‘కస్తూర్బా’ వద్దన్న ‘నయా గాంధీ’ జగన్!

506

కాలేజీకి తండ్రి పేరు పెట్టుకున్న భీమవరం వైసీపీ ఎమ్మెల్యే
దాతల భూమిపై రాజకీయ దాష్టీకం
గాంధీ జయంతి రోజునే కస్తూర్బా గాంధీ పేరు తొలగింపు
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ఉత్తి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాత్రమే కాదు. ‘మహాత్మాగాంధీ జగన్మోహన్‌రెడ్డి’ కూడా! అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన  మహాత్ముడు, మళ్లీ పులివెందులలో జగనన్న రూపంలో జన్మించారు. మంచిదే. ప్రపంచానికి  సహనం, శాంతి సిద్ధాంతాలను చాటి చెప్పిన అంతటి మహాత్ముడు, మన జగనన్న రూపంలో ఈ యుగంలో పుట్టడం, తెలుగువారి పూర్వజన్మ సుకృతమే. ఒక చెంప మీద కొడితే, మరో చెంప చూపమన్న ‘ప్రపంచ శాంతికపోతం’ తెలుగు గడ్డపై మళ్లీ జన్మించడం, ప్రపంచంలోని తెలుగువారందరికీ గర్వకారణమే. జగనన్నకు, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి గారిచ్చిన మహాత్ముడి బిరుదులో ‘అతి’శయోక్తి ఉందా.. లేదా అన్నది పక్కకు పెడితే..  ‘అసలు మహాత్ముడి’తో కలసి జీవనం సాగించిన కస్తూర్బా గాంధీ పేరు తొలగించి, అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే.. తన తండ్రి పేరు పెట్టుకోవడమే జాతిపితను,  క్షోభకు గురిచేసే వ్యవహారం. ఈ విషయాన్ని ‘తెలుగు జాతిపిత’ అయిన ‘మహాత్మా జగన్మోహన్‌రెడ్డి’ ఎందుకో విస్మరించారు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో.. కస్తూర్బా గాంధీ ప్రభుత్వ జూనియర్ కాలేజీని,  చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు అనే వదాన్యుడు ఏర్పాటుచేశారు. గోదావరి జిల్లాలకు ‘మూర్తిరాజు’గా పరిచితులయిన ఆ దానశీలి, తన 3 వేల ఎకరాల భూములను విద్యా సంస్థలకు దానం ఇచ్చారు. ఇప్పుడు గుడిలో ఒక ఫ్యాను ఇచ్చి, మూడు రెక్కలపై తమ కుటుంబ సభ్యుల పేర్లు రాసుకుంటున్నారు. కానీ, 3 వేల ఎకరాల భూములిచ్చిన మూర్తిరాజు గారు, ఏ ఒక్క సంస్థకూ తన పేరు పెట్టుకోకపోవడమే గొప్పతనం.

ఈ కాలేజీని దిరుసుమర్రి గ్రామానికి చెందిన  ఓ రైతు,  స్థలం విరాళంగా ఇచ్చారు. అయితే ఆయన వారసులు, తమ స్థలం తమకు ఇచ్చేయాలని కోర్టుకెళ్లి, విజయం సాధించారు. అప్పుడు ప్రస్తుత వైసీపీ ఎమ్మల్యే గ్రంధి శ్రీనివాస్ స్పందించి, బైపాస్ రోడ్డు వద్ద ఉన్న తన 30 సెంట్ల భూమిని, కాలేజీ భవన నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగా, ఆయన తండ్రి గ్రంధి వెంకటేశ్వరరావు పేరు కాలేజీ భవనానికి పెట్టారు. అప్పటివరకూ అది కస్తూర్బాగాంధీ కాలేజీగానే కొనసాగుతోంది. తాజాగా అధికార వైసీపీ ఎమ్మెల్యే అయిన గ్రంధి శ్రీనివాస్, ఏకంగా కాలేజీకి తన తండ్రి గ్రంధి వెంకటేశ్వరరావు పేరుతో, ఉత్తర్వునే తెచ్చుకున్నారు. అది కూడా గాంధీ జయంతి రోజున!

మహాత్ముడు మళ్లీ పుట్టాడని వైసీపీ అధికార పత్రిక ఓ వైపు, తన వ్యాసాల్లో ‘నయా గాంధీ జగనన్న’ను ఆకాశానికెత్తేస్తోంది. కానీ, అదే ‘నయా గాంధీ’ పాలనలో.. ‘ఒరిజినల్ గాంధీ’ సతీమణి పేరుతో ఉన్న కాలేజీ పేరును మార్చడం, మరి మన ‘నయాగాంధీ జగనన్న’కు తలవంపులే కదా? అసలు గాంధీని అవమానించినట్లే కదా? దీనిపై యుశ్రారైకా పార్టీ రెబెల్ ఎంపీ, రఘురామకృష్ణంరాజు కూడా స్పందించారు. ఆ కాలేజీకి తిరిగి కస్తూర్బాగాంధీ పేరు పెట్టాలని, కలియుగ మహాత్మా గాంధీ అయిన జగన్‌ను కోరారు. మహాత్ముడి పాలనలో ఇలాంటివి జరగడం మంచిది కాదన్నారు. మూర్తిరాజు గారు వేల ఎకరాలు విద్యా సంస్థలకు దానం చేసినా, ఎక్కడా తన పేరు పెట్టుకోలేదని గుర్తు చేశారు.