‘కమల’వనం.. కలుషితమవుతోందా?

468

ఇళ్ల నుంచి ఫైవ్‌స్టార్ హోటళ్ల వరకూ
పెరుగుతున్న అవినీతి, అనైతిక, పైరవీరాజ్
మారుతున్న బీజేపీ నేతల లైఫ్‌స్టైల్
                ( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

భారతీయ జనతా పార్టీ అంటే పులుకడిగిన ముత్యం. అంతా మేలిమి ముత్యాలే. బురద నుంచి వికసించిన పద్మం అది. గంగాజలం కంటే శుద్ధమైన ది. అందులో నీతి నిజాయితీ అనేది, మడిబట్ట అంత పవిత్రమైనది.  ఆ పార్టీలో అంతా సామాన్యులే. అత్యంత సాధారణ జీవనం గడిపే నేతలే.  నేతల ఇళ్లలోనే అగ్రనేతల భేటీలు, బస. బస్సు, రైళ్లలో ప్రయాణం. గోడమీద రాతలు చేతిలో రాసే స్వయంసేవకులు.  అవినీతి, అక్రమాలు, అనైతిక కార్యక్రమాలకు, పైరవీకారులకు అతీతమైన పార్టీ అది. గంగాజలమంత శుద్ధమయిన పార్టీకి, సిద్ధాంతమే మూలస్తంభం. దానికోసం ప్రాణాలర్పించిన నేతలు కోకొల్లలు. ఫిరాయింపులు-ఎమ్మెల్యేల కొనుగోళ్లు-క్యాంపు రాజకీయాలు- వెన్నుపోట్లు- పైరవీరాజ్ ఆ పార్టీకి నచ్చని, మెచ్చని విషయాలు.

అలాంటి పరిశుద్ధాత్మక పార్టీలో.. ఇప్పుడు అన్ని రకాల పైత్యాలూ, వికారాలు, విచిత్రాలూ  కనిపిస్తుండటమే వింత. తాజాగా కరీంనగర్‌లో భాజపా జిల్లా అధ్యక్షుడు సాగించిన రాసలీల.. కలుషితమవుతున్న కమలాన్ని వెక్కిరించినట్టయింది. ఎవరయినా దొరికితేనే దొంగ. లేకపోతే దొరలే. పార్టీలో మహిళా కార్యకర్తతో సాగించిన రొమాన్సు, అంతకుముందు ఆమెతోనే చేసుకున్న డబ్బుల సెటిల్‌మెంట్లు,  సోషల్‌మీడియాలో అందరూ దర్శించినవే. ఆ తర్వాతనే సదరు నేతను పార్టీ నుంచి వెలివేశారు. ఒకవేళ  ఆ శుభవార్త మీడియాలో రాకపోతే, సదరు జిల్లా అధ్యక్షుడు తన కార్యకలాపాలు విజయవంతంగా కొనసాగించేవారన్న మాట! ఈ ఘటన సైద్ధాంతిక నిబద్ధత-నైతిక విలువలు- మానవ జీవనమనే… పడికట్టు పదాల మడి కట్టుకున్న, భాజపా వలువలు ఊడదేసేవే.

ఇదొక్కేనా? గత కొన్నేళ్ల నుంచి హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న నామినేటెడ్ పోస్టుల దందా, పోలీసుస్టేషన్లకు చేరుతూనే ఉన్నాయి. ఇందులో స్వయంగా పార్టీ జాతీయ నాయకుడిపైనే ఫిర్యాదులందటం ఆశ్చర్యం. కేంద్రంలో నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తామని, పలువురు మహిళా నేతల నుంచి లక్షలు వసూలు చేస్తున్న ప్రబుద్ధుల వైనం, పత్రికల్లో దర్శనమిస్తూనే ఉంది. తెలుగు రాష్ట్రం నుంచి, జాతీయ స్థాయికి ఎదిగిన మరో మహా పురుషుడిపైనా, లెక్కలేనన్ని ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరంతా భారతీయతకు-భారతీయ జనతా పార్టీ ప్రవచించే నీతి-నిబద్ధత-నిరాడంబరత్వానికి ప్రతీకలే కాదు. నిలువెత్తు నిదర్శనాలు మరి!  ఇప్పుడు హైదరాబాద్‌కు ఎవరైనా కేంద్రమంత్రులొస్తే వారి చుట్టూ కనిపించేది పైరవీకారులే.

ఏపీలో టీడీపీ-బీజేపీ కలసి కాపురం చేసినప్పుడు, ఓ మంత్రి గారు- మరో నేత కలసి రాయలసీమ జిల్లాలో చేసిన, రియల్ ఎస్టేట్ వ్యాపారం అందరికీ తెలిసిందే. ఇక కార్పొరేషన్ ఎన్నికలు-అప్పట్లో జరిగిన అసెంబ్లీ టికెట్ల ఎంపిక యవ్వారం బహిరంగ రహస్యాలే. నియోజకవర్గ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగిన ఓ మహానేత ఆస్తులు, కుటుంబ వ్యాపారాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇతర రాష్ట్రాల్లో పవర్‌ప్రాజెక్టు వ్యాపారాలు చేస్తున్న వాళ్లకూ తక్కువేమీ లేదు. టీడీపీ సర్కారుతో మ్యాచ్‌ఫిక్సింగ్‌తో లాభపడిన నేతలు కొందయితే, ఇప్పుడు వైకాపా సర్కారుతో మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల లబ్ధి పొందుతున్న నేతలు మరికొందరు.

ఇక తెలంగాణలో కూడా,  ఇలాంటి తరహా నేతలకు కొదువ లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 5 సీట్ల కోసం, ఏకంగా అధికార పార్టీ ప్రతినిధితోనే తెరచాటు బంధం కొనసాగించిన కథ తెలిసిందే. ఇక ఎన్నికల్లో పార్టీ పంపిన నిధుల ఖర్చు, దానిపై జరిగిన చర్చ లాంటి రచ్చ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. అంటే పార్టీ సంస్కృతి ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందో, ఈ ఉదంతాలు చూసి చెప్పవచ్చన్నమాట.

ఒకప్పుడు కమలం పువ్వు పార్టీగా పేరున్న బీజేపీ.. నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించేది. అతి సామాన్యులు నేతలుగా ఉండేవారు. ఉదయమంతా పార్టీ పనిచేసి, సాయంత్రానికి ఇళ్లకు చేరేవారు. అప్పట్లో మీడియాకు భోజనాలు పెడితే గొప్ప. జాతీయ స్థాయి నేతలు వచ్చినా, వారికి స్థానిక నేతల ఇళ్లలోనే బస. సమావేశాలూ అక్కడే. పార్టీ ప్రచారం కూడా స్వయంసేవనే. నేతలే గోడలపై రంగులతో రాతలు రాసేవారు. కారున్న నేతలుంటే మహా గొప్ప. అంతా స్కూటరు- సైకిలిస్టులే. సరే ఇక ఏబీవీపీ సైనికుల శ్రమ సరేసరి.  ఎవరిపైనయినా ఆరోపణలు వస్తే ఆ నేతను వెంటనే తొలగించేవారు.

మిగిలిన పార్టీలతో పోటీ పడలేని స్థాయి-డబ్బు లేకపోయినా, సమాజంలో గౌరవం ఉన్న నేతకు, పిలిచి మరీ టికెట్లు ఇచ్చేవారు. వారి ప్రచారం కూడా నిరాడంబరంగానే కనిపించేది.  మొత్తంగా ప్రజలు.. భాజపా నాయకులను ఒక మర్యాదస్తుల మాదిరి గౌరవించేవారు. ఇవన్నీ వాజపేయి-అద్వానీ శకం నాటి తీపి జ్ఞాపికలు. ఒక్క ఓటుతో అధికారం నిలబెట్టుకునే అవకాశం ఉన్నా, నైతిక విలువలు అనుసరించి,  అధికారాన్నే త్యజించిన మహానాయకుడయిన వాజపేయి శ్వాసించిన పార్టీ అది.

ఇప్పుడు ఏ స్థాయి నాయకుడు వచ్చినా ఫైవ్‌స్టార్ హోటళ్లలోనే బస. నేతల ఇళ్లలో దిగి, వారితో భోజనాలు చేసే పిచ్చిరోజులు ఎప్పుడో పోయాయి. విమానాల్లోనే ప్రయాణం. రాత్రిళ్లు పార్టీలు రొటీన్ విషయమే. పార్టీ ప్రచారం అంతా కాంట్రాక్టే. పార్టీ ఫిరాయింపులు ఒక నిరంతర ప్రక్రియ. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, నెల్లూరు వంటి నగరాల్లో కొందరు బీజేపీ నేతల భవంతులు చూస్తే.. బీజేపీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగిందనేది స్పష్టచమవుతుంది.

ఇప్పుడు ఎన్నికల్లో  టికెట్లకూ ధర పలుకుతోంది. వారికి సమాజంలో విలువ ఉందా లేదా? అన్నది అనవసరం. కేసులున్నాయా? లేవా అన్నది అప్రస్తుతం. ఆ విషయంలో మిగిలిన పార్టీల దారిలోనే ప్రయాణం! ఇప్పుడు హీనపక్షం 15 లక్షల రూపాయల కారు లేని నాయకుడు భూతద్దం వేసి కనిపించరు. ఇక అగ్రనేతలయితే  కార్ల ఖరీదు చెప్పాల్సిన పనిలేదు. డబ్బులున్న ఆసాములు, పారిశ్రామికవేత్తలు,  ఎన్నికల్లో పెట్టుబడి పెట్టగల వ్యాపారులు, జైళ్లకు వెళ్లొచ్చిన మహానుభావులు, కబ్జా కేసుల్లో కూరుకుపోయిన వాళ్లకే ఇప్పుడు తమ పార్టీలో పెద్దపీట అన్నది కమలదళాల ఆవేదన.  ఇక అంబానీ, అదానీల సహవాసానికి కొదువ లేదు. నత్వానీల వంటి వాణిజ్య రాయబారులకు కరువే లేదు.

నరేంద్రమోదీ-అమిత్‌షా ద్వయం చేతికి,  పార్టీ పగ్గాలు వచ్చిన తర్వాత పార్టీ మూల సిద్ధాంతమే కాదు. అన్నీ  సమూలంగా మారిపోయాయి. అసలు పార్టీ స్వరూపమే మారింది. నిరాడంబరత్వం గాలికెగిరిపోయింది. ఇప్పుడు రాష్ట్రాల్లో పార్టీని నడిపించే సంఘటనా కార్యదర్శుల జీవన శైలి, రాజకీయ నిర్ణయాలపై లెక్కలేనన్ని ఆరోపణలు. వీటికి తెలుగు రాష్ట్రాలూ మినహాయింపు కాదు. గతంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓ సంఘటనా కార్యదర్శి వ్యక్తిగత జీవనశైలిపై బోలెడు ఆరోపణ లొచ్చిన విషయం బహిరంగ రహస్యమే.

నిశితంగా పరిశీలిస్తే.. కొన్ని అంశాల్లో తప్ప కాంగ్రెసుకూ, భాజపాకూ పెద్ద వ్యత్యాసమే కనిపించదు. కాంగ్రెస్ కొందరు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తే, భాజపా మరికొందరిని చేరదీసింది. కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాల్లో విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొడితే, అదే పని భాజపా కూడా చేస్తోంది. కాంగ్రెస్ కంటే భాజపానే ఎన్నికల్లో ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతోంది. భారతీయత, 370 ఆర్టికల్, త్రిపుల్ తలాక్, విదేశీ విరాళాలకు కళ్లెం, వామపక్షాలు కబ్జా చేసిన విద్యావిధానంలో సమూల ప్రక్షాళన వంటి కీలక అంశాల్లోనే ‘బీజేపీ జంట’ ఎక్కువ మందిని మెప్పించగలిగింది. ఇవి తప్ప కాంగ్రెస్ సంస్కృతే, ఇప్పుడు బీజేపీలోనూ కనిపిస్తోంది.