నాని వ్యాఖ్యలు తెలియదన్న సలహాదారు
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘అయోధ్యలో రామాలయం భూమిపూజ జరిగిన ప్రదేశానికి, ప్రధాని మోదీ గారు మరోసారి సతీసతేమంగా వెళ్లాలి. మోదీ ఏ భార్యను తీసుకువెళ్లారు?’ – ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యపై స్థానిక-జాతీయ మీడియా అంతా గొల్లుమంది. అప్పటికప్పుడే దానిపై చర్చల పేరంటం కూడా పెట్టేశాయి. భాజపేయుల ఖండనలూ వెల్లువెత్తాయి. టీవీలు చూసే ప్రతి ఒక్కరికీ, ప్రధానిపై నాని చేసిన వ్యాఖ్యలేమిటో తెలిసిపోయాయి. ఒక్కరికి తప్ప!  ఆ ఒక్కరు సామాన్యులేమీ కాదు. సర్కారు సలహాదారు. పైగా.. హోంశాఖ ఆయన కనుసన్నులలోనే నడుస్తుందన్న ప్రచారం ఉంది కాబట్టి, సర్కారీ వేగులు ఆ ఉప్పు ఆయనకు అప్పుడే అందించి తీరాలి. కానీ.. ప్రధానిపై నాని చేసిన వ్యాఖ్యలు, తనకు తెలియవని చెప్పడమే వింత. ఇంత ఆశ్చర్యాన్ని అందరికీ పంచిన సలహాదారు పేరు సజ్జల రామకృష్ణారెడ్డి!

అయోధ్యకు వెళ్లిన మోదీ.. ఏ భార్యను తీసుకువెళ్లారని ప్రశ్నించిన మంత్రి నానిపై, కమలదళాలు విరుచుకుపడ్డాయి. ఆయనను బర్తరఫ్ చేయాలని నినదించాయి. దానికి చిర్రెత్తిన ఆయన, ‘పదిమంది వెళ్లి అమిత్‌షాను తీసేయమంటే తీసేస్తారా?ఏమిటీ పిచ్చమాటలు’ అని మరోసారి ఎదుడుదాడి చేశారు. అంటే తన స్థాయిని అమిత్‌షాతో పోల్చుకున్నారన్న మాట. అయితే, నాని చేసిన విమర్శలన్నీ తనకు తెలియవని, నాని అలా అనడం తప్పేనని సర్కారు సలహాదారయిన సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వెల్లడించారు. ‘మీడియా ప్రతినిధులు చెబితే తప్ప, నాని ప్రధానిపై ఏం వ్యాఖ్యలు చేశారో నాకు తెలియలేదు. అయినా అవన్నీ నాని వ్యక్తిగతమైనవి. మోదీ గురించి పార్టీలో ఎవరైనా సరే వ్యక్తిగతంగా మాట్లాడటం తగదు. నేతలు సంయమనం పాటించాల’ని సజ్జల హితవు పలికారు.

వైకాపా విస్తారమైన యంత్రాంగం ఉన్న పార్టీ. సోషల్ మీడియా గ్రూపులకయితే లెక్కేలేదు. సొంత మీడియా కూడా ఉంది. వీటికి మించి అధికారంలోనే ఉన్నందున, ఇంటలిజన్స్ విభాగం కూడా చేతిలోనే ఉంటుంది. ఇవి కాకుండా సీఎంఓలోనే కొమ్ములు తిరిగిన జర్నలిస్టు సారథ్యంలో.. మీడియా విభాగం కూడా ఉంది. కాబట్టి, రాష్ట్రంలో చీమచిటుక్కుమన్నా, వెంటనే ప్రభుత్వ పెద్దలకు చేరిపోతుంది. మరి ఇంత నెట్‌వర్క్ ఉన్న సజ్జల.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొడాలి నాని విమర్శలు తెలియదని చెప్పడమే ఆశ్చర్యం. అంతపెద్ద హోదాలో ఉన్న వ్యక్తికి బయట జరిగే విషయాలు మీడియా ప్రతినిధులు చెబితేనే తెలుస్తాయనడం నిజంగా వింతనే. పోనీలెండి. ప్రభుత్వం నుంచి కనీసంఆయనయినా స్పందించారు. కానీ పార్టీ నుంచి ఎవరూ నోరు విప్పకపోవడం ప్రస్తావనార్హం.

సరే. బాగానే ఉంది. నాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని సజ్జల చెబుతున్నారే తప్ప, ఇప్పటివరకూ నాని మాత్రం.. అవి నా వ్యక్తిగతమైనవని పెదవి విప్పకపోవడం ఒక ఆశ్చర్యమయితే.. మంత్రులకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవని సజ్జల గ్రహించకపోవడం మరో ఆశ్చర్యం. రేపు మరో మంత్రి,  ఏ రాష్ట్రపతినో విమర్శించారనుకోండి. అది కూడా వ్యక్తిగత అభిప్రాయాలుగా కొట్టిపారేస్తారా? ఇంకో మంత్రి రాజధాని అమరావతిలోనే ఉండాలని చెబితే, దానిని కూడా వ్యక్తిగత అభిప్రాయమేనంటారా అన్నది ప్రశ్న. నాని విమర్శలపై ఇంత దుమారం రేగుతున్నా, సీఎం జగన్ కనీసంపెదవి విప్పకపోవడమే ఆశ్చర్యం. ఈ విషయంలో,  కనీసం నానిని మందలించారన్న లీకులు కూడా వినిపించలేదు.

గతంలో టీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో, ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలేవి. కన్నా-సోము-పురందేశ్వరి ముగ్గురూ బాబుపై విరుచుకుపడేవారు.  ఒక సందర్భంలో ప్రధానిపై వ్యాఖ్యలు చేసిన బెజవాడ ఎంపీ కేశినేని నాని, బీజేపీపై వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్, బుద్దా వెంకన్నను బాబు మందలించారు. ఆ విధంగా మీడియా ముందు మాట్లాడవద్దని పార్టీ నేతలతో హెచ్చరించారు. దానిపై కేశినేని నాని అప్పట్లో మనస్తాపం చెందారు. అంటే.. తన పార్టీ నేతలు చేసే వ్యాఖ్యల వల్ల కేంద్రంలో ఉన్న పార్టీతో, సంబంధాలు బలహీనమవుతాయన్నది బాబు ముందుజాగ్రత్త. ఒక సందర్భంలోనయితే, తాను చెప్పిందే ఫైనలని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఎన్నికల ముందు,  స్వయంగా చంద్రబాబే కేంద్రం-మోదీపై విరుచుకుపడ్డారనుకోండి. అది వేరే విషయం.  కానీ ఇప్పుడు జగన్ అలాంటి కనీస సంప్రదాయం-ముందు జాగ్రత్తలు తీసుకోలేదంటే.. అది ఆయన ధైర్యమా? మొండితనమా? బీజేపీ తనపై ఆధారపడి ఉందన్న  లెక్కలేని తనమా? లేక ఇవేమీ కాకుండా.. కేంద్రంలో ఉన్న పార్టీతో అవగాహనా? అన్నది ఒక సందేహం.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner