హైదరాబాద్ ‘బాద్’షా ఎవరు?

170

‘గ్రేటర్’ ఎన్నికల కసరత్తు షురూ
కాంగ్రెస్-బీజేపీ బలమెంత?
టీడీపీని నమ్మని సెటిలర్లు
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కసరత్తు మొదలయింది. తెలంగాణలో అసెంబ్లీ, మునిసిపల్, జడ్పీ-ఎంపీటీసీ ఎన్నికలన్నీ అయిపోగా, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు మాత్రమే మిగిలిపోయాయి. సమైక్య రాష్ట్రం ఉన్నంత వరకూ.. కార్పొరేషన్‌లో బలంగా ఉన్న బలంగా ఉన్న, టీడీపీ-కాంగ్రెస్ పార్టీలు, రాష్ట్రం విడిపోయిన తర్వాత బలహీనపడ్డాయి. అయినప్పటికీ నగరంలో సీట్లు సంపాదించుకున్న టీడీపీ, తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో విఫలమయింది. ఫలితంగా నగరం- శివార్లలోని సెటిలర్లు వివిధ కారణాల వల్ల ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌కు జై కొట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి జై కొడుతున్న ఉత్తరాది సెటిలర్లు, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తెలివిగా టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్న పరిస్థితి.

ఇక కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యం వల్ల, అది కూడా చేతులెత్తేసింది. ఈవిధంగా ఒకప్పుడు కార్పొరేషన్‌పై జెండా ఎగురవేసిన ఈ రెండు పార్టీలను, టీఆర్‌ఎస్ పూర్తిగా వెనక్కినెట్టి, గత ఎన్నికల్లో తొలిసారి కార్పొరేషన్‌పై జెండా ఎగురవేసింది. వచ్చే ఏడాదితో, పాలకవర్గ పదవీకాలం పూర్తవుతుంది. అయితే, ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్నది టీఆర్‌ఎస్ ఆలోచన. అందుకే ఆ పార్టీలో ఎన్నికల సమరోత్సాహం తొంగిస్తోంది.

ఒకప్పుడు ఖాతా తెరవని టీఆర్‌ఎస్.. మళ్లీ కార్పొరేషన్‌పై రెండోసారి జెండా ఎగురవేయలని పట్టుదలతో ఉంది. ఆ పార్టీ కార్పొరేటర్లపై వ్యతిరేకత ఉన్నప్పటికీ, విపక్షాల వైఫల్యం వల్ల అది ఎన్నికల్లో ప్రభావం చూపే పరిస్థితి కనిపించడం లేదు. పాతబస్తీలో కాంగ్రెస్ ఇంతవరకూ ప్రత్యామ్నాయంగా ఎదగకపోవడంతో, సహజంగా టీఆర్‌ఎస్ మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీనే అక్కడ మరోసారి  పాగా వేసేలా ఉంది. న్యూసిటీలో కొంతవరకూ సర్కారుపై వ్యతిరేకత ఉన్నప్పటికీ, కాంగ్రెస్-బీజేపీ-టీడీపీ చీల్చుకునే ఓట్లు, టీఆర్‌ఎస్‌కు లాభించనుంది. నగరంలోని కొందరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. వారి నియోజకవర్గాల్లో మాత్రమే టీఆర్‌ఎస్ నష్టపోయే అవకాశం ఉంది. అయితే అక్కడ ప్రత్యామ్నాయ పార్టీలు లేకపోయినా, సిట్టింగ్ ఎమ్మెల్యే-కార్పొరేటర్లపై ఆ స్థాయిలో వ్యతిరేకత ఉందన్నమాట.

