జగన్-మోదీ..ఆ విధంగా ముందుకు వెళ్లారు!

74

ఎన్డీఏలో చేరికపై తుస్సుమన్న ఊహాగానాలు
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఇంకేముంది.. మోదీతో జగన్ డైరెక్టుగా చేతులు కలిపేశారు. పాపం మోదీ-అమిత్‌షా కూడా, చాలా కాలం నుంచి చేరమని చేతులు పట్టుకుని బ్రతిమిలాడుతున్నారు. అందుకే జగనన్న కరుణించేశారు. మోదీ భయ్యాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన జగనన్న, ఎన్టీఏలో చేరడానికి సై అనేశారు. అందుకు ప్రతిఫలంగా విజయసాయిరెడ్డి, సురేష్‌కు మంత్రి పదవులు, మిథున్‌రెడ్డికి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు కమల దళాలు సిద్ధపడ్డాయి. అందుకు ప్రతిగా జగనన్న కూడా, రాష్ట్ర క్యాబినెట్‌లో సోము వీరన్నకు ఓ మంత్రి పదవి ఇచ్చేందుకు అంగీకరించారు. ఇక త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో వైసీపీ కూడా చేరిపోవడం ఖాయం. ఇదీ రెండు రోజుల నుంచి సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొట్టిన కథనం.

కానీ జగనన్న ఢిల్లీకి వెళ్లారు. మోదీతో మాట్లాడి వచ్చేశారు. మరి ఎన్డీఏలో చేరిక ముచ్చట, దానిపై వైసీపీ సోషల్‌మీడియా దళాలు చేసిన హడావిడి అంతా ఏమైంది? ఇంకేముంటుంది? కాకి ఎత్తుకెళ్లింది! అవును.. అటు, ఇటు ఇద్దరూ దానిపై సైలెన్స్ అయ్యారు. అయినా.. మోదీతో కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన జగన్‌కు, అనవసరమైన హైప్ ఇచ్చిన వైకాపా సోషల్ మీడియా దళాలు.. ఒక్కరోజు వరకయితే ఆ ఉత్కంఠను పెంచి, తమ నాయకుడి ఇమేజ్ పెంచగలిగారు. బీజేపీ నాయకత్వమే వైసీపీని.. కేంద్రంలో చేరమని తెగ బతిమిలాడుతున్నా, మా జగనన్న మాత్రం రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని బిల్డప్ ఇచ్చారు. చివరాఖరకు అది తస్సాదియ్యా, తుస్సుమంది. కారణం.. అక్కడ ఉన్నది మోదీ-అమిత్‌షా జమిలి నాయకత్వం. అద్గదీ సంగతి!

అయినా.. జగనన్న సోషల్‌మీడియా దళాల పిచ్చికాకపోతే.. అసలు వైకాపా ఎన్డీఏలో ఎలా చేరుతుంది? ఎన్డీఏ కూడా వైకాపాను ఎలా తీసుకుంటుంది? అని ఆలోచించాలి కదా? అయినా ఇప్పుడు మోదీ భయ్యా సర్కారుకు, జగనన్న దూరంగా ఏమీ లేరు కదా? రాజ్యసభలో సర్కారు సమస్యల్లో చిక్కుకున్నప్పుడల్లా, ఆపద్బాంధవుడిలా ఆదుకుంటూనే ఉన్నారాయె. మన విజయసాయిరెడ్డి కూడా నిరంతరం పీఎంఓలోనే దర్శనమిస్తూ, కావలసిన పనులు చక్కబెడుతూనే ఉన్నారాయె. రాష్ర్టానికి రావలసిన నిధులన్నీ ఇస్తూనే ఉన్నారాయె. ఇక ప్రత్యేకంగా వైకాపా ఎన్డీఏలో చేరవలసిన అగత్యం ఏముందన్న ప్రశ్న.. బుర్ర-బుద్ధీ ఉన్న ఎవరికయినా వచ్చితీరాలి.

పైగా వైకాపా ఒకవేళ ఖర్మకాలి ఎన్డీఏలో చేరితే.. జగనన్నపై అభిమానం చూపించే ముస్లిం-క్రైస్తవుల ఓట్లు మాయమయిపోవూ? సరే.. క్రైస్తవులంటే, జగన్ తమ బిడ్డ కాబట్టి ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా, క్షమించేస్తారు. కానీ, ముస్లిముల అలా కాదు కదా? ఇప్పటికే మోదీపై మండిపడుతున్న ముస్లింలు, జగనన్న మోదీ భయ్యాతో చేరితే ఊరుకుంటారా? వీటికిమించి.. పక్క రాష్ట్రంలో ఉన్న తన అపూర్వ సహోదరుడ యిన కేసీఆర్, ఎన్డీఏతో జత కలిస్తే జగనన్నను ఊరకనే వ దిలేస్తారా? ఇన్ని సమస్యలను జగన్ వంటి తెలివైన నాయకుడు ఎందుకు కోరి కొనితెచ్చుకుంటారు?

ఇక పులుకడిగిన ముత్యమయిన బీజేపీ కూడా, నిజాయితీ అనే మడికట్టుకున్న పార్టీ మరి. బోలెడన్ని కేసులున్న జగనన్న పార్టీని ఎన్డీఏలో చేర్చుకుంటే, బీజేపీ నిజాయితీ అనే పాతివ్రత్యం మైలపడిపోదూ? పైగా 9 నెలల్లోగా అన్ని కేసులూ తేల్చేసేందుకు కోర్టులు సిద్ధమవుతున్నాయి. అందులో జగనన్నకు వ్యతిరేకంగా తీర్పు వస్తే, బీజేపీ మరింత మైలపడిపోదూ? వీటికి మించి రాష్ట్రంలో ‘గుర్రం ఎగరావచ్చ’న్న దింపుడుకళ్లెం ఆశతో ఉన్న బీజేపీ.. ఒకవైపు టీడీపీతోపాటు, వైకాపా కూడా.. తమకు అంటరానిపార్టీగానే సోమన్న లాంటి వాళ్లు చెబుతూనే ఉన్నారు. మరి ఈ పరిస్థితిలో వైకాపాను, ఎన్డీఏలో చేర్చుకుంటే కమలం కొంప కొల్లేరయి పోదూ? అదన్నమాట అసలు లోగుట్టు!