‘గ్రేటర్’లో పార్టీని బాబు గాలికొదిలేశారా?

326

ఇప్పటివరకూ ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్షించని బాబు
రమణపై తమ్ముళ్ల తిరుగుబాటు
బాబు ఇంటివద్దనే తమ్ముళ్ల ధర్నా
          (మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

రాజకీయాల్లో హత్యలుండవు. అన్నీ ఆత్మహత్యలేనన్నది, తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మౌనం స్పష్టం చేస్తోంది. ఒకవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఇంకోవైపు దెబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక,  మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముంచుకొస్తున్నా… ఇప్పటిదాకా చంద్రబాబు సమీక్షించని వైనంపై, తెలంగాణ తమ్ముళ్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కరోనా సీజన్ మొదలయినప్పటి నుంచీ, హైదరాబాద్‌లోనే ఉంటున్న బాబు.. ఇప్పటివరకూ ఈ మూడు ఎన్నికలపై కనీస సమీక్ష నిర్వహించకపోవడంపై, పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అటు తెలంగాణ పార్టీ అధ్యక్షుడు రమణ నిర్లిప్తత కూడా తోడవడంతో, ఎటు పోవాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో తెలంగాణ తమ్ముళ్లు కనిపిస్తున్నారు. ప్రధానంగా..కేసుల కారణంతో,  కేసీఆర్‌తో బాబు యుద్ధం చేసే పరిస్థితి లేదన్న మానసిక భావన టీడీపీ నేతల్లో కనిపిస్తోంది.

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా మంచుకువస్తున్నాయి. తొలుత గ్య్రాడ్యుయేట్ ఎన్నికలు, ఆ తర్వాత గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు రానున్నాయి. అయితే, వీటిపై  దృష్టి సారించి స్థానిక నేతలతో సమీక్షించాల్సిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ చేతులెత్తేశారు. పోనీ.. కరోనా సీజన్ నుంచీ హైదరాబాద్‌లోనే ఉన్న, అధినేత చంద్రబాబు నాయడు ఏమైనా వీటిపై పార్టీ నేతలతో సమీక్షించారా, అంటే అదీ లేదు.

ప్పటికే అన్ని పార్టీలూ ఎన్నికల రంగంలోకి దిగాయి. చిన్నా చితకా పార్టీలు కూడా వ్యూహ రచనలో మునిగిపోయాయి. కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించాయి. అధికార టీఆర్‌ఎస్, హైదరాబాద్‌లో డివిజన్ల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహిస్తోంది. కానీ టీడీపీ మాత్రం ఇప్పటిదాకా గ్రేటర్ సహా, ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించలేదు. దానితో తమ పార్టీ అసలు బరిలో ఉందా? లేదా? అన్న సందిగ్ధం తమ్ముళ్లను వేధిస్తోంది.

నిజానికి గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో 25 డివిజన్లలో సెటిలర్ల ప్రభావం తీవ్రంగా ఉంది. మరో 19 డివిజన్లలో విజయంలో వారిదే కీలక పాత్ర. గత ఎన్నికల్లో టీడీపీకి ఒక్క స్థానమే వచ్చినా కాంగ్రెస్-బీజేపీని వెనక్కి నెట్టేసి అనేక డివిజన్లలో టీడీపీనే రెండో స్థానం సాధించిన విషయాన్ని తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు.  ఆ ప్రకారంగా గత గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ 4,39,047 ఓట్లతో 13.11 శాతం ఓట్లు సాధించింది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీనే రెండో స్థానంలో ఉంది. అయినా ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునే నాయకత్వం లేకుండా పోయిందన్నది తమ్ముళ్ల ఆవేదన.

స్వయంగా చంద్రబాబు నాయుడే, నగరంలో  కాడి కిందపడేశారన్న భావన వారిలో ఉంది. ఒకవేళ టీడీపీకి ఓటేసి గెలిపిస్తే, గెలిచిన కార్పొరేటర్లు తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరరన్న గ్యారంటీ లేదన్న భావన జనంలో ఉందంటున్నారు. అందుకే సెటిలర్లు ఉన్న డివిజన్లలో టీఆర్‌ఎస్‌ను గెలిపించారని విశ్లేషిస్తున్నారు.  అలాంటి అభిప్రాయం తొలగించేందుకు,  ఏ స్థాయిలోనూ ప్రయత్నం జరగడం లేదని చెబుతున్నారు.

