కమలానికి కొత్త నీరు కలిసొస్తుందా?

186

తెలుగు రాష్ట్రాలకు రెండు కీలక పదవులు
రాంమాధవ్, మురళీధర్, జీవీఎల్ అవుట్
అధికారుల ప్రతినిధుల్లో ‘సౌత్’కు స్థానమేదీ?
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. జాబితా కూర్పు చూస్తే.. తెలుగు రాష్ట్రాలపై భాజపా నాయకత్వానికి కాస్తంత కనికరం ఉండీ, లేనట్లే కనిపించింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికీ స్థానం కల్పించడం ద్వారా, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పార్టీ చేరాలనుకునే వారి ఆశలు చిగురింపచేసినట్టయింది.

తెలుగురాష్ట్రాల్లో కొంతమంది పార్టీ నేతలకు ఢిల్లీలో పెద్ద దిక్కుగా ఉన్న వారణాసి రాంమాధవ్‌కు, జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్ నరసింహారావు, తెలంగాణలో మరళీధర్‌రావుపై వేటు వేయడం పార్టీ సీనియర్లను పెద్దగా  ఆశ్చర్యపరచలేదు. జీవీఎల్‌ను మినహాయిస్తే.. మిగిలిన ఇద్దరికీ కమిటీలో చోటు ఉండకపోవచ్చన్న చర్చ, చాలా కాలం నుంచి పార్టీ వర్గాల్లో వినిపించింది. ఇప్పుడు అదే నిజమయింది. రాంమాధవ్‌పై రెండు అంశాలు, మురళీధర్‌రావుపై ఒక అంశంలో ఆరోపణలున్నాయన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరిగింది.

ఇక ఏపీ విషయాల్లో తరచూ తలదూర్చే, యుపి ఎంపి జీవీఎల్ నరసింహారావుకూ నద్దా టీములో స్థానం లభించలేదు. ఇది టీడీపీకి కొంత ఊరటయితే, వైసీపీ సర్కారుకు కాస్త లోటుగానే భావించాలి. అయితే నవంబర్‌లో జరిగే మంత్రివర్గ విస్తరణలో, ఆయనకు స్థానం లభించవచ్చన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీపడిన డికె అరుణకు జాతీయ ఉపాధ్య పదవి లభించడం, అదే సమయంలో అటు ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం చివరి వరకూ ప్రయత్నించిన పురందీశ్వరికి, జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లభించడమే విశేషం. ఇద్దరికీ కష్టపడే నేతలుగానే పేరుంది. దూకుడుగా వెళ్లే వీళ్లిద్దరికీ జాతీయ స్థాయి పదవులు రావడంతో, ఇక కేసీఆర్- జగన్ సర్కారుపై మాటల యుద్దానికి తెరలేచినట్లే.

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌కు ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వడం కూడా, తెలంగాణ శ్రేణులలో జోష్ నింపే నిర్ణయమే.  పురందీశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడంలో, ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లోని కమ్మ వర్గాన్ని దరిచేర్చుకునే వ్యూహం కనిపిస్తోంది. సంఘ్ చీఫ్ పదవి కోసం చివరి వరకూ పోటీ పడిన కీలకనేత ఒకరు, ఆమెకు  ఆ పదవి సిఫార్సు చేసినట్లు సమాచారం. కన్నా అధ్యక్షుడిగా  ఉన్నప్పుడు పార్టీలో కమ్మ వర్గం భారీగానే చేరినా, సోము అధ్యక్షయ్యాక.. ఆయన కమ్మ వ్యతిరేక విధానాల కారణంగా వలసలు నిలిచిపోయాయన్న ప్రచారం ఉంది. పురందీశ్వరి రాకతో, కమ్మ వర్గం వలసలు మళ్లీ మొదలవుతాయన్నది ఒక అంచనా.

ఏపీకి చెందిన సత్యకుమార్‌ను మళ్లీ కార్యదర్శిగా కొనసాగించారు.  వెంకయ్యనాయుడు వద్ద కార్యదర్శిగా పనిచేయడమే అర్హతగా ఉన్న సత్యను,  అప్పట్లో జాతీయ కార్యదర్శిగా చేయడమే విమర్శలకు గురయింది. క్షేత్రస్థాయిలో పనిచేయకుండా.. ఏకంగా జాతీయ కార్యదర్శి పదవి ఎలా ఇస్తారన్న ప్రశ్నలు అప్పట్లో వినిపించాయి. మళ్లీ ఆయనను కొనసాగించడంపై పార్టీ నేతల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దీనివల్ల ఎలాంటి సంకేతాలు వెళతాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సునీల్ దియోథర్‌కు జాతీయ కార్యదర్శి పదవి ఇచ్చినందున, ఇక ఆయన నిర్వహిస్తున్న  ఏపీ ఇన్చార్జి పదవి పోయినట్లే లెక్క. ఆయనను ఏపీ ఇన్చార్జిగా తొలగిస్తారని ‘సూర్య’లో కొద్దిరోజుల క్రితమే వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే.  రాష్ట్ర ఇన్చార్జిగా పూర్తి స్థాయిలో విఫమయిన ఆయనకు, ప్రమోషన్ లభించినట్లే. ఇక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన లక్ష్మణ్‌కు జాతీయ కమిటీలో స్థానం కల్పించిన నాయకత్వం, అదే ఆంధ్ర రాష్ట్ర అధ్యక్ష పదవి నిర్వహించిన కన్నా లక్ష్మీనారాయణకు, స్థానం కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక తెలంగాణలో ఇతర పార్టీల నుంచి చేరిన సీనియర్లకు అటు రాష్ట్ర కమిటీ-ఇటు జాతీయ కమిటీలోనూ స్థానం దక్కలేదు. మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి, వివేక్, చాడా సురేష్‌రెడ్డితోపాటు.. పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్శింహులు, పెద్దిరెడ్డి వంటి సీనియర్ నేతలకు ఎక్కడా చోటు లభించలేదు. నిజానికి వీరంతా జాతీయ పార్టీలో చేరితే,  ఎలివేషన్ వస్తుందని ఆశించారు. అయితే తాజా పరిణామాలతో.. తమకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీలను విడిచిపెట్టి, వారి వెంట తామూ అనవసరంగా చేరి, రెంటికీచెడ్డ రేవడిలా మారామన్న ఆందోళన వారి అనుచరుల్లో వ్యక్తమవుతోంది.

ఇక జాతీయ కమిటీలో 25 మంది అధికార ప్రతినిధులను ప్రకటించారు. కానీ అందులో దక్షిణాది నుంచి ఒక్కరు మాత్రమే ఉండటం బట్టి, సమర్థవంతంగా మాట్లాడే నాయకులు దక్షిణాదిలో ఎవరూ లేరన్న సంకేతాలిస్తోంది. అయితే.. ఏపీ నుంచి పురిఘళ్ల రఘురాం, సినీ నటి కవిత, లంకా దినకర్, విల్సన్, తెలంగాణ నుంచి సీనియర్ నేత జీఆర్ కరుణాకర్,  రఘనందన్‌రావు, టీడీపీ నుంచి చేరిన మోత్కుపల్లి నర్శింహులు తదితరులు చానెళ్ల చర్చలు, ప్రెస్‌మీట్లలో పార్టీ వాణిని సమర్ధవంతంగా వినిపిస్తూ, ప్రత్యర్ధుల దాడిని ఎదుర్కొంటున్నారు.

వీరిలో టీడీపీ నుంచి చేరిన లంకా దినకర్, చాలా ఏళ్ల నుంచీ జాతీయ మీడియా చర్చల్లో  నిరంతరం కనిపిస్తుంటారు. విల్సన్ తెలుగు చానెళ్ల చర్చల్లో సమర్థవంతంగా మాట్లాడుతున్నారు. జీవీఎల్ నరసింహారావు జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నప్పటికీ, దికన్ ఆయన కంటే సమర్ధవంతంగా వివిధ అంశాలపై వాదించేవారు. టీడీపీ హయాంలో ఎంతోమంది ఎంపీలున్నప్పటికీ, జాతీయ మీడియాలో దినకర్  వాణి ప్రముఖంగా వినిపించేది.

కన్నా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విల్సన్, దినకర్‌ను బాగా ప్రోత్సహించారు. సోము వీర్రాజు అధ్యక్షుడయిన తర్వాత, వీరికి కమిటీలో స్థానం ఇవ్వలేదు. అసలు కన్నా కమిటీలో పనిచేసిన వారెవరికీ చోటివ్వలేదు. అది వేరే విషయం. తెలుగు రాష్ట్రాల నుంచి ఇంతమంది సమర్ధులయిన నాయకులున్నప్పటికీ..  జాతీయ నాయకత్వానికి ఉత్తరాది వారు తప్ప, ఒక్క దక్షిణాది- అది కూడా తెలుగు నేత కూడా కనిపించకపోవడమే ఆశ్చర్యం. మొత్తంగా జాతీయ కమిటీలో దక్షిణాదికి పెద్దగా స్థానం లేదన్నది స్పష్టమవుతోంది.