భూములు వెనక్కి ఇస్తానన్న చంద్రబాబు ఎందుకివ్వలేదు?

280

– కాకినాడ సెజ్ లో ఏరువాక చేసి, భూములు వెనక్కి ఇస్తానన్న చంద్రబాబు ఎందుకివ్వలేదు?
– కాకినాడ పోర్టును ప్రైవేటు సంస్థకు దీర్ఘకాలిక లీజుకు ఇచ్చింది చంద్రబాబు కాదా?
– రెండు సంస్థల మధ్య ఒప్పందం జరిగితే సీఎంకి ముడిపెట్టడం ఏమిటి?
– కాకినాడ నడిబొడ్డున ఉన్న గోదావరి ఫెర్టిలైజర్స్‌ను పప్పుబెల్లాలకు అమ్మేసింది ఎవరు?
– అసలేవీ ఒప్పందాలు లేకుండానే మచిలీపట్నం పోర్టుపై అవాస్తవాలు ప్రచారం చేస్తారా?
– టీడీపీకి సంబంధించిన వారే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలా..? మిగిలినవారు పెట్టుబడులే పెట్టకూడదా?
– రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకూడదా? టీడీపీ హయాంలో మాదిరిగా మేం గ్రాఫిక్స్‌ చూపించటం లేదు
– రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు 40 లక్షల ఉద్యోగాలని సమ్మిట్‌ల పేర్లతో కోట్లు ఖర్చు చేసి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు
– 1999-2004 మధ్య రాష్ట్రంలోనే 52 ప్రభుత్వరంగ సంస్థల్ని చంద్రబాబు అమ్మేశారు. ఇది వాస్తవం కాదా?
– టీడీపీ నేతలతో వ్యాపారాలు చేస్తే నిమ్మగడ్డ ప్రసాద్ మంచివారు… సాక్షిలో, ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెడితే శిక్షించాలా?
– టీడీపీ వాళ్లు చేస్తే నీతి. ఈ ప్రభుత్వం చేస్తే అవినీతా..? ఇదెక్కడి దిక్కుమాలిన తీరు బాబూ..?
– యనమల జ్ఞాపక శక్తి రోజురోజుకీ దిగజారిపోతోందా? గతంలో కాకినాడలో సెజ్‌లకు శ్రీకారం చుట్టింది యనమల కాదా?
– ఒక అబద్ధాన్ని రాయించి దానిపై మళ్లీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం టీడీపీ నేతలకే చెల్లింది.
-చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా కార్పొరేషన్లు, షుగర్‌ ఫ్యాక్టరీలు, ఆయిల్‌ ఫ్యాక్టరీలు అమ్మేశారు.. గతం మర్చిపోయారా?
– కాకినాడ ఎస్‌ఈజడ్‌ రైతులకు న్యాయం చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం కమిటీ వేసింది.
– రూ.1500 కోట్లు విలువ చేసే 500 ఎకరాలని భోగాపురంలో వెనక్కి తీసుకోవడం జీఎంఆర్‌కు అనుచిత లబ్ధి చేకూర్చడమా..?
– త్వరలో కస్టమర్‌ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నాం. శనగ విత్తనాల పంపిణీ వచ్చే సోమవారం నుంచి ప్రారంభం.

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ..

1. కాకినాడ సెజ్‌ను కొట్టేయాలని అనుకుంటున్నారని, దానిమీద కన్నేశారని ఇది ఇవాళ్టిది కాదని తండ్రీకొడులకు నుంచి మొదలైందని చాలా తీవ్రమైన విమర్శలు యనమల రామకృష్ణుడు చేయటంపై మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యనమల రామకృష్ణుడు చాలా పెద్దపెద్ద స్టేట్‌మెంట్స్‌ ఇస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు. టీడీపీ ఇంతకాలం తప్పులు చేసి మళ్లీ ఇప్పుడు ఎదుటివారి మీద వేలెత్తి చూపించటానికి సిగ్గుపడటం లేదని కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. మాట్లాడేముందు మనం ఏం చేశాం. జనం ఏం అనుకుంటారో అన్న ఆలోచన కూడా టీడీపీ నేతలకు లేదన్నారు. అలాంటి ఆలోచన ఉంటే టీడీపీ సిగ్గుతో చితికిపోవాలి. ఒక అబద్ధాన్ని గోబెల్స్‌లాగా పదేపదే ప్రచారం చేసి ఏదో విధంగా ప్రజల్లోకి అబద్ధాలను నిజం చేయాలని ప్రయత్నిస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు.

2. అసలు కాకినాడలో సెజ్‌లకు కారం చుట్టింది యనమల కాదా అని కన్నబాబు సూటిగా ప్రశ్నించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్లి పారిశ్రామిక అభివృద్ధి జరగాలని ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఏదో జరిగిపోతోందని గగ్గోలు చేసి రాజకీయంగా వాడుకోవాలని చూసింది టీడీపీనే అని కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాకినాడ సెజ్‌ భూముల్లో ఏరువాక చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి ఇస్తామన్న చంద్రబాబు ఎందుకు ఆ విషయాన్ని మర్చిపోయారని కన్నబాబు ప్రశ్నించారు. మీరు ఏమైనా ఆ సంస్థలతో లాలూచీ పడ్డారా అని కన్నబాబు ప్రశ్నించారు. ఏరువాకకు వచ్చినప్పుడు ఇచ్చిన మాటల్ని చంద్రబాబు ఏమైనా మర్చిపోయారా? అని కన్నబాబు మండిపడ్డారు.

3. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి తప్ప ఏదో భ్రమలు కల్పించి కాలం గడపకూడదని సీఎం  వైయస్‌ జగన్ స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తుంటే టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై కన్నబాబు నిప్పులు చెరిగారు. కాకినాడ సెజ్‌ను అరబిందో సంస్థ టేకోవర్‌ చేసిందనే వార్తలు రాగానే అదేదో చాలా తప్పైనట్లుగా, అదేదో  జగన్ కి లబ్ది చేకూరే నిర్ణయంగా, దానికి సీఎం  జగనే బినామీ అన్నట్లుగా యనమల మాట్లాడటంపై కన్నబాబు ఆగ్రహం వ్యక్తం శారు. మరి, అలాంటప్పుడు హెరిటేజ్‌ను ప్యూచర్ గ్రూప్‌కు అమ్మి నానా రకాలైన లావాదేవీలు నడిపారని బయట చెప్పుకుంటున్నారు. అది మాట్లాడితే టీడీపీ నేతలకు కోపం వచ్చి పరువు నష్టం దావాలు వేస్తారు. రెండు ప్రైవేటు సంస్థల మధ్య జరిగిన లావాదేవీల్లోకి సీఎంని లాగి బురద చల్లే కార్యక్రమం టీడీపీ నేతలు చేయటంపై కన్నబాబు మండిపడ్డారు.

4. భోగాపురం ఎయిర్‌పోర్టులో 500 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కమర్షియల్‌ లొకేషన్‌ నుంచి 500 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుందని కన్నబాబు తెలిపారు. ఆ లెక్కన ఎకరం రూ.2 నుంచి 3 కోట్లు అయితే రూ.1500 కోట్ల విలువైన ఆస్తిని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లని కన్నబాబు వివరించారు. తద్వారా రాష్ట్రానికి మేలు జరిగిందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ఇవ్వటానికే ఒత్తిడి చేసి ఈ సెజ్‌ ఇచ్చినట్లు పత్రికల్లో రాసుకుంటారు. మళ్లీ తెల్లవారి ప్రెస్‌మీట్లు పెట్టి ఒక అబద్దాన్ని నిజమని చెప్పే ప్రయత్నం టీడీపీ నేతలు చేస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు.

5. పారిశ్రామికవేత్తలను కేవలం పారిశ్రామికవేత్తలుగా చూసే వ్యక్తిత్వం  వైయస్‌ జగన్ దని కన్నబాబు తెలిపారు. మ్యాట్రిక్స్ ప్రసాద్ టీడీపీ నేతలతో వ్యాపార సంబంధాలు నడిపితే మంచి వ్యాపారవేత్త. అదే సాక్షిలో, మిగిలిన సంస్థల్లో వాటాలు ఉంటే ఆయన తప్పులు చేసే పారిశ్రామిక వేత్త. ఆయన్ను శిక్షించాలన్నట్లుగా టీడీపీ వారు మాట్లాడతారని కన్నబాబు అన్నారు. పారిశ్రామికవేత్తల్లోనూ రెండు వర్గాల్లో ఉంటాయి. టీడీపీని ప్రేమించేవారు.. టీడీపీ ప్రేమించేవారు. ఇతర పారిశ్రామికవేత్తల్ని ఎదగకుండా చూస్తారు. హెటిరో, అరబిందో మార్కెట్‌లో భూములు కొనుగోలు చేసి ఏదైన సంస్థలు ఏర్పాటు చేయాలనుకుంటే అదేదో మహా తప్పులాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.

