మరి ముస్లిం తోఫా హిందువులకూ ఇస్తారా?
తెలంగాణ తెరపైకి కొత్త చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ప్రభుత్వాలనేవి సెక్యులర్‌గానే ఉంటాయి. ఉండాలి కూడా. పాలకులకు అన్ని కులాలు- అన్ని మతాలూ సమానమే. ఎవరి పట్ల పక్షపాతం ఉండకూడదు. అందరికీ సమాన హక్కులు కల్పించాలి. రాజ్యాంగం కూడా చెబుతోంది ఇదే. సరే.. కొందరు పాలకులు కొన్ని మతాల మెహర్బానీల కోసం, వారికోసమే ప్రత్యేక పథకాలు తీసుకువస్తున్న సంప్రదాయం దశాబ్దాల నుంచే మొదలయింది. గత ఐదేళ్ల కాలం నుంచీ అది కులాల వరకూ విస్తరించి, కులానికో కార్పొరేషన్ ఏర్పాటుచేసే సంప్రదాయానికి తెరలేపారు. అందుకు ఎవరూ అతీతులు కాదు. కానీ ఒక మతం చేసుకునే పండుగలప్పుడు, అన్ని మతాలకూ బహుమతులిస్తున్న పాలకులు.. మరి మిగిలిన మతాల పండగులప్పుడు ఇచ్చే బహుమతులు కూడా, అన్ని మతాలకూ ఇవ్వాలి కదా? మరి పాలకులు ఆ సమ న్యాయం పాటిస్తున్నాయా? తెలంగాణలో మహిళలకు చేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ.. ఇప్పుడు ఈ ప్రశ్ననే తెరపైకి తెచ్చింది.

తెలంగాణలో బతుకమ్మ పండుగకు విశిష్టతతోపాటు, చారిత్రక నేపథ్యం కూడా ఉంది. కొన్ని వందల ఏళ్ల నుంచి తెలంగాణ పల్లెలో, బతుకమ్మ ఆడే సంప్రదాయం ఉంది. అయితే అది పట్టణ ప్రాంతాలలో కొందరు మాత్రమే ఆచరించేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, మర్చిపోయిన ఈ సంప్రదాయాన్ని కేసీఆర్ కుమార్తె కవిత మళ్లీ గుర్తు చేశారు.ఉద్యమ సమయంలో తమకు రాష్ట్రం కావాలంటూ వివిధ సంస్థలు ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించారు. అయితే కవిత మాత్రం బతుకమ్మను ఇంటింటికీ చేర్చారు.ఒకరకంగా బతుకమ్మకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌లా మారారు. నిజానికి ఆమె కృషి వల్లనే, బతుకమ్మ పండుగకు ఇంత ప్రాధాన్యం వచ్చిందనేది నిజం. అసలు బతుకమ్మ గురించి తెలియని ఆంధ్రా మహిళలు సైతం.. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంతోపాటు, బయట బతుకమ్మ ఆడారంటే, కవిత ఎంతమంది మహిళలపై ప్రభావితం చూపారో స్పష్టమవుతోంది. ఉద్యమ సమయంలో మహిళలు, బతుకమ్మ ఆడుతూ స్వరాష్ట్ర కాంక్షను వ్యక్తీకరించారు. బతుకమ్మ ఫక్తు హిందువుల పండుగ. నిజాం నవాబుల జమానాలో, రజాకార్లు మహిళలను బట్టలు ఊడదీసి, వారితో నగ్నంగా బతుకమ్మ ఆడించి పైశాచిక ఆనందం పొందినట్లు చరిత్ర చెబుతోంది.

