‘కాకినాడ సెజ్’పై బాబు తప్పులో కాలేశారా?

186

పాత తప్పిదాలతో వైసీపీ చేతికి చిక్కిన టీడీపీ
అధికారంలోకి వచ్చాక కాకినాడ్ సెజ్‌ను విస్మరించిన బాబు
హెరిటేజ్- జీఎంఆర్ షేర్లకూ లింకు పెట్టిన మంత్రి కన్నబాబు
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

విపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలను, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా తేల్చేస్తారు. వాటిపై కమిషన్లు, విజిలెన్స్ విచారణలు జరిపిస్తారు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీనికి పూర్తి భిన్నం. విపక్షంలో చేసిన ఆరోపణలను అధికారంలోకి వచ్చిన వెంటనే మర్చిపోతారు. మర్చిపోవడమే కాదు. సదరు కంపెనీ అధినేతలతో కలసి తిరుగుతుంటారు. పారిశ్రామికవేత్తలతో అంటకాగడం ఆయనకు మహా ఇష్టం. పార్టీ నేతలు, మంత్రులయినా సరే.. సూటు-బూటు వేసుకున్న వాళ్లు బయకు వచ్చేంత వరకూ, బాబు చాంబరు బయట వేచి ఉండాల్సిందే. విపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలు, జనం కూడా తన మాదిరిగానే మర్చిపోతారన్నది బాబు భ్రమ. అందుకే ముందు వెనుకా ఆలోచించకుండా, ఏదంటే అది మాట్లాడుతుంటారు. చివరకు ప్రత్యర్ధుల చేతిలో ఇరుక్కుపోతారు. ఇప్పుడు కాకినాడ సెజ్ కథలో కూడా బాబు ఆత్మరక్షణలో పడిపోయారు. ఫలితంగా హెరిటేజ్ షేర్ల అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిన ట్టయింది.

చంద్రబాబు నాయుడు విపక్ష నేతగా ఉన్నప్పుడు, కాకినాడ సెజ్ భూముల కుంభకోణంపై ఆందోళన నిర్వహించారు. నాటి తూర్పు గోదావరి జిల్లా పార్టీ ఇన్చార్జి గరికపాటి మోహన్‌రావు, భారీ స్థాయిలో జిల్లా నేతలను సమీకరించి ధర్నా చేశారు. ఆ సందర్భంలో బాబు ట్రాక్టరు కూడా నడిపారు. ఏరువాక చేశారు. రైతుల వద్ద తీసుకున్న భూములను, వారికి తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే, రైతుల భూములు వాపసు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ ధర్నాలో యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన రాజప్ప వంటి అగ్రనేతలంతా హాజరయ్యారు.

నిజానికి కెవి రావు అనే పారిశ్రామికవేత్త, అప్పట్లో రైతుల వద్ద నేరుగా భూములు కొనుగోలు చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు, ఆయన ‘ఆత్మ’ ద్వారా కెవి రావు వ్యవహారం నడిపారన్నది ఒక ప్రచారం. ఆ ప్రకారంగా ఎమ్మార్వోలు, సీఐల ఒత్తిళ్లతో రైతులు నేరుగా కెవి రావుకు భూములు కొనుగోలు చేశారు. ఆ తర్వాత దానిని సెజ్‌గా ప్రకటించారు. కాబట్టి ఆ వ్యవహారంతో సర్కారుకు నేరుగా ఎలాంటి సంబంధం లేదు. కానీ ధర్నా నిర్వహించిన చంద్రబాబు.. తాము అధికారంలోకి వస్తే ఆభూములను రైతులకు స్వాధీనం చేస్తామని హామీ ఇచ్చారు. మరి గెలిచిన త ర్వాత చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా? కానీ ఆ పనిచేయలేదు.

టీడీపీ విజయం సాధించిన తర్వాత.. విచిత్రంగా ఏ కెవి రావు భూములపై పోరాడారో, అదే కెవి రావు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చుట్టూ కనిపించేవారు. కాకినాడ్ సెజ్‌లో భూములిచి నష్టపోయిన రైతులకు తానిచ్చిన హామీలు కూడా బాబు అవలీలగా మర్చిపోయారు. అంతేనా? ఆయన కంపెనీకి పొడిగింపు ఇచ్చారు. నిజానికి బాబు తన మాట ప్రకారం సీఎం అయిన తర్వాత, ఆ భూములను రైతులకు స్వాధీనం చేయించాలి. కానీ అందుకు భిన్నంగా సదరు కంపెనీకి పొడిగింపు ఇవ్వడం, స్థానిక టీడీపీ నేతలను విస్మయపరిచింది. ఈ విషయంలో నానా యాగీ చేసిన, యనమల రామకృష్ణుడు కూడా మౌనం వహించటం మరో విశేషం.

టీడీపీ విపక్షంలో ఉన్న సమయంలో మెగా ఇంజనీరింగ్, కృష్ణపట్నం పోర్టు కంపెనీలపైనా ఇదేవిధంగా విరుచుకుపడింది. గాలి ముద్దుకృష్ణమనాయుడు-సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రెస్‌మీట్లు పెట్టి, మెగా ఇంజనీరింగ్ కంపెనీ కెవిపి బినామీ అని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే దాన్ని బ్లాక్‌లిస్టులో పెడతామన్నారు. ఆ కంపెనీ చేసిన పనులపై విజిలెన్సుతో విచారణ జరిపిస్తామన్నారు. కానీ విచిత్రంగా బాబు సీఎం అయిన తర్వాత.. అదే మెగా కంపెనీకి, పోలవరం సహా పెద్ద ప్రాజెక్టులన్నీ కట్టబెట్టారు. తాను చేస్తే సంసారం.. ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అన్నట్లు, టీడీపీ చేస్తున్న ఆరోపణలను జనం విశ్వసించకపోవడానికి ఇలాంటి ఘటనలే కారణం.

తాజాగా కాకినాడ్ సెజ్‌పై, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలపై స్పందించిన మంత్రి కన్నబాబు.. టీడీపీ పరువు తీశారు. అధికారం రాకముందు ఏరువాక చేసిన చంద్రబాబు, అధికారం వచ్చిన తర్వాత ఆ భూములను రైతులకు ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్న, టీడీపీ నైతిక విలువలను నిలదీసినట్టయింది. హెరిటేజ్ కంపెనీ షేర్లు అమ్ముకుంటే లేని తప్ప, జీఎంఆర్ అమ్ముకుంటే తప్పేంటన్న కన్నబాబు ప్రశ్నకు జవాబు లేదు. ఎంతయినా బాబుకు పారిశ్రామికవేత్తలు, సూటు బూటు వేసుకున్నవాళ్లంటే మహాప్రేమ.