ఆంధ్రాలో అదుపు లేని ‘పోలీస్‌రాజ్’

785

మరో వ్యక్తిని ఎత్తుకెళ్లిన తాడేపల్లి పోలీసులు
సవాంగ్‌కు సమస్యలు తెస్తున్న అధికారుల అత్యుత్సాహం
(మార్తి సుబ్రహ్మణ్యం- 97053111)

తమ బాసు వరసగా హైకోర్టు మెట్లెక్కి.. న్యాయమూర్తుల వ్యాఖ్యలతో అవమానాలకు గురవుతున్నా, కింది స్థాయి పోలీసులకు అదేమీ పట్టడం లేదు. ఎమ్మెల్యేల దన్నుతో.. స్థానికంగా తమకు ఎదురులేదని చెలరేగిపోతున్న అధికారుల అత్యుత్సాహం, డీజీపీకి చెలగాటంగా మారింది. హెబియస్ కార్పస్ పేరిట మనుషులను మాయం చేస్తున్న అధికారుల అత్యుత్సాహం, పోలీస్ బాసుకు పితలాటకంగా మారింది. సీఐ-ఎస్‌ఐ స్థాయి అధికారులు.. స్థానికంగా కొందరితో కుమ్మక్కయి, వారి ప్రత్యర్ధులను ఎత్తుకొస్తున్న చందం.. పోలీసుశాఖకు నగుబాటుగా మారింది. దీనిపై హైకోర్టు స్వయంగా డీజీపీని కోర్టుకు పిలిచినా, కింది స్థాయి పోలీసుల తీరులో మార్పు కనిపించడం లేదు. చివరకు ‘ఇది ఖాకీస్ట్రోక్రసీ’నా అని కోర్టు ఘాటుగా ప్రశ్నించినా, కింది స్థాయి అధికారుల తీరులో మార్పు రావడం లేదు.

కొన్ని నెలల క్రితం విశాఖపట్నం పోలీసులు.. రెడ్డి గౌతం అనే వ్యక్తిని, ఒక సివిల్ కేసుకు సంబంధించి బెజవాడకు వచ్చి ఎత్తుకెళ్లారు. ఆ సందర్భంలో ఆయన తరఫున వాదించిన లాయర్‌పైనా దాష్టీకం చేశారు. దానిపై హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా, డీజీపీ హైకోర్టుకు హాజరుకావలసి వచ్చింది. ఆ కేసుకు సంబంధించి.. తమ బాసు కోర్టుకు హాజరయ్యారన్న విషయం తెలిసినా, స్థానిక పోలీసుల తీరులో ఏమాత్రం మార్పు రాలేదు.

చోడవరం పోలీసస్టేషన్‌లో నివసించే రెడ్డి గోవిందరావు ఇంటిపై,  బాకీలకు సంబంధించి కొందరు దాడి చేశారు. అది సీసీ టీవీలోనూ రికార్డయింది.  ఒక ఎస్‌ఐ.. అప్పులిచ్చిన వారితో రాజీ చేసుకోవాలని గోవిందరావుపై ఒత్తిడి చేశారట. సివిల్ కేసు అని తెలిసినా, అది కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిసినా, సెటిల్‌మెంట్ ప్రయత్నాలు చేయడం విమర్శలకు దారితీసింది. ఈ వ్యవహారం మీడియాలో కూడా సంచలనం సృష్టించింది. తన ఇంటిపైకొచ్చి కొందరు వ్యక్తులు దాడి చేశారంటూ సదరు గోవిందరావు, చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ దిక్కులేదు. దానితో మళ్లీ అదే వ్యక్తులు.. తిరుపతిలోని గోవిందరావు వియ్యంకుడి ఇంటికి వెళ్లి, హడావిడి చేశారన్న ఫిర్యాదు వెళ్లింది. అదే ఫిర్యాదు వచ్చినప్పుడే స్పందించి ఉంటే, ఈ చర్యకు అవకాశం ఉండేది కాదు.

ఆ తర్వాత గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కూడా కనిపించడం లేదన్న కేసుకు సంబంధించి, డీజీపీ హైకోర్టు వ్యాఖ్యలకు గురికావలసి వచ్చింది. చివరకు మీకు పనిచేయడం చేతకాకపోతే రాజీనామా చేసి వెళ్లమనే కటువు వ్యాఖ్యలు కూడా న్యామూర్తుల నుంచి వినాల్సి వచ్చింది. ఓ కేసు సందర్భంలో డీజీపీ ఉదయం నుంచి సాయంత్రం వరకూ కోర్టు ఆవరణలోనే ఉండాల్సి వచ్చింది.వరసగా,  ఇన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నా కిందిస్థాయి పోలీసుల బేఖాతరిజంలో మార్పు కనిపించకపోగా, మరింత రెచ్చిపోవడం దారుణం. ఇవన్నీ.. బాసులకు వ్యవస్థపై పట్టు తప్పుతోందన్న సంకేతాలు వెళ్లేందుకు కారణమవుతున్నాయి. తాజాగా మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి మండలం చిర్రావూరుకు చెందిన, పోకల వెంకయ్య అనే వ్యక్తిని పోలీసులు బుధవారం తెల్లవారుఝామున, ఎత్తికెళ్లిపోవడం కలకలం సృష్టించింది. ఉదయమే ముగ్గురు పోలీసులు వచ్చి సీఐ అంకమ్మరావు పిలుస్తారని జీబులో తీసుకువెళ్లారు. ఇది మీడియాలో రావడంతో పోలీసు బాస్ మరోసారి తలపట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

‘‘మేం మా అన్నయ్య కోసం ఉదయం నుంచీ గాలిస్తున్నాం. తాడేపల్లి సీఐలు అంకమ్మరావు, సుబ్రమణ్యం మమ్మల్ని తరచూ స్టేషన్‌కు పిలిచి వేధిస్తున్నారు. మేం పెట్టిన కేసు వాపసు తీసుకోమని బెదిరిస్తున్నారు. మాదగ్గర తీసుకున్న డబ్బులు ఇప్పించాల్సింది పోయి, మమ్మల్లే వాళ్లకు డబ్బులివ్వలివ్వమని ఒత్తిడి చేస్తున్నారు. సచివాలయంలో పనిచేసే వలేటి రవీంద్ర అనే వ్యక్తి, పోలీసు అధికారులతో కుమ్మక్కయి మమ్మల్ని వేధిస్తున్నారు. ఇక పోలీసుల వేధింపు మేం తట్టుకోలేం. మమ్మల్ని కాపాడకపోతే మాకు ఆత్మహత్యనే గతి’ అని బాధితుడి సోదరుడైన మార్కండేయులు వాపోయారు. అందుకే ప్రముఖ న్యాయవాది ఉమేష్‌చంద్రను ఆశ్రయించి, ఆయన ద్వారా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినట్లు వెల్లడించారు.

అయినా తెల్లవారుఘామున తమ ఇంటికి రావడానికి మేమేనయినా దొంగలమా? నేరగాళ్లమా అని ఆయన ప్రశ్నించారు.  తమపై ఎలాంటి కేసులు లేవని, ఒక సివిల్ కేసులో పోలీసులు తమపై వేధింపులకు పాల్పడటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని డిజిపి సవాంగ్, గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని మార్కండేయులు వాపోయారు. ఆ మేరకు ఆయన విడుమల చేసిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.ఇది కూడా చదవండి.. ఖాకీవనంలో కలుపుమొక్కలు!