6. కాకినాడ ఎస్‌ఈజడ్ మీ(యనమల రామకృష్ణుడు-తుని) నియోజకవర్గ పరిధిలోనే ఉంది కదా. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు భూములు వెనక్కి తీసుకొని రైతులకు ఇస్తామంటే ఎవరు వద్దన్నారని, మరి ఎందుకు ఇవ్వలేదని కన్నబాబు ప్రశ్నించారు. సీఎం  వైయస్‌ జగన్  పాదయాత్ర చేస్తున్న సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో రైతులు వచ్చి మొరపెట్టుకున్నారని.. దీనిపై ఒక కమిటీ వేసి తప్పకుండా పరిష్కరిస్తానని చెప్పారని కన్నబాబు తెలిపారు. సెజ్‌లపై వేసిన కమిటీలో నన్ను ఒక సభ్యుడిగా పెట్టారని కన్నబాబు తెలిపారు. ఇప్పటికే పలు దఫాలుగా రైతులతో చర్చించాం. ఏ విధంగా సెజ్‌ రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే టీడీపీ ఏమో వేరే పార్టీల (రెండు కంపెనీల) మధ్య జరిగిన వ్యాపారలావాదేవీల వల్ల ఎవరికైనా మేలు జరిగిపోతేందోమో అని టీడీపీ నేతలు కంగారు పడిపోతున్నారని కన్నబాబు అన్నారు. టీడీపీ ఏమో హెరిటేజ్ వాటాలు అమ్మేస్తే తప్పులేదంట. జీఎంఆర్ కంపెనీ వాటాలు అమ్మితే చాలా తప్పు అన్నట్లుగా మాట్లాడటంపై కన్నబాబు మండిపడ్డారు.

7. పెద్ద పెద్ద కాలుష్య పరిశ్రమలు సెజ్‌లోకి రావటానికి వీల్లేదని … యనమల రామకృష్ణుడు అంటున్నారు. పైగా ఈ ప్రాంతంలో బల్క్‌ డ్రగ్స్ పరిశ్రమలు పెడితే హేచరీలు కాలుష్య కోరల్లో చిక్కుకుపోతాయని, కోనసీమ అంతా కాలుష్యమయం అయిపోతుందని బడుగుబలహీన వర్గాలు ఉపాధి కోల్పోతారని యనమల చెబుతున్నారు. దీన్ని స్థానిక టీడీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని యనమల అనటం ఏంటని అసలు ఆయనకు మరచిపోయే శక్తి భగవంతుడు ఇచ్చారా? స్టేట్‌మెంట్‌ ఇచ్చేముందు ఏమైనా ఆలోచిస్తున్నారా అని కన్నబాబు మండిపడ్డారు. కొద్దిరోజుల క్రితమే దివీస్ అనే సంస్థను తీసుకొచ్చి ఇదే హేచరీస్ ప్రాంతంలో 600 ఎకరాలు కేటాయించి బల్క్‌ డ్రగ్స్‌ పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నిస్తే అక్కడ మత్స్యకారులపై కేసులు పెట్టించలేదా? ఊర్లపై పడి కొట్టించలేదా? హేచరీలు నాశనమైపోతాయ్‌ ఇదంతా బ్రీడింగ్ ఏరియా అని హేచరీ యజమానులు గగ్గోలు పెడితే వారిని బెదిరించిన మాట వాస్తవం కాదా అని కన్నబాబు గుర్తు చేశారు. దివీస్ పరిశ్రమ అక్కడ వచ్చింది బల్క్‌ డ్రగ్స్‌ కంపెనీ పెట్టడానికే కానీ చెట్లను పెంచడానికి కాదు కదా అని కన్నబాబు అన్నారు. ఇప్పుడేమో బల్క్‌ డ్రగ్స్‌ కంపెనీ పెట్టడానికి లేదు.. మీరు చేస్తే నీతి.. ఈ ప్రభుత్వం చేస్తే అవినీతా..?. మీరు చేస్తే ఒప్పు. ఈ ప్రభుత్వం చేస్తే తప్పు అన్నట్టుగా ఉంది టీడీపీ వ్యవహారం.

8. టీడీపీ హయాంలో న్యాయం చేయండని రైతులు అడిగితే ఎన్నెన్ని రోజులు జైల్లో తోశారు. నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి నెలలు పాటు జైల్లో పెట్టలేదా? ఆరోజు తుని నియోజకవర్గానికి యనమల సోదరుడే కదా ఇంఛార్జిగా ఉన్నదని కన్నబాబు గుర్తు చేశారు. అయ్యా ఏంటీ ఈ కేసులు అంటే ఊర్లకు ఊర్లలో జనాలను కొట్టి పోలీసు వ్యాన్‌లు ఎక్కించి దౌర్జన్యం చేశారని మంత్రి కన్నబాబు గుర్తు చేశారు. ఆరోజున స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, నేను గ్రామాల్లో పర్యటించానని కన్నబాబు గుర్తు చేశారు. జీఎంఆర్‌ వాటాలు వేరే కంపెనీకి అమ్ముకుంటే దాన్ని తీసుకొచ్చి సీఎం  వైయస్ జగన్ కి ముడివేయటం ఏంటని కన్నబాబు మండిపడ్డారు.

9. రాష్ట్రంలోకి పరిశ్రమలు రాకూడదా? టీడీపీలాగా అబద్ధాలు చెప్పి.. ఏరుదాటేయాలా అని కన్నబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు 40 లక్షల ఉద్యోగాలు.. అంటూ సమ్మిట్‌ల మీద సమ్మిట్‌లు పెట్టారు. విశాఖపట్నంలో ఈ సమ్మిట్‌ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఎవరో ఒకడిని తేవటం ఎంఓయులు జరిగాయనటం, పెద్దపెద్ద పతాక శీర్షికలు రాయించటం.. జనాల్ని ఇది నిజమని నమ్మించటం వంటివి చేశారు. ఇప్పుడు నిజమైన పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంటే ఇదేం గొడవని కన్నబాబు ప్రశ్నించారు. పైగా ఇవన్నీ తీసుకొచ్చి సీఎం  వైయస్‌ జగన్ కి ముడివేయాలనుకోవటం ఏంటని టీడీపీపై కన్నబాబు నిలదీశారు. పైగా పారిశ్రామికవేత్తలు ఎవ్వరూ రాష్ట్రంలో రాకూడదు అన్నట్టుగా టీడీపీ వ్యవహరిస్తుంది. అసలు ఎలాంటి ఒప్పందాలు లేకుండా మచిలీపట్నం పోర్టు గురించి టీడీపీ నేతలు మాట్లాడటం ఏంటని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

10. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలు మీకు అవకాశం ఇస్తే.. మీరు ఏమీ చేయలేదని చంద్రబాబుపై కన్నబాబు మండిపడ్డారు. ఆనాడు మచిలీపట్నం, భావనపాడు పోర్టు కడతామంటే ఎవరైనా అడ్డుకున్నారా? ఎందుకు కట్టలేకపోయారని కన్నబాబు ప్రశ్నించారు. ఇప్పటికీ అమరావతిలో ఒక బిల్డింగ్‌ కట్టలేకపోయారు. ఇంత సీనియార్టీ ఉన్న యనమల రామకృష్ణుడు మాట్లాడే మాటలు విని ప్రజలు ఏమి అనుకుంటారో ఆలోచన కూడా లేకుండా పోయిందని కన్నబాబు ఎద్దేవా చేశారు. కోట్లు విలువైన భూములు కాస్త  జగన్  పాలవుతున్నాయనటం ఏంటని, తీరప్రాంతం అంతా కబ్జా చేస్తున్నారని పిచ్చిపిచ్చి పేపర్ స్టేట్‌మెంట్లు ఇవ్వటం సరికాదని కన్నబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలు భ్రమల నుంచి బయటకు రావాలని కన్నబాబు హితవు పలికారు.

