పవన్ నోట వాహన కారుల మాట

220

ఈ ఒక్క స్పందన చాలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపట్ల, సున్నితమైన ఒక ఊరి కట్టుబాట్లకు, సంప్రదాయలకు ఎంత విలువిస్తారనేది.
అసలు వాహనకారులు అంటే ఎవరు?
రథానికి., వాహనకారులకు., ఆ ఊరికి ఉన్న సంభందం ఏంటి?
ఒకసారి, తెలిసుకొనే ప్రయత్నం చేద్దాం…
వాహనకారులంటే.. మనం నడిపే బండో, కారు గురించి కాదు.
అంతర్వేది ఉత్సవాలతో ముడిపడి ఉన్న పవిత్రవిధులలో ఒక భాగం ఈ వాహనకారులు.

సాక్షాత్తూ.. శ్రీ లక్ష్మీనారసింహా స్వామి వారి వాహనమైన గరుత్మంతునికి ప్రతిరూపమే కళ్యాణ నారసింహుని రథం. రథాన్ని నడిపించే బృందాన్నే వాహనకారుల బృందం అంటారు.
అంతర్వేదిలో శ్రీస్వామివారి రథం ధగ్ధం తరువాత ప్రభుత్వం నిర్మిస్తున్న నూతన రథం నిర్మాణంలో జిల్లా కు చెందిన మంత్రి అతి ప్రమేయం కొత్త వివాదాలకు దారితీస్తుంది. టెండర్ల ప్రక్రియలేకుండానే రథం తయారీ బాధ్యతలు అప్పచెప్పారు అనే కోణంలో కొత్త వివాదం చోటు చేసుకొంది. రథం తయారీలో తామూ భాగస్వాములవుతామంటూ పల్లిపాలెం గ్రామస్తులు అధికారులు, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా తమను పట్టించుకోవడం లేదంటూ జనసేన అధినేత  పవన్ కల్యాణ్ కి విన్నవించుకొన్న విషయం తెలిసిందే.

అంతర్వేదిని ఆనుకొని ఉన్న ఒక చిన్న గ్రామం అంతర్వేది పల్లి పాలెం. ఈ గ్రామంలో 90% పైగా అగ్నికుల క్షత్రియులే. అంతర్వేది ఆలయాన్ని నిర్మించింది కూడా ఓడలరేవుకి చెందిన అగ్నికుల క్షత్రియుడు కొపనాతి క్రిష్ణమ్మ. ఆలయ నిర్మాణం నాటి నుండి 200 ఏళ్ళుగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నారసింహుని కల్యాణోత్సవాలలో రథోత్సవం జరుగుతున్న చరిత్ర ఉంది. ఈ రథానికి నాటి నుండి నేటి వరకు వాహనకారులగా పల్లిపాలెం గ్రామస్తులే స్వచ్చదంగా నిర్వహిస్తున్నారు. తరాతరాల చరిత్ర, సంప్రదాయంగా ఈ రథోత్సవంలో భాగస్వాములవుతున్నారు.

వాహనకారులు చేసే పని ఏంటీ ?
కల్యాణోత్సవాలకు కొద్దిరోజుల ముందే రథాన్ని షెడ్డు నుండి బయటకు తీసుకొనివచ్చి, రంగులు వేయడం మరమత్తులు చేస్తారు. స్థానిక తిరుమాని నాగేశ్వర రావు రథానికి మరమత్తులు కుడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. రథ సప్తమి నాడు ప్రారంబమయ్యే శ్రీ స్వామీ వారి ఉత్సవాలలో తొలి రోజు, 40 అడుగుల రథాన్ని గ్రామస్తులంతా ఏకమై, మెరక వీధికి తీసుకొని వచ్చి, సిద్దం చేస్తారు. శ్రీ వారి కల్యాణం తదుపరి రోజు భీష్మ ఏకాదశి నాడు రథోత్సవాన్ని ప్రధానంగా వాహనకారులే నిర్వహిస్తారు. ఉత్సవాల అనంతరం తిరిగి రథాన్ని షెడ్డుకి చేర్చేంత వరకూ భాద్యత వారిదే.

ఇంకా లోతైన వివరణకు వెళ్ళితే..,
పల్లిపాలెం గ్రామంలో ఉన్నటి వంటి యువకుల నుండి ముదుసలి వారి వరకూ ఇందులో భాగస్వామిలే. గ్రామంలో ఉన్న ఇంటి పేరు, వీదులు ఇతర కొలమాణాలు ఆదారం చేసుకొని వాహనకారుల గ్రూపులు ఉంటాయి. ప్రస్తుతం ఆరు ఉన్నాయి. ప్రతి ఏటా ఒక గ్రూపు వాహనకారులుగా వ్యవహరిస్తుంటారు. మిగిలిన వారు సహకారం అందిస్తారు. ఈ వాహనకారుల టీం, ఏడాది లో వచ్చే పండుగలకు, ప్రధానంగా శ్రీ వారి కళ్యాణోత్సవాలకు నిర్వహించే గ్రామోత్సవాలకు, శ్రీ వారిని వివిద వాహనాలపై పుర వీదుల్లో ఊరేగించే భాద్యత తీసుకొంటారు. రథోత్సవం నాడు అన్ని గ్రూపుల వారు వార్షికంగా వచ్చే వాహనకారులకు సహకరిస్తారు.

అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే, రథోత్సవం నాడు నలబై అడుగుల రథాన్ని, వేలాది మంది ప్రజలు లాగేందుకు పోటీ పడతారు, లక్షలాదిగా హాజరయ్యే ఆ గుంపులో రథం అదుపుతప్పకుండా, ప్రమాదాల భారిన పడకుండా క్రమ పద్దతిలో ఎన్నో ఏళ్ళుగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియలో రథాన్ని చక్రాలు వేసే భాద్యతను కొందరు అనుభవజ్ఞులు తీసుకొంటారు. ఇది ఎంత ప్రాముఖ్యమైన పనో అంత ప్రమాదకం కూడా, అంటే భక్తి పరవశంతో లాగే భక్తులకు రథాన్ని లాగడమే ధ్యేయం కానీ, అందులో అవగాహన ఉండదు. రథాలు ప్రదాన మార్గం(రోడ్డు) నుండి ప్రక్కకు వెల్లకుండా, ప్రత్యేకమైన చాలా బలమైన సరుగుడు కర్రలను చక్రాలకు ఆడ్డుగా పెట్టి అదుపు తప్పకుండా చూడటంతో పాటు, అవసరమైన చోటా రథాన్ని నిలుపుదల చేయాలన్నా వీరు కర్రలతో ఆపాల్సిందే. ఏ మాత్రం తేడా వచ్చినా చక్రాలేసే వాహనకారులకు ప్రమాదం.

అంతేకాకుండా పల్లిపాలెం గ్రామస్తులకు ఆలయం ప్రత్యేక గుర్తింపునిస్తూ వారికి వార్షిక పూజలు నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజున అంతర్వేది ఆలయంలో ఉత్తర ద్వారం గుండా శ్రీ స్వామి వారి దర్షణనికి అనుమతి ఇస్తారు. ఆ రోజు శ్రీ వారి అభిషేకాలనoతరం తొలి పూజలను పల్లిపాలెం గ్రామస్తులకు చేసిన తర్వాతే ఇతరులకు అనుమతించే ఆనవాయితీ వందల ఏళ్ళుగా వస్తుంది. అలాగే కళ్యాణొత్సవాలలో భాగంగా జరిగే శ్రీ వారి సుదర్శణ పెరుమాల్ చక్రవారీ స్నానం పవిత్ర కార్యంలో కూడా వీరికి భాగస్వామ్యం ఉంది. తొలుత పేరూరు ఉద్దండ పండితులు, ఆలయ చైర్మన్ మొగల్తూరు రాజా వారు, తదుపరి వాహనకారులచే స్నానమాచరించే భాగ్యం వాహనకారులకి కలుగుతుంది. ఇలా ఎన్నో ప్రత్యేకతలు అంతర్వేది పల్లి పాలెం గ్రామస్తులతో శ్రీ వారి ఆలయానికి ముడి పడి ఉన్నాయి.

శ్రీ స్వామి వారికి అంతర్వేది పల్లి పాలెం గ్రామస్తులతో సంప్రదాయంగా ముడిపడి ఉన్న వార్షిక కార్యక్రమాలకు భంగం కలగకుండా చూడాల్సిన ప్రభుత్వం, వారిని విస్మరించి నడుచుకోవడం వివాదాలకు తావిస్తుంది.
భవిష్యత్తులో ఆలయ ఆచార వ్యవహారాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. రథం భాద్యతలను వందల ఏళ్ళుగా నిర్వహిస్తున్న అంతర్వేది పల్లిపాలెం గ్రామస్తులను కాదని, వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ఆ గ్రామస్తుల తరుపున, జనసేన ఖండిస్తుంది.

మోహన్ కుమార్ తాడి,
జనసేన నాయకులు,
రాజోలు నియోజకవర్గం. తూ.గో.జిల్లా.