జగన్ ఢిల్లీ టూర్‌తో ఏపీ రాజకీయాలు మారనున్నాయా..!!

269

(రుద్రవీణ, పొలిటికల్ అనలిస్ట్)

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లారు.  ఢిల్లీ పర్యటనలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వీరిద్దరి  భేటీలో ప్రధానంగా మూడు  అంశాలు చర్చకు వచ్చాయి. 1. అభివృద్ధి – సంక్షేమం 2 . ఇరిగేషన్  3. రాజకీయాలు. అభివృద్ధి –  సంక్షేమానికి సంబంధించి సీఎం వైఎస్ జగన్‌ అడిగినన్ని నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్దంగానే ఉంది. ఇక రెండోది..ఇరిగేషన్. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి  నిధులు త్వరగా  ఇవ్వాలని ప్రధానిని సీఎం జగన్‌ అడిగి ఉంటారు అనడంలో సందేహం లేదు. అంతేకాదు..గోదావరి –  కృష్ణా , పెన్నా – కావేరి నదుల  అనుసంధానం గురించి కూడా  వీరిద్దరి మధ్య చర్చకు వచ్చాయి. నదుల అనుసధానంతోనే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి నమ్మకం.అందుకు తగ్టట్లుగానే ఆయన ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఇరిగేషన్ అధికారులను పరుగులు పెట్టించి ప్రాజెక్టులు పూర్తి చేయిస్తున్నారు.  ఇక మూడోది రాజకీయాలు. ఈ మూడో అంశం మీదనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిపై మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని  నిలబెట్టుకోవాలని వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అమిత్ షాతో భేటీలో ఇవే అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వీటికి కొనసాగింపుగానే మోదీతో  జగన్ భేటీ అయినట్లు సమాచారం.

2014 -19 మధ్య కాలంలో  ఏపీలో చంద్రబాబు అరాచక పాలన సాగింది. ఫలితంగానే వైఎస్‌ఆర్‌ సీపీకి 50శాతం పైగా ఓట్లతో ఘన విజయం సాధించింది. పాలనా పగ్గాలు చేపట్టిన ఏడాదిన్నరలోనే  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి దేశంలోని బెస్ట్‌ సీఎంల్లో మూడో స్థానం సొంతం చేసుకున్నారు.  అంతేకాదు.. సీఎంగా వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ గుర్తింపు పొందుతున్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్ గ్రామ పంచాయతీ,వాలంటరీ వ్యవస్థలను ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్‌ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. ఇవన్నీ కూడా కేంద్రం క్షుణ్ణంగా గమనిస్తోంది. ఏపీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడంపై బీజేపీ పెద్దలు, వ్యూహకర్తలు ఆసక్తిగా ఉన్నారు. కమలనాధులకు నమ్మదగిని నేతగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి కనిపిస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని మిత్రుడిని చేసుకుంటే, ఆయనతో మంచిగా ఉంటే ఏపీలోనే కాదు దక్షిణాదిలోనే సమీకరణలు మార్చివేయవచ్చు అనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారు. “వైఎస్‌ జగన్‌ పాలన చాలా బాగుంది. అవినీతిలేదు, సంక్షేమం, అభివృద్ధి బాగున్నాయి. ఏపీ సీఎంతో మంచిగా  ఉంటే రాజకీయంగా బీజేపీకే లాభం” నాతో ఓ ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అన్న మాట ఇది. ఈ ఆర్‌ఎస్‌ఎస్‌ నేత మాటల్లోనే కషాయవాదుల వ్యూహాన్ని పసిగట్టవచ్చు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు అంటేనే  చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది. టీడీపీ శ్రేణుల్లో తుఫాను రేగుతుంది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. బీజేపీకి గాలం వేయడానికి తన నమ్మిన బంట్లకు కాషాయ కండువా కప్పిన కూడా చంద్రబాబు  ఆటలు ఢిల్లీలో సాగడం లేదు.  మోదీ రెండో సారి పీఎం అయిన తరువాత చంద్రబాబు ఒక్కసారి కూడా ఢిల్లీ గడప తొక్కలేదు అంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. మోదీకి ఎంత దగ్గర కావాలని చంద్రబాబు చూస్తున్నారో అంత దూరం అవుతున్నారు.

ఇప్పట్లో ఏపీలో అధికారం చేపట్టలేమని గ్రహించిన బీజేపీ పెద్దలు, వ్యూహకర్తలు కూడా ఏపీలో రెండు సూత్రాల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. 1 . అభివృద్ధి, సంక్షేమం దిశగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అడిగినన్ని నిధులు ఇవ్వడం. 2. చంద్రబాబును రాజకీయంగా దెబ్బకొట్టడానికి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డితో స్నేహం చేయడం. ఈ రెండు  సూత్రాల రాజకీయాన్ని ఏపీలో బీజేపీ పెద్దలు అమలు చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్‌ తరువాత ఈ రెండు సూత్రాల పథకానికి మరింత పదును పెట్టే అవకాశముంది. చంద్రబాబును రాజకీయంగా కోలుకోకుండా దెబ్బ కొట్టాలంటే ఏపీ ప్రభుత్వం అడుగుతున్నట్లు అమరావతి భూ కుంభకోణం,ఫైబర్ గ్రిడ్‌పై సీబీఐ విచారణకు ఒప్పుకోవడం. ఈ రెండింటికి మోదీ సై అంటే చంద్రబాబు పని అయిపోయినట్లే. ఎందుకంటే ఇప్పటికే అమరావతది భూకుంభకోణం దేశంలోనే అతి పెద్ద కుంభకోణంగా పేరు తెచ్చుకుంది.

చంద్రబాబు అండ్ కో అమరావతిలో ఓ ప్రణాళిక ప్రకారమే భూములు కొన్నట్లు సిట్, ఏసీబీ పక్కా ఆధారాలు సేకరించాయి. అంతేకాదు..చంద్రబాబు ముందు చూపుతో తన రాజకీయ లబ్ధి కోసం ఎవరెవరికీ భూములు కట్టబెట్టాడో అది కూడా సిట్,ఏసీబీ సంపాదించాయి. ఆ విచారణలో భాగంగానే పలువురు జడ్జీలు, ఐఏఎస్‌,ఐపీఎస్‌ల పేర్లు బయటకు వచ్చాయి. అమరావతి భూకుంభకోణంపై సీబీఐ విచారణకు కేంద్రం ఒప్పుకుంటే 2024 ఎన్నికల నాటికి చంద్రబాబును రాజకీయంగా తెర మీదకు రాకుండా చేయొచ్చు. బీజేపీ వ్యతిరేక కూటమి అంటూ కాంగ్రెస్‌తో  కలిసి  యూపీఏకి ప్రాణం పోయకుండా చూడొచ్చు. అమరావతి భూకుంభకోణం,ఫైబర్‌ గ్రిడ్‌లో అవకతవకలతో దేశ రాజకీయ తెరపై చంద్రబాబును అతి పెద్ద అవినీతిపరుడిగా చూపించవచ్చు. రాజకీయంగా ఇది బీజేపీకి లాభం. ఎందుకంటే…చంద్రబాబులాంటి కుటిల రాజకీయాలు చేసేవారిని అవకాశం వచ్చినప్పుడే అణగదొక్కాలి. అది అమరావతి భూకుంభకోణం రూపంలో బీజేపీ ముందుకు వచ్చింది. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అందించిన అమరావతి భూకుంభకోణం అస్ట్రాన్ని బీజేపీ పెద్దలు అందిపుచ్చుకుంటారనే అనుకుంటున్నాను.

మోదీ – వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిలకు రాజకీయ శత్రువు చంద్రబాబు. 2019 ఎన్నికలకు ముందు మోదీని పీఎం కాకుండా అడ్డుకోవడానికి  కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు చేయాల్సిందంతా చేశారు. వైఎస్‌ఆర్‌ అకాల మరణం తరువాత  అదే కాంగ్రెస్‌తో కలిసి వైఎస్‌ జగన్‌ను రాజకీయంగా ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు. సో….మోదీ – జగన్‌ల కామన్‌ శత్రువు చంద్రబాబు. 2024 నాటికి  రాజకీయంగా చంద్రబాబు ఊసే లేకుండా చేయాలంటే  వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఆలోచనతో మోదీ ఏకీభవిస్తూ ముందుకు సాగాలి. ఇది ఇద్దరికి ప్రయోజనం. చంద్రబాబు అవసరం అనుకుంటే కాళ్లు, అవసరం లేదనుకుంటే జుట్టు పట్టుకునే రకం.  చంద్రబాబుకు స్వార్థ ప్రయోజనాలే తప్ప ..ఎటువంటి రాజకీయ సిద్దాంతాలు ఉండవు. కాబట్టి…చంద్రబాబును రాజకీయంగా అణగదొక్కే విధంగా మోదీ – జగన్‌ల ద్వయం ముందుకు సాగాలి.

చంద్రబాబును రాజకీయంగా అడ్డుకోవాలంటే వైఎస్‌ జగన్‌తో స్నేహం చేయాలని ఇప్పటికే బీజేపీ వ్యూహకర్తలు  ఓ అంచనాకు వచ్చారు. వ్యవసాయ బిల్లుతో 40 ఏళ్లుగా తమతో స్నేహం చేస్తో న్న అకాళీలు బీజేపీకి దూరమయ్యారు. బిహార్‌ ఎన్నికల్లో ఆర్జేడీ – కాంగ్రెస్‌ కూటమి దూకుడుగా ఉన్నాయి. యూపీలో హథ్రాస్‌ వ్యవహారం ఇవన్నీ కూడా బీజేపీకి కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు.   మరో ఏడాదిలొ పంజాబ్ ఎన్నికలు ఉ న్నాయి.  అకాలీలు లేకుండా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నెట్టుకు రావడం అగ్ని పరీక్షే. యూపీలో శాంతి,భద్రతల సమస్య బీజేపీని పట్టి పీడిస్తోంది. బిహార్  ఎన్నికల్లో బీజేపీ – జూడీయూ కూటమి బయట పడే అవకాశమున్నప్పటికీ తలనొప్పులు తప్పకపోవచ్చు.

2019లో ఉత్తరాదిలో గెల్చుకున్న సీట్లు 2024లో బీజేపీకి రాకపోవచ్చు. అకాలీల దూరం బీజేపీని కలిసి వేసిందనే చెప్పాలి. సో..ఇప్పటి నుంచే కొత్త మిత్రుల వేట బీజేపీ ప్రారంభించింది. వారికి నమ్మదగ్గ నేస్తంగా  ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి కనిపిస్తున్నారు. ఏపీలో 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి.  వైఎస్‌ జగన్‌తో స్నేహంగా ఉంటే 36 పార్లమెంట్ స్థానాలు బీజేపీ బ్యాగ్‌లో ఉన్నట్లు . అంతేకాకుండా.. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డితో స్నేహంగా ఉంటే  తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం సాయం కూడా లాభిస్తుందని బీజేపీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు.

అంతేకాకుండా..కర్ణాటక, తమిళనాడుల్లో కూడా  వైఎస్‌ జగన్‌ అభిమానులు ఉన్నారనే విషయాన్ని కేంద్రం గుర్తించింది.  జగన్‌తో స్నేహం చేస్తే ఆ రెండు రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా లాభం ఉంటుందని కమలనాధులు అంచనాల్లో ఉన్నారు.వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డితో స్నేహం బహుళ ప్రయోజనం కాబట్టే ఆయనను అత్యంత విశ్వసించదగ్గ మిత్రుడిగా మోదీ భావిస్తున్నారు.  వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి పాలనా సంస్కరణలను  ప్రధాని  మోదీ మెచ్చుకోవడం వెనుక కూడా  రాజకీయ వ్యూహం దాగుంది.  ఆ రాజకీయం  ఏంటనేది తెలియడానికి కొన్ని నెలల పట్టొచ్చు. ఆ రాజకీయ వ్యూహంపై చర్చ మాత్రం ఈ రోజే జరిగింది.ఈ చర్చలో నిర్ణయాలే చంద్రబాబు రాజకీయ జీవితాన్ని శాసించనున్నాయి.