ఇక గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వచ్చిన 14, 68,618 ఓట్లను, ఈసారి గణనీయంగా పెంచుకునేందుకు ఆ పార్టీ నాయకత్వం రంగంలోకి దిగింది. గత ఎన్నికల్లో తెరాసకు 43.85 శాతం ఓట్లు వచ్చాయి. కాగా మజ్లిస్ 5,30,812 ఓట్లతో 15.85 శాతం ఓట్లు, టీడీపీ 4,39,077 ఓట్లతో 13.11 శాతం; బీజేపీ 3,46,253 ఓట్లతో 10.34 శాతం; కాంగ్రెస్ 3,48,388 ఓట్లతో 10.4 శాతం; ఇతరులు 2,27,742 ఓట్లతో 6.5 శాతం ఓట్లు సాధించారు. ప్రధానంగా సెటిలర్లు ఎక్కువగా నివసించే, శివారు నియోజకవర్గాలన్నీ కారెక్కడం విశేషం. ఈసారి కూడా అదే ట్రెండు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

నిజానికి నగరంలో టీఆర్‌ఎస్, రాజకీయంగా పెద్దగా కార్యక్రమాలు చేసిందేమీ లేదు. ఇప్పటివరకూ కమిటీలు లేవు. అసలు నగర పార్టీకి ఓ ఆఫీసు అంటూ లేకపోవడమే ఆశ్చర్యం. చాలా నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా ఆలయ కమిటీలు వేయలేదు. తొలి నుంచీ రాజకీయాల్లో చురుకుగా ఉన్న ఎమ్మెల్యేలు మాత్రమే, స్థానికంగా ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీ చేసుకున్నారు. కానీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రాతినిధ్యం వహించే సికింద్రాబాద్‌లో మాత్రం, ఒక్క నామినేటెడ్ పదవి కూడా భర్తీ చేయలేదు. మొత్తానికి, టీఆర్‌ఎస్‌కు ఒక బాధ్యత-ఒక రాజకీయ వ్యవస్థ అంటూ లేదు. అయినా గత ఉన్నికల్లో  కేసీఆర్-కేటీఆర్‌ను చూసే ప్రజలు ఓటు వేసే పరిస్థితి కొనసాగింది.

ఇక భాజపా హడావిడి తప్ప, పార్టీ విస్తరించిన దాఖలాలు లేవు. ఇటీవలే నగర కమిటీని చీల్చి, కొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటుచేసి కమిటీలు ప్రకటించారు. దానిపైనా నేతల్లో  తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. హంగామా చేసే నాయకులకు కొదవ లేని నగరంలో, జనం వద్దకు వెళ్లే నాయకులు తగ్గిపోవడం  ఆ పార్టీకి ఆందోళన కలిగించే అంశమే. హిందుత్వ అజెండానే నగరంలో పార్టీని బతికిస్తోంది తప్ప, రాజకీయ పార్టీగా సొంతగా బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు శూన్యం. గతంలో టీడీపీతో కలసి కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్‌ను సాధించిన బీజేపీ.. గత కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన సీట్లు కేవలం నాలుగే నాలుగంటే! దీన్నిబట్టి నగరంలో బీజేపీ అగ్రనేతలు పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నారో అర్ధమవుతూనే ఉంది.

పట్టుమని పదిమందిని తీసుకురాలేని వారిని రాష్ట్ర-నియోజకవర్గ నాయకులుగా నియమిస్తున్న విధానం, పార్టీకి నష్టంగా పరిణమించింది. దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి చుట్టూ తిరిగి పైరవీలు చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ, పార్టీ విస్తృతిపై పెడుతున్న దాఖలాలు లేవంటున్నారు. పెద్ద బొట్లు పెట్టుకుని,  నినాదాలు చేసి.. మీడియాలో షో చేయడం తప్ప, క్షేత్రస్థాయిలో పనిచేసి పార్టీని విస్తరించాలన్న ఆలోచన ఎవరికీ లేదు. టీడీపీతో పొత్తు ఉన్నప్పుడే, బీజేపీ రాజకీయంగా బలపడిందన్నది చరిత్ర చెబుతోంది. ఈసారి కూడా టీడీపీతో పొత్తు లేనందున, బీజేపీ ఎన్ని సీట్లు సాధిస్తుందో చూడాలి.

నగరంపై పట్టు-అవగాహన ఉన్న జీఆర్ కరుణాకర్-చింతల రామచంద్రారెడ్డి-సుభాష్‌చందర్జీ వంటి దూకుడుగా వెళ్లే నేతల సేవలు, ఈ ఎన్నికల్లో వినియోగించుకుంటేనే, పార్టీకి కొద్దిగానయినా పరువు దక్కుతుందన్నది సీనియర్ల సలహా. టీడీపీ-బీజేపీ కలసిపోటీ చేసినప్పుడు.. చింతల రామచంద్రారెడ్డి మొండిపట్టుదల వల్లే, అప్పుడు పార్టీకి అన్ని సీట్లు దక్కాయి. ఆయన వైఖరితో నాటి మంత్రి విజయరామారావు కూడా విసిగిపోవాల్సి వచ్చింది. చింతల వ్యూహం వల్ల.. కార్పొరేషన్‌లో బీజేపీ సంతృప్తికర స్థానాలు సాధించి, సుభాష్‌చందర్జీ డిప్యూటీ మేయర్ కాగలిగారు. ఇప్పుడు కూడా ఆ స్థాయిలో దూకుడుగా వెళితేనే, ఉపయోగమని పార్టీ నేతలు స్పష్టంచేస్తున్నారు. కొత్తగా నియమించిన అధ్యక్షులలో ఆ సత్తా ఉన్న వారెవరూ కనిపించడం లేదంటున్నారు.

ఇక గతంలో కార్పొరేషన్‌పై జెండా ఎగురవేసిన టీడీపీ పరిస్థితి,  ప్రస్తుతం దయనీయంగా ఉంది. స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే పార్టీని వదిలేశారన్న భావన ఉంది. టీఆర్‌ఎస్‌కు భయపడి, తెలంగాణలో పార్టీని ఆయనే చంపేశారన్న అభిప్రాయం కార్యకర్తల్లో బలంగా ఉంది. తెలంగాణలో బాబు పార్టీని వదిలేయడంతో, దిక్కులేక వివిధ పార్టీల్లో చేరిన వారి పరిస్థితి కూడా, విషాదంగానే ఉంది. బీజేపీ-టీఆర్‌ఎస్-కాంగ్రెస్‌లో చేరిన నాయకులకు అక్కడ ఎలాంటి గుర్తింపు, ఆదరణ లేదు. తమకే దిక్కులేకపోతే, మీరు వచ్చి ఏం చేస్తారని ఆయా పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. టీడీపీలో ఎంతో గౌరవం పొందిన నేతలు ప్రస్తుతం, ఇతర పార్టీల్లో అనాధల్లా మిగలిన దుస్థితి. అయినా ఆ పరిస్థితిని సద్వినియోగం చేసుకునే నాయకత్వం లేదు.

నగరంలో చివరకు సెటిలర్లు కూడా, టీడీపీని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. సీనియర్ నేత పిన్నమనేని సాయిబాబా, ఏదో ఎదురీది పార్టీ కమిటీలు వేసేందుకు కష్టపడుతున్నారు. ఎన్టీఆర్‌తో కలసి పనిచేసిన అనుభవం ఉన్నందున, అంతో ఇంతో నగరంలో పార్టీ ఉనికి కాపాడగలుగుతున్నారు. ఇప్పటికీ ఎన్టీఆర్ ఉన్నప్పుడు పనిచేసిన వారే, పార్టీలో మిగలడం గమనార్హం. ఇంత క్లిష్ట పరిస్థితిలో టీడీపీ, గతంలో వచ్చిన ఒక్క సీటును దాటుతుందా అన్నది ప్రశ్న.

ఇక కాంగ్రెస్‌ను, నాయకత్వ సమస్య వెన్నాడుతోంది. పిజెఆర్, కోదండరామిరెడ్డి, దానం నగేందర్, పిట్ల కృష్ణ వంటి నాయకులు ఇప్పుడు, భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు. ప్రజాదరణ ఉన్న నేతలు  లేకపోవడంతో, నియోజకవర్గాల్లో కార్యకర్తలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇమేజ్ ఉన్న ఒక్క నాయకుడూ ఆ పార్టీకి కరువయ్యారు. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి వంటి ఫైర్‌బ్రాండ్లు పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే తప్ప, కాంగ్రెస్‌కు గతంలో వచ్చిన సీట్లు కూడా రావడం అనుమానమే.