అధికారుల సంఘానికి ఆత్మగౌరవం లేదా?

134

ఐఏఎస్‌లకూ తప్పని వేధింపులు
నాడు రమామణి నేడు రమణమూర్తి
బాసులు అగ్రకులాలయితేనే  స్పందిస్తారా?
వారే బాధితులయితే పట్టించుకోరా?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అధికారుల సంఘాలు ఉన్నాయా? దుప్పటి ముసుగేసుకుని పడుకున్నాయా? లేక పాలకులిచ్చే పోస్టింగులకు ఆశపడి భయపడుతున్నాయా? నోరుతెరిస్తే ఎక్కడ శంకరగిరిమాన్యాలు పట్టిస్తుందేమోనని నిలువునా వణికిపోతున్నాయా? అదీ కాకపోతే మనకెందుకులేనని, నోరులేని జీవులవుతున్నాయా? అందుకేనా… తమ సహచరులపై బాసులు దాష్టీకం చేస్తున్నా నోరుమెదపడం లేదు? అందుకేనా.. ఎంతమంది సహచరులు చనిపోతున్నా ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించలేకపోతున్నాయా? అవును… అప్పుడు ఐఏఎస్ అధికారిణి రమామణి. ఇప్పుడు ఐఎఫ్‌ఎస్ అధికారి రమణమూర్తి. ఇక రేపెవరు? తమ సహచరులు ఒక్కొక్కరే బాసుల దాష్టీకానికి బలవుతున్నా, ఈ సంఘాల నేతలు ఏ కలుగులో దాక్కొన్నారు? పెదవి విప్పి ప్రశ్నించేందుకు ఎందుకు వణికిపోతున్నారు? సర్కారు స్పందనలో ఎందుకీ పక్షపాతం? అగ్రకులాల అధికారులు బాధితులయితే, పాలకులు స్పందించరా? అగ్రకులాలు బాసులుగా ఉన్నప్పుడు జరిగే ఘటనలకే స్పందిస్తారా? ఎందుకీ రెండకళ్ల సిద్ధాంతం?.. ఎందుకీ పక్షపాతం?.. ఇదీ ఇప్పుడు ఏపీలో ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల అంతర్మథనం.

న్యాయం అందరికీ ఒక్కటే. దానికి కులం లేదు. మతం లేదు. చట్టంలో ఉన్న దీనిని నిజమని నమ్మితే చివరకు మిగిలేది అవమానం, వేధింపులే! కులం ఉంటేనే న్యాయం. బాసు స్థానంలో ఉండే కులాన్ని బట్టి న్యాయం చేస్తున్న తీరు. అగ్రకులానికి చెందిన వారు బాసులయితే జరిగే న్యాయం వేరు. బాధితుడే అగ్రకులానికి చెందిన వారయితే జరిగే న్యాయం వేరు! ఏపీలో గత 15 నెలల నుంచి నిర్నిరోధంగా అమలవుతోన్న సర్కారీ న్యాయసూత్రం ఇదే!  ఏపీలో ఇప్పుడు ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్‌లకే రక్షణ లేదు. ఐదేళ్లు పాలించే రాజకీయ పార్టీల దయాధర్మంపై ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్‌లు ఆధారపడాల్సిన దుస్థితి.

ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి పోస్టింగంటే  అధికారులు ఎగిరి గంతేసేవారు. ఓ అయిదు- పదేళ్లయినా డిప్యుటేషన్లపై వచ్చేందుకు ఆసక్తి చూపేవారు. అంత క్రేజు-మోజు ఉన్న ఈ పరిస్థితి, ఇప్పుడు రివర్సయిపోయింది. ఇక్కడెందుకు ఉద్యోగం చేస్నున్నామా అని, బిక్కుబిక్కుమని పనిచేయాల్సిన దుస్థితి. బాసుల దాష్టీకం, అవమాన పర్వానికి తాళలేక.. తమ ఈతిబాధలు చెప్పుకున్నా, వినే దిక్కులేక.. మనోవ్యథతో ఒత్తిళ్ల పాలయి, చివరకు చనిపోతున్న దయనీయ పరిస్థితి. కొద్ది నెలల క్రితం ఐఏఎస్ అధికారిణి రమామణి. ఇప్పుడు ఐఎఫ్‌ఎస్ అధికారి రమణమూర్తి. పేర్లు ఏమయితేనేం? హోదా ఏదయితేనేం? వారంతా బాధాసర్పదస్టులు. అగ్ర కులం కావడమే  ఏకైక శాపం! అందుకే తమ మరణశాసనాన్ని తామే  లిఖించుకుంటున్నారు.

డాక్టర్ వాడ్రేవు భాస్కర రమణమూర్తి. ఐఎఫ్‌ఎస్ అధికారి. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ స్థాయి అధికారి. అంటే పోలీసు భాషలో డీజీపీతో సమానం.  నిజాయితీకి మారు పేరు. వీటికి మించి సున్నిత మనస్కుడు. ఇప్పుడు అదే ఆయన ప్రాణం తీసింది. సీనియారిటీకి తగిన పోస్టింగు దొరక్క, చాలా కాలం లూప్‌లైన్‌లో మగ్గిన అధికారి. తాను పీసీసీఎఫ్ క్యాడర్ అధికారి అయినప్పటికీ, తనకు రెండు స్థాయిలు తగ్గి ఉన్న హోదా ఇచ్చినా, ఇదేం అన్యాయమని ప్రశ్నించకుండా  తన పని తాను చేసుకున్న మౌని. అయినా ఓ ఉన్నత స్థాయి అధికారి, వరస వెంట వరస కొనసాగిస్తున్న అవమానాన్ని తనలోనే దిగమింగుకున్నారు.