సొంత రాష్ట్రం సిద్ధించిన తర్వాత, బతుకమ్మ పండుగకు కేసీఆర్ సర్కారు ఏటేటా కొంత నిధిని ఏర్పాటుచేసింది. తర్వాత మహిళలకు చీరలు ఉచితంగా పంపిణీ చేసే సంప్రదాయం ప్రవేశపెట్టింది. అయితే, ఆ చీరలు నాసిరకంగా ఉన్నాయని మహిళలు వాటిని రోడ్డుపైనే పడేసి పోయిన ఘటనలు మీడియాలో చూసినవే. చీరల కొనుగోలులో కుంభకోణం జరిగిందని, మహారాష్ట్ర నుంచి వాటిని తక్కువ రేటుకు తెచ్చి, ఇక్కడి కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని అప్పట్లో కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న చీరలలో కూడా నాణ్యత లేదని, గత ఏడాది మిగిలిపోయిన చీరలను పంపిణీ చేస్తున్నారన్న మహిళల విమర్శలు మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇదంతా రాజకీయ కోణం. రంజాన్ తోఫాకు సైతం ప్రభుత్వం నిధులిస్తున్న విషయం తెలిసిందే.

కానీ, బతుకమ్మ చీరలను, ముస్లిం మహిళలకూ పంపిణీ చేయడంపై.. తెలంగాణలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఫక్తు హిందువుల పండుగయిన బతుకమ్మ పండుగ చీరలు, ముస్లింలకు ఎలా ఇస్తారన్నది ఒక ప్రశ్న. రజాకార్లు హిందూ మహిళలతో నగ్నంగా బతుకమ్మ ఆడించి.. బతుకమ్మను అవమానిస్తే, అదే బతుకమ్మ చీరలను ముస్లింలకు ఎలా పంపిణీ చేస్తారన్న ప్రశ్నలు, హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్నాయి. దీనిపై వినిపిస్తున్న ప్రశ్నలు, జరుగుతున్న చర్చ ఆసక్తికరంగా మారింది. బతుకమ్మ పండుగ రోజు ప్రభుత్వం ఇచ్చిన చీరలు కట్టుకున్న హిందూ మహిళలు, వాటికి కట్టుకుని బతుకమ్మ ఆడతారు. మరి ఆ చీరలు కట్టుకునే ముస్లిం మహిళలు, హిందూ మహిళల మాదిరిగా బతుకమ్మ ఆడతారా? అన్నది ఇప్పుడు హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. మరి ఏ ఉద్దేశ్యంతో ముస్లిం మహిళలకు, బతుకమ్మ చీరలను బహుమానంగా ఇచ్చారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అదేవిధంగా ప్రభుత్వం, ప్రతి ఏటా రంజాన్ తోఫా ఇస్తోంది. దీనికి కూడా బతుకమ్మ చీరల మాదిరిగానే కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోంది. కానీ విచిత్రంగా.. రంజాన్ తోఫా కేవలం ముస్లింలకు మాత్రమే పరిమితం. ఆ బహుమతులు హిందువులకు ఇవ్వరని హిందూ సంస్థలు గుర్తు చేస్తున్నాయి. మరి హిందువులు నిర్వహించుకునే ప్రతి బతుకమ్మ పండుగకు ముస్లిం మహిళలకు సైతం చీరలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం, మరి రంజాన్ తోఫా సమయంలో హిందువులకు ఎందుకు బహుమతులు ఇవ్వరని ప్రశ్నిస్తున్నాయి.

‘ప్రభుత్వ సెక్యులర్ విధానం హాస్యాస్పదం, అసంబద్ధంగా ఉంది. బతుకమ్మ చీరలు తీసుకుంటున్న ముస్లిం మహిళలు, వాటిని కట్టుకుని హిందూ మహిళల మాదిరిగా బతుకమ్మ ఆడగలరా? అలా ఆడాలని ఈ ప్రభుత్వం చెప్పగలదా? మరి రంజాన్ తోఫా ముస్లింలకే ఎందుకు పరిమితం చేస్తున్నారు? ఇదేనా కేసీఆర్ చెప్పే సెక్యులర్ నీతి? అయినా రజాకార్ల చేతిలో.. అవమానాల పాలయిన హిందూ మహిళలను ఏ మతమయితే దారుణంగా వేధించిందో, అదే మతానికి చెందిన మహిళలకు బతుకమ్మ చీరలు ఇవ్వడమంటే, హిందూ మహిళలను అవమానించినట్టే’నని భాగ్యనగర్ విశ్వహిందూ పరిషత్, ప్రచార సహ ప్రముఖ పగుడాకుల బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner