జడ్జి రమణపై…జగన్ ‘జంగ్’!

662

‘సుప్రీం’ సీజే కాకుండా అడ్డుపడటమే జగన్ ధ్యేయమా?
సర్కారు ‘అధికార సమరాని’కి అదే సంకేతమా?
బీజేపీ అనుమతితోనే జగన్ తెగిస్తున్నారా?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘‘జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాకుండా ఉండేందుకే, సీఎం జగన్ కోర్టులపై చాలకాలం నుంచి యుద్ధం ప్రకటించారు. చంద్రబాబు వల్ల న్యాయమూర్తి అయిన జస్టిస్ రమణ సీజే అయితే జగన్‌కు ఇబ్బందులు తప్పవు’’- ఇది నిన్నటి వరకూ రాజకీయ వర్గాలు, వివిధ పార్టీల కార్యకర్తలు, మీడియాను ఫాలో అయ్యే వర్గాలందరూ జనాంతికంగా చర్చించుకున్న మాట! కానీ దానిని ఇప్పుడు జగన్ నిజం చేశారు. ముసుగులో గుద్దులాటకు తెరదించారు. మొహమాటాలు పక్కనపెట్టి, మనసులో మాట బయటపెట్టారు. సుప్రీంకోర్టు జడ్జితో తాడోపేడో తేల్చుకునేందుకే జగన్ సిద్ధమవుతున్నారు. జగన్ అసలు లక్ష్యం అదే. ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం రెడ్డి మీడియా ముందుకొచ్చి చదివిన ప్రకటన సంకేతం కూడా అదే.


జగన్ సామాన్యుడు కాదు. పులివెందుల పగ-ప్రతీకారం- పోరాటం-మొండితనానికి నిలువెత్తు నిదర్శనం. అవును.. ఏపీ సీఎం జగ న్మోహన్‌రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి నూతలపాటి వెంకటరమణపై, నేరుగా యుద్ధం ప్రకటించారు. రాష్ట్ర హైకోర్టు శరపరంపరగా ఇస్తున్న ప్రభుత్వ వ్యతిరేక తీర్పుల వెనుక, జస్టిస్ రమణ ఉన్నారన్న విషయాన్ని జగన్మోహన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లంరెడ్డి నోటి నుంచి చెప్పించారు. ‘అమరావతి భూ కుంభకోణం కేసులో ప్రభుత్వం ఇచ్చిన జీఓపై జస్టిస్ సోమయాజులు స్టే ఇచ్చారు. మాజీ అడ్వకేట్ జనరల్ కేసులో, హైకోర్టు ఏకంగా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం చేసుకుంటున్నారని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సీజే బోబ్డేకి అక్టోబర్ 8న ఫిర్యాదు చేశాం’- ఇదీ సలహాదారు కల్లంరెడ్డి మీడియా ముందుకు వచ్చి, ప్రభుత్వం తరఫున చేసిన అధికారిక ఆరోపణ.

అంతేనా?.. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరిని, సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారన్న మరో బాంబు పేల్చారు. ‘ ‘జస్టిస్ రమణ జోక్యం తర్వాత, హైకోర్టులో పరిణమాలు మారిపోయాయి. చంద్రబాబు కోరుకున్నట్లుగా కీలకమైన కేసులు జస్టిస్ శేషసాయి, జస్టిస్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ రమేష్, జస్టిస్ కె.లలిత బెంచ్‌కు మారిపోయాయ’ని ఆరోపించారు. ఈ వివరాలన్నీ ఆధారాలతో సహా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఇచ్చామని కల్లం రెడ్డి వెల్లడించారు. ఎన్‌వి రమణను అడ్డుపెట్టుకుని, చంద్రబాబునాయుడు న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారన్న మరో తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు.

