భారతదేశంలో మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం 1936లో ప్రత్యేక చట్టం 1935 ద్వారా షెడ్యూల్డ్ కులాల జాబితాను ప్రకటించింది అంతకు ముందు వీరిని డిప్రెస్డ్ తరగతులుగా పరిగణించేవారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 ద్వారా రాష్ట్రపతి షెడ్యూల్డ్ కులాల, ఆర్టికల్ 342 ద్వారా షెడ్యూల్డు తెగలను ప్రకటిస్తారు. ఒక కులాన్ని షెడ్యూల్డ్ కులం (ఎ.స్సీ) గా గుర్తించాలంటే సామాజిక, విద్యా, ఆర్థిక వెనుకబాటు తోపాటుగా అస్పృశ్యతను అనుభవిస్తూ ఉండాలి, అదేవిధంగా ఒక తెగను షెడ్యూల్డ్ తెగ (ఎస్.టి) గా గుర్తించాలంటే సంబంధిత తెగ ప్రత్యేక భాష, ప్రత్యేక ఆచారాలు, ఆటవిక సంచార జీవితం కలిగి, అడవుల్లో వంశపారంపర్య వృత్తితో జీవిస్తూ ఉండాలి. ఒక కులాన్ని సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతి (ఓ బి సి) గా గుర్తించాలంటే ఆ కులం సామాజికంగా మరియు విద్యాపరమైన వెనుకబాటును అనుభవిస్తూ ఉండాలని నిర్ధారించారు, 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 342ఎ ను రాజ్యాంగంలో చేరుస్తూ 2019 నుండి కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలంటే రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా చేర్చవలసి ఉంటుంది.

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత 1950లో రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా దేశంలో షెడ్యూల్డ్ కులాల (ఎ.స్సీ) జాబితాను విడుదల చేస్తూ ఉత్తర్వులొ పేర 3లో షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించిన వారందరూ తప్పనిసరి హిందూమతంలో కొనసాగాలని నిబంధన పెట్టారు మరియు పంజాబ్ రాష్ట్రంలోని రాందాసి, కాబిరపంతి, మజాబి, సిక్లిగర్ కులాలు మాత్రం సిక్కు మతంలో కొనసాగవచ్చని తెలిపింది. తదనంతరం 1990లో రాష్ట్రపతి ఉత్తర్వులను సవరణ చేస్తూ షెడ్యూల్డ్ కులాల వారు తప్పనిసరిగా హిందూ లేదా సిక్కు లేదా బౌద్ధ మతంలో కొనసాగాలని నిబంధన పెట్టారు, ఒకవేళ ఇతర మతం లోనికి మారినచో షెడ్యూల్డ్ కులం హోదాను కోల్పోయి ఓబీసీ గా గుర్తింపు పొందుతారు. షెడ్యూల్డు కులాల వారికి మత నిబంధన పెట్టడానికి కారణం ముఖ్యంగా హిందూమతంలో పంచమ వర్ణానికి సంబంధించిన అతిశూద్రులు అంటరానితనాన్ని అనుభవించారు, అదే క్రైస్తవ, ముస్లిం మతాలలో అంటరానితనం లేదు క్రైస్తవ చర్చిలో పాస్టర్గా, ముస్లిం మసీదులో ఇమామ్ లుగా ఎవరైనా కావచ్చు కానీ హిందూ దేవాలయాలలో పూజారిగా బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు. 1956లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా దేశంలో షెడ్యూలు తెగలను (ఎస్.టి) జాబితాను ప్రకటించారు వీరికి ఎలాంటి మత నిబంధనలు లేవు వీరు ఏమతంలో నైనా కొనసాగవచ్చు కారణం ఆయా తెగలు సభ్య నాగరిక సమాజానికి దూరంగా అడవులలో జీవిస్తున్నారు కనుక.

కేంద్ర ప్రభుత్వం 1975లో ఉత్తర్వులను జారీ చేస్తూ ఎవరైనా షెడ్యూల్డ్ కులానికి చెందినవారు ఇతర మతాలు అనగా క్రైస్తవ మతము లేదా ముస్లిం మతం లేదా జైన మతంలోకి మారినచో వారికి షెడ్యూల్డ్ కులాలకు కల్పిస్తున్న ఏలాంటి రిజర్వేషన్లు వర్తించవు తిరిగి కొంతకాలం తర్వాత వారి పూర్వ మతం అయినా హిందూ, సిక్కు, బౌద్ధ మతానికి మారినచో వారికి షెడ్యూల్డ్ కుల హోదా రిజర్వేషన్లు పొందే వెసలుబాటు కల్పించారు. ఇందుకు సంబంధించి 1976లో సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ప్రిన్సిపాల్ గుంటూరు మెడికల్ కళాశాల వర్సెస్ వై మోహన్ రావు (Principal of Guntur Medical College Vs Y Mohan Rao ) కేసు తీర్పులో చాలా స్పష్టమైన అంశాలను తెలిపింది, అదేవిధంగా 1976 నుండి 2020 వరకు పలు కేసు తీర్పు లలో, ఉదాహరణకు తల్లి మరియు తండ్రి షెడ్యూల్డ్ కులానికి చెందిన వారై వారు క్రైస్తవ మతంలోకి మారినప్పుడు వారు షెడ్యూల్డ్ కుల హోదాను కోల్పోతారు ఒకవేళ వారి సంతానం హిందూ లేదా సిక్కు లేదా బౌద్ధ మతంలోనికి మారినట్లయితే తిరిగి షెడ్యూల్డ్ కులల హోదా పొంది రిజర్వేషన్లు కూడా పొందుతారు. అదే షెడ్యూల్డ్ తెగలు ఏ మతంలోకి మారిన వారి హోదాను కోల్పోరు మరియు రిజర్వేషన్లు పొందవచ్చు.

సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు (ఓ బి సి) సంబంధించి నేటి వరకు దేశంలోని హైకోర్టుల ధర్మాసనాలు గాని లేదా సుప్రీంకోర్టులో ఏలాంటి స్పష్టమైన తీర్పులు ఓ బి సి లు మతం మారినచొ రిజర్వేషన్లు కోల్పోతారని రాలేదు, కానీ 2013 లో మద్రాసు హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఎస్. యాస్మిన్ వర్సెస్ ది సెక్రటరీ తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( S.Yasmin Vs The Secretary Tamil Nadu Public Service Commission) కేసు తీర్పులో పిటిషనర్ ఓ బి సి కులానికి చెందిన క్రైస్తవ నాడార్ కులం, పిటిషనర్ ముస్లిం మతానికి మారింది కనుక ఆమె బిసి రిజర్వేషన్ కోల్పోతుందని తీర్పు ఇచ్చారు, అంతేకానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేటి వరకు ఓబిసి/బీసీలు మతం మారితే రిజర్వేషన్ కోల్పోతారని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు.

ప్రధానంగా దేశంలో దళిత క్రైస్తవులు వారిని షెడ్యూలు కులాలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి భారత దేశంలో మతం మారినంత మాత్రాన సామాజిక సమానత్వం గాని అంటరానితనము గాని పోవడం లేదు ఎందుకంటే దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు ఇందులో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ పోలేదు కేవలం కొందరు షెడ్యూల్డ్ కులాల వారు మతం మారినంత మాత్రాన వారి సామాజిక హోదాలో ఎలాంటి మార్పు రావడం లేదు, పూర్వం షెడ్యూల్డ్ కులాలకు హిందూ దేవాలయాల్లోకి ప్రవేశం లేదు కావున వారు ప్రత్యామ్నాయంగా ఇతర మతంలోకి మారడం సహజంగానే చూడాలి. భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులానికి చెందినవారు మతం మారితే షెడ్యూల్డు కులాల హోదా మరియు రిజర్వేషన్లు కోల్పోతారని ఎలాంటి నిబంధనలు లేవు, కేవలం రాష్ట్రపతి ఉత్తర్వులలో మాత్రమే నిబంధన పెట్టారు, మొదట హిందూమతంలో కొనసాగాలని చెప్పారు తరువాత సవరించి సిక్కు లేదా బౌద్ధ మతాలలో కొనసాగవచ్చని తెలిపారు. అందుకే దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవులు రాష్ట్రపతి ఉత్తర్వు 1950 లోని పేర 3ను సవరించి వారికి షెడ్యూల్డ్ కులాల హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు, దీనిపై కేంద్ర ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకొని వీరికి న్యాయం చేయవలసి ఉంది.

కోడెపాక కుమార స్వామి
ప్రముఖ సామాజిక విశ్లేషకులు
మొబైల్: 9490959625

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner