అనుబంధం లేని ఆత్మీయత

773

సహజంగా ఎవరయినా పెళ్లికో, చావుకో.. తెలిసినవారయితేనే వెళతారు. వారితో అనుబంధం ఉన్నవారే వెళతారు. ఇక ఆత్మీయబంధం ఉన్న వారి సంగతి సరేసరి. కానీ.. కన్నుమూసిన ఓ గొప్ప వ్యక్తితో ఎలాంటి అనుబంధం లేని మరో వ్యక్తి.. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి, మరణించిన ఆ మహానుభావుడికి నివాళులర్పించడం గొప్పే. అది మరణించిన ఆ మహానుభావుడి గొప్పతనమయితే..  ఆయనతో పెద్దగా అనుబంధం లేకపోయినా,  ఈ కరోనా కల్లోల సమయంలో కూడా ఆయనకు  అంజలి ఘటించేందుకు,  అంతదూరం వెళ్లిన ఆ నాయకుడి వ్యక్తిత్వం ఇంకా గొప్పది. ఆ నాయకుడి పేరు భూమన కరుణాకర్‌రెడ్డి. తిరుపతి శాసనసభ్యుడు.

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం దివికేగారన్న వార్త తెలుసుకున్న కరుణాకర్‌రెడ్డి, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లి.. అక్కడి నుంచి చెన్నై చేరుకున్నారు. ఎస్పీ బాలు ఫాంహౌస్ ఎక్కడో విచారించి, అర్ధరాత్రి అక్కడికి చేరుకున్నారు. ఎస్పీ భౌతికకాయానికి నివాళి అర్పించి, ఆయన తనయుడికి మేమున్నామని ధైర్యం చెప్పి, అదే రాత్రి తిరుపతికి తిరుగు పయనమయ్యారు. అప్పటికి ఇంకా  ప్రముఖులెవరూ అక్కడికి చేరుకోలేదు.  ఇంతకూ..ఎస్పీతో కరుణాకర్‌రెడ్డికి ఏమైనా ప్రత్యేక  అనుబంధం, ఆత్మీయబంధం అంటే.. ఏమాత్రం లేదు. ఎస్పీ భౌతిక కాయం వద్ద కరుణాకర్‌రెడ్డి ఉన్న ఫొటోను చూసి, అలాంటి సందేహమే వచ్చింది. అలాంటి అనుబంధం ఉంటే చెప్పమని కోరితే కరుణాకర్ రెడ్డి ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది.

 ‘నాకూ ఆయనకూ పెద్దగా పరిచయం లేదు. అనుబంధమూ లేదు. నేనెవరో ఆయనకు తెలియదు. ఆయనెవరో నాకు తెలుసు. ఇది చాలు కదా? దానికి అనుబంధ-పరిచయంతో పనేమిటి? ఆయన గొప్ప వ్యక్తి. తెలుగు భాషాభిమాని. మంచి వ్యక్తిత్వం, హృదయం  ఉన్న వాడు. అదొక్కటి చాలు కదా.  నేను అక్కడికి వెళ్లడానికి! వైఎస్ హయాంలో, నేను టీటీడీ చైర్మ్‌న్‌గా ఉన్నప్పుడు నాలుగురోజుల పాటు నిర్వహించిన ‘భాషా బ్రహ్మోత్సవాల’కు ఎస్పీగారు, రెండురోజుల పాటు అందులో పాల్గొన్నారు. మా ఇద్దరి మధ్య అదొక్కటే అనుబంధ’మని, కరుణాకర్‌రెడ్డి అలనాటి స్మృతులు సింహావలోకనం చేసుకున్నారు. ఇదీ.. రాజకీయాల్లో ఉన్న కరుణాకర్‌రెడ్డి ఉన్నత వ్యక్తిత్వం. శహభాష్ భూమన!