ధర్మాన ప్రసాదరావు పరువు తీస్తున్న కృష్ణదాసు

592

ధర్మాన అనుచరులలో అసంతృప్తి
నోరు పారేసుకుంటున్న మంత్రులతో తలనొప్పి
జగన్ సర్కారుకు దూరమవుతున్న తటస్థులు- విద్యావంతులు
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘ఆణిముత్యాల’ వంటి మంత్రులుగా ఏరికోరి ఎంపిక చేసుకున్న ఏపీ సీఎం జగన్ నిర్ణయం.. ఇప్పుడు ప్రతికూల ఫలితాలిస్తోంది. కొడాలి నాని, ధర్మాన కృష్ణదాసు వంటి మంత్రుల నోటిదురుసు వ్యాఖ్యలతో, పార్టీ పరువు పోతోందన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా.. గత ఎన్నికల్లో జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దామనుకుని ఓటేసిన.. ఏపార్టీకీ చెందని తటస్థులు, విద్యావంతులలో వారిపై ఏహ్య భావం ఏర్పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మంత్రులంతా జగన్ పరువు తీస్తున్నందు వల్లే, ప్రజల్లో తమ ప్రభుత్వం పలచన అవుతోందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

తిరుమల డిక్లరేషన్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు.. చివరకు జాతీయ స్థాయిలో దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు చివరకు.. ప్రధాని మోదీని సైతం అవమానించే స్థాయికి చేరడంతో, బీజేపీ నేతలు కూడా ఆందోళన నిర్వహించారు. తమ అధినేతకు రక్షణ కవచంలా నిలబడటంలో తప్పు లేదు. అయితే ఎదుటివారిని విమర్శించే సందర్భంలో, సంయమనం పాటించాల్సి ఉంది. తర్వాత  అమరావతి రైతులపై.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు చేసిన బూతు వ్యాఖ్యలు, మర్యాదస్తుల మనసులను గాయపరిచాయి. సభ్య సమాజంలో బతుకుతూ, ఉన్నత పదవిలో ఉన్న ఒక మంత్రి, రైతులనుద్దేశించి ఆవిధంగా బూతు మాటలు మాట్లాడటాన్ని, చివరకు వైసీపీ శ్రేణులే అంగీకరించకలేపోతున్నారు. రైతులను ఉద్దేశించి కృష్ణదాసు చేసిన వ్యాఖ్య, యావత్ రైతాంగాన్ని మానసికంగా గాయపరిచినట్టయింది. అది పార్టీపై కూడా ప్రభావం చూపేదేనంటున్నారు.

పైగా తాను చేసిన వ్యాఖ్యలను… యధాతథంగా రాసుకోవాలని మీడియాకు చెప్పడంపై, పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. సహజంగా అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఏ నాయకుడయినా, నాలిక్కరచుకుని నష్టనివారణకు దిగుతారు. తమ పీఏ లేదా పీఆర్‌ఓలతో మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి, దయచేసి అలాంటివి రాయవద్దని బ్రతిమిలాడతారు. ఆ వ్యాఖ్యలు ఒకవేళ దుమారం రేపితే, తాము తెలియక నోరుజారినందున, తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే  క్షమించాలని స్వయంగా వారే ప్రకటనలిస్తుంటారు. ఇది రాజకీయాల్లో చాలాకాలం నుంచీ వస్తున్న సంప్రదాయమే. తాజాగా విశాఖలో.. తన గోడ కూల్చిన వ్యవహారంలో నోరు జారినందుకు, మాజీ ఎంపీ సబ్బం హరి మీడియా ముఖంగా క్షమాపణ కోరారు. ఇలాంటి దిద్దుబాటుతో, నేతల హుందాతనం బయటపడుతుంటుంది.
కానీ ధర్మాన కృష్ణదాసు వ్యవహారం, దీనికి పూర్తి రివర్సులో ఉండటంపై సొంత పార్టీలోనే ఆగ్రహం, అభ్యంతరాలు వ్యక్తమవుతోంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో అయితే వైసీపీ శ్రేణులు, ధర్మాన కుటుంబాన్ని అభిమానించే ఇతర పార్టీ కార్యకర్తలు కూడా.. కృష్ణదాసు వాడిన, బూతు పదంపై తలపట్టుకుంటున్నారు. కృష్ణదాసు తన సోదరుడైన, ధర్మాన ప్రసాదరావు పరువు తీస్తున్నారన్న వ్యాఖ్యలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఎంతోమంది ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన, సీనియర్ నాయకుడయిన ధర్మాన ప్రసాదరావుకు మర్యాదస్తుడన్న పేరుంది. ఆయన అసెంబ్లీలో-బయట అనేక సార్లు విపక్షాలపై విమర్శలు, ఆరోపణాస్త్రాలు సంధిచేవారు. ఆ సందర్భంలో ఆయనెక్కడా నోరు జారిన సందర్భాలు లేవు.  అవి కూడా హుందాతనంగానే ఉంటాయి.

నిజానికి ప్రసాదరావు వాడే భాష చాలా సంస్కారవంతంగా, అచ్చ తెలుగులో ఉంటుంది. ఆయన తన ప్రసంగంలో, ఆంగ్ల భాష కూడా వినియోగించిన సందర్భాలు బహు అరుదు. కాంగ్రెస్ హయాంలో, ముఖ్యంగా వైఎస్ జమానాలో మంత్రులుగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి, కాసు కృష్ణారెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, డొక్కా మాణిక్యప్రసాదరావు వంటి నేతల భాష చాలా హుందాగా ఉండేది. వీరిలో ధర్మాన ప్రసాదరావు ప్రసంగం మళ్లీ వినాలన్నంత ఆసక్తిగా ఉంటుంది.

ఆ అంశంలో, రాజకీయ ప్రత్యర్ధులు సైతం గౌరవించేలా ఉండే ధర్మాన ప్రసాదరావుకు, ఆయన సోదరుడైన కృష్ణదాసుకు ఏ స్థాయిలోనూ పోలికలు లేవన్న వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దశాబ్దాల నుంచి ధర్మాన ప్రసాదరావు కాపాడుకుంటూ వస్తున్న పరువు, గౌరవాన్ని.. ఆయన సోదరుడు తన అసభ్యమైన భాషతో పోగొడుతున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. కొందరు మంత్రులు, ఎమ్పెల్యేలు వాడుతున్న బూతు భాష .. జగన్‌ను సీఎంగా చూడాలని ఓటు వేసిన తటస్థులు- విద్యావంతులను, పార్టీకి దూరం చేస్తోందన్న ఆందోళన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.