సొమ్ము రాష్ట్రాలది…సోకు కేంద్రానిది..!

299

మాటలు కోటలు దాటుతాయి. చేతలు గడప దాటదు అని అంటారు. మోడీ విషయంలో ఇది అక్షర సత్యం. రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. జీఎస్టీ లో చేరండి అని చెప్పి అందరిని ఒప్పించాడు. తీరా చేరాక ఇప్పుడేమో వచ్చిన నష్టాన్ని మీరే భరించాలి అంటున్నాడు. అంతే కాదు జీఎస్టీ ద్వారా రాష్ట్రాల నుండి వసూళ్లు ఐన డబ్బులు తిరిగి రాష్ట్రాల వాటా రాష్ట్రాలకు ఇవ్వాలి. కానీ ఆలా చేయకపోగా మీ చావు మీరు చావండి అనే పద్దతులలో వ్యవహరిస్తున్నాడు. పైగా లాక్ డౌన్ తో జీఎస్టీ వసూళ్లు తగ్గాయని చెప్పి తెలంగాణ నుండి జీఎస్టీ సెస్సుల రూపంలో 18 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి జమ అయితే అందులో రాష్ట్రానికి వచ్చింది 3 వేల కోట్లు మాత్రమే.ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ మొత్తం అంచనాలకు వసూళ్లకు మధ్య తేడా 3 లక్షల కోట్ల రూపాయలు దాకా ఉంది. కానీ రాష్ట్రాలకు ఇస్తామన్న పరిహారం సెస్సు వసూళ్లు 65 వేల కోట్లు దాటడంలేదు. దీనితో రాష్ట్రాలకు 2 .35 లక్షల కోట్ల ఆదాయం తగ్గింది.రాష్ట్రాలను సంప్రదించకుండానే వృద్ధి రేటును 14 శాతం నుండి 10 శాతానికి తగ్గించింది.పేరుకే నీతి ఆయోగ్ కానీ కనీస నీతిని కూడా మోడీ పాటించలేదు.ఫెడరల్ స్ఫూర్తి కి తిలోదకాలు ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ చర్యలు కేంద్ర ,రాష్ట్ర సంబంధాలను అవహేళన చేయడమే అవుతుంది.జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో కేంద్రం రాష్ట్రాలకు అన్యాయం చేసిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆక్షేపించింది. సుమారు 47 ,272 కోట్ల రూపాయలు పరిహారాన్ని రాష్ట్రాలకు చెల్లించకుండా ఆ మొత్తాన్ని ఇతర అవసరాలకు కేంద్రం వాడుకుందని చెప్పింది.ఇది జీఎస్టీ చట్టానికి విరుద్ధమని కూడా వ్యాఖ్యానించింది. ఈ మొత్తం జీఎస్టీ సెస్సు కింద వసూలు చేసిందని రూలు ప్రకారం రాష్ట్రాలకే చెందాలని కూడా చెప్పింది. నాన్-లాప్సబుల్ నిధి (జీఎస్టీ పరిహారం నిధి )కింద జమ చేయాల్సిన మొత్తాన్ని వేరే పథకాలకు మళ్లించారని కాగ్ కామెంట్ చేసింది. వస్తు సేవల పన్నుల వ్యవస్థ కారణంగా రాష్ట్రాలకు వచ్చే ఆదాయ నష్టాన్ని 5 సంవత్సరాలు తామే భరిస్తామని 2017 లో కేంద్రం ఒప్పుకున్న విషయం అందరికి తెలిసిందే కానీ ఆ పరిహారాన్ని పూర్తిస్థాయిలో చెల్లించిన దాఖలాలు లేవు రాష్ట్రాలకు చెల్లింపుల విషయంలో చాలా తాత్సారం చేస్తుంది. కొన్ని సార్లు దశల వారీగా మరీ కొన్ని సార్లు అసలే చెల్లించకుండా మొండి చెయ్యి చూపే ప్రయత్నం చేస్తుంది. తాజాగా లాక్ డౌన్ కారణం చెప్పి చేతులు ఎత్తేసింది. ఇది ఎంత అన్యాయం.