11. టీడీపీ వర్గ పారిశ్రామికవేత్తల కోసం ఎన్నెన్ని విన్యాసాలు చేశారో.. ఏ పార్టీల్లో వారిని చేర్చారో ప్రజలకు తెలుసని బ్యాంకులను దోచుకున్నవారిని, ప్రజలకు శఠగోపురం పెట్టిన వారిని చంద్రబాబు భుజాల మీద ఎత్తుకొని తిరుగుతారు. ఆనాడు కీలకంగా వ్యవహరించిన పరిస్థితి ఏమైందో ప్రజలకు తెలుసని కన్నబాబు మండిపడ్డారు. ఏదో తప్పులు చేసినట్లుగా వ్యంగ్యం వెటకారం చేయటం సరికాదని రాజకీయాల్లోనూ ఎంతోకొంత హేతుబద్దత ఉండాలని కన్నబాబు అన్నారు.

12. కాకినాడ సెజ్‌ రైతులకు న్యాయం చేస్తానని సీఎం  వైయస్ జగన్  హామీ ఇచ్చారని కన్నబాబు తెలిపారు. అక్కడ పరిశ్రమలు వద్దు అని టీడీపీ నేతలు అంటున్నారు. మరి, ఆ భూముల్ని బీడు భూములుగా వదిలేయాలా? టీడీపీ నేతలేమో కుటుంబాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, ఇప్పుడు వచ్చి నీతి కబుర్లు చెప్పటం ఏంటి? గత ఐదేళ్లలో మీరు భూముల్ని వెనక్కి ఇస్తామంటే ఎవరు వద్దన్నారు. మచిలీపట్నం పోర్టు కడతామంటే ఎవరు వద్దన్నారని కన్నబాబు నిలదీశారు.

13. అమరావతి భూములు ఇచ్చిన రైతులు కూడా చంద్రబాబు మాటను నమ్మి ఉద్యమం చేస్తున్నారు. ఆరోజున ప్లాటింగ్ చేసిన భూములు ఇస్తామంటే అడ్డుకున్నది ఎవరు? మీదగ్గర ఇంత భూమి తీసుకున్నాం. మీకు ఇంత భూమి వస్తుందని చెప్పి చంద్రబాబు ఎందుకు ఇవ్వలేకపోయారని కన్నబాబు నిలదీశారు. చంద్రబాబు చరిత్ర తీస్తే ఎప్పుడైనా సరే… ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మిన చరిత్ర, కార్పొరేషన్లు మూసేసిన చరిత్రే. 1999-2004 మధ్య దేశవ్యాప్తంగా 82 సంస్థలు కేంద్ర ప్రభుత్వం అమ్మివేస్తే ఒక్క మన రాష్ట్రంలోనే 52 సంస్థల్ని చంద్రబాబు అమ్మేశారు. ఆల్విన్, గోదావరి ఫెర్టిలైజర్స్, నిజాం షుగర్స్‌, పాలేరు షుగర్స్‌, ఆయిల్‌ మిల్స్‌, రిఫైనరీలు ఉన్నాయ్‌. దొరికినవి దొరికినట్లుగా షుగర్‌ ఫ్యాక్టరీలను పప్పు బెల్లాలుగా చంద్రబాబు అమ్మేశారు. ఇదీ చంద్రబాబుకు ఉన్న చరిత్రని కన్నబాబు నిలదీశారు.

14. ఈ రోజు రాష్ట్రంలో ఒక్క కార్పొరేషన్ మూసేయకూడదు. ఒక్క ఉద్యోగినీ తొలగించకూడదని సీఎం  వైయస్‌ జగన్ ఆదేశించారు. షుగర్‌ ఫ్యాక్టరీలను ఎలా పునరుద్ధరించాలని సీఎం తో మీటింగ్ కూడా జరిగిందని కన్నబాబు తెలిపారు. ఈ అంశంలో మూడు నాలుగు దఫాలుగా మీటింగ్‌లు జరిగాయన్నారు. సీఎం  వైయస్‌ జగన్  ఆదేశంతో చెరుకు రైతులకు రూ.50 కోట్ల బకాయిలు కూడా చెల్లించటం జరిగిందన్నారు. కాకినాడ నడిబొడ్డున ఉన్న గోదావరి ఫెర్టిలైజర్స్ లాంటి ఫ్యాక్టరీని ఎవరైనా అమ్మేస్తారా? ఇలా తవ్వితే టీడీపీ హయాంలో జరిగిన బోలెడు శకలాలు బయటపడ్తాయ్‌ అని కన్నబాబు హెచ్చరించారు. ఏడీబీ రుణం తీసుకొచ్చి కాకినాడ పోర్టులను ప్రైవేటు వారికి లాంగ్‌ లీజ్‌కు చంద్రబాబు ఇచ్చారు. ఒక్కసారి యనమల రామకృష్ణుడు గతం నెమరేసుకుంటే మంచిదన్నారు. సీఎం  వైయస్ జగన్  మీద ఆక్రోశం వెళ్ళగక్కటం టీడీపీ నేతలు మానేయండన్నారు. ముందు టీడీపీని ఎలా నడుపుకోవాలో ఆలోచిస్తే మంచిదని కన్నబాబు హితవు పలికారు.

15. పైగా ఐదేళ్లలో టీడీపీ చేసిన అప్పుల్ని ఒక్క ఏడాదిలో ప్రభుత్వం చేసిందని యనమల రామకృష్ణుడు అనటంపై కన్నబాబు మండిపడ్డారు. టీడీపీ షోకులకు, గ్రాఫిక్స్‌, శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాల కోసం అప్పులు చేశారు. మీరు పెట్టిన బకాయిలు తీర్చటానికి ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. గతాన్ని మర్చిపోవద్దని కన్నబాబు గుర్తు చేశారు. జీఎంఆర్, అరబిందో సంస్థల మధ్య జరిగిన ఒప్పందాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వానికి, పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయటం ప్రభుత్వ విధుల్లో ప్రధానమైనదని కన్నబాబు సూచించారు. టీడీపీ నాయకులు బఢా వ్యాపారస్తులతో కలిసి వ్యాపారాలు చేస్తూ, పరిశ్రమల్లో వాటాలు తీసుకుంటూ.. బయటకు వచ్చి ఏదో జరుగుతోందని నంగనాచి కబుర్లు చెప్పడం మంచిపద్ధతి కాదని కన్నబాబు స్పష్టం చేశారు.

-మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..

– అపెక్స్ కమిటీ భేటీపై మీడియా వేసిన ప్రశ్నకు కన్నబాబు సమాధానం ఇస్తూ.. ఏ రాష్ట్ర అధిపతి అయినా, నాయకులు అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడతారు. అంతేకానీ కొన్ని ఇష్యూలను పెడచెవిన పెట్టేలా మాట్లాడటం సరికాదని దీనిపై ఇరిగేషన్ మినిస్టర్‌ ని అడిగి తెల్సుకోవాలని సూచించారు.

– త్వరలో రాష్ట్రంలో కస్టమర్‌ హైరింగ్ సెంటర్లు తీసుకువస్తున్నాము. ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో కస్టమర్‌ హైరింగ్ సెంటర్ వస్తుందన్నారు. ఆర్బీకే హబ్‌లు మెగా సీహెచ్‌సీలు వస్తున్నాయన్నారు. ఈ మెగా సీహెచ్‌సీలో కోటి 30 లక్షల విలువైన యంత్రపరికరాలను అందుబాటులో పెడతామని కన్నబాబు తెలిపారు. రైతు గ్రూపుల్ని ఇందులో ఇన్వాల్వ్‌ చేస్తున్నామన్నారు. రైతు గ్రూపు ఎవరైతే సీహెచ్‌సీ ఏర్పాటు చేస్తారో వారు ఆ యంత్రపరికరాలు వాడుకోవటంతో పాటు అద్దెలకు ఇచ్చుకోవచ్చని కన్నబాబు తెలిపారు. పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో యంత్రీకరణ చేస్తామన్నారు.

– శనగ విత్తనాల పంపిణీ వచ్చే సోమవారం నుంచి ప్రారంభం అవుతుందని కన్నబాబు అన్నారు. 30% సబ్సిడీ ఇస్తామని.. ఇంచుమించు 3-4 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతుందని అంచనా వేశామన్నారు