ఏడవకం డేడవకండి…

777

-(Rajan PTSK)

ఒరేయ్ పిల్లలూ ఏడవకండర్రా! అంతల్లా గుక్క పెడితే గొంతు పాడవుతుందిరా. అదిగో మళ్ళీ! నేను చెబుతున్నా అలానే ఉంటే ఏలా? బాధ ఉంటుందిరా బంగారాలూ; ఉండదని నేను అనను. కానీ ఒక్కసారి ఆలోచించండి! ఈరోజు కాకపోతే, రేపు. పోనీ పదేళ్ళ తరువాత. ఎప్పటికైనా ఇది తప్పదు కదా. అయినా, నేనంటే అభిమానం ఉంటుందని తెలుసుకానీ.. మరీ ఇంత వెర్రిప్రేమ ఏమిట్రా మీకు. నా భార్యాపిల్లల్ని, భారతీరాజా, ఇళయరాజా, జానకి గారు, రామోజీరావు గారు, మా అన్నయ్య విశ్వనాథ్, తమ్ముడు కమల్‌హాసన్ వంటి ఆత్మీయుల్ని, మరీ ముఖ్యంగా, లక్షల సంఖ్యలో ఉన్న మిమ్మల్మి, లక్షలు కాదేమో కోట్లే అయ్యుండొచ్చు కదా? ఇలా మీ అందరినీ విడిచిపెట్టి వచ్చేస్తుంటే.. నాకూ దుఃఖం తన్నుకొచ్చిందిరా పిల్లలూ. నాకు 75 యేళ్ళు వచ్చినా నేను బాలుడినే కదా. మీ బాలూనే కదా. అందుకే దుఃఖం ఆపుకోలేక పోయాను. ఇక్కడకు వచ్చే వరకూ మీ అందరి కోసం ఏడుస్తూనే ఉన్నాను.

కానీ ఇక్కడకు వచ్చిన క్షణం నుండి నా దుఃఖమంతా ఆవిరైపోయింది. నా కోసం స్వయంగా మా అమ్మానాన్న, మా గురువుగారు కోదండపాణి గారు ఎదురొచ్చారు. ఒక్కసారి ఊహించండి, అలాంటి క్షణంలో నా మనఃస్థితి ఎలా ఉంటుదో? అలా వాళ్ళ ముగ్గురికీ సాష్టాంగ నమస్కారం చేసి, ఈ లోకంలో ప్రవేశించాను. ఇక్కడంతా చాలా బావుందిరా. మరీ ముఖ్యంగా ఇక్కడ ఏడుపన్నదే లేదు. లోపలికి వచ్చిన దగ్గర నుండి నా పెదాలు నవ్వుతూనే ఉన్నాయి. నా గుండె ఆనందంతో పొంగుతూనే ఉంది. అసలు ఏ ఏడుపు లేకపోవడమే స్వర్గంరా నాన్నా! అంతకుమించేమీ కాదు. మీరు కూడా అక్కడ అలా ఉండడానికి ప్రయత్నించి చూడండి. అప్పుడు అదే స్వర్గమవుతుంది.

ఈపాటికి మీరు ఊహించే ఉంటారు, తరువాత నేనెక్కడకి వెళ్ళానో! మహ్మద్ రఫీ గారి దగ్గరకురా. మామూలుగా వెళ్ళలేదు. చిన్నపిల్లాడిలా పరిగెత్తుకు వెళ్ళాను. బడే గులాం అలీ ఖాన్, మెహదీహసన్‌ కూడా అక్కడే ఉన్నారు. దానితో నా ఆనందం అంతకు పది రెట్లు పెరిగింది. వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడుతుండగా అక్కడకు బాపూ గారూ, రమణగారు వచ్చారు. మరి బాపూ గారికి వీళ్ళ సంగీతం అంటే ఎంత అభిమానమో తెలుసు కదా. “ఏమిటి బాలూగారు, అప్పుడే వచ్చేశారు?” అని ఆశ్చర్యంగా అడిగారు రమణగారు. మన “కొత్త సినిమాకి సంగీతం చేద్దామని” అని చిన్నగా నవ్వారు బాపు గారు. “ఏంటి ఇక్కడ కూడా సినిమాలు ఉంటాయా?” అని ఆశ్చర్యంగా అడిగాన్నేను. “ఇక్కడ లేనిదీ, దొరకనిదీ అంటూ ఏదీ లేదు బాలూ గారు; ఒక్క ఏడుపు తప్ప. అందుకే పాపం మన బాలచందర్ గారు ఎంతటి ప్రతిభావంతుడైనా, ఎన్నెన్ని మంచి కళాఖండాలు తీస్తున్నా, జనం రావట్లేదు. భూలోకంలో ఆయన మార్కెట్ ఎంత ఫుల్లో.. ఇక్కడంత నిల్” అన్నారు రమణగారు.

“మరి ఇక్కడ మార్కెట్ ఎవరికుంది?” అన్నాన్నేను. “మాకైతే బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ అప్సరసలతోటే మాకు తలనొప్పిగా ఉంది. ఈ బాపూ ఎవరో ఒక భూలోకంనుండి వచ్చినమ్మాయినో, పాతాళం నుండి వచ్చినమ్మాయినో హీరోయిన్‌గా తీసుకుంటాడు. ఇతడి తీతకి ఆ అమ్మాయిలు ఈ రంభా ఊర్వశులకంటే మాచెడ్డ అందంగా కనబడతారు. దానితో దేవతలలో ఆ అప్సరసల ప్రభ కొంచెం తగ్గింది. అందుకే మామీద ఆ కినుక. ఇక్కడ అందరికంటే మంచి మార్కెట్ మాత్రం మన జంధ్యాలదే, సర్లే మీరొచ్చేశారు కదా, ఇంక మనకు బోలెడంత కాలక్షేపం. ముందు కాసేపు అలా ఈ స్వర్గం అంతా తిరిగిరండి, తరువాత తాపీగా మాట్లాడుకుందాం” అని నా భుజం మీద చిన్నగా తట్టి అన్నారు మన రమణ గారు.

నేనలా సరదాగా తిరుగుతుండగా, ఒకచోట ఐరావతం ఎక్కి వస్తున్న ఇంద్రుడు కనబడ్డాడు. “బాలుగారూ బావున్నారా!” అన్నాడు. నేనెంత ఆశ్చర్యపోయానో చెప్పలేను. “నేను మీకు తెలుసా” అని అడిగా. మీరు తెలియని లోకం ఏదుందండి అసలు. నేనూ, మా శచీ రోజూ మీ పాటలతోనే నిద్రలేస్తాం. ఇదిగో ఇప్పుడు ఇలా విహరిస్తూ కూడా మీ పాటలే వింటున్నా, అంటూ ఆ ఐరావతం మీద ఉన్న చిన్నపాటి స్వరమంజూషలో ఉన్న మీటను పైకి జరిపాడు. “రా దిగిరా దివినుండి భువికి దిగిరా” అనే పాట వస్తోందప్పుడు. ఇంద్రుడు పెద్దగా నవ్వుతూ.. మొన్న దేవతల సమావేశంలో పెట్టిన విభావరిలో ఈ పాట రాగానే.. తన్మయత్వంలో ఉన్న మా అధినేతలైన ఆ పరమశివుడు, మహావిష్ణువు భూలోకాని బయల్దేరబోయారు. మేం కాళ్ళావేళ్ళా పడి వాళ్ళను ఆపాల్సివచ్చింది.

“సరే సరే ఇకనుండి మనం రోజూ కలుస్తూనే ఉంటాం కదా! అలా తిరిగిరండి కాసేపు” అని అలా ముందుకు వెళ్ళిపోయాడు. తరువాత నేను నందనవనంలోకి వెళ్ళాను. అక్కడ ఉన్న కల్పవృక్షానికి, కామధేనువుకి నమస్కరించుకున్నాను. ఇంతలో మా వేటూరి సుందరరామ్మూర్తి ఎదురొచ్చాడు. నన్ను చూడగానే ఆశ్చర్యపోయాడు. “దిక్కుమాలింది అప్పుడే వచ్చేసావేమిట్రా?” అని అలా నోరుతెరచే నిలబడిపోయాడు. “మీకు తెలుసు కదా! దిక్కుమాలింది అన్నది ఆయన ఊతపదం.” నేను వెంటనే వెళ్ళి మా సుందర్రాముడిని గట్టిగా కౌగిలించేసుకున్నాను. అక్కడనుండి ఆయన నన్ను ఆ స్వర్గమంతా తిప్పుతూనే ఉన్నాడు. నాకంటే పదేళ్ళు ముందొచ్చాడుగా మరి.

ముందుగా త్యాగరాజస్వామి వద్దకు తీసుకువెళ్ళాడు. అంతటి మాహానుభావుడిని చూడగానే నా ఒళ్ళంతా ఆనందంతో పులకరించిపోయింది. అక్కడెవరో పెద్దాయన త్యాగరాజస్వామికి ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ఆయన వెనుకభాగం మాత్రమే కనబడుతోంది. కానీ, ఎవరో తెలిసినవారే అన్నట్టు అనిపించడంతో, మెల్లిగా ముందుకు వెళ్ళి చూశాను. ఆయన, ఎవరొచ్చారా అన్నట్టు తలత్రిప్పి చూశారు. ఆశ్చర్యం.. మన మంగళంపల్లివారు. ఆయన నన్ను చూడగానే “ఓయ్ బాలూ నువ్వూ వచ్చేశావా” అన్నారు పెకి లేస్తూ. నేను ఆ త్యాగరాజస్వామి పాదాలకూ, బాలమురళిగారి పాదాలకు నమస్కరించాను. మంగళంపల్లివారు నన్ను లేవనెత్తి కావలించుకొని, త్యాగరాజస్వామికి నన్ను చూపిస్తూ.. “స్వామీ! మా బాలూ” అన్నారు. అప్పుడు ఆయన కళ్లల్లో ఎంత సంతోషం కనబడిందో చెప్పలేను. అప్పుడా త్యాగరాజస్వామి చిన్నగా ఆశీఃపూర్వకంగా నవ్వుతూ.. “తెలుసు” అన్నారు. నేను మరోసారి శిరస్సువంచి ఆయనకు నమస్కరించాను.

మళ్ళీ కలుస్తామని వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని నేనూ, వేటూరి అక్కడనుండి బయలుదేరాం. నిన్న రాత్రి వరకూ అలా కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూనే ఉన్నాం. మధ్యలో మాకు జంధ్యాల కలిశాడు. ఇంక చెప్పేదేముంది. నవ్వులే నవ్వులు. కాసేపటికి మా దగ్గరకు ఇద్దరు దూతలు వచ్చి, “మిమ్మల్ని దేవేంద్రులవారు స్వరస్థలికి సగౌరవంగా తీసుకురమ్మన్నారు మహాశయా” అన్నారు. సరే పదమంటూ వాళ్ళ వెనుక బయలుదేరా. వేటూరీ, జంధ్యాల కూడా మా వెంటే వచ్చారు.
అక్కడ సభంతా గంధర్వులతో నిండిపోయి ఉంది. తుంబురుడు, నారదుడు కూడా కనిపించారక్కడ. అధ్యక్షపీఠంలో సాక్షాత్ సరస్వతీదేవి కూర్చుని ఉంది. నన్ను చూడగానే “రా నాయనా!” అంది. నేను గభాలున వెళ్ళి అమ్మ పాదాల మీద పడ్డాను. “నువ్వు పెట్టిన భిక్షతోనే 54 సంవత్సరాలపాటు భూలోకంలో గానగంధర్వుడన్న కీర్తి సంపాదించానమ్మ” అంటూ, ఆనందంతో ఉబికి వచ్చే కన్నీళ్ళతో అమ్మ పాదాలను తడిపివేశాను. అమ్మ ఆనందంగా.. “లే నాయనా, లే!. ఇక్కడ కూడా నీ ప్రతిభ అసాధారణ స్థాయిలో వెల్లడి కాగలదు. నీ కీర్తి ఆ చంద్రతారార్కం ఉంటుంది.”

పైనున్న ఏడులోకాలలోనూ ఏ సంగీత విభావరి అయినా, జంటగానం చేయాలన్నప్పుడు ఈ తుంబుర నారదులే వెళ్ళవలసి వస్తోంది. ప్రతీచోటకీ వారే అంటే కష్టం కదా నాయనా. అందుకే ఇకనుండి ఆ బాధ్యతలో కొంత నువ్వు కూడా తీసుకోవాలి. ఇదివరకే వచ్చి వేచి ఉన్న ఆ మహాపురుషునితో కలసి నువ్వు జంటగానం చేయాలి అంటూ తన కుడిచేతి చూపుడు వ్రేలితో సభలో ఉన్నతాసనంపై కూర్చున్న ఉన్న ఒకవ్యక్తిని చూపించింది. నేను అటుగా చూశాను. “మాష్టారు. మన ఘంటసాల మాస్టారు” నేను చేతులెత్తి నమస్కరించాను. ఆయన కళ్ళతోనే ఆశీర్వదించారు.

తరువాత ఆ సరస్వతీదేవి.. “నాయనా! నువ్వు మొదలు పెట్టవలసిన ఇంకొక ముఖ్యమైన పని కూడా ఉంది. భూలోకంలో నువ్వు నిర్వహించే “పాడుతా తీయగా” వంటి కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ప్రారంభించాలి. మా ముగ్గురమ్మలం న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తాం. గణపతి, కుమారస్వామి కూడా ఆ కార్యక్రమంలో చిన్నపిల్లల విభాగంలో పోటీపడతారు. కార్యాచరణను సిద్ధంచేసుకో నాయనా. వచ్చే విజయదశమిని ఈ కార్యక్రమానికి శుభమూహూర్తం నిర్ణయించాం. ఇది పరమేశ్వరాజ్ఞ” అని చెప్పి సభ ముగించింది.

ఆ తరువాత నేను, వేటూరీ, జంధ్యాల మా బసకు వచ్చేశాం. రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం. ఒకరిమీద ఒకరం చెణుకులు విసురుకుంటూ నవ్వుకుంటూనే ఉన్నాం. పొద్దున్న లేవగానే.. ఈ విషయాలన్నీ మీకు ఎలా అయినా చేరవేయాలన్న తహతహ మొదలయ్యింది. ఆ మాటే వేటూరికి చెప్పాను. నిన్నటి నీ అనుభవాలు, అనుభూతులూ ఒక ఉత్తరంలో వ్రాసి ఇవ్వమన్నాడు. అలానే వ్రాసి ఇచ్చాను. దానిని భూలోకానికి పంపే మార్గం కావాలి కనుక, మా వేటూరి ఫొటో ఫ్రేము కట్టించి పెట్టుకున్న Rajan PTSK ను ఈ ఉత్తరం చేరవేసే మాధ్యమంగా ఎంచుకున్నాము. పాపం అతడు కూడా నిన్నటి నుండి నాకోసం ఏడుస్తూనే ఉన్నాడు. అతడి ఇంటిలో ఉన్న మా వేటూరి ఫొటో ద్వారా ఈ ఉత్తరాన్ని జారవిడిచాము. అదే మీరిప్పుడు చదువుతున్నారు. ఇకపై మీరెవ్వరూ ఏడవవద్దు. నేనిక్కడ చాలా ఆనందంగా ఉన్నాను. ఇక ఉంటానురా బంగారాలు. జాగ్రత్తగా ఉండండీ!

సర్వేజనా సుజనా భవంతు! సర్వే సుజనా సుఖినో భవంతు! స్వస్తి!

– మీ బాలు