పీసీసీఎఫ్ క్యాడర్ అధికారినయిన తనను కీలకమైన సమావేశాలకు పిలవకపోగా,  చాంతాండంత మెమోలతో వేధిస్తున్న వైనానికి కుమిలిపోయిన రమణమూర్తి సెలవు పెట్టారు. సెలవు ముగిసి, తిరిగి విధుల్లోకి చేరాల్సి ఉన్నప్పటికీ..ఆయనను సదరు ఉన్నతాధికారి వేధింపు ఆలోచనలే వెంటాడాయి. ఫలితం ఆత్మహత్య. అలా..  నిజాయితీపరుడైన ఓ అధికారి జీవితం అర్ధంతరంగా రాలిపోయింది. కాదు. రాల్చేశారు.

ఓ ఉన్నతాధికారికి-ఆయనకు సరిపడటం లేదని ప్రభుత్వానికి తెలుసు. అయినా, ఎవరూ పట్టించుకోలేదు. ఓ ఉన్నతాధికారి.. చనిపోయిన రమణమూర్తినే కాదు. మరో ఇద్దరు అదే స్థాయి అధికారులనూ వేధిస్తూనే ఉన్నా, సదరు శాఖ మంత్రికీ పట్టదు. ఆయనసలు ఆ శాఖనే పట్టించుకోరు. ప్రతి ఏడాది ఇచ్చే సీఆర్‌పై సంతకం చేసేది సదరు ఉన్నతాధికారే. అంటే కింద స్థాయి అధికారి పిలక, ఆయన చేతిలోనే ఉన్నట్లు లెక్క. పైగా.. పీసీసీఎఫ్ స్థాయి అధికారులెవరూ, నేరుగా తమ సమస్యలు సర్కారుకు నివేదించే  అధికారం లేదు. ఏమైనా ఉంటే బాసుకు ఇచ్చుకోవాల్సిందే. అంటే సదరు బాసుపై ఆయనకే ఫిర్యాదు చేయాలన్న మాట. ఇదీ అటవీ శాఖలో ఓ వైచిత్రి.

నిజానికి రమణమూర్తి సహా, ఆ శాఖలో పనిచేసే ఇద్దరు అధికారులకు ఇప్పుడు చేయడానికి పెద్ద పనేమీ లేదు. వీరంతా డీజీపీ స్థాయి అధికారులే. ఇప్పుడున్న ఓ అధికారికి 8 నెలల తర్వాత గానీ పోస్టింగు రాలేదు. కానీ ఇప్పుడు పనిచేస్తున్న ఓ అధికారి, తన హోదా కంటే నాలుగు స్థాయుల కింద హోదాలో పనిచేస్తున్నారు. అంటే ఒక డీఎఫ్‌ఒ స్థాయిలో అన్నమాట. నిజానికి, పీసీసీఎఫ్ స్థాయి అధికారికి.. పై స్థాయి అధికారులతో హోదా విషయంలో విబేధాలు రాకుండా, ఒకరికి సెక్రటేరియేట్‌లో కార్యదర్శి, మరొకరికి కార్పొరేషన్ ఎండీ పదవులిస్తుంటారు. అవన్నీ స్వతంత్రంగా పనిచేసే హోదా ఉన్న విభాగాలు కావడంతో, ఇప్పటిదాకా ఏ స్థాయిలోనూ మనస్పర్ధలు వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఓ ఉన్నతాధికారి.. కింది స్థాయి అధికారులను వేధిస్తున్న తీరు వల్ల,పీసీసీఎఫ్ స్థాయి అధికారి ఆత్మహత్య చేసుకోవలసిన దయనీయం నెలకొంది. వీటిని పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇవేమీ పట్టవు.

అయితే ఇక్కడ ఓ ఉన్నతాధికారి వేధింపులతో.. ఆత్మహత్య చేసుకున్నది ఒక అగ్ర కులానికి చెందిన అధికారి. కాబట్టే ఎక్కడా స్పందన లేదు. ఎక్కడా ఆందోళనలు లేవు. పాలకులు కూడా పెదవి విప్పరు. గతంలో రమామణి విషయంలోనూ అదే జరిగింది. అదే ఆత్మహత్య చేసుకున్న అధికారి స్థానంలో, ఇతర కులాలకు చెందిన అధికారి ఉంటే,  సర్కారు ఇంత నింపాదిగా ఉండేదా? ఆయా కులాలకు చెందిన ఉద్యోగ-కుల సంఘాలు మౌనంగా ఉండేవా అన్నది ప్రశ్న. అంటే…  కులాన్ని బట్టి, సర్కారు న్యాయం అమలుచేస్తుందనుకోవాలా?