మోడీ మీద కొండంత ఆశలు పెట్టుకున్నదేశ ప్రజలకు రోజు రోజుకు నిరాశ ఎదురవుతుంది. బడా బాబులు విదేశాలలో దాచుకున్న నల్ల ధనం దేశానికి తెచ్చి తమ బతుకులు బాగుచేస్తాడని పేదలు ఎదురు చూసారు. అది చేయకపోగా బ్యాంకులను మోసం చేసిన బడా బాబులను విదేశాలకు పంపించారు. అంతే కాదు ఆశతో ఎదురు చూసిన పేదవారిని లాక్ డౌన్ తో బజారు పాలు చేశారు.దేశానికి అన్నం పెట్టె మాకు మోడీ మేలు చేస్తాడని రైతులు ఎదురు చూసారు. కానీ వారికి సున్నం పెట్టె సంస్కరణలు తెచ్చాడు.మాకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాడని ఎదురు చూసిన నిరుద్యోగులకు నిరాశ కలిగించాడు. పైగా పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, లాక్ డౌన్ లతో ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి రోడ్డల మీదకు తెచ్చాడు.మోడీ ప్రధాని అయితే ఉద్యోగ భద్రత ఉంటుందనుకున్న మధ్యతరగతి వర్గాలకు నిరాశ మిగల్చడమే కాకుండా భద్రత లేకుండా చేసాడు.ఎల్ ఐ సి, టెలికామ్,రైల్వే, రక్షణ రంగాలతోపాటు అంతరిక్ష రంగాన్ని కూడా ప్రెవేటు పరం చేసి చేతులు దులుపుకున్నారు.భావుద్రేకాలను పెంచే అంశాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఆర్థికాంశాలకు ఇవ్వలేదు.ఫలితంగా దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారింది జిడిపి మైనెస్ లోకి వెళ్ళింది ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రాజకీయ విలువలు పెంచుతాడని ఎదురు చూసిన మేధావులకు, ప్రజాస్వామ్య వాదులకు కూడా నిరాశే ఎదురయింది.విలువలను తుంగలోతొక్కుతూ వివిధ రాష్ట్రాలలో తమ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాడు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాడు.జాతీయ భావాన్ని పెంచుతాడు అనుకుంటే విద్వేషాలు పెంచాడు.దేశ భక్తిని రగిలిస్తాడు అనుకుంటే ఉన్మాదాన్ని రగిలించాడు.మోడీ తో తమ పార్టీ ఇమేజ్ పెరుగుతుందని ఎదురు చూసిన తమ పార్టీ వారికి కూడా తన సొంత ఇమేజ్ ను పెంచుకుని నిరాశే మిగిల్చాడు. మోడీ తెచ్చిన నీతి ఆయోగ్ తో కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుంటాయని ఆశ పడ్డ రాష్ట్రాలకు భంగపాటు మిగిల్చాడు .ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి .

దేశాన్ని గాలికి వదిలేసి కార్పొరేట్ సంస్థలకు ముఖ్యంగా అదానీ అంబానీలు పెద్ద పీఠ వేసాడు.అన్ని రంగాలను వారికి అప్పనం గా అప్పగించే పని పెట్టుకున్నాడు చివరికి వ్యవసాయ రంగాన్ని కూడా వారికి కట్టబెట్టే పనికి పూనుకున్నాడు అందులో భాగమే వ్యవసాయ సంస్కరణలు దేశంలోని ప్రముఖ ఆర్ధిక మరియు వ్యవసాయ రంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు ఈ సమసకరణల పట్ల. కొత్తగా తెచ్చిన చట్టం వలన రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది అంటున్నారు. ఇప్పటిదాకా కొద్దో గొప్పో భరోసాగా ఉన్న వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేయడం వలన అన్యాయం జరుగుతుందని.అలాగే నిత్యావసర సరుకుల నిల్వల చట్టాన్ని రైతుల పేరుతో సవరించి కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే చర్యకు కేంద్రం పూనుకుంది అని దీని వలన అటు రైతుకు ఇటు వినియోగదారుడికి కూడా అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు.పైగా ఎంత సరుకును అయినా నిల్వ చేసుకునే అవకాశం కల్పించడమంటే ఖచ్చితంగా రైతుల పేరుతో కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడమే అని చెప్పక తప్పదు ఇప్పటిదాకా సరుకు నిల్వలమీద నియంత్రణ ఉంది కానీ కొత్త చట్టం వ్యాపారాలు తమ సరుకును నిల్వ చేసుకోవడానికి కావాల్సిన గోడౌన్ ల నిర్మాణం చేసుకోవచ్చని కొత్త చట్టం చెబుతుంది రైతుల తో ముందస్తు ఒప్పందానికి కూడా చట్టబద్ధత కల్పించింది దీనితో రైతు ఒక్కసారి కార్పొరేట్ సంస్థతో ఒప్పందం చేసుకుంటే తన పొలంలో తాను కూలీ గ మారడమే అవుతుంది కొత్త చట్టంతో రైతు కూలీ అవుతాడు దేశంలో ఉన్న సరుకు నిల్వలమీద ఆధిపత్యం కార్పొరేట్ సమస్థలది అవుతుంది వినియోగదారుడికి నిత్యావసర వస్తువులు అందని ద్రాక్ష అవుతుంది కేంద్రం ప్రేక్షక పాత్ర వహిస్తుంది జరిగేది ఇదే అందుకే ఉత్తరాది రైతాంగం రోడ్డలెక్కారు దేశ వ్యాపితంగా మరో రైతు ఉద్యమం అనివార్యం.

పి.వి శ్రీనివాస్ రావు
ఇన్ పుట్ ఎడిటర్
టీ న్యూస్
9553955396