పురందీశ్వరిని తిట్టినా నోరు మెదపని కమలదళం
వైసీపీపై కమలదళాల మొహమాటం
‘ఏపీ పొలిటిక్ గ్రౌండ్’లో ఇదో మ్యాచ్‌ఫిక్సింగ్
                  (మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఆమె పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆమె సేవలు గుర్తించినందుకే నాయకత్వం ఆ పదవి ఇచ్చింది. దానికి విపక్షాల సర్టిఫికెట్ అవసరం లేదు. మరి అలాంటి నాయకురాలిని, ఒక విపక్ష పార్టీ ఎంపీ దారుణంగా, కులం కోణంలో దూషించిన వైనం విస్మయపరిచింది. ఆ  లెక్క ప్రకారమయితే  రాష్ట్ర నేతలంతా, సదరు విపక్ష పార్టీ ఎంపీపై మూకుమ్మడి దాడి చేయాలి. అటో ఇటో తేల్చుకోవాలి. కానీ ఏపీలో ఆ లెక్క తిరగబడింది. విపక్ష పార్టీపై విరుచుకుపడాల్సిన జాతీయ పార్టీ రాష్ట్ర నేతలు, దుప్పటి ముసుగేసుకుని పడుకున్నారు. విమర్శకులకు గురైన నాయకురాలు, తమ పార్టీకి చెందిన వారు కాదనుకుంటున్నారు. అధికార పార్టీ అగ్రనేతలతో ఉన్న బాదరాయణ సంబంధంతో, తెగ మొహమాటంలో ఉన్నారు. ఇలాంటి మొహమాటం ఇప్పుడే కాదు. పూర్వ అధ్యక్షుడి విషయంలోనూ కనిపించింది. అధికారపార్టీ అంతగా ప్రభావం చూపిస్తున్న ఈ నాయకులు.. అదే టీడీపీలో, ఒక మాజీ మంత్రి తమపై ఏదైనా వ్యాఖ్యలు చేస్తే మాత్రం, అధ్యక్షుడు సహా అంతా గయ్యిన లేచి ఎదురుదాడి చేస్తున్నారు. ‘ఏపీ పొలిటికల్ గ్రౌండ్’లో జరుగుతున్న.. ఇలాంటి ‘మ్యాచ్ ఫిక్సింగ్ యవ్వారం’ యమా రంజుగా కనిపిస్తోంది.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయిన పురందీశ్వరిపై, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలు నెరపుతున్న వైసీపీ నేతలు.. రాష్ట్రంలో మాత్రం అదే బీజేపీ అగ్రనేతలను, దారుణంగా అవమానిస్తున్నారు. అయినా ఢిల్లీ నాయకత్వం మౌనం వహిస్తున్న తీరు, బీజేపీ శ్రేణులలో గందరగోళానికి కారణమవుతోంది. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురదీశ్వరిని,  ‘‘ ఆమె జాతీయ నాయకురాలు కాదు. జాతి నాయకురా’లంటూ,  విజయసాయి చేసిన విమర్శపై, బీజేపీ రాష్ట్ర నేతలెవరూ స్పందించకపోవడమే విచిత్రం.

చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా, ఇప్పటిదాకా పెదవి విప్పకపోవడమే ఆశ్చర్యం. ఇది సహజంగా పార్టీ వర్గాల్లో అనుమానాలకు తావిచ్చింది. బహుశా ఆయనకు విజయసాయిని విమర్శించడం, వ్యక్తిగతంగా ఇబ్బందేమోనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు మీద ఒంటికాలితో  లేచే సోము వీరత్వం, విజయసాయిపై ఏమయిందన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక  చీమ చిటుక్కుమన్నా, వెంటనే సోషల్ మీడియాలో.. అందరికంటే ముందుగానే  కేక వేసే, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి కూడా, ఇంతవరకూ స్పందించకపోవడం మరో విచిత్రం. కరోనాతో ఆయన ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ, పోస్టింగులు వస్తూనే ఉన్నాయి. అయినా పురందీశ్వరిపై.. విజయసాయి చేసిన వ్యాఖ్యలపై ఆయన కూడా స్పందించకపోవడం ఆశ్చర్యమే.నిజానికి వీరిద్దరూ టీడీపీపై నిరంతరం విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు.  కానీ టీడీపీ నేతలెవరూ బీజేపీపై విమర్శలు చేయడం లేదు. అయినా టీడీపీ లక్ష్యంగానే ఈ ఇద్దరు నేతలు విరుచుకుపడుతున్నారు. కానీ, తమ పార్టీ నేతలపై మంత్రులు, వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నా,  బీజేపీ నేతలెవరూ ఎదురుదాడి చేయకపోవడమే అనుమానాలకు కారణం.

