ఇద్దరు స్వాములు సెలవిచ్చారుగా..ఇక జగన్ హిందువే!

324

పండితురాలు పార్వతమ్మదీ అదే మాట
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

క్రీడాకారులు, సినిమా యాక్టర్లు మాత్రమే ప్రభుత్వాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండటం చూశాం. కానీ  వారిని చూసిన పాలకులకు మొహంమొత్తినట్లుంది. అందుకే ఇప్పుడు స్వాములు వారిని నెట్టివేసి,  ఆ  స్థానంలో బ్రాండ్ అంబాసిడర్ల అవతారమెత్తుతున్నారు. అప్పట్లో ఆస్ధాన విద్వాంసులుండేవారు. ఇప్పుడు ఆ హోదా లేకపోయినా, దానిని సర్కారు స్వాములోర్లతో భర్తీ చేస్తున్నట్లుంది. ఇది దేశంలో ఒక్క తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పట్టిన మహద్భాగ్యం. సర్వసంగ పరిత్యాగులు,  పీఠాలు-మఠాల్లో ముక్కుమూసుకుని జపం చేసుకునే పిచ్చిరోజులు ఎప్పుడో గతించిపోయాయి.  ప్రజల వద్దకు పాలన మాదిరిగా.. ఇప్పుడంతా వారంతా పాలకులు, వీవీఐపీల సేవలో తరించేందుకు  తహతహలాడుతున్నారు. సదరు స్వాములిచ్చే ఒక్క ప్రకటన.. ఒక్క ముద్దు చాలు. అవతలివాడు ఆఫ్ఘనిస్తానీ అయినా, జెరూసలీమీయుడయినా క్షణాల్లో హిందువయిపోవడానికి! ఈ లోకోత్తర-లోకకల్యాణ దృశ్యకావ్యాలను చూసేందుకు రెండు కళ్లు, ఒక్క జన్మ సరిపోదు. అది కూడా హిందువులు.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల హిందువులు చేసుకున్న పూర్వ జన్మసుకృతం.

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, తిరుమలలో స్వామి వద్దకు చేరేముందు డిక్లరేషన్‌పై సంతకం చేయాలన్నది ఒక డిమాండు. అవసరం లేదు. ఆయనొక్కరు తప్ప, అన్యమతస్తులంతా సంతగించాలన్నది మరో వాదన. తెలుగు భాషా పండితుడు- ‘వేదపండితుడయిన’ మంత్రి కొడాలి నాని గారయితే.. ‘నీ అమ్మ మొగుడిని అడిగి తిరుమలకు వెళ్లాలా? డిక్లరేషన్‌పై ఎందుకు సంతకం చేయాలి?  అసలు ఈదిక్కుమాలిన విధానం పెట్టిందెవరు? అర్జంటుగా దాన్ని తీసి అవతలపారేయండని’ సెలవిచ్చారు. వేదాలు-ధర్మ శాస్త్రాలను పుక్కిట పట్టిన  పండితురాలు, లక్ష్మీపార్వతమ్మ కూడా అదే సెలవిచ్చారు.

ధర్మశాస్త్రాలు మొత్తం తెలిసిన పండితురాలిగా చెబుతున్నానని,  సర్టిఫికెట్ కూడా ఇచ్చారు.  ‘‘జగన్‌బాబు డిక్లరేషన్‌ఫై సంతకం చేయాల్సిన పనిలేదు. కొందరు స్వామీజీలు కాషాయం కట్టి పాలిటిక్స్ చేస్తున్నారు. జగన్ ఎప్పుడో హిందువుగా మారారు. స్వరూపానంద గతంలో జగన్‌తో గంగానదిలో స్నానం చేయించారు. గంగానదిలో మూడు మునకలు మునిగి ఆయన హిందువయ్యారు. అయినా  రాజు విష్ణువుతో సమాన’మని పార్వతమ్మ, తన పవిత్ర స్వరంతో సెలవిచ్చారు. ఆ లెక్కన జగనన్న ఇప్పుడు మానవ అంశలో పుట్టిన శ్రీమహావిష్ణువన్నమాట!

సరే.. రాజకీయ వేదపండితులు, ప్రకటనల ప్రవచనకర్తల సర్టిఫికెట్లు పక్కనపెడితే.. అజ్ఞానాంధకారాలు పారద్రోలి,  విజ్ఞానకాంతులు నింపే జగద్గురువులు కూడా వారి బాటనే పట్టి.. జగన్మోహన్‌రెడ్డిని పెద్ద మనసుతో దీవించి, ఆయన హిందువేనని సెలవిచ్చిన తర్వాత, ఇక జగన్మోహన్‌రెడ్డి హిందువు కాకుండా పోతారా చెప్పండి? ఇప్పటిదాకా జగన్గురువు-జగద్గురువు విశాఖ స్వామి స్వరూపానంద ఒక్కరే అనుకుంటే.. ఇప్పుడు శ్రీమాన్ చినజీయరు స్వామి వారు కూడా జగన్ గొప్పతనం గురించి పామరలోకానికి వివరించేశారు. ‘‘జగన్ ఏం చేసినా పూర్తిగా నమ్మి త్రికరణ శుద్ధిగా చేస్తాడు. ఆయన తిరుమల దర్శనం వల్ల హిందూమతానికి ఎనలేని మేలు జరుగుతుందని’’ జీయరయ్యగాంతటి దేవర సెలవిచ్చారు. వైష్ణవాచార్యుల వారు చెప్పారు కాబట్టి, హిందువులు కూడా పరిశుద్ధాత్మతో దేవుడిని నమ్మేయడమే!

ఆ ప్రకారంగా.. జగనన్న మతంపై నెలకొన్న అపపోహలనే అజ్ఞానాంధకారాలను తొలగించి, ఆయన హిందువనే చెప్పి కొత్త జ్ఞానగుళికలొసంగించారు. సో..  ఈ సమాజమంతా ఏకమై నిలిచి జగనన్న హిందువు కాదని ఎంత గింజుకుని వాదించినా, జగనన్న అసలు సిసలు హిందువేనన్మాట! కాదన్నవారి కళ్లు పేలిపోవడమే కాదు. నవరంధ్రాల నుంచి రక్తం ఏరులై పారుతుంది. స్వాములోర్లు సర్టిఫికెట్టిచ్చిన తర్వాత కూడా కాదనడానికి, వారిది గుండెనా చెరువా?

ఇంతమంది స్వాములు చెప్పిన తర్వాత, ఇక జగనన్న హిందువు కాకుండా పోతాడా? అందుకే తిరుమలకు వెళ్లిన ఆయన, డిక్లరేషన్‌పై సంతగించకుండానే స్వామిని దర్శించుకున్నారు. ఇద్దరు స్వాములు సెలవిచ్చినట్లుగా జగనన్న నిఖార్సయిన హిందువయితే, మరి లోటస్‌పాండ్‌లోని ఆయన ఇంటిపై నిలువెత్తు శిలువ ఎందుకున్నట్లని, ఎవరైనా అడిగితే వారు అమాయకుల కిందే లెక్క!  పార్వతమ్మ చెప్పినట్లు.. అది స్వరూపానందుల వారు, జగనన్నను గంగలో ముంచి మూడు మునకలు వేయించి, హిందువుగా మార్చనప్పటి కథ. అసలు చూడాల్సింది లోటస్‌పాండు ఇంటిపై ఉన్న నిలువెత్తు శిలువ కాదు. దాని వెనుక ఉన్న దాగి ఉన్న గుడిని చూడాలన్నది.. మెడలో డజను తాయత్తులతో పాటు, శిలువ బొమ్మ కూడా వేసుకున్న కొడాలి నాని లాంటి భక్తుల కవిహృదయం. ఇంతమంది సద్గురులు జగనన్న హిందువేనని తీరికూర్చుని తీర్మానించిన తర్వాత కూడా, బజరంగదళాలూ అనవసరంగా లోటస్‌పాండ్‌పై దాడికి దిగడం మహానేరమే కాదు. మహాపచారం కూడా.  హిందూ సమాజానికి అర్ధమవుతోందా?

1 COMMENT

  1. Hmm it appears like your blog ate my first comment (it was extremely long) so I guess I’ll just sum it up what I had written and say, I’m thoroughly enjoying your blog. I as well am an aspiring blog blogger but I’m still new to everything. Do you have any tips for rookie blog writers? I’d really appreciate it.