పవన్ ‘పవర్’ చూపిస్తారా..?

491

గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ ప్రభావమెంత?
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఇంట గెలవలేని పవనన్నయ్య.. రచ్చ గెలిచే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి, రెండుచోట్లా గుడ్లుతేలేసిన జనసేనాధిపతి పవన్ కల్యాణ్.. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, తన పార్టీని బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారట. అదీ వార్త. ఆ మేరకు ఆయన 50 డివిజన్లలో పార్టీ కమిటీలు కూడా ప్రకటించేశారు.

నవంబర్-డిసెంబర్‌లో జరిగే, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన ఎవ‘రెడీ’గా ఉందట. ఎలాగూ బీజేపీతో పొత్తు ఉన్నందున, జనసేన ఆ పార్టీతో కలిసే పోటీ చేస్తుంది. అయితే, జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో స్పష్టత లేకున్నా, కనీసం 30- 40 స్థానాలు కావాలని పవనన్నయ్య తమ్ముళ్లు పట్టుదలతో ఉన్నారు. అదంతా బీజేపీ దయాధర్మాలపైనే ఆదారపడి ఉంటుంది. ప్రస్తుత కరోనా కాలంలో పవనన్నయ్య ఫాంహౌసులోనే ఉండి, ప్రకటనలతో సందర్భానుసారంగా ట్వీటుతున్నారు. ఏపీకి కూడా వెళ్లడం లేదు. ప్రస్తుతానికి ఆయన కార్యస్థానం హైదరాబాదే.

మరో మూడు నెలలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో, జనసేన బరిలోకి దిగాలని నిర్ణయించింది. అంటే ఆ ఎన్నికల ప్రచారంలో పవన్ కూడా దిగుతారన్నమాట. తెలంగాణలో బీజేపీకి, నేము-ఫేము ఉన్న పెద్ద స్టార్ క్యాంపెయినర్ లేరు కాబట్టి.. ఉభయులకూ ఇప్పుడు, పవనన్నయ్యే మెగా స్టార్ క్యాంపెయినర్ అన్నమాట. ఎంతలేదన్నా పవన్ సినిమా స్టార్. కాబట్టి ఆయన సభలకు జనాలు బాగానే వస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో జరిగిన పవన్ ఎన్నికల సభలకూ జనం విరగబడ్డారు. తోసుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఫ్లెక్సీలుడుతుండగా అభిమానులు చనిపోయారు. కానీ.. ఆ ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోగా, ఒక్కరు మాత్రమే గెలిచి గట్టెక్కారు. అంటే పవన్ కల్యాణ్ ఇంట ఓడిపోయారన్న మాట.

ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో పోటీ చేస్తే, పరిస్థితి ఎలా ఉంటుందన్నది ప్రశ్న. ఇప్పటివరకూ నగరంలో జనసేనకు బలం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పరిస్థితే, హైదరాబాద్ నగరంలో అగమ్యగోచరంగా మారింది. మరి కొత్తగా పుట్టిన జనసేన సంగతి ఏమిటన్నది, సహజంగానే తెరపైకొచ్చే సందేహం. నగరంలోని సెటిలర్ల ఓట్లలో సింహభాగం ఓట్లు, జనసేనకు పడతాయన్నది ఆ పార్టీ ఆశలా కనిపిస్తోంది. దానివల్ల టీఆర్‌ఎస్‌కు వచ్చే నష్టమేమీ లేదు. ఒకరకంగా మరింత నష్టపోయేది టీడీపీనే. ఎందుకంటే దాని బలం అంతో ఇంతో సెటిలర్లు ఉన్న ప్రాంతాల్లోనే కాబట్టి! విపక్షాల ఓట్లు ఎంత చీలితే, టీఆర్‌ఎస్‌కు అంత లాభం.అదీ లాజిక్కు!

సెటిలర్లు తాము ఎంతగానో ప్రేమించే టీడీపీనే కాదని, టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నప్పుడు.. అసలు ఉనికి లేని జనసేనకు ఓట్లేస్తారన్నది అనుమానమే. మరోవైపు, పవన్ ప్రచారబరిలో దిగితే, కాపు-మున్నూరు కాపు ఓట్లు సాధించవచ్చన్న ఆలోచన బీజేపీ-జనసేన నేతల్లో కనిపిస్తోంది. అయితే, ఈ అంచనా కూడా ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి. ఎందుకంటే.. ఏపీలో కాపుల పార్టీగా ముద్రపడిన జనసేన అభ్యర్ధులెవరూ గెలవలేదు. కాపుల సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ, పవన్ కూడా విజయం సాధించలేకపోయారు. కులపిచ్చి బాగా ఉన్న ఆంధ్రాలోనే కాపుల ఓట్లు సాధించలేని జనసేన.. ఎలాంటి కులపిచ్చి లేని హైదరాబాద్ నగరంలో, వేసే కులం కార్డు ఎంతవరకూ ఫలిస్తుందన్నది ప్రశ్న. ఇంట ఓడిన పవనన్నయ్య, రచ్చ ఎలా గెలుస్తారో చూడాలి!