నగరంలో పార్టీకి కొన్ని ప్రాంతాల్లో అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ, చంద్రబాబు గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల, పార్టీ మూల్యం చెల్లించుకోవలసి వస్తోందంటున్నారు. నిజానికి టీడీపీ నుంచి టీఆర్‌ఎస్-బీజేపీలో చేరిన నేతలకు, అక్కడ సరైన గౌరవం-గుర్తింపు లేదన్న భావన చాలాకాలం నుంచీ ఉంది. కేసీఆర్‌కు భయపడి.. బాబు ఆంధ్రాకు వెళ్లినందున, ఇక పార్టీలో ఉన్నా ఫలితం లేదన్న ముందుచూపుతోనే, వారంతా ఇతర పార్టీల్లో చేరుతున్నారు. అటు సెటిలర్లు కూడా అనివార్య పరిస్థితిలో టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నారని విశ్లేషిస్తున్నారు. ఆ భావనను తొలగించేందుకు, పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు చేసిన ప్రయత్నాలేవీ లేవంటున్నారు. అందుకు తగినట్లుగానే రమణ పనితీరు ఉండటం, ఆయనను మార్చాలని యావత్ పార్టీ యంత్రాంగం సంతకాలు చేసినా, బాబు స్పందించకపోవడం చూస్తే.. హైదరాబాద్ సహా, తెలంగాణలో చంద్రబాబు పార్టీని గాలికొదిలేశారన్న అభిప్రాయం కార్యకర్తల్లో స్థిరపడిపోయింది.

చివరకు దుబ్బాక ఉప ఎన్నికపైనా, బాబు ఇప్పటివరకూ దృష్టి సారించని వైనాన్ని పార్టీ నే తలు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్-బీజేపీలు దాదాపు అభ్యర్ధుల పేర్లు ప్రకటించేశాయి. కానీ త మ పార్టీ మాత్రం ఇప్పటి దాకా దానిపై దృష్టి సారించలేదంటున్నారు. తాజాగా.. అధ్యక్షుడు రమణ బీజేపీతో కుమ్మక్కయారంటూ, బాబు నివాసం వద్ద తమ్ముళ్లు ధర్నా చేయడం కలకలం సృష్టించింది. ఖమ్మంలో ఎమ్మెల్సీ పోటీ విషయంలో రమణ, బీజేపీతో కుమ్మక్కయ్యారని తమ్ముళ్లు ఆరోపించారు. తాము సూచించిన నేతకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఓ కార్పొరేటర్ అభ్యర్ధి.. బాబు నివాసం వద్ద, పార్టీ వైఖరిని తప్పుపడుతూ చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దుబ్బాకలో పార్టీ అధ్యక్షుడు రమణను పోటీ చేయించి, ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నన్నూరు నర్శిరెడ్డిని బరిలోకి దించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. నర్శిరెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బరిలోకి దించితే, ఉస్మానియా యూనివర్శిటీ నేపథ్యంతోపాటు, రెడ్డి సామాజికవర్గం కూడా కలసి వస్తుందని విశ్లేషిస్తున్నారు. అయితే, ఇప్పటి పరిస్థితిలో పార్టీ నాయకత్వం నయాపైసా ఇచ్చే పరిస్ధితి లేదంటున్నారు.  హైదరాబాద్-రంగారెడ్డి-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎన్నికలో, ఇతర పార్టీల నుంచి రెడ్లు ఎవరూ పోటీ చేయనందున, ఆ సమీకరణ టీడీపీకి పనికివస్తుందంటున్నారు. నర్శిరెడ్డిది ఉస్మానియా యూనివర్శిటీ నేపథ్యమే అయినందున, అది ఎన్నికల్లో అక్కరకొస్తుందని విశ్లేషిస్తున్నారు. కానీ స్థానికంగా ఎలాంటి పట్టు లేని రమణ, ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తుండంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

టీఆర్‌ఎస్‌పై చంద్రబాబు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుని, నగరంపై దృష్టి సారిస్తే ఇప్పటికీ సానుకూల వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల తీన్మార్ మల్లన్న, బ్యాలెట్‌పై నిర్వహించిన సర్వేలో తెరాసకు 50 శాతంపైగా రాగా, టీడీపీకి 25 శాతం వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి.. తమ అధినేత చంద్రబాబు నాయుడే, తెలంగాణలో పార్టీ కాడి కింద పడేశారన్న వాస్తవం అర్ధమవుతోందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.