-(రవీంద్ర ఇప్పల)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మొన్నటి అపెక్స్ కౌన్సిల్ భేటీ హీరోగా నిలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అని ఏపీ సీఎం జగన్ బలమైన వాదన వినిపించడంతో … ఆంధ్రప్రదేశ్ సమాజంలో శభాష్ సీఎం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్, జగన్ మంచి మిత్రులని …కేసీఆర్ మాయ మాటలకు రాష్ట్ర ప్రయోజనాలు తా కట్టు పెడుతున్నారని నిన్న మొన్నటి వరకు జగన్ ప్రత్యర్థులు విమర్శిస్తూ వచ్చారు.
రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే … స్నేహ మైనా, మరేదైనా అని జగన్ తన చర్యల ద్వారా ప్రత్యర్థులకు గట్టిగా జవాబిచ్చారు. అలాగే ఏపీ సమాజానికి తాను రాష్ట్ర ప్రయోజనాల కోసం మిత్రుడితోనైనా గట్టిగా ఢీకొంటాననే సందేశాన్ని పంపగలిగారు.
అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఏపీ సీఎం జగన్ బలమైన వాదన వినిపించారని తప్పక చెప్పాలి. చర్యకు ప్రతి చర్య ఉంటుందని న్యూటన్ థర్డ్ లా చెబుతుంది. అపెక్స్ కౌన్సిల్ భేటీకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన చదివితే …. ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఎంత అసహనంగా ఉన్నారో తెలుసుకోవచ్చు. ఇదంతా ఏపీ తరపున జగన్ తెలంగాణ సీఎం వాదనపై పైచేయి సాధించినట్టుగా అర్థమవుతోంది.
అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ ఏం మాట్లాడారో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో ఏముందంటే…
కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే , తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్ -పెద్దమరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతుంది. తద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ఖాయం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను ఉద్యమ కాలం నుంచే తెలంగాణ వ్యతిరేకిస్తోంది ….ఇలా అనేక అంశాలు ఆ ప్రకటనలో ఉన్నాయి.
ఇది కేసీఆర్ రియాక్షన్. జగన్ యాక్షన్ ఏంటో తెలియాలంటే ఆయన్ను వ్యతిరేకించే ఎల్లో మీడియాలో అపెక్స్ కౌన్సిల్ భేటీపై వచ్చిన కథనాన్ని చదివితే తెలుస్తుంది. కేసీఆర్ వాదనను తిప్పికొట్టేలా జగన్ దాటిగా ఏపీ వాదన వినిపించారని అర్థమవు తోంది.
‘పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు ఏ అనుమతులూ లేవు. అలాంటిది దాని సామర్థ్యం పెంచడం ఏమిటి? కాళేశ్వరానికి అన్ని అనుమతులూ ఉన్నాయి. ఆ ప్రాజెక్టు నది బేసిన్లో ఉంది. కానీ రాయలసీమ ప్రాజెక్టు ద్వారా నది బేసిన్ బయటికి నీళ్లు తరలిస్తున్నారు. ఇలాగైతే… మేము కూడా జూరాల దిగువలో భారీ బ్యారేజిని నిర్మించి, రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తాం’ అని కేసీఆర్ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. కేసీఆర్‌కు జగన్ తన మేధో, వాదనా పటిమతో చక్కటి కౌంటర్ ఇచ్చారు. అదెలాగో చూద్దాం.
‘అనుమతులు లేకుండానే గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులు చేపడుతున్నారు. సీతారామ ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టులకు అనుమతులు లేవు. మాకో న్యాయం వాళ్లకో (తెలంగాణకు) న్యాయమా? తెలంగాణకు ఏ నిబంధన వర్తిస్తుందో మాకూ అదే వర్తిస్తుంది’….ఇదీ జగన్ వాదన.
ఇంకా జగన్ ఏమన్నారంటే…
‘గోదావరిపై పట్టిసీమ నిర్మించుకుంటే 45 టీఎంసీల్లో వాటా కావాలంటారు. వారు గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు 214 టీఎంసీల నీటిని తరలిస్తున్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ఆ తరలింపులో ఏపీకి వాటా ఇవ్వరా? తెలంగాణ భూభాగంలో ఉందని శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వారే నిర్వహించుకుంటారు.
మరోవైపు ఏపీ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ కుడిగట్టు ఆఫ్ టేక్‌ను వారే నిర్వహిస్తామంటారు’….అని తెలంగాణ ఒంటెత్తు పోకడలను అపెక్స్ కమిటీ భేటీ సాక్షిగా, ఢిల్లీ వేదికగా జగన్ తిప్పికొట్టారు. ఒక దశలో ఇద్దరి మధ్య వాదన వాగ్వాదానికి దారి తీసిన పరిస్థితిలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జోక్యం చేసుకుని సర్ది చెప్పాల్సి వచ్చిందంటే …పాలనానుభవం, వయస్సులోనూ చిన్నవాడైన జగన్ ఎంతో అనుభవజ్ఞుడి వలే రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ముందు అసలు డీపీఆర్‌లు ఇచ్చేది లేదని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ …జగన్ వాదన, కేంద్రం ఆదేశాలతో చివరికి డీపీఆర్‌లు ఇచ్చేందుకు అంగీకరించారు. అలాగే సుప్రీంకోర్టు నుంచి కేసు ఉపసంహరణకు దిగి రావాల్సి వచ్చింది. హైదరాబాద్ నుంచి కృష్ణా రివర్ బోర్డును ఆంధ్రాకు తరలించేందుకు ఓ నిర్ణయానికి రావాల్సి వచ్చింది.
ఇవ్వన్నీ ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బలమైన వాదనలు వినిపించడం వల్లే సాధ్యమైందనే అభిప్రాయాలు ఇటు ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా వ్యక్తం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రతిపక్షాల అభిప్రాయాలేంటో ఒకసారి తెలుసుకుందాం.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందన ఏంటంటే…ముఖ్యమంత్రి కేసీఆర్ తోక ముడిచి కేంద్రానికి డీపీఆర్‌లు ఇచ్చారు. కేంద్ర పెత్తనం ఏందని, డీపీఆర్‌లు ఎందుకివ్వాలని నిన్నటి వరకు తొడగొట్టిన కేసీఆర్ లోని పౌరుషం ఈ మీటింగ్‌లో ఏమైంది? ఎక్కడికి పోయింది? రాష్ట్ర నీటి ప్రయోజనాలు కాపాడేందుకు ఏ విషయంపై కూడా కేసీఆర్ చర్చించకపోవడం సిగ్గుచేటు అని ఘాటుగా విమర్శించారు.
కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఏమన్నారంటే… జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కై తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. పాత ప్రాజెక్టుల కోసమే సంగమేశ్వరం లిప్ట్ పెడుతున్నామని, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచుతున్నామని ఏపీ వాదిస్తోంది. అసలు ఏపీకి ఇక్కడి నీటిపై హక్కేలేదు. కేసీఆర్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు…అని కాంగ్రెస్ నేత మండిపడ్డారు.
కానీ అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత ఏపీలో ఏ ఒక్కరూ కూడా జగన్‌పై ఒక్క విమర్శ కూడా చేయలేదు. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ సమాజం ఆకాంక్షలకు, అభిప్రాయాలకు అనుగుణంగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన వాదనను బలంగా వినిపించ డంతో పాటు ఊహించిన దానికంటే ఎక్కువగా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారని ఏపీ నమ్ముతోంది. కానీ కేసీఆర్ విషయంలో అక్కడి సమాజం విశ్వసించడం లేదు. జగన్‌కు మాత్రమే సాధ్యమైన విజయం ఇది.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా ఢీ కొట్టడానికి జగన్‌లా ఏ ముఖ్యమంత్రి అయినా ఉండాలని ఏపీనే కాదు తెలంగాణ సమాజం కూడా ముచ్చటపడేలా నిన్నటి అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఆయన ప్రవర్తించారు. ముఖ్యంగా తెలంగాణ అభ్యంతరం చెబుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తారనే నమ్మకాన్ని అపెక్స్ సమావేశం మరింత పెంచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.