చదువే విద్యార్థులకు ఒక శక్తి

614

‘జగనన్న విద్యాకానుక’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌
నాడు-నేడు పనులను పరిశీలించిన సీఎం

కృష్ణా జిల్లా: ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలన్నారు. చదువే విద్యార్థులకు ఒక శక్తి అని పేర్కొన్నారు. ‘‘పిల్లలను గొప్పగా చదివించాలనే తల్లిదండ్రులు భావిస్తారు. స్కూళ్లలో డ్రాప్ అవుట్స్‌పై గత ప్రభుత్వం ఆలోచించలేదు. ఇంగ్లీషు మీడియం చదవాలంటే ఆర్థిక భారంగా మారిన పరిస్థితులు ఉన్నాయని’’ సీఎం పేర్కొన్నారు. ‘‘పేదలకు మంచి విద్యాప్రమాణాలు అందించాలనే అంగన్‌వాడి నుంచి ఉన్నతవిద్య వరకు విప్లవాత్మక మార్పులు చేపట్టాం. నాడు -నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లల్లో రూపురేఖలు మారుస్తున్నాం. బడికి వెళ్లే పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు గోరుముద్ద పథకం తీసుకొచ్చాం. పేద పిల్లలు గొప్పగా చదవాలని భావించాను. ఒకటి నంచి టెన్త్ వరకు ప్రతి విద్యార్థికి విద్యాకానుక అందిస్తున్నాం. నవంబర్ 2 లోగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 44.32 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందిస్తాం. రూ.650 కోట్ల ఖర్చుతో విద్యాకానుకను అందిస్తున్నాం. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మూడ్రోజులపాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థి చదువుకోవాలి. ఉద్యోగం ఇచ్చేందుకు ప్రపంచమంతా మన దగ్గరకు రావాలి. ప్రతి విద్యార్థి గొప్పగా చదవాలని ఆశిస్తున్నాం. పేదవాడి తలరాతలు మార్చాలని 8 ప్రధాన పథకాలు అమలు చేస్తున్నాం. అమ్మఒడి పథకం ద్వారా రూ.15 వేలను ప్రతి తల్లి అకౌంట్‌లో వేస్తున్నామని’’ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

చదువుకు పేదరికం అడ్డుకాకూడదు: మంత్రి సురేష్‌
విద్యా ప్రమాణాలు పెంచడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. పేద విద్యార్థులకు బంగారు బాట వేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. నాడు – నేడు కింద ప్రతి పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దామని, నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదని సీఎం జగన్ భావించారని, ‘జగనన్న విద్యాకానుక’తో విద్యార్థులకు సీఎం జగన్ అండగా ఉన్నారని మంత్రి సురేష్‌ తెలిపారు.

ఎన్నో సంక్షేమ పథకాలు: పార్థసారధి
వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. ఎక్కడాలేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్థాయికి సీఎం జగన్ తెచ్చారని తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. కుల,మతాలు, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పార్థసారధి పేర్కొన్నారు.

జగన్‌ మావయ్య అంటే ఎంతో ఇష్టం : సభ వేదికపై సీఎం వైఎస్‌ జగన్‌ని విద్యార్థులు మావయ్య అంటూ సంబోధిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వారు మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. జగన్‌ మామాయ్య సీఎం అయిన తర్వాత చాలా పథకాలు ప్రవేశ పెట్టారని, ‘జగనన్న విద్యాకానుక’ను ప్రారంభిస్తున్నారని తెలిపారు. ‘‘నేను భవిష్యత్‌లో కలెక్టర్ కావాలని అనుకుంటున్నా. నేను కలెక్టర్ అయ్యేంతవరకు సీఎంగా జగనే ఉండాలని కోరుకుంటున్నా. జగన్ మావయ్య అంటే నాకు ఎంతో ఇష్టం’’ అంటూ హైస్కూల్‌ విద్యార్థిని అభిమానాన్ని చాటుకుంది. మరో విద్యార్థిని లీలాలహరి మాట్లాడుతూ 3వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్‌లో చదివానని, కానీ ఇప్పుడు గవర్న్‌మెంట్ స్కూల్‌లో చేరానని తెలిపింది. ‘జగనన్న విద్యాకానుక’ ఇవ్వడం పట్ల చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. ఈ స్కూల్‌లో చదవడం తనకు చాలా గర్వంగా ఉందని, అన్ని వసతులు ఉన్నాయని విద్యార్థిని తెలిపింది. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ జగనన్న విద్యాకానుక ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రారంభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని తల్లిదండ్రులు తెలిపారు.

1 COMMENT