వ్యవసాయరంగ సంక్షోభం

400

పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ బిల్లులు!

స్వయం సమృద్ధి ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే లక్ష్యమంటూ మోడీ ప్రభుత్వం ఒకవైపు ఊదరగొడుతూ, మరొకవైపు దేశ‌ ఆర్థిక వ్యవస్థపై బహుళ జాతి సంస్థలు, దేశీయ కార్పోరేట్ సంస్థల పెత్తనానికి పెద్ద పీఠ వేస్తున్నది. రైతుల‌ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ మాటల గారడీ చేస్తూ వచ్చిన మోడీ ప్రభుత్వం తాజాగా వ్యవసాయ సంస్కరణల పేరుతో మూడు చట్టాలను దేశంపై రుద్దుతున్నది. 1) రైతుల ఉత్పత్తి – వ్యాపారం – వాణిజ్యం(ప్రచారం, సదుపాయం) బిల్లు – 2020, 2) రైతుల(సాధికారత, రక్షణ) ధరల హామీ – వ్యవసాయ సేవల‌ ఒప్పందం బిల్లు-2020, 3) నిత్యావసర సరుకుల(సవరణ) బిల్లు -2020. మోడీ నేతృత్వంలోని యన్.డి.ఏ. ప్రభుత్వానికి లోక్ సభలో అడ్డేలేదు కాబట్టి ఆమోదించుకొన్నారు. పెద్దల సభగా పిలువబడే రాజ్యసభ పనితీరుపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత వివాదాస్పదమైన, రైతాంగం భవిష్యత్తుతో ముడిపడిన బిల్లులను సమగ్రంగా చర్చించడానికి వీలుగా సెలక్ట్ కమిటీలకు పంపాలన్న విపక్షాల డిమాండును, ఓటింగ్ సందర్భంగా డివిజన్ కోరిన సభ్యుల విన్నపాన్ని తృణీకారభావంతో పెడచెవినపెట్టి రాజ్యాంగంలో ప్రస్తావనేలేని మూజువాణి ఓటు ద్వారా రాజ్యసభలో కూడా ఆమోదించినట్లు ప్రకటించుకొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని చెప్పుకొంటాము. కానీ, చట్టాల రూపకల్పనలో పార్లమెంటు ఉభయ సభల్లో జరుగుతున్న తంతు చూస్తుంటే జుగుప్సాకరంగా ఉన్నది. రాష్ట్రపతి ఆమోదముద్ర తదనంతరం ఆ బిల్లులు చట్ట రూపం దాల్చనున్నాయి.

వ్యవసాయ రంగంలో సంస్కరణల అమలులో కేంద్ర ప్రభుత్వం వేగం పెంచి, దూకుడు ప్రదర్శిస్తున్నది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగాన్ని ఈ చట్టాలు ఆదుకొంటాయా, లేదా, మరింత సంక్షోభంలోకి నెట్టుతాయా! అన్న చర్ఛ దేశ వ్యