ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ

540

ఇదో బీజేపీ-వైసీపీ ఫ్రెండ్లీ ఫైట్
నానిపై వేటేసి కమలాన్ని విరబూయిస్తారా?
టీడీపీ స్థానం ఆక్రమించే వ్యూహమేనా?
భాజపాకు దారిస్తున్న వైకాపా సర్కార్?
                 ( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఎన్నికల సమయంలో రెండు పార్టీల మధ్య పొత్తులుంటాయి. కానీ కొన్ని నియోజకవర్గాల్లో పీటముడి పడుతుంది. దానితో రెండు పార్టీలూ అభ్యర్ధులను బరిలోకి దించుతాయి. మిగిలిన చోటంతా కలసి పనిచేస్తే, అక్కడ మాత్రం విడిగా పోరాడుతుంటాయి. అంటే కలి‘విడి’ కదనమన్నమాట! ఇదేం విచిత్రమని అడిగితే,  అది ‘ఫ్రెండ్లీఫైట్’ అని నిర్వచిస్తారు. ఇది ఎన్నికల సమయంలో ఎప్పుడూ చూసే చిత్రమే. వామపక్షాలది మరో గమ్మత్తు. ఎన్నికల్లో తమది అవగాహనే తప్ప, పొత్తులు కావని సూత్రీక రిస్తుంటారు. అదో విచిత్రం!  ఇంచుమించు అలాంటి చిత్ర విచిత్రాలే, ఏపీ రాజకీయాల్లో వైకాపా-భాజపా మధ్య కనిపిస్తున్నాయి. ఢిల్లీలో అపూర్వ సహోదరుల్లా కలసిమెలసి ఉన్న ఈ రెండు పార్టీలూ, ఏపీ గల్లీలో మాత్రం కొట్లాడుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. పార్లమెంటులో కవలల మాదిరిగా కలసి ఉన్న ఆ రెండు పార్టీలూ, గల్లీలో మాత్రం కీచులాడుకుంటున్నాయి. ఇదోరకం ఫ్రెండ్లీఫైటా? లేక వామపక్షాల మాటల ప్రకారం అవగాహనా రాజకీయమా? అన్నదే ప్రశ్న.

నువ్వు నన్ను కొట్టినట్లు నటించు-నేను ఏడ్చినట్లు నటిస్తానన్నట్లుంది.. ఏపీలో వైకాపా-భాజపా, సమర-సరస రాజకీయం. ఇటీవలి కాలంలో హిందూ ఆలయాల కేంద్రంగా జరుగుతున్న పరిణామాలతో.. ఉనికి చాటుకోవాలని తాపత్రయపడుతున్న కమలదళాలకు, జగనన్న సర్కారు ‘తెరవెనుక ప్రోత్సాహం’ ఇతోధికంగానే కనిపిస్తోంది. అంటే.. బీజేపీ నేతల గృహనిర్బంధాలు, అరెస్టులు, బీజేపీ నేతలపై ఎదురుదాడి వంటి కార్యక్రమాలతో, వైసీపీ సర్కారు చేతనయింత మేరకు బీజేపీని క్రేన్లతో పైకి లాగే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తూనే ఉంది.

అంటే బీజేపీకి దారి సుగమం చేసినట్టయితే, ఆ దారిలో ఇప్పటికే నిలబడి ఉన్న తెలుగుదేశం రథాన్ని, వెనుకనెట్టివేయవచ్చని ఇరు పార్టీల అవగాహన కావచ్చు. నిజానికి కమలనాధుల ఆశ కూడా అదే. ముందు టీడీపీని నిర్వీర్యం చేసి, ఆ స్థానంలో తాను జెండా ఎగురవేయాలి.  ఆ తర్వాత ఎలాగూ జగనన్న కేసుల జుట్టు, తమ చేతిలోనే ఉంది కాబట్టి ఆయన సంగతి, ఎన్నికలప్పుడు చూడవచ్చన్నది కమలదళాల కల- కోరిక!  ఏపీ రాజకీ యాలు- బీజేపీ నేతల ప్రకటనలు చూసిన, మెడమీద తల ఉన్న ఎవరికయినా కలిగే అభిప్రాయమే ఇది.

తాజాగా ‘తెలుగుభాష-సాంస్కృతిక శాఖ’ మంత్రి కొడాలి నాని చేసిన ప్రకటనను, సాధారణ దృష్టితో చూడలేము. ఆయన ఏకంగా ప్రధాని మోదీపైనే విమర్శలు గురిపెట్టారు. ‘‘జగన్ భార్యతో సహా బ్రహోత్సవాలకు రావాలంటున్న బీజేపీ వాళ్లు, ముందు మోదీని వెళ్లి ఓసారి సతీసమేతంగా  భూమిపూజ చేసిన తర్వాత ఇతరులకు చెప్పమనండి. మోదీ గారు ఏ భార్యను తీసుకెళతారండి’’ అని నాని చేసిన వ్యాఖ్యను,  ఆషామాషీగా చూడలేం కదా? ఆయన చేసిన ఈ వ్యాఖ్య దుమారం రేపింది. అది జాతీయ మీడియాలో కూడా హల్‌చల్ చేసింది. జగన్ ఢిల్లీ వెళ్లి, కేంద్ర పెద్దలందరినీ కలసి వచ్చిన రోజునే, సహచర మంత్రి నాని ఏకంగా ప్రధానిపైనే మాటల దాడి చేయడం, అయినా జగన్ మౌనంగా ఉన్నారంటే దాని సంకేతామిటన్నది సుస్పష్టం.

