రం ఎందుకు ఫిర్యాదు చేయలేదని  ఏ రాజకీయ పార్టీనో ఎదురుదాడి చేస్తే, అప్పుడు  పరిస్థితి ఏమిటి? అసలు న్యాయవ్యవస్థ పరిస్థితి ఏమిటి? ఇలాగయితే ఇక న్యాయవ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుందా? అన్నదే ఆందోళన కలిగించే అంశం.