అన్న అపాయింట్‌మెంటా?..ఆశ..దోశ..అప్పడం!

737

ఫాఫం..  గజపతిరాజుల ఫ్యామిలీ
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఆశకయినా ఒక హద్దుండాలి. ఆశ మంచిదే. అత్యాశ పనికిరాదు. పూసపాటి ఆనంగజపతిరాజు సతీమణి, వారి కుటుంబ రత్నం,  జగనన్నయ్య అపాయింట్‌మెంట్ దొరకలేదని అమాయకంగా చెప్పడంపై, వైసీపీ నేతలు పుసిక్కున నవ్వుకుంటున్నారట. మాన్సాస్ వ్యవహారంపై తాము జగన్ కలుద్దామని ఏడాది నుంచీ ప్రయత్నిస్తున్నా, ఆయన అపాయింట్‌మెంట్ దొరకడం లేదని ఆనందగజపతి రాజు భార్య సుధా ఆనంద గజపతిరాజు, కుమార్తె ఊర్మిళ గజపతి రాజు.. తెలుగు ఏడుపుగొట్టు సీరియల్‌లో బాధిత క్యారక్టర్ల మాదిరిగా తెగ వాపోవడం చూసి, వైసీపీలో ‘ట్వల్వ్ ఇయర్స్ ఇండస్ట్రీ’లు.. తుండుగుడ్డలు నోట్లో కుక్కుకుని, తలుపేసుకుని భోరున విలపిస్తున్నారట. జగనన్నయ్యతో ఓదార్పు యాత్ర నుంచి.. ఇప్పటివరకూ వెంట ఉన్న తమకే, ఆయన దర్శనభాగ్యం దొరక్క,  టన్నుల కొద్దీ కన్నీరు కారుస్తుంటే.. అసలు పార్టీకి సంబంధమే లేని తల్లీకూతుళ్లు కొత్తగా వచ్చి, ఆయన అపాయింట్‌మెంట్ దొరకడం లేదని చెప్పడం.. తమ కష్టాల పుండుపై కారం చల్లినట్లేనంటున్నారు. ఏం చేస్తాం? సీత బాధ సీతది, పీత బాధ పీతది!

విజయనగరంలోని మహారాజా కళాశాలను, ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయంపై పాపం తల్లీకూతుళ్లు తెగ బాధపడ్డారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత.. తమ తాత పీవీజీ రాజు, తండ్రి ఆనంద గజపతిరాజు ఆశయాలను తుంగలో తొక్కుతున్నారని జమిలిగా వాపోయారు. అసలు మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలపై సీఎం జగనన్నతో మాట్లాడాలని ఏడాది నుంచీ ప్రయత్నిస్తున్నా, ఆయన అపాయింట్‌మెంట్ దొరకడం లేదని అసలు విషయం బయటపెట్టారు. అదీ సంగతి.

తాత-తండ్రి సంగతి చెబితే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, తమ అభిమాన నాయకుడయిన జగనన్నయ్య అపాయింట్‌మెంట్ కోసం, ఏడాది నుంచీ ప్రయత్నిస్తున్నా కుదరడం లేదన్న తల్లీకూతుళ్ల మాటలే.. అన్నను అభిమానించే తమ్ముళ్లకు నచ్చడం లేదు. తాము ఎంతో ప్రేమించి, అభిమానించి, తమ గుండెలో ప్రతిష్ఠించుకున్న జగనన్నయ్యను కలవడం.. తమకే ఇంతవరకూ సాధ్యం కాక అల్లాడి ఆకులు మేస్తుంటే, మధ్యలో వచ్చిన ఈ తల్లీకూతుళ్ల గోలేమిటని జగనన్నయ్య అభిమానులు తెగ ఇదయిపోతున్నారట.అసలు జగనన్నయ్య సీఎం అయిన తర్వాత ఇప్పటివరకూ, ఆయనను ఓ పదిమంది మంత్రులు, ఓ అరడజను ఎంపీలే వన్‌టూ వన్ కలిశారట. అన్నను కలవాలని అధికారులను అడిగితే, ముందు తమకు కారణాలు చెప్పమని, సదరు అధికారులు కూపీలు తీస్తున్నారట. అంతపెద్ద ఎంపీ భీమవరం బుల్లోడు రఘురామకృష్ణంరాజుకే అపాయింట్‌మెంట్ ఇవ్వని జగనన్నయ్య..  గజపతిరాజు కుటుంబానికి ఇస్తారా? మరీ అత్యాశ కాకపోతే అని, అన్నయ్య అభిమానులు లాజిక్కు పాయింట్లు తీస్తున్నారట. నిజమే కదా మరి?

నిజానికి జగనన్నయ్య, మన పాత చంద్రన్నలా  ఎవరినీ కలవరు. బాబన్న మాదిరిగా రోజుకు పది సమీక్షలు, రెండు పార్టీ సమీక్షలు చేయరు. సమీక్షల పేరిట సమయాన్ని సాగదీయరు. క్లారిటీ వచ్చే వరకూ ఎవరినీ సతాయించరు. అసలు జగనన్నయ్య స్టైలే వేరట. రోజుకు ఒక సమీక్ష. తర్వాత ఆయన కంప్యూటరూ, ఆ గోలనే వేరట! మంత్రయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంత లావు పార్టీ లీడరయినా సరే… ముందు నందీశ్వరులను కలవాల్సిందే. వారికి నచ్చి, మెచ్చితేనే అప్పుడు జగనన్నయ్య వద్దకు ప్రవేశపెడతారన్న ప్రచారం ఉంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పే సర్కారీ వేగులున్నారు. వారితోపాటు,  ప్రైవేటు నివేదికలిచ్చే తన సొంత మీడియా వేగులు ఉండనే ఉన్నారు. ఇక జగనన్నయ్య దేని గురించి ఆందోళన చెందాలి?

ఈ మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు కలిస్తే.. ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలంటూ టన్నుల కొద్దీ అర్జీలు తన ఎదుట కుమ్మరిస్తారు. అటు చూస్తే ఖజానా బాగా వీకాయె. చేస్తానని చెప్పి చేయకపోవడం తన ఇంటా వంటా లేదు. అందుకే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలన్నట్లు.. అసలు ఎవరినీ కలవకుండా ఉంటే ఈ సీత కష్టాలుండవు కదా? అదన్నమాట.. జగనన్నయ్య ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడానికి వెనకున్న అసలు కథ! అర్ధమవుతోందా…?