ఈలోగా నాని మాటలపై కమలదళం యాగీ మొదలుపెట్టింది. ధర్నాలకు పిలుపునిచ్చింది. ఇదే నాని మొన్నామధ్య.. కమలాన్ని కరోనా వైరస్‌తో పోల్చినప్పుడే గమ్మున కూర్చున్న కమలదళాలు, ఇప్పుడు మోదీని విమర్శిస్తే మాత్రం రోడ్డెక్కేస్తున్నాయి. అంటే పార్టీ కంటే ప్రధానికే విలువన్నమాట! సరే అది వారి అంతర్గత వ్యవహారమనుకోండి. నాని వ్యాఖ్యలపై కమలదళాలు, నింగీ నేలను ఏకం చేసేంత హడావిడి చేస్తున్నాయి. దీన్ని ఒక జాతీయ అంశంగా మార్చే పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.

ఆ ప్రకారంగా.. భాజపేయుల ఆందోళనలో, ‘లక్షలాది’ మంది కార్యకర్తలు అరెస్టవడం, ఫలితంగా  దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేయడం, దీనికి జగనన్న స్పందించి.. నానిని మంత్రివర్గం నుంచి తొలగించినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. అప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి సాధ్యం కానిది, బీజేపీ సులభంగా సాధించిందన్న కొత్త ప్రచారానికీ తెరలేపవచ్చు. ఈ పరిణామాల ఫలితంగా.. ఏపీలో అసలైన ప్రతిపక్షం టీడీపీ కాదు, భాజపానే అన్న అభిప్రాయం కలిగించడం రెండో అంకమైనా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. పనిలో పనిగా.. డిక్లరేషన్‌పై అవాకులు చవాకులూ పేలిన కొడాలి నానిని, మంత్రివర్గం నుంచి తొలగించడాన్ని తమ విజయంగా, ముఖ్యంగా హిందువుల విజయంగానూ ప్రచారం చేసుకునేందుకు, రంగం సిద్ధం చేసుకుంటారన్న అనుమానాలూ లేకపోలేదు.

మామూలుగా అయితే.. ఈపాటికే నానిపై వేటు వేయాల్సి ఉంది. కానీ జగనన్న ఇంకా జాగు చేస్తున్నారంటే, అందులో అనేక మతలబులు ఉన్నాయనుకోవచ్చు. నానిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగిస్తే.. భాజపాతో ఉన్న దోస్తీ కారణంగానే తొలగించారని, అది వారిద్దరి మ్యాచ్ ఫిక్సింగుకు నిదర్శనమన్న అపప్రద ఎదుర్కోవలసి వస్తుంది. అదే ఆయనను కొనసాగిస్తే, మోదీని ఎదిరించి నిలిచారన్న భావన తాత్కాలికంగానయినా ఏర్పడుతుంది. మరి అదే నిజమయితే.. పార్లమెంటులో అన్ని బిల్లులకూ వైకాపా మద్దతునివ్వడం, తాజాగా ఆగమేఘాలపై కేంద్ర పెద్దలకు వెళ్లి కలవడంలో, మతలబేమిటన్న ప్రశ్నలూ తెరపైకి రాక తప్పవు.

మొన్నామధ్య బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పోయిన,  మూడు సింహాల కథనే తీసుకుందాం. అవి మాయమయ్యాయన్న వార్తతో మీడియా అక్కడకు వెళ్లింది. రథం ముసుగు తీసి చూపాలని  కోరినా ఈఓ కుదరదు పొమ్మన్నారు. అదే అక్కడికి వచ్చిన,  కమలదళపతి సోము వీర్రాజు ఆదేశించిన వెంటనే ముసుగు తీసి చూపడ ం ఆశ్చర్యం. డి క్లరేషన్‌పై సంతకం వివాదం ముదురుపాకాన పడి, మంత్రి నాని వ్యాఖ్యలపై హిందూ సమాజం మండిపడింది. ఆ సమయంలో మంత్రిపై విరుచుకుపడాల్సిన అదే భాజపా దళపతి..  ‘‘తమ్ముడికి పాపం తెలియక మాట్లాడుతున్నాడు. ఆలయ సంప్రదాయాలు మార్చడం సాధ్యం కాద’‘ని సాత్వీకంగా చెప్పడమే ఆశ్చర్యం.

గత ఎన్నికల ముందు మోదీపై,  బాబు కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కుటుంబంలేని మోదీకి, తల్లి-భార్యను కూడా పట్టించుకోని మోదీకి కుటుంబ విలువలేం తెలుస్తాయని బాబు విమర్శించారు. దానితో కమలదళాలు బాబుపై మూకుమ్మడి దాడి చేశాయి.  ఇప్పుడు నాని కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. కాకపోతే కాస్తంత కూల్‌గా విమర్శించారు. కానీ ఇప్పుడు మాత్రం, ఆ స్థాయి దాడి కనిపించకపోవడమే ఆశ్చర్యం. అన్నట్లు.. మోదీపై మాట తూలిన మంత్రి గారి వ్యాఖ్యలపై, చాలాకాలం త ర్వాత ఏపీకి చెందిన యుపి ఎంపి జీవీఎల్ స్పందించారు. దేవాలయాలపై దాడులు, తిరుమల వ్యవహారంపై యాగీ అవుతున్నా వినిపించ ని ఆయన స్వరం, ఎట్టకేలకు నాని పుణ్యమా అని వినిపించింది.