అచ్చన్నకు టీడీపీ అధ్యక్ష పదవి ఇస్తారట
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

చెప్పడానికే నీతులు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,  సమయానుకూలంగా మార్చుకునే సిద్ధాంతాలు చూస్తే, ఈ సామెత గుర్తుకురాక తప్పదు. ‘జైలుకొచ్చిన ముద్దాయి మీకు పార్టీ అధ్యక్షుడ’ని.. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డినుద్దేశించి, చంద్రబాబు చాలాసార్లు చేసిన ఎద్దేవా ఇది. మీ చుట్టూ ఏ వన్, ఏ టూలను పెట్టుకుని ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారని, బాబు మండిపడ్డ సందర్భాలు కూడా బోలెడు. మరి  విలువలపై అంత నిబద్ధత ఉన్న అదే చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?.. అదే జైలుకు వెళ్లొచ్చిన తన పార్టీ నాయకుడికి, రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారట! అదేంటీ? మరి ఆయన ప్రవచించిన నైతిక విలువల మడి బట్టలు ఏమయ్యాయని మాత్రం అడక్కండి. అదంతే! బాబు అంతే!!

తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాబు గారి రాజగురువు  పత్రిక కూడా.. ఈ విషయం వెల్లడించిన తర్వాత, ఇక అందులో తిరుగే ఉండదు. ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ అరెస్టు చేసిన అచ్చెన్న,  చాలాకాలం జైలు జీవితం అనుభవించి, బెయిలుపై బయటకొచ్చారు. ఇప్పుడు అదే అర్హత, ఆయనను అధ్యక్షుడిగా నియమించేందుకు ప్రాతిపదిక కానుంది.

ఇక అంతకుముందు.. అంటే అచ్చెన్న జైలుకు వెళ్లముందు, అదే అధ్యక్ష పదవి బీద రవిచంద్రయాదవ్‌ను వరించనుందన్న వార్త కూడా, పార్టీ వర్గాల్లో గుప్పుమంది. ఇప్పుడాయనకు ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తారట. అచ్చెన్న మాదిరిగానే జైలుకు వెళ్లొచ్చిన, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకూ ఒక పెద్ద పదవి ఇస్తారట. ఇదీ  విషయం!అసలు.. ఆరోపణలపై జైలుకు వెళ్లొచ్చిన అచ్చెన్నకు అధ్యక్ష పదవి  ఎలా ఇస్తారన్నది ప్రశ్న.  ఏం.. 16 నెలల పాటు జైలులో ఉన్న జగన్‌కు, ఆ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వగా లేనిది, కేవలం రెండు మూడు నెలలు జైలులో ఉండి వచ్చిన అచ్చెన్నకు ఇస్తే తప్పేంటి?..  అయినా అచ్చెన్నపై చేసింది కేవలం ఆరోపణలే. జగన్ ప్రభుత్వం కక్ష కట్టి పెట్టిన కేసు అది. ప్రభుత్వం పెట్టిన కేసులో నిజం లేదనే కదా,  కోర్టు ఆయనకు బెయిలిచ్చింది. ఇదీ బాబు భజనమండలి సమర్ధన!

నిజమే. మరి ఆ లెక్క ప్రకారం.. జగన్‌పై కూడా సీబీఐ చేసింది కేవలం ఆరోపణలే కదా? అందులో నిజం లేదని నమ్మినందుకే కదా, ఆయనకు కోర్టు బెయిలిచ్చింది? మరి అప్పుడు జగన్‌కు-అచ్చెన్నకూ తేడా ఏమిటి? జైలుకె ళ్లిన వ్యక్తి చేతిలో పార్టీ ఉందన్న తమ్ముళ్లు.. అచ్చెన్న అధ్యక్షుడయితే, రేపటి నుంచి ఏమని సమాధానం చెబుతారు? ఏమని సమర్థించుకుంటారు? మీరు జైలు కెళ్లిన వ్యక్తికి అధ్యక్ష పదవి ఇచ్చినందువల్ల, మేమూ జైలుకెళ్లిన వ్యక్తికి అధ్యక్ష పదవి ఇచ్చామని సమర్ధించుకుంటారా? లేక మీ నాయకుడు చంచల్‌గూడ సెంట్రల్ జైలుకెళితే, మా నాయకుడు గుంటూరు సబ్‌జైలుకు వెళ్లారని వాదిస్తారా? అన్నది ప్రశ్న.

వైఎస్ సీఎం అయిన తర్వాత, ఆయనను చూసి బాబు కూడా తన పద్ధతులు కొన్ని మార్చుకున్నారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు, సీఎంరిలీఫ్ ఫండ్ 25 వేలకు మించి ఇచ్చేవారు కాదు. కానీ వైఎస్ టీడీపీ ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికి సైతం, లక్షలు మంజూరు చేసేవారు. మళ్లీ సీఎం అయిన బాబు కూడా, వైఎస్‌కు మించి మంజూరు చేసేవారు. 15 లక్షలకు పైగా ఇచ్చిన సందర్భాలూ లేకపోలేదు. వైఎస్ మాదిరిగానే బాబు కూడా, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికే పోస్టింగులిచ్చే సంప్రదాయం కొనసాగించారు. వైఎస్ విపక్షంలో ఉన్నప్పుడు జైల్లో ఉన్న గౌరువెంకటరెడ్డిని కలిస్తే, దానిని బాబు ఆక్షేపించారు.

