చర్చి పాస్టరు అత్యాచారంపై మీడియాలో చర్చలేవీ?

153

విశాఖలో దళిత బాలికపై పాస్టరు అత్యాచారం
చానెళ్లు- పత్రికల హడావిడి, చర్చల పేరంటం ఏదీ?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అసలు తెలుగు మీడియా బుద్ధి పనిచేస్తోందా? దానికి పట్టిన సెక్యులర్ మొహమాటమనే జబ్బు నుంచి ఇక బయటపడదా? కరోనాకు సైతం వ్యాక్సిన్ వస్తుంది గానీ, ఈ సెక్యులర్ మొహమాటమనే జబ్బుకు మాత్రం వ్యాక్సిన్ రాదా? అత్యాచారాలు- హత్యాచార వార్తలను కూడా, ఒక వర్గానికే పరిమితం చేస్తుందా? గంటల తరబడి తీరికూర్చుని, పోచుకోలు కబుర్లతో టీఆర్పీ రేటింగు పెంచుకునేందుకే పనిచేస్తుందా? ఈ అరాచక- పక్షపాత-అష్టావక్ర బుద్ధి నుంచి ఇంకా ఎన్నేళ్లకు బయపడుతుంది?

గుళ్లు-గోపురాలు-స్వాములు-చివరాఖరకు దేవుళ్ల పేర్లు తగిలించి, వ్యంగ్యాస్త్రాలు వేసే టీవీ చానెళ్ల ఆసాములకు.. మతం మారిన ఒక దళిత బాలికపై, చర్చి పాస్టరు ప్రార్ధన పేరిట చేసిన అత్యాచార యత్నం కనిపించదా? అంటే దళిత బాలిక సమాజంలో మనిషి కాదా? ఆమె మాన ప్రాణాలు టీవీ చానెళ్ల దృష్టిలో, మరీ అంత పనికిరాకుండా పోయాయా? లేక పాస్టరు గారి కామలీలలు చూపిస్తే,  యాంకరమ్మలు, టీవీ యజమానులకు  ప్రభువు శిలువ వేస్తాడన్న భయమా? మరి అలాంటి భయం హిందూ దేవుళ్లపై ఉండదేం?.. విశాఖలో పదిహేనేళ్ల దళిత బాలికపై,  ఒక చర్చి పాస్టరు అత్యాచారానికి పాల్పడ్డ వార్త, ఏ తెలుగు మీడియాలో కూడా భూతద్దం పెట్టి వెతికినా కనిపించనప్పుడు.. సహజంగా తెలుగు మీడియా శీలంపై మెడ మీద తల ఉన్న ఎవరికయినా  వచ్చే సందేహాలే ఇవి!

తెలుగు మీడియా బుద్ధి, వంకర అన్నది బహిరంగ రహస్యం. అది మరీ అవుటర్ రింగురోడ్డంత వంకర అన్నది మరోసారి నిరూపితమయింది. మొన్నామధ్య టీవీ 9లో నారదుడి పాత్రలో నడిపించిన ఒక వెకిలి కార్యక్రమంపై, హిందూ సంఘాలు మండిపడ్డాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాయి. సెక్యులర్ పీఠానికి చాలాకాలం నుంచి అధిపతిగా ఉన్న, సదరు చానెల్‌లో కొన్నేళ్ల నుంచి జాతికి హితోక్తులు వినిపిస్తుంటాయి. దీపావళి వల్ల కాలుష్యం పెరుగుతుందని, వినాయక నిమజ్జనం వల్ల హుస్సేన్‌సాగర్ పూర్తిగా కాలుష్యయిపోతుంది కాబట్టి మట్టి వినాయకుడిని వాడాలని సుద్దులు చెబుతుంటుంది. పండగల సమయంలో చేసే సౌండ్ల వల్ల శబ్దకాలుష్యం పెరిగిపోతుందని వాపోతుంటుంది. ఇలాంటి సుద్దులు..  మిగిలిన మతాల పండగల విషయంలో చెప్పే ధైర్యం ఉండకపోవడమే ఆశ్చర్యం.

ఇక దేవుళ్లపైనా చర్చల పేరంటం పెట్టి, వాటికి  రాంగోపాల్‌వర్మ అనే ‘మర్యాదస్తులతో’పాటు, వామపక్ష-మహిళా అభ్యుదయ నేతలను కూడా పిలిచి, రచ్చబండలో రచ్చ రచ్చ చేయడం ఆ చానెల్ స్పెషాలిటీ. అయితే.. ఈ పైత్యంపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఎన్నిసార్లు అక్కడకు వెళ్లి ధర్నాలు చేసినా, దాని సెక్యులర్ ముసుగు తొలగించనే లేదు. పైగా సదరు చానెల్ యజమాని మహా భక్తుడు. అది వేరే విషయం! సరే ఇక వైసీపీ అధికార సాక్షి మీడియాలో, పాస్టర్ల వ్యవహారాలపై చర్చ జరగదంటే దానిని అర్ధం చేసుకోవచ్చు. దాని మొహమాటం దానిది. మరి మిగిలిన చానెళ్ల జ్ఞానం ఏ జమ్మిచెట్టుపైకెక్కిందన్నది ప్రశ్న!

తాజాగా విశాఖ గాజువాక వాంబే కాలనీలో,  నానిబాబు అలియాస్ హెవెల్ అనే పాస్టరు.. మతం మారిన ఓ దళిత బాలికపై, ప్రార్ధన పేరుతో అత్యాచార యత్నం చేసిన వార్త కలకలం సృష్టించింది. అంతలో బాలిక తండ్రి అక్కడికి వెళ్లబట్టి, ఆ బాలిక సురక్షితంగా బయటపడగలిగింది. దీనిపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు పాస్టర్ నానిబాబును అదుపులోకి తీసుకోవడం జరిగిపోయింది.

జరిగిన ఘోరం తెలుసుకున్న టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత, టీడీపీ నేత పళ్లా శ్రీనివాస్, పుచ్చ విజయ్, ఇతర దళిత సంఘాల నేతలు ఆమె కుటుంబానికి ధైర్యం చెప్పారు. పాస్టరుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ యువ నేత నారా లోకేష్, ఫోన్‌లో బాలిక- ఆమె తండ్రిని పరామర్శించారు. ఒక అన్నగా అండగా ఉంటానని, ఆమె చదువు బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇది ఏబీఎన్- ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా ప్రసారమయింది. ఇదీ గాజువాకలో జరిగిన పైశాచిక ఘటన.

కానీ, సెక్యులర్ అంశాలపై ఆగమేఘాలపై, పురప్రముఖులతో  చర్చల పేరంటం పెట్టే అలవాటున్న టీవీ 9 సహా, మిగిలిన ఏ చానెలూ దీనిపై చర్చ పెట్టిన దాఖలాలు లేవు. బాధితురాలు క్రైస్తవురాలయినా, ఆమెది  మతం మారిన కుటుంబమే కాబట్టి దళితురాలి కిందే లెక్క. అంటే మతం మారిన వారికి రక్షణ లేదన్న మాట. ముఖ్యంగా మతం మారిన దళితుల మాన ప్రాణాలకు,  ఆ మతంలోనే రక్షణ లేదన్నది గాజువాక అరాచకం చెబుతూనే ఉంది.

మరి ఆ కోణంలో చర్చ పెట్టి, సమాజాన్ని చైతన్యపరచాల్సిన తెలుగు మీడియా మెదళ్లు, మత్తు టాబెట్లు వేసుకున్నంతగా ఎందుకు మొద్దుబారి, సుఖనిద్ర పోతున్నాయన్నది సమాజం సంధిస్తున్న  ప్రశ్న. ఇదే మరో మతానికి చెందిన పెద్ద.. ఇలాంటి ఉన్మాదానికి పాల్పడితే, పెద్ద పెద్ద బ్యాంక్‌గ్రౌండ్ మ్యూజిక్కుతో.. చూపిందే చూపించే చానెళ్ల కళ్లు, గాజువాక పాస్టర్ ఘటనలో మూసుకుపోవడమే ఆశ్చర్యం.

పోనీ పాస్టరు చేతిలో అత్యాచార యత్నానికి గురయింది మతం మారిన క్రైస్తవురాలు కాదని కాసేపు అనుకుందాం. దళిత బాలిక అని కూడా పక్కనపెడదాం. కానీ దాడికి గురయింది ఒక పేద బాలిక అన్న స్పృహ కూడా, తెలుగు మీడియాకు లేకపోవడమే దారుణం.  ఇక హిందుత్వానికి తామే పరిరక్షకులమని, జబ్బలు చరచుకునే బీజేపీ వస్తాదులు కూడా, రాత్రి వరకూ ఈ ఘటనపై పెదవి విప్పిన పాపాన పోలేదు. అంటే ఇది ఒక మతానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి గాలికొదిలేశారా? లేక కొత్త సారథుల ఏలుబడిలో వికసిస్తున్న సర్కారీ స్నేహం ఎక్కడ చెడిపోతుందోనన్న మొహమాటమా? అయినా.. లోకపరిరక్షకుడయిన,  విశాఖ స్వామి స్వరూపానందుల వారు నడయాడే విశాఖ నగరంలో, ఇలాంటి దారుణం జరగడం మహా ఘోరం!