ఇటీవల జగన్ తిరుమల వెళ్లినప్పుడు.. డిక్లరేషన్ అంశంపై పార్టీ నాయకులెవరూ ధర్నాలు చేయవద్దని, తిరుపతి పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు ఆదేశించారు. అయినా ఆయనను సస్పెండ్ చేయకపోవడం ఆశ్చర్యం. ఒకవేళ సోము అనుమతితోనే ఆయన అలా ఆదేశించి ఉంటే, అది కూడా తప్పేనంటున్నారు. డిక్లరేషన్‌పై బయట మీడియాలో హడావిడి చేసిన తాము.. జగన్ స్వయంగా తిరుమలకు వస్తే ఆయన పర్యటనను అడ్డుకోవద్దని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది  పార్టీ నాయకత్వమే తమ చేతులు కట్టివేసినట్టని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

గతంలో కన్నా లక్ష్మీనారాయణపై.. అదే విజయసాయి దారుణమైన ఆరోపణలు చేసినా, వీరెవరూ స్పందించలేదు. కన్నాపై విజయసాయి చేసిన ఆర్థికపరమైన ఆరోపణలను, ఇన్చార్జి సునీల్ దియోథర్ కూడా నేరుగా ఖండించలేదు. ఇప్పుడు ఇదే దియోథర్.. పార్టీ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరిపై, విజయసాయి చేసిన ఆరోపణలను ఖండించడం విశేషం. సునీల్- పాతూరి నాగభూషణం- ఒంగోలు  పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు తప్ప.. రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులెవరూ విజయసాయి ఆరోపణలపై స్పందించకపోవడం ప్రస్తావనార్హం.

దీన్నిబట్టి..తమ పార్టీ నేతలను తిట్టే అధికారాన్ని, బీజేపీ నాయకత్వం  వైసీపీకి దఖలు చేసినట్లు స్పష్టమవుతోంది. రాజ్యసభలో వైసీపీ బలంపై బీజేపీ ఆధారపడింది.  అందుకు ప్రతిఫలంగా, ఏపీలో తన పార్టీని బలి చేస్తున్నట్లు.. కన్నా నుంచి- పురందీశ్వరి వరకూ జరుగుతున్న ఘటనలు రుజువుచేస్తూనే ఉన్నాయి. మామూలుగా అయితే, బీజేపీ జాతీయ నాయకత్వం  దీనిని సీరియస్‌గా తీసుకోవలసి ఉంది. అంతకంటే ముందు.. రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మధుకర్‌రెడ్డి, నేతలు సమన్వయ పరిచి, ఎదురుదాడికి మార్గనిర్దేశం చేయాల్సి ఉంది. ఆ అంశంలో ఆయన కూడా విఫలమయ్యారన్న వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తున్నాయి. ఆయన పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని సరైన రాజకీయ పంథాలో నడిపించలేకపోతున్నారన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.  మొత్తానికి వైసీపీ-బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయ క్రీడ సారాంశం, మెడపై తల ఉన్న ఎవరికయినా పెద్ద కష్టపడకుండానే అర్ధమవుతోంది. అదీ అసలు సమస్య!

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner