‘గ్రేటర్’లో రిజర్వేషన్ లొల్లి

140

మాకొద్దంటున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
కేటీఆర్‌కు మొర పెట్టుకుంటున్న నేతలు
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. దీనితో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేడి మొదలయింది. ఓ వైపు పార్టీలు వ్యూహరచనలో మునిగిపోగా, మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, రిజర్వేషన్ల వ్యవహారం పితలాటకంగా మారింది. 2016 నాటి గ్రేటర్ ఎన్నికల్లో, ఒక ప్రాతిపదిక అంటూ లేకుండా చేసిన రిజర్వేషన్ల ప్రక్రియ, ఇప్పుడు ఇబ్బందిగా పరిణమించిందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఇదే అంశంపై వారంతా, ఇటీ వల నిర్వహించిన ఓ సమావేశంలో.. పార్టీ అగ్రనేత కేటీఆర్‌కు చెప్పి, తమ ఈతిబాధలు వెళ్లబోసుకున్నారట. రానున్న ఎన్నికల్లో ఇప్పుడున్న రిజర్వుడు స్థానాలు మార్చాలని కేటీఆర్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు.

గత ఎన్నికల్లో నగరంలోని మొత్తం 150 డివిజన్లలో.. ఎస్టీలకు ఒక జనరల్-ఒక మహిళ వార్డు కేటాయించారు. ఎస్సీలకు 5 జనరల్- 5 మహిళా వార్డులు కేటాయించారు. బీసీలకు 25 జనరల్-25 మహిళా వార్డులు; మహిళ (జనరల్)కు 44 వార్డులు; అన్ రిజర్వుడు-44 డివిజన్లు కేటాయించారు. అయితే, అప్పట్లో తెరాస టికెట్ల ఎంపిక కూడా హడావిడిగా జరిగింది. ఎవరంటే వారికి, ముఖ్యంగా ఉద్యమంలో ఉత్సాహంగా పనిచేసిన వారితోపాటు, స్థానిక ఎమ్మెల్యే-ఇన్చార్జులు చెప్పిన వారికి సీట్లు ఇచ్చారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత, నగరంపై టీఆర్‌ఎస్ పట్టు మరింత పెరిగింది. నగరంలో మజ్లిస్ తప్ప, మరో పార్టీకి స్థానం లేకుండా పోయింది. బీజేపీకి ఒక్క సీటు మాత్రమే దక్కింది. దీనితో కార్పొరేటర్ల సీట్లపై నియోజకవర్గ-ద్వితీయ స్థాయి నేతల ఆశలు పెరిగాయి. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ల స్థానాల్లో, ఎమ్మల్యేలు ఇప్పటికే తమ అనుచరులను ప్రోత్సహిస్తున్నారు. మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్‌లో 75 స్థానాల్లో మహిళా కార్పొరేటర్లే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. వారిలో 90 శాతం వరకూ పెత్తనం చేసేది, వారి భర్తలు లేదా తండ్రులేనన్నది బహిరంగ రహస్యం. ఇది అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సంకటంలా పరిణమించింది. వారిని గట్టిగా మందలించలేని పరిస్థితి. కొంతమంది మహిళా కార్పొరేటర్లు మాత్రం క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా ఉంటే, చాలామంది కార్పొరేటర్ల పెత్తనాన్ని భర్తలే చెలాయిస్తున్న పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో, తమ నియోజకవర్గాల వరకూ మహిళా రిజర్వేషన్లు లేకుండా చూడాలని, మహిళా రిజర్వేషన్లు ఉన్న డివిజన్లను సాధ్యమయినంత వరకూ.. బీసీ జనరల్ లేదా జనరల్ రిజర్వేషన్లు వచ్చేలా చూడాలని, ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. నగరంలో సికింద్రాబాద్-సనత్‌నగర్ నియోజవర్గాల్లోనే ఎక్కువగా మహిళ జనరల్, ఎస్సీ, బీసీ స్థానాలు రిజర్వు అయ్యాయి. ఇక్కడ పురుష కార్పొరేటర్ల శాతం బహు తక్కువ. దీనితో పార్టీకి పనిచేసిన మగవారికి, అవకాశం కల్పించే పరిస్థితి లేకుండా పోతోందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. గతంలో బీసీలు ఎక్కువగా ఉన్న డివిజన్లను కూడా, ఎస్సీ రిజర్వుగా మార్చారన్న విమర్శలున్నాయి.

అయితే.. మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం, మహిళలు ఉంటేనే తమకు నెత్తినొప్పి ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. మగవారయితే, ఒకవేళ వారు ఆర్ధికంగా బలంగా ఉంటే.. తమపైనే గ్రూపులు కట్టే ప్రమాదం ఉందని, అదే మహిళలయితే ఆ సాహసం చేయరన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, పార్టీకి చెందిన మహిళా నేతలు మాత్రం, పార్టీలో మొదటి నుంచీ పనిచేస్తున్న తమకు కాకుండా, నేతల భార్యలకు టికెట్లు ఇప్పించుకుంటున్న సంప్రదాయానికి, ఈసారయినా తెరదించాలని కేటీఆర్‌కు మొరపెట్టుకుంటున్నారు.

ఈ ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలు.. తమ వారసులను రంగంలోకి దింపాలన్న యోచనలో ఉన్నారు. అయితే, ఇప్పటి రిజర్వేషన్లే మళ్లీ కొనసాగితే.. కొడుకులకు బదులు,  కోడళ్లను నిలబెట్టాలన్న నిర్ణయానికి వస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే ఉన్న మునిసపల్ చట్టాన్ని కొనసాగిస్తారా? లేక జీహెచ్‌ఎంసీ చట్టాన్ని కూడా, దానికి వర్తింపచేస్తూ ఆర్డినెన్స్ ఇస్తారా? అన్నది చూడాలి.