వ్యవసాయంలో విప్లవం కాదు వినాశనమే

251

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయబిల్లుతో రైతుల రాత మారిపోతుందని, విపక్షాలు ఆరోపిస్తున్నట్లు రైతుల కనీస మద్దతుధరకు ఎలాంటి ఇబ్బంది లేదని, కొత్త బిల్లులతో రైతులు దేశంలో ఎక్కడైనా తమ ఉత్పత్తులను అమ్ముకుని అధికరెట్లు ఆదాయం పొందేందుకు ఈ బిల్లులు దోహదం చేస్తుందని, కాంట్రాక్టు వ్యవసాయం చేయవచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘వ్యవసాయంలో ఇక విప్లవమే’ శీర్షికన రాసిన కథనం వాస్తవానికి పూర్తిగా సత్యదూరం. కేంద్రం చేసిన బిల్లుకు, చేస్తున్న ప్రచారానికి ఏ మాత్రం పొంతన లేదు.

అమిత్ షా చెప్పినట్లు విపక్షాలు మాత్రమే ఈ బిల్లులను వ్యతిరేకించలేదు. 22 ఏళ్లుగా వారితో మిత్రపక్షంగా ఉన్న శిరోమణి అకాళీదళ్ ఈ బిల్లులను వ్యతిరేకించడంతో పాటు కేంద్ర క్యాబినెట్ నుండి ఎందుకు వైదొలగింది ? దీనిని బట్టి విపక్షాల మీద తుపాకీ పెట్టి కేంద్రం రైతులను, వినియోగదారులను కాల్చుతుందన్నది వాస్తవం కాదా ? కొత్త వ్యవసాయ బిల్లులతో రైతుల కనీస మద్దతుధరకు ఎలాంటి ఇబ్బందులు లేనట్లయితే దానిని బిల్లులలో ఎందుకు పొందుపరచలేదు ? పంజాబ్, హర్యానాలలో రైతులు రోడ్ల మీదకు వస్తున్నారు ? వారు ప్రతిపక్ష రైతులా ? అధికారపార్టీ రైతులా ?
ఈ బిల్లులలో నిత్యావసర వస్తువులను నిలువ చేసుకునే చట్టం, కంపెనీలు, రైతుల ఒప్పందం, ఎక్కడైనా అమ్ముకునే చట్టం, కార్పోరేట్ కంపెనీలు నేరుగా రైతులతో కాంట్రాక్టు వ్యవసాయ ఒప్పందాలు చేసుకునే చట్టం. ఇలా మూడు చట్టాల మూలంగా రైతులకు, వినియోగదారులకు తీవ్ర నష్టాలు ఎదురుకానున్నాయి. కొత్త బిల్లుతో నిత్యావసర వస్తువులు ఎంత మొత్తం అయినా నిలువ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీని మూలంగా కార్పోరేట్ శక్తులు కృత్రిమ కొరతను సృష్టించి వినియోగదారుల నడ్డివిరిచే అవకాశం కల్పిస్తున్నది వాస్తవం కాదా ? వందశాతం ధరలు పెరిగే వరకు ఈ బిల్లు ప్రకారం నిత్యవసర వస్తువుల విషయంలో చర్యలు తీసుకునేందుకు వీలులేకుండా చేయడం ఎవరి ప్రయోజనాల కోసం ? దేశంలో 86 శాతం మంది తెలంగాణలో 92.5 శాతం మంది 5 ఎకరాల లోపు ఉన్న రైతులు ఉన్నారు. వారు ఇప్పటి వరకు ఎన్నడైనా తమ పంటలను నిల్వ చేసుకున్నారా ? కల్లాల వద్దనే పంటలు అమ్ముకుని తమ అవసరాలు తీర్చుకునే రైతులు ఈ బిల్లుతో నిల్వచేసుకుని, దేశంలో ఎక్కడైనా తమ పంటలు అమ్ముకుని లాభపడతారని చెప్పడం పూర్తిగా వాస్తవ దూరం. కేంద్రం ఇప్పటి వరకు దేశంలో 23 పంటలకు మాత్రమే ఎం.ఎస్.పి నిర్ణయిస్తుంది. వాటిలో కూడా అన్ని పంటలను సేకరించడం లేదు. దేశంలో పండిన గోధుమ, వరిలో 6 శాతం మాత్రమే ప్రభుత్వం సేకరిస్తుందని 2015 జనవరి 12న శాంతాకుమార్ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. ఇప్పుడు ఈ బిల్లుతో కేంద్రం పూర్తిగా ఎం.ఎస్.పి విధానానికి తిలోదకాలు ఇస్తున్నది.

ఇప్పటి వరకు వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు, కనీస మద్దతుధరల సిఫారసుకు అనుసరిస్తున్న పద్దతులే లోపభూయిష్టంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నీతిఅయోగ్ సభ్యుడైన డాక్టర్ రమేష్ చంద్ ఆధ్వర్యాన ఏర్పరచిన ‘‘కనీసమద్దతు ధరలు నిర్ణయించడానికి అనుసరిస్తున్న పద్దతుల పరిశీలన కమిటీ’’ 02.08.2015న ఇచ్చిన నివేదికలో లోపాలను ఉటంకిస్తూ 23 సిఫారసులు చేసింది. ఉదాహారణకు వ్యవసాయ కుటుంబ యజమాని శ్రమశక్తి విలువను సాధారణ కూలీతో సమానం కాకుండా నిపుణుడైన శ్రామికుడి వేతనంతో సమానంగా లెక్కలోకి తీసుకోవాలని, కౌలుచట్టాలలో పేర్కొన్నట్లు కాకుండా వాస్తవంగా మార్కెట్లో అమలవుతున్న కౌలును పరిగణనలోకి తీసుకోవాలని, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు తెచ్చి రైతు పెట్టే పెట్టుబడిని బ్యాంకు వడ్డీ రేటుతో కాకుండా రైతు చెల్లించిన వడ్డీని పరిగణనలోకి తీసుకోవాలని, విదేశీ వాణిజ్య విధానాలు పంటల ధరలను తీవ్రంగా దెబ్బతీయడం, స్థిరపెట్టుబడిపై వడ్డీ, ఉత్పత్తి పరికరాల అరుగుదలను ద్రవ్యోల్భణం , భూమిపై రైతు పెట్టుబడి అనగా కంచె, బొరుబావి, పొలం చదునుచేయడం అంశాలను పరిగణనలోకి తీసుకుని లెక్కించాలనిసిఫారసులు చేసింది. కానీ ఇప్పటి వరకు మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక్క సిఫారసును అమలు చేయలేదు.

కార్పోరేట్ కంపెనీలతో రైతుల కాంట్రాక్టు వ్యవసాయం అనేది మరో పెద్ద కుట్ర. సామాన్య రైతుల వెంట నిలిచే మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేస్తూ రైతులు, కంపెనీలను నేరుగా అనుసంధానం చేయడమే కాకుండా, ఏవైనా వివాదాలు తలెత్తితే ఇప్పటి వరకు ఉన్న మండల మరియు డివిజన్ స్థాయిలో ఉన్న వివాద పరిష్కార మార్గాలే పూర్తిగా రైతులకు న్యాయం చేయలేకపోతున్నాయి. అలాంటిది జిల్లాస్థాయి అదనపు కలెక్టర్ హోదాలో పరిష్కారాలు చేసుకోవాలనడం రైతుల గొంతు నొక్కడమే. ఓ సామాన్య రైతు బడా కార్పోరేట్ సంస్థలతో న్యాయపోరాటం చేయగలడా ? మరి ప్రభుత్వం గానీ, దాని అనుబంధ సంస్థలు గానీ రైతు వెంట లేకుండా చేయడం కార్పోరేట్ శక్తులకు ఊతమివ్వడం కాదా ? మార్కెట్లలోనే అమ్ముకోవాల్సిన అవసరం లేదనడం మూలంగా మార్కెట్ వ్యవస్థను రూపుమాపడమే. ఈ రోజుకు కూడా దేశంలో మార్కెట్ కు వచ్చే పంటలు కేవలం 50 శాతం మాత్రమే. దేశంలో కాంట్రాక్టు వ్యవసాయం కొత్తది కాదు. చెరుకు, పొగాకు, పామాయిల్, సుబాబుల్, జూటు, విత్తనరంగంలో ఈ విధానం కొనసాగుతున్నది. చెరుకు, జూటుకు ప్రభుత్వం కనీస మద్దతుధర నిర్ణయించినా అమలు సాధ్యంకావడం లేదు. ఏండ్ల తరబడి బకాయిలు చెల్లించడం లేదు. చిన్నచిన్న సంస్థలు దెబ్బతిని పెద్ద కార్పోరేట్, బహుళజాతి సంస్థలే ఇక్కడ నిలబడతాయి. వారి కనుసన్నలలో మార్కెట్ నడవడం గిట్టుబాటు ధర కాదు కనీస మద్దతుధరల ఒప్పందాలకు ఈ సంస్థలు అంగీకరించవు. మరి ఇలాంటి పరిస్థితులలో రైతులకు ఎలా న్యాయం జరుగుతుంది ?

కార్పోరేట్ కంపెనీలు రైతులతో కాంట్రాక్టు కుదుర్చుకుని వ్యవసాయం మొదలుపెట్టాయి అనుకుందాం. ఈ ఫలానా ప్రాంతం, మండలంలో ఫలానా పంటను పండిస్తే ఈ ధరను ఇస్తానని కంపెనీ రైతులకు చెబుతుంది. ఆ ప్రాంతంలోని రైతులంతా ఒకేరకం కూరగాయలు, పప్పుదినుసులు, నూనెగింజలు తదితర పంటలను వేస్తారు. కానీ ఆ ప్రాంత వినియోగదారులు, రైతులు తాము నిత్యం ఉపయోగించే కూరగాయలు, ఇతర నిత్యావసరాలను అదే బహుళజాతి సంస్థ ఇంకోొ చోట పండించి తెచ్చేదాని మీదనే ఆధారపడాల్సి వస్తుంది. అప్పుడు ధర, నియంత్రణ అంతా ఆ సంస్థదే. మొదట్లో మంచిగా అనిపించే ఈ కార్పోరేట్ వ్యవసాయం ఆఖరుకు కొత్తిమీర, పుదీనకు కూడా వారి మీదనే ఆధారపడే స్థితికి చేరుతుందన్నది వాస్తవం. చివరకు ఇది గ్రామాలలో నిర్వహించే వారపు సంతల మీద ప్రభావం చూపినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇంతకుముందు మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు అదుపుతప్పితే కేంద్ర ప్రభుత్వం తన వద్ద ఉన్న నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయడం, నిత్యావసర వస్తువుల చట్టం ప్రయోగించి ధరల స్థిరీకరణకు తోడ్పడేది. కానీ కొత్త బిల్లు ప్రకారం రైతులు, వినియోగదారులను కార్పోరేట్ల ఇష్టారాజ్యానికి వదిలేసి కేంద్ర ప్రభుత్వం తన కనీస బాధ్యతల నుండి తప్పుకుంటున్నది. ప్రభుత్వం తరపున నిత్యవసారాలను నిలువచేసే ఎఫ్ సీ ఐ లాంటి సంస్థలు తాజా బిల్లుతో కనుమరుగుకానున్నాయి. తదుపరి ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కన్పిస్తున్నది. ఇది దేశంలోని అత్యధిక శాతం సామాన్యులపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది.

విదేశీ కార్పోరేట్ వ్యవస్థను ఆహ్వానించడం మూలంగా దేశంలో స్వదేశీ కార్పోరేట్లు అంటూ ఎవరూ మిగలరు. అందరూ ప్రస్తుతం బహుళజాతి సంస్థలతో అంటకాగుతున్నవారే. లాభాపేక్ష తప్ప ఏ మాత్రం మానవత్వంలేని విదేశీ, స్వదేశీ బహుళజాతి కంపెనీలు, వ్యాపారులు గ్రామీణ పేద రైతాంగ ప్రయోజనాల గురించి, వారికి అధిక ఆదాయం కల్పించే అవకాశాల గురించి సహకరిస్తారని చెప్పడం హస్యాస్పదం. దేశంలోని రూ.60 లక్షల కోట్ల విలువైన ఆహారసంబంధ మార్కెట్ ను కార్పోరేట్లకు అప్పజెప్పడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం అన్నది సుస్పష్టం.

నిత్యావసరచట్టం పరిధి నుండి ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, నూనెగింజలు, పప్పుధాన్యాలను తొలగించడం వినియోగదారులను నిండా ముంచడమే. గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పటి వరకూ మార్కెట్లకు రావడం మూలంగా ఇక్కడ స్థానికంగా ఉండే హమాలీలు, చాటకూలీలు, వ్యాపారులు, దళారులు బతికేది. ఎన్నడన్నా ధరలు పెరిగితే అది రైతులకన్నా దక్కేది. పూర్తిగా కార్పోరేట్ వ్యవస్థ పడగనీడకు వెళ్తే రైతుకు లాభం దక్కుతుందా ? వినియోగదారుడికి సరసమైన ధరలలో నిత్యవసర వస్తువులు లభిస్తాయా ?

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం గత ఆరేళ్లలో సాగునీటి వసతులు పెంచి, రైతుబంధు, రైతుభీమా పథకాలు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు సౌకర్యం కల్పించి, వందశాతం పంటలు కొనుగోలు చేయడం మూలంగా రైతులు ధీమాగా వ్యవసాయం చేస్తున్నారు. నియంత్రిత వ్యవసాయం వైపు రైతులను మళ్లించి, రైతాంగాన్ని సంఘటితశక్తిగా మార్చే యోజనలో భాగంగా కేసీఆర్ రైతుబంధు సమితులతో లక్షా 65 వేల మంది సైన్యం తయారుచేశారు. 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించడంతో పాటు రైతువేదికలను నిర్మించడం ద్వారా రైతులకు వ్యవసాయ మెళకువలు అందించి వ్యవసాయరంగం బలోపేతం చేసే ప్రయత్నంలో ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో రైతుకు అధిక ఆదాయం కల్పించేందుకు సంకల్పించింది.

ఆరేళ్లలో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ద్యం ఉన్న వ్యవసాయ గోదాంల సామర్ధ్యాన్ని 24 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది. మరో 40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంగల గోదాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర బిల్లులతో మార్కెట్ వ్యవస్థతో పాటు గోదాంలన్నీ కార్పోరేట్ వ్యవస్థ చేతిలోకి వెళ్లనున్నాయి. అసంఘటిత వ్యవసాయరంగాన్ని, రైతాంగాన్ని సంఘటితం చేసి వ్యవసాయం లాభసాటి చేసే ప్రయత్నంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు ఈ బిల్లు విఘాతం కలిగిస్తుంది. ఈ బిల్లుల ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, మార్కెట్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి బహుళజాతి కంపెనీలకు అప్పచెబుతుందన్నది వాస్తవం. సమాఖ్యస్ఫూర్థికి విరుద్దంగా రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా, ఏకపక్షంగా బిల్లులను ఆమోదింపచేసుకోవడం విచారకరం. కేంద్రం ఈ బిల్లులతో రైతులకు సిరులు కురిపించడం కాదు .. ఉరి బిగించబోతుందన్నది నిజం.

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి