‘సమాచార’ సమరం!

418

(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఎవరు పాలకులుగా ఉంటే, ఆ ప్రభువు పల్లకీ మోయడం ఉద్యోగుల విధి. శాఖల కర్తవ్యం. అందుకు ఎవరూ అతీతులు కాదు. కాకపోతే ఆ విధేయత ఎలా ప్రదర్శించాలన్నది సదరు ఉద్యోగులు లేదా అధికారుల వ్యక్తిగత ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. అది ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా సరే. పాలకులకు కళ్లు-చెవులయిన సమాచార శాఖ కూడా అందుకు మినహాయింపు కాదు. కానీ ఇదే సమయంలో గతంలో పాలకులతో సంతృప్తికర స్థాయిలో లబ్థిపొందిన వారు, తమకు నచ్చని అదికారులు-శాఖలపై చేసే ఉపదేశాలు,హితోక్తులు, ఆవేదన, ఆక్రోశమే ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ఇప్పుడు ఏపీ సమాచార శాఖ విషయంలో అదే జరుగుతోంది.

సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్‌రెడ్డి వ్యవహారశైలిపై ‘రాజగురువు’కు చెందిన మీడియాలో వచ్చిన ఓ కథనం ఆశ్చర్యపరిచింది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నంత వరకూ సమాచార శాఖపై పెద్ద పత్రికల్లో ఎక్కడా కథనాలు వచ్చిన దాఖలాలు లేవు. ప్రకటనలు-అక్రిడెటేషన్ల విషయంలో చిన్న పత్రికలే సమాచారశాఖకు, సంబంధిత అధికారులకు వ్యతిరేకంగా కథనాలు రాసేవి. అవి ఇప్పుడూ వస్తున్నాయి. అది వేరే విషయం. కానీ పెద్ద పత్రికల్లో కూడా ఆవిధంగా వ్యతిరేక కథనాలు రావడం వైసీపీ అధికార మీడియా సాక్షితోనే మొదలయింది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ వల్ల లబ్థిపొందిన ‘ఆంధ్రజ్యోతి’కి ప్రకటనలు నిలిపివేశారు. ఆ సందర్భంలో ఏయే పత్రికలకు వైఎస్ సర్కారు ఎన్ని కోట్ల ప్రకటనలిచ్చిన వైనాన్ని ఆంధ్రజ్యోతి వెల్లడించింది. ఆ తర్వాత అది కోర్టుకు వెళ్లి, ప్రకటనలు సాధించుకుంది. అది వేరే విషయం.

జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు సమాచార శాఖపై సాక్షి దినపత్రిక, పుంఖానుపుంఖాల వ్యతిరేక కథనాలు రాసింది. కారణం ఆ పత్రికకు తగినన్ని ప్రకటనలివ్వకవడమే. ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఫుల్‌పేజీ ఇస్తే, సాక్షికి సగం పేజీ ప్రకటన మాత్రమే ఇచ్చేది. అది కూడా కృష్ణమోహన్ కమిషనర్‌గా ఉన్నంతవరకూ సాక్షికి క్లాసిఫైడ్ ప్రకటనలు మాత్రమే వచ్చేవి. వెంకటేశ్వర్ కమిషనర్‌గా వచ్చిన తర్వాతనే, సగం పేజీ, ఒక్కో సందర్భంలో ఫుల్‌పేజీ ప్రకటనలు కనిపించేవి. దానితో సహజంగానే సాక్షి ఆ దుగ్థతో వ్యతిరేక కథనాలు రాసింది. అదీ అసలు కథ.

నిజానికి ఆర్‌ఎన్‌ఐ నివేదిక ప్రకారం.. ఏపీలో సర్క్యులేషన్ పరంగా ఈనాడు, ఆ తర్వాత సాక్షి ఒకటి-రెండవ స్థానాల్లో ఉన్నాయి. టీడీపీ హయాంలో కూడా, సాక్షి రెండవ స్థానంలోనే నిలిచింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. అప్పుడూ-ఇప్పుడూ ఆంధ్రజ్యోతి మూడవ స్థానంలోనే ఉంది.
ఇప్పుడు అదే పని ఆంధ్రజ్యోతి మొదలుపెట్టింది. కారణం దానికీ జగన్ ప్రభుత్వం ప్రకటనలివ్వకపోవడమే. అయితే, టీడీపీ హయాంలో సాక్షికి కొద్దో గొప్పో ప్రకటలివ్వగా, ఇప్పుడు వైసీపీ సర్కారుకు ఆంధ్రజ్యోతికి అది కూడా ఇవ్వకుండా నిలిపివేసింది. అదీ అసలు లోగుట్టు. ఆ ప్రకారంగా కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డిపై రాసిన కథనం ఆశ్చర్యంతోపాటు, ఆసక్తినీ రేపింది. పిఐబీ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి, సమాచార శాఖలో చేరిన ఆయన, చివరకు మంత్రులనూ త్రోసిరాజని పెత్తనం చెలాయిస్తున్నారని, మితిమరీ స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారన్నది ఆ కథనంలోని సారాంశం. నిజమే. పిఐబీ నుంచి డిప్యుటేషన్‌పై సమాచార శాఖకు వచ్చిన వారిలో విజయ్‌కుమార్‌రెడ్డి మొదటివారేమీ కాదు. గతంలో చాలామంది పిఐబి నుంచి డిప్యుటేషన్‌పై వచ్చినవారే. పాలకులతో పరిచయాలున్న వారినే డిప్యుటేషన్‌పై తెచ్చుకుంటారన్నది బహిరంగమే.

ఇక అన్ని శాఖల ప్రకటనలూ సమాచార శాఖ ద్వారానే ఇస్తున్నారన్నది మరో విమర్శ. నిజానికి ప్రభుత్వ శాఖలన్నీ సమాచార శాఖ ద్వారానే ప్రకటనలివ్వాలన్నది ఉమ్మడి రాష్ట్రంలోనూ ఉన్న విధానమే. తెలంగాణ ప్రభుత్వం ఆ విధానాన్ని చాలా ఏళ్ల నుంచీ అమలుచేస్తోంది. అయితే దానిని గత టీడీపీ ప్రభుత్వం అమలుచేయకుండా, ఆయా శాఖల ఇష్టానికే వదిలేసింది. ఫలితంగా మంత్రులు తమ ఇష్టం వచ్చిన ఏజెన్సీలకు ప్రకటనతోపాటు, హోర్డింగుల కాంట్రాక్టును కట్టబెట్టారు. చివరకు మన రాష్ర్టానికి చెందని కంపెనీలకూ ఏజెన్సీలు ధారాదత్తం చేశారు. అప్పట్లో ప్రతి ఒక్కరూ సమాచార శాఖపై స్వారీ చేసి, కమిషనర్‌ను నిమిత్తమాత్రుడిని చేశారన్న వ్యాఖ్యలు కూడా వినిపించేవి. కాపు కార్పొరేషన్‌లో అయితే, దానిపై పెద్ద పంచాయతీనే జరిగి, చివరకు నాటి సీఎం బాబుకు ఫిర్యాదు చేసేంతవరకూ వెళ్లింది. అప్పట్లో ఉన్న జీఞఓను బాబు అమలుచేయకపోతే, ఇప్పుడు జగన్ అదే జీఓను అమలు చేస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రం వరకూ అన్ని ప్రభుత్వాలూ, యాడ్ ఏజెన్సీల ద్వారానే ప్రకటనలు ఇచ్చేవి. ఇప్పుడు జగన్ సర్కారు ఆ విధానాన్ని మార్చింది. ఏజెన్సీలను రద్దు చేసి, నేరుగా సమాచార శాఖనే యాడ్స్ ఇచ్చి, ఆర్‌ఓ కూడా సాయంత్రానికే ఇచ్చేసే పద్ధతి ప్రవేశపెట్టింది. పైగా 15 శాతం సీఎస్‌ఆర్ కింద బిల్లు మినహాయించుకుదే విధానం ప్రారంభించింది. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా 25 కోట్లు ఆదా అయిందని అధికారుల వాదన. గతంలో ప్రభుత్వంలోని పెద్దలను ప్రసన్నం చేసుకున్న వారికే అడ్డగోలుగా ప్రకటనలు వచ్చేవి. దానికి ఓ ప్రాతిపదిక అంటూ ఏదీ ఉండదు.

ఆ ప్రకారంగా గత ఐదేళ్లలో బాబు ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల బడ్జెట్‌లో ఈనాడు-ఆంధ్రజ్యోతికే సింహభాగం వెళ్లేది. పైగా ఆంధ్రజ్యోతికి ఎలాంటి టెండరు పిలవకుండా, అసెంబ్లీసమావేశాలు-ప్రభుత్వ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాల కాంట్రాక్టు కట్టబెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో బాబు సర్కారు ఈ కాంట్రాక్టును ఈటీవికి కట్టబెట్టగా, తర్వాత వచ్చిన వైఎస్, తమ అనుకూల కంపెనీకి కట్టబెట్టారు. ఇప్పుడు జగన్ కూడా అదే విధానం అనుసరిస్తోంది. అయితే ప్రస్తుత కమిషనర్ ప్రకటనల విషయంలో కొత్త విధానం రూపొందించారు. తమ షరతులకు లోబడి ఎవరయితే ప్రకటనలు వేసుకుంటామని లిఖిత పూర్వకంగా రాసి ఇస్తారో, వారికి మాత్రమే ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం ప్రకటనలిస్తోంది. అందుకు ఆంధ్రజ్యోతి మినహా, అన్ని పత్రికలూ అంగీకరించాయన్నది అధికారుల వాదన.

ఇది ఒకరకంగా సర్కారుకు సొమ్ములు మిగిలే అంశమే. ఎందుకంటే పట్టుమని పదివేల సర్క్యులేషన్ కూడా లేని పత్రికల టారిఫ్, ఈనాడు రేటు కంటే ఎక్కువగానే కనిపిస్తుంటుంది. నెలవారీ సంచికలన్నీ ఒకేసారి కొట్టి, పిఐబీ-ఇటు జిల్లా సమాచార శాఖల కోసమే ఒకేసారి ముద్రించే పత్రికలు సైతం, కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న పరిస్థితి ఏళ్ల తరబడి కొనసాగుతోంది. భూసేకరణ ప్రకటనలతో కోట్లాది రూపాయలు సంపాదించిన పత్రికలు అనేకం. అసలు వాటికోసమే పుట్టిన పత్రికలకు లెక్కలేదు. అందువల్ల కొత్తగా ప్రవేశపెట్టిన ఈ విధానంతో, సర్కారుకు ఆర్ధిక నష్టం తప్పించినట్లే లెక్క

ఇక పాలకుల భజనలో సమాచార శాఖ మునిగిపోయిందన్న మరో విమర్శ కూడా విస్మయకరమే. జగన్ మామ అంత్యక్రియల వంటి ప్రైవేటు కార్యక్రమానికి సమాచార శాఖ వార్త, ఫోటోలు పంపడాన్ని ఆంధ్రజ్యోతి ఆక్షేపించడమే ఆశ్చర్యం. గత ఎన్నికల సమయంలో.. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు, భార్య-కోడలు ఆయనకు దిష్టితీసిన ఫొటోలు విడుదల చేసింది కూడా, ఇదే సమాచార శాఖ అన్న విషయాన్ని విస్మరించడమే ఆశ్చర్యం. బాబుపై అలిపిరిలో నక్సలైట్ల దాడి తర్వాత, ఆయనను పరామర్శించేందుకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్ధుల సహా వివిధ వర్గాలు హైదరాబాద్‌కు తరలివచ్చారు. అప్పుడు ఇదే సమాచార శాఖ వార్తలు-ఫొటోల శ్రమదానం చేసిన విషయాన్ని విస్మరించటం మరో ఆశ్చర్యం.

అయితే.. అమిత్‌షాతో జగన్ భేటీపై, ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై సమాచార శాఖ లీగల్ నోటీసు ఇవ్వడం ఆశ్చర్యమే కాదు. ఆక్షేపణీయం కూడా. వైఎస్ హయాంలో కూడా ఇలాంటి విపరీత పరిణామాలు చోటు చేసుకోలేదు. ఆయన ఆంధ్రజ్యోతిని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రకటనలు కూడా నిలిపివేశారు. దానితో రాధాకృష్ణ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. సహజంగా ఇలాంటి కథనాలు వస్తే, సంబంధిత వర్గాలు ఖండనలు పంపించేవి. ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. అమిత్‌షాతో జగన్ భేటీ పూర్తిగా ప్రైవేట్ అంశం. దాన్ని ఖండించాల్సింది వాళ్లిద్దరిలో ఒకరు మాత్రమే. మరి ఆ పని వాళ్లిద్దరూ చేయలేదు. ఆ భేటీలో సమాచార శాఖ అధికారులెవరూ లేరు. అయినా సమాచార శాఖ ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించిందో అర్ధం కావడం లేదు.

చంద్రబాబు హయాంలో జరిగిన క్యాబినెట్-పార్టీ నేతల భేటీలో.. చోటుచేసుకున్న అంతర్గత అంశాలపై, సాక్షి అనేక కథనాలు రాసింది. చివరకు సాక్షిపై నిషేధం ఉన్నప్పటికీ, బాబు నివాసం ఫొటోలు కూడా తీసింది. సమాచార శాఖపై, పుంఖాను పుంఖాల వ్యతిరేక కథనాలు రాసింది. జిల్లా కలెక్టర్లు, ఐపిఎస్‌లపైనా వ్యతిరేక కథనాలు రాసింది. నాటి ఇంటలిజన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావు- నాటి సీఎంఓ ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర కలసి, వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్న కథనాలు రాసింది. అయినా, ఈవిధంగా లీగల్ నోటీసులిచ్చిన దాఖలాలు లేవు. బాబు-వైఎస్ ఎప్పుడూ వాటిపై ఆసక్తి చూపలేదు. కానీ జగన్ వ్యవహారం, అందుకు పూర్తి విరుద్ధంగా ఉండటమే విమర్శలకు దారితీస్తోంది. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఆ విషయాన్ని అందరూ గుర్తిస్తే మంచిది.