ఇప్పుడు తన పార్టీకి చెందిన చింతమనేని ప్రభాకర్, అచ్చెన్న, కొల్లు రవీంద్ర, జెసి ప్రభాకర్‌రెడ్డితోపాటు, చివరకు ఒక స్ధాయి నేతలు జైలుకెళ్లినా.. చంద్రబాబు గానీ, లోకేష్ గానీ వారిని కలసి సానుభూతి చెబుతుండటం విశేషం.ఇవన్నీ బహుశా, తాను మారానని తమ్ముళ్లకు సంకేతం ఇచ్చేందుకే కావచ్చు. ఇప్పుడు , జగన్ ‘ఎవరేమనుకున్నా నాకేంట’న్న బేఖాతరిజంతో వెళుతున్నారు. చివరకు కోర్టులతో కూడా యుద్ధం చేస్తున్నారు. అయినా ప్రజలు- పార్టీ నేతలు కిక్కురుమనడం లేదు. ఏ వర్గమూ ప్రశ్నించడం లేదు. కాబట్టి, బాబు కూడా ఇప్పుడు, జగన్ విధానాన్నే అనుసరిస్తున్నట్లు అచ్చెన్న అధ్యక్ష పదవి వ్యవహారం స్పష్టం చేస్తోంది. బహుశా పార్టీ కోసం జైలుకెళ్లిన అచ్చెన్నను పార్టీ వదిలేసిందని, ఎవరైనా విమర్శిస్తారేమోనని బాబు గారు ఈ నిర్ణయానికి వచ్చినట్లుంది!

బాబు సీఎంగా ఉన్నప్పుడు, ఆరుగురు మంత్రులను మార్చడానికి మూడేళ్లు సమయం తీసుకున్నారు. ఇప్పుడు విపక్ష నేతగా కూడా, అధ్యక్ష పదవి ఎంపికకు ఏడాదిన్నర సమయం తీసుకోవడంలో పెద్ద విశేషమే లేదు. బాబు సత్వర నిర్ణయం తీసుకుంటేనే విచిత్రం! కాబట్టి ఇక టీడీపీ ఏపీ అధ్యక్ష పదవి అచ్చెన్నకు ఇవ్వబోతున్నారు. జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు, ఆయన పైకి లేచిన అనేకసార్లు ‘జైలుకె ళ్లిన వాళ్లూ మాట్లాడుతున్నార’ని బాబు భజనమండలి ఎద్దేవా చేసేది. అంటే ఆ లెక్కన.. రేపు అసెంబ్లీలో ఇదే అచ్చెన్న పైకి లేచినప్పుడు, జగన్ భజనమండలి కూడా.. ‘జైలుకెళ్లిన నువ్వేం మాట్లాడేది.కూర్చో’ అని ఎద్దేవా చేస్తారన్నమాట!

సరే.. అన్నీ కులాల లెక్కలు వేసుకునే బాబు, అచ్చెన్నకు ఏ ప్రాతిపదికన అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తారన్న లాజిక్కు అప్పుడే చర్చకు వచ్చింది. అచ్చెన్న బీసీ వెలమ కులస్తుల సంఖ్య, ఉత్తరాంధ్రలోనే కనిపిస్తారు. అది కూడా శ్రీకాకుళం జిల్లాలోనే అధికం. తర్వాత విశాఖ జిల్లాలో కొద్దిగా ఎక్కువగా, విజయనగరం జిల్లాలో కొద్దిమేరకు ఉంటారు. ఇక తూర్పు గోదావరిలో రెండు-మూడు, పశ్చిమ గోదావరిలో మూడు-నాలుగు, కృష్ణా జిల్లాలో ఒక నియోజకవర్గాలకు మించి అచ్చెన్న కులం జనాభా కనిపించదు.

మరి రాష్ట్రంలోని బీసీ కులాల్లో అత్యధిక శాతం.. అది కూడా  కొన్ని జిల్లాల్లో మొదటి స్థానం, ఇంకొన్ని జిల్లాల్లో రెండో స్థానంలో ఉన్న యాదవులను కాదని.. అచ్చెన్న బీసీ వెలమకు ఎలా ఇస్తారన్నది ఇప్పుడు టీడీపీ బీసీ నేతల లాజిక్కు! బ:హుశా ఆ పదవి రేసులో ఉన్న బీద రవిచంద్రయాదవ్  జైలుకు వెళ్లనందున, ఆ పదవి ఆయనకు  ఇవ్వలేదేమో?

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner