ప్రత్యక్ష ఎన్నికలకు ఫికరెందుకు?

459

అన్నీ అనుకూల అంశాలే
‘మేయర్’పై టీఆర్‌ఎస్ వెనుకడుగు ఎందుకు?
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

చేతిలో అధికారం.. ప్రజల దన్ను.. సెటిలర్ల సపోర్టు.. ఇన్ని అంశాలు సానుకూలంగా కనిపిస్తున్నా.. ప్రత్యక్ష ఎన్నికలకు, టీఆర్‌ఎస్ సర్కారు వెనుకడుగు వేయడమే ఆశ్చర్యం. గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో పోటీ ఇచ్చిన టీడీపీ కనుమరుగయిపోగా, కాంగ్రెస్ బలం అంతంత మాత్రంగానే ఉంది. ఇక బీజేపీ బలం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాగూ పాతబస్తీలో మజ్లిస్ దన్ను ఉండనే ఉంది. అయినా మేయర్ ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దిగేందుకు, కేసీఆర్ సర్కారు భయపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

నవంబర్-డిసెంబర్‌లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగనుంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఆ మేరకు ప్రకటన కూడా చేశారు.నగరంలో ఒక్క బీజేపీ స్థానం తప్ప, మిగిలిన  అన్ని స్థానాల్లోనూ టీఆర్‌ఎస్-మజ్లిస్ శాసనసభ్య్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మజ్లిస్ ఎలాగూ తెరాసకు మిత్రపక్షమే. గతంలో జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో, టీడీపీ దాదాపు రెండవ స్థానంలో నిలిచింది. అయితే, చంద్రబాబు నాయుడు ఓటుకునోటు కేసు కారణంగా.. కేసీఆర్ సర్కారుకు భయపడో-రాజీ కుదిరిన మేరకో, పదేళ్ల ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నుంచి, విజయవాడకు పారిపోయారన్న అభిప్రాయం సెటిలర్లలో బలంగా ఏర్పడింది. అందుకే తన రక్షణ కోసం వెళ్లిన టీడీపీని కాదని, స్థానిక పార్టీ అయిన టీఆర్‌ఎస్‌కే సెటిలర్లు తమ రక్షణ కోణంలో జైకొట్టారు. అదీ అసలు రహస్యం.

టీఆర్‌ఎస్ కూడా గత ఎన్నికల్లో, సెటిలర్లకు కార్పొరేటర్ల సీట్లు ఇచ్చింది. ఎన్నికల్లో సెటిలర్లు అదే సంప్రదాయం, గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పాటించారు. మొత్తంగా సెటిలర్లు భయానికో-ప్రేమకో-ప్రత్యామ్నాయం లేకనో- టీడీపీ అధినేత ఆంధ్రాకు పారిపోవడం వల్లనో- అనివార్య పరిస్థితిలోనో, తెరాసకు మద్దతునిస్తున్నారన్నది నిర్వివాదం. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెరాస అధికారంలోకి వచ్చినప్పటికీ, ఇప్పటి వరకూ ఒక్క సెటిలర్‌పై ఎక్కడా దాడి జరిగిన దాఖలాలు లేవు. పైగా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల సహా, అనేక పనులన్నీ సింహభాగం ఆంధ్రా కాంట్రాక్టర్లే చేస్తున్నారు. బహుశా తెరాసపై వ్యతిరేకత లేకపోవడానికి ఇదీ ఒక కారణం కావ చ్చు.

గతంలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు.. 14,68,618 ఓట్లు, 43.85 శాతం ఓట్లు సాధించి 100 సీట్లు సాధించింది. సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి, సనత్‌నగర్, శేరిలింగంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, జూబ్ళీహిల్స్ నియోజకవర్గాల్లో,  మెజారిటీ డివిజన్లు టీఆర్‌ఎస్ ఖాతాలోకే వెళ్లాయి. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఈ నియోజకవర్గాల్లో సెటిలర్లంతా కారు ఎక్కడం చూస్తే… రాజధాని నగరంలో సెటిలర్లంతా తెరాసకే జై కొడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇక పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఉత్తరాది- సీమాంధ్ర సెటిలర్లు జాతీయ కోణంలో ఓటేశారు. ఫలితంగా బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి విజయం సాధించగలిగారు.

కానీ అదే సెటిలర్లు, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం.. స్థానిక పరిస్థితుల దృష్ట్యా, టీఆర్‌ఎస్‌కే జై కొట్టడం ప్రస్తావనార్హం. గుజరాతీ-రాజస్థానీలు ఎక్కువగా నివసించే సనత్‌నగర్‌లో.. అసెంబ్లీకి తలసాని శ్రీనివాసయాదవ్‌కి ఓటేసిన ఉత్తరాది ఓటర్లు, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కిషన్‌రెడ్డిని గెలిపించడం విశేషం. అటు పాతబస్తీలోని ఉత్తరాది వారు కూడా ఇదే సూత్రం అవలంబించారు. లేకపోతే అసెంబ్లీలలో ఒక్క సీటు కూడా లేని బీజేపీ, ఏకంగా ఎంపీ సీటు గెవలవడం అసాధ్యం.

మరి నగరంలో ఇంత తిరుగులేని బలం ఉన్న టీఆర్‌ఎస్.. గ్రేటర్ ఎన్నికల్లో పరోక్ష పద్ధతిలో, మేయర్ ఎన్నిక నిర్వహించడమే ఆశ్చర్యం. ఎంసీహెచ్‌గా ఉన్న కార్పొరేషన్‌లో దశాబ్దాల పాటు, మేయర్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలోనే జరిగాయి. కానీ చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు మాత్రం, మేయర్‌కు ప్రత్యక్ష ఎన్నికలే నిర్వహించి రికార్డు సృష్టించారు.

ఆ ఎన్నికల్లో తీగల కృష్ణారెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. నేరుగా ఎన్నికయిన మేయర్ రికార్డు ఇప్పటికీ , ఆయన పేరిటనే ఉంది. ఒకవేళ రేపు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే, తీగల కృష్ణారెడ్డి అభ్యర్ధి అయితే, తిరిగి భారీ మెజారిటీతో గెలవడం ఖాయం.  మళ్లీ తర్వాత జరిగిన ఎన్నికల్లో,  పరోక్ష పద్దతిలోనే మేయర్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కానీ, ఇప్పుడు నగరంలో టీఆర్‌ఎస్‌కు అనేక కోణాల్లో  బలం- సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, మేయర్‌కు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు భయపడుతుండటమే ఆశ్చర్యం. సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, ప్రజలు  అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే పరిస్థితి ఉండదన్న లాజిక్కును, కేసీఆర్ ఎలా విస్మరించారో అర్ధం కావడం లేదంటున్నారు.

ఈ విషయంలో విపక్షాలు సైతం కేసీఆర్ సర్కారుకు సవాల్ విసురుతున్నారు. నిజంగా కేసీఆర్‌కు గ్రేటర్‌పై పట్టు-పలుబడి ఉంటే ప్రత్యక్ష పద్ధతిలో మేయర్ ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో… గెలిచిన ఇతర పార్టీ కార్పొరేటర్లను కరీంనగర్‌లో మాదిరిగా, కొనుగొలు చేసి అధికారం సాధించవచ్చన్న ముందుచూపుతోనే, మేయర్‌కు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శిస్తున్నారు.