రమేష్ ఆసుపత్రి సరే..పద్మావతి ఆసుపత్రి సంగతేమిటి?

0
4

యాజమాన్య నిర్లక్ష్యంతో  మహిళా ఉద్యోగి మృతి
మరి కాంట్రాక్టరుపై చర్య తీసుకుంటారా?
ఆ ఆసుపత్రికి సీఎం చైర్మన్, మంత్రి, టీటీడీ చైర్మన్లే సభ్యులు
మరి వారిపైనా రమేష్ మాదిరిగానే  కేసులు పెడతారా?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

న్యాయం అందరికీ ఒకటే. చట్టం అందరికీ సమానమే. వాటిని పక్షపాతం లేకుండా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. మరి అలాంటి చట్టాలు-న్యాయాన్ని, అధికారులు పక్షపాతం లేకుండా అమలుచేస్తున్నారా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. కొద్ది నెలల క్రితం విజయవాడలో రమేష్ ఆసుపత్రి, కోవిద్ సెంటర్ కోసం ఒక హోటల్‌ను లీజుకు తీసుకుంది. ఆ హోటల్‌లో అగ్ని ప్రమాదం సంభవించి, రోగులు మృతి చెందారు. దానిపై ఆగమేఘాలపై స్పందించిన సర్కారు, దానిపై విచారణ  కమిటీ వేసింది. రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని నివేదిక ఇచ్చింది. దానితో  రమేష్‌ను అరెస్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దానిపై హైకోర్టుకు వెళిన రమేష్ , స్టే తెచ్చుకున్నారు. ఇది పాత కథే.

తాజాగా తిరుపతిలోని స్విమ్స్‌కు చెందిన పద్మావతి కోవిడ్ సెంటర్‌లో ఓ ప్రమాదం సంభవించింది. ఆ ఘటనలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిని మృతి చెందగా, ఇద్దరు కరోనా పేషెంట్లు గాయపడ్డారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఎవరిపై చర్యలు తీసుకుంటుంది? జరిగిన ఘటన ప్రభుత్వానికి చెందిన ఆసుపత్రిదే కాబట్టి.. అధికారులపై తీసుకుంటారా? లేక రమేష్ ఆసుపత్రి తరహాలోనే, దానికి చైర్మన్లు, డైరక్టర్లుగా ఉన్న పాలకులపై తీసుకుంటారా అన్నది ప్రశ్న.

తిరుపతి పద్మావతి కోవిడ్ సెంటర్‌లో, రెండో బ్లాక్‌లో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పైన పనులు జరుగుతున్నప్పుడు, కింద ఉండే వారి కోసం రక్షణ చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఆ మేరకు ఇనుప కంచెలాంటిది ఏర్పాటుచేయవలసి ఉంది. కానీ, అక్కడ అలాంటి జాగ్రత్తలు తీసుకున్న దాఖలాలే లేవు. ఒకవేళ అలాంటి చర్యలు తీసుకుంటే, ఓ గర్భిణి మృతి చెందేది కాదు. మరో ఇద్దరు గాయపడేవారు కాదు. స్విమ్స్ ఆసుపత్రి టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోంది. దానికి స్వయంగా ముఖ్యమంత్రి చైర్మన్ కాగా, టీటీడీ చైర్మన్, ఆరోగ్యశాఖ మంత్రి, టీటీడీ ఈవోలు డైరక్టర్లుగా వ్యవహరిస్తుంటారు. చనిపోయిన మహిళ మృతి అత్యంత విషాదకరం. రాధిక అనే కాంట్రాక్టు ఉద్యోగి 5 మాసాల గర్భిణి. ఇప్పటికే ఇద్దరు చిన్నారులు మృతి చెందటంతో, ఆమె మూడోసారి గర్భం దాల్చింది. భవన నిర్మాణంలో చూపిన నిర్లక్ష్యం వల్ల,  చివరకు ఇప్పుడు ఆమె మృతి చెందటం బాధాకరం.

టీడీపీ ప్రభుత్వ హయాంలోనే  సదరు బిల్డరుకు, భవన నిర్మాణ కాంట్రాక్టు లభించింది. కానీ ఒక సబ్ కాంట్రాక్టరుతో పనులు చేయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా జరిగిన ఘటనకు కాంట్రాక్టరూ బాధ్యుడే. కానీ, ఆసుపత్రికి చైర్మన్ ముఖ్యమంత్రిగా ఉండటం, అందులో మంత్రి, టీటీడీ చైర్మన్ పాటు ఉన్నతాధికారులు కూడా,  సభ్యులు కూడా కొనసాగుతున్నారు. కాబట్టి.. బెజవాడలో రమేష్ ఆసుపత్రి,  లీజుకు తీసుకున్న హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో తీసుకున్న చర్యలే,  తిరుపతి ఘటనలోనూ తీసుకోవలసి ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రుల విషయంలోనే అంత కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం.. మరి తన అధీనంలో ఉన్న ఆసుపత్రిలోనే ఘటన జరిగితే అంతకంటే వేగంగా-కఠినంగా వ్యవహరించాలి కదా? మరి న్యాయం-చట్టం  అందరికీ సమానమే కదా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here