ప్రభుత్వం తరఫున సలహాదారు చేసిన ఆరోపణలు చూస్తే.. జగన్మోహన్‌రెడ్డి నేరుగా జస్టిస్ ఎన్వీ రమణపై యుద్ధానికి తెరలేపినట్లేనన్నది విస్పష్టం. కల్లంరెడ్డి ఆరోపణలు పరిశీలిస్తే.. జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ రాకేష్‌కుమార్ వంటి వారిని మినహాయిస్తే.. రోజువారీ కేసులలో తీర్పులిస్తున్న, కీలకమైన న్యాయమూర్తులందరిపైనా ఫిర్యాదు చేసినట్లు స్పష్టమవుతూనే ఉంది. తమ సర్కారుకు వ్యతిరేకంగా ఎవరైతే తీర్పులిస్తున్నారో, వారందరి పేర్లు ఉటంకించడం ప్రస్తావనార్హం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఇచ్చిన ఫిర్యాదులో… జస్టిస్ రమణ ఆస్తుల లావాదేవీలు, 2013-2016 మధ్య కాలం నాటి ఆస్తుల వివరాలు కూడా పేర్కొనడం బట్టి.. జస్టిస్ రమణనే లక్ష్యంగా చేసుకుని, సీఎం జగన్మోహన్‌రెడ్డి దేనికయినా తెగించేందుకు సిద్ధపడుతున్నట్లు స్పష్టమవుతోంది.

నిజానికి జస్టిస్ రమణపై గతంలో విద్యార్ధి నేతగా ఉన్నప్పటి కేసు, హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయి సందర్భంలో ఇచ్చిన, సెల్ఫ్ డిక్లరేషన్ వివాదమయింది. కానీ అవి కోర్టులో నిలబడలేదు. ఇక అప్పటి నుంచీ చంద్రబాబు నాయుడు వ్యతిరేక వర్గం, పరోక్షంగా రమణను దృష్టిలో పెట్టుకుని పరోక్ష ప్రచారం కొనసాగిస్తూనే ఉందన్నది బహిరంగ రహస్యమే. అయితే, ఈ రకంగా నేరుగా జిస్టిస్ రమణ పేరు పెట్టి ఆరోపించిన వారెవరూ లేరు. ఆ ధైర్యం చేసిన సీఎంగా జగన్మోహన్‌రెడ్డి, న్యాయచరిత్రలో నిలిచిపోతారు. ఇప్పటివరకూ తమకు గిట్టని జడ్జిలపై, ఆకాశరామన్నల పేరుతో ప్రధాన న్యాయమూర్తులకు, లేఖ రూపంలో ఫిర్యాదు చేసే సంప్రదాయం ఉంది. కానీ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రే స్వయంగా, సుప్రీంకోర్టు జడ్జిపై చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేయడం దేశంలో ఇదే తొలిసారి.

అయితే.. జగన్మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు జడ్జి రమణను ఎందుకు ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారన్న చర్చ రాజకీయ, న్యాయ వర్గాల్లో జరుగుతోంది. త్వరలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో సీనియరయిన, జస్టిస్ రమణకు సీజే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఆ పదవిలో 18 నెలలు ఉంటారని చెబుతున్నారు. ఒకవేళ ఆయన చీఫ్ జస్టిస్ అయితే, జగన్మోహన్‌రెడ్డికి కష్టకాలమేనని వైసీపీ వర్గాల్లో జరుగుతున్న ప్రధాన చర్చ. ఆందోళన కూడా!

ఎందుకంటే.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ 9 నెలల్లో తేల్చాయాల్సి ఉంది. వాటిని రోజువారీ విచారణ ద్వారా పూర్తి చేయాలని, సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశించింది. అందులో భాగంగానే.. జగన్మోహన్‌రెడ్డిపై ఉన్న సీబీఐ- ఈడీ కేసులు మళ్లీ విచారణకు వచ్చాయి. ఈ కేసుల్లో ప్రస్తుతానికి జగన్‌కు, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ వాటిని 9 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ జస్టిస్ రమణ సీజే అయిన పక్షంలో.. జగన్మోహన్‌రెడ్డిపై ఉన్న కేసులలో వ్యతిరేక తీర్పులు వచ్చి, మళ్లీ ఆయన జైలులు వెళతారన్న ఆందోళన, ఆ కోణంలో చర్చ వైసీపీ వర్గాల్లో బహిరంగంగానే జరుగుతోంది. అదే జస్టిస్ రమణను సీజే కాకుండా నిలువరించినట్టయితే.. జగన్ బయటపడతారన్న భావన కూడా, ఆ పార్టీ వర్గాల్లో ఉందన్నది బహిరంగ రహస్యమే. ఈ కారణాలతోనే జగన్మోహన్‌రెడ్డి, ఇప్పటినుంచే జస్టిస్ రమణపై బహిరంగ యుద్ధం ప్రకటించినట్లు రాజకీయ వర్గాల విశ్లేషణ.

ఇప్పటికే హైకోర్టు తీర్పులపై.. స్పీకర్ నుంచి ఎమ్మెల్యే-ఎంపీల వరకూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న వైనంపై, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అటు జగన్ సర్కారు-వైసీపీ నేతలు కూడా.. జస్టిస్ రమణ రిటైరయ్యే వరకూ, ఇలాంటి పరిస్థితే కొనసాగుతుందన్న మానసిక పరిస్థితికి వచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా అజయ్‌కల్లం రెడ్డి ప్రెస్‌మీట్ పరిశీలిస్తే.. జగన్ కేసులపై ముందస్తు వ్యూహానికి తెరలేచినట్లు అర్ధం చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ రేపు కోర్టులు.. సీబీఐ-ఈడీ కేసులలో, జగన్‌కు వ్యతిరేక తీర్పు ఇస్తే, ఫలానా వ్యక్తి కారణంగానే జగన్ జైలుకెళ్లారన్న ప్రచారానికి, ఇప్పటినుంచే రంగం సిద్ధం చేసుకున్నట్లు, వైసీపీ వ్యూహం అర్ధమవుతోంది. ఇదంతా వైసీపీ సహజ మైండ్‌గేమ్‌లో భాగంగానే కనిపిస్తోందని, రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే..కేంద్రంలోని బీజేపీ మద్దతు లేకుండా, జగన్ ఇంత పెద్ద సాహసానికి ఒడిగడతారా? అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జగన్ కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఆ సందర్భంలో జగన్.. జస్టిస్ రమణపై ఫిర్యాదు చేయగా, వ్యవస్థల జోలికి వెళ్లవద్దని అమిత్‌షా మందలించినట్లు ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వెలువడింది. దానిపై సమాచార శాఖ కమిషనర్ ఆ పత్రికపై కేసు నమోదు చేశారు. అది వేరే విషయం! నిజంగా అమిత్‌షా సీఎం జగన్‌కు నచ్చచెప్పి ఉంటే, జగన్ ఇంత సాహసానికి శ్రీకారం చుట్టే ధైర్యం చేయరు. తర్వాత జగన్ ప్రధాని మోదీని కలిసినప్పుడూ, జస్టిస్ రమణ వ్యవహారంపైనే ఫిర్యాదు చేశారని, ఆయనతోపాటు హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులపైనా ఫిర్యాదు చేశారన్న వార్తలు వచ్చాయి. జగన్ ఢిల్లీకి వెళ్లిన తర్వాతనే ఏపీ హైకోర్టు సీజేను బదిలీ చేస్తారన్న ప్రచారం మొదలవడం గమనార్హం.

నిజంగా న్యాయవ్యవస్థ జోలికి వెళ్లవద్దని బీజేపీ నేతలు, జగన్‌ను హెచ్చరించి ఉంటే.. జగన్ ఇప్పుడు జస్టిస్ రమణపై ఆరోపణలు ఎందుకు ఎక్కుపెట్టారన్నది ప్రశ్న. ఒకవేళ బీజేపీ నాయకులు జగన్‌ను హెచ్చరించి ఉంటే, జగన్ అంత ధైర్యం చేసేవారు కాదన్నది, మెడమీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. అంటే దీన్నిబట్టి.. ఈ వ్యవహారంలో బీజేపీ సహకారం లేదని భావించడం కష్టమేనని, రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. బీజేపీ దృష్టిలో.. ప్రధాన న్యాయమూర్తి పదవి ఎంపికలో, మరొకరు ఉండివచ్చన్న విషయాన్ని కొట్టిపారేయలేమంటున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే, కాగల కార్యాన్ని జగన్మోహన్‌రెడ్డితో కానిస్తున్నారన్న మరో చర్చ కూడా జరుగుతోంది. నిజం నరేంద్రుడికెరుక?