బాబు..మోడీ  భక్తుడు ఎప్పుడయ్యారు?

641

టీడీపీ వన్‌సైడ్ లవ్ వర్కవుతుందా?
కోరకుండానే కమలానికి మద్దతు
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘తిరుమల సంప్రదాయాలను ఎందుకు పాటించరని సీఎం జగన్ ను ప్రశ్నిస్తే, అందులోకి ప్రధాని మోదీని లాగడమేమిటి? మోదీని సతీసమేతంగా రమ్మని, కొందరు మంత్రులు సవాళ్లు విసురుతున్నారు. ఇక్కడ జరుగుతున్న చర్చకు, ప్రధానికి సంబంధమేమిటి?’’
– ఈ ప్రశ్న వేసింది భాజపా జాతీయ అధికార ప్రతినిధి ఏ జీవీఎల్ నరసింహారావో, లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు ఏ సోము వీర్రాజో, జనసేన అధ్యక్షుడు ఏ పవన్  కల్యాణో అనుకుంటే,  కచ్చితంగా తప్పులో కాలేసినట్లే. అంతగట్టిగా నిలదీసినందు వల్ల, ఆయన బీజేపీ అధికార ప్రతినిధేమీ కాదు. అంతకంటే ఎక్కువగా స్పందించి..  ప్రధాని మోదీపై ఇంత ప్రేమానురాగాలు కురిపించిన ఆ  నాయకుడి పేరు చంద్రబాబు నాయుడు! అవును. మీరు విన్నది నిజమే. అచ్చంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడేనండీ!! మోదీపై.. ‘సోము వీర్రాజు తమ్ముడయిన’, మంత్రి కొడాలి నాని చేసిన విమర్శలకు, కమల దళాలు కత్తులు నూరీనూరనట్లు నూరుతున్నారు. కాసేపు బంతిపూలు- ఇంకాసేపు తమలపాకు యుద్ధం చేస్తున్నారు. ఈలోగా ‘మాజీ పార్టనర్’ చంద్రన్న తెరపైకొచ్చి.. బీజేపీ నేతలకు మించి, మోదీపై స్వామిభక్తి ప్రదర్శించడం, చూడముచ్చట గొలిపే యవ్వారమే.  అది కూడా కమలదళాలు ఈర్ష్యపడే స్థాయిలో!

అదేంటీ.. గతంతో మరి.. ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే మోదీని అన్నేసి మాటలన్నారు కదా? ఇదే బాబు,  ఎన్నికల ముందు  ఒంటికాలిపై లేచి మోదీని ఉతికి ఆరేశారు కదా? చివరకు ఇదే కొడాలి నాని కంటే ఎక్కువగా, మోదీ కుటుంబాన్ని పేరుపెట్టి మరీ విమర్శించారు కదా? మోదీని నమ్మకద్రోహి అన్నారు కదా? అసలాయనకు కుటుంబమే లేదని విరుచుకుపడ్డారు కదా? నరేంద్రుడు నమ్మకద్రోహి అన్నారు కదా?.. మరి ఇన్నేసి మాటలన్న అదే మోదీకి.. చంద్రబాబు అర్జెంటుగా వీరభక్తుడు, వీరాభిమాని ఎలా అయ్యారని అడగకండి. బాబుగారు అలా ముందుకుపోతారంతే!

అయితే.. అది వర్కవుటవుతుందా లేదా అన్నది బాబుకు అనవసరం. క్రియ తాను చేసి ‘ఖర్మ’ కార్యకర్తలకొదిలేస్తారు. అయితే.. తనమాటలన్నీ ఎదుటివారు గుర్తుపెట్టుకోరు. తన మాదిరిగానే మర్చిపోతారనుకోవడమే ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అయిన చంద్రబాబు గొప్పతనం. అమాయకత్వం కూడా! ఈ విషయంలో తన మాదిరిగానే అందరికీ అంత‘ విశాల హృదయం’ ఉంటుందనుకోవడం, బాబు ‘హుందాతన’మని బాబు భజనపరులు గర్వంగా  చెబుతుంటారు. అంత గొప్పతనం-విశాల హృదయం ఎదుటివారికీ ఉంటుంద ని ఆ ఆశాజీవి నమ్మకం. కానీ నిన్న తనను తిట్టిపోసిన వారిని కౌగిలించుకుని.. రేపటినుంచి ఆ తిట్టిపోసిన వారినే నెత్తినెక్కించుకునేందుకు, ఢిల్లీలో ఉన్నది తనలాంటి వారు కాదు. ఆవులించకుండానే పేగులు లెక్కబెట్టగల, మోదీ-అమిత్ అన్న విషయం చంద్రన్నకు ఇంకా తెలియకపోవడమే అమాయకత్వమంటున్నారు.

అప్ప ఆర్భాటమే గానీ బావ బతికుందిలేదన్నట్లుంది తెలుగుదేశం తాపత్రయం. ఓ వైపు తన ‘ఒకప్పటి చర్య’లను ఇంకా మర్చిపోలేక.. బీజేపీ తనను అంటరాని పార్టీగానే చూస్తోంది. అయినా  బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పడుతున్న, ‘ఫలితంలేని పాట్ల’ను చూసి తమ్ముళ్లే జాలిపడుతున్న పరిస్థితి. చేయవలసిన సమయంలో చేయకుండా, చేయకూడని సమయంలో బాబు తీసుకునే నిర్ణయాలు తమ్ముళ్లకు రుచించడం లేదు. ఇప్పుడు బీజేపీ-వైసీపీ ఇద్దరు అపూర్వ సహోదరుల్లా పనిచేస్తున్నారన్న విషయం చిన్నపిల్లాడికీ తెలుసు. అయినా బీజేపీ ‘ఎప్పటికయినా’ కరుణిస్తుందన్న ముందుచూపు. వైసీపీ చేయి విడిచి.. తనతో కలసి నడుస్తుందన్న ఆశతో, బీజేపీ ప్రేమ కోసం పరితపిస్తున్న టీడీపీ వ్యూహం వల్ల,  తమ పార్టీ చివరాఖరకు రెంటికీ చెడ్డ రేవడి కావడం ఖాయమని టీడీపీ సీనియర్లు అంటున్నారు.

రాజ్యసభలో వైసీపీ బలమే బీజేపీకి ఆక్సిజన్ ఇస్తోంది. పార్లమెంటులో అన్ని బిల్లులకు వైసీపీ తలాడించేస్తోంది. బాబు-బీజేపీ కలసి ఉన్నప్పటి రోజుల కంటే, ఇప్పుడు కేంద్రం రాష్ట్రానికి నిధులు పారిస్తోంది. మోదీ అపాయింట్‌మెంట్ కోసం అప్పుడు బాబు పడిగాపులు కాస్తే, ఇప్పుడు జగన్ ప్రధానితో అవలీలగా భేటీ అవుతున్నారు. వీటికిమించి.. మోదీకి నమ్మినబంట్లయిన అంబానీ-అదానీ కంపెనీలకు ఏపీలో జగనన్న రెడ్‌కార్పెట్ వేస్తున్నారు. మరి ఇన్ని చూస్తున్నా… బిల్లులతోపాటు, మోదీకి జైకొట్టడం ఎందుకు? దానివల్ల తమకు వచ్చే లాభమేమిటి? బాబు భజన వల్ల బీజేపీ, జగనన్నను విడిచిపెట్టి సైకిలెక్కుతుందా? అసలు ఎన్నికల ముందు మోదీపై, బాబు చేసిన విమర్శలు ఆయన అంత సులభంగా మర్చిపోతారా? ఒకవేళ పొరపాటున ఆయన మర్చిపోయినా, సోము అండ్ విష్ణు అదర్స్ గుర్తుచేయకండా ఉంటారా? అన్నది తమ్ముళ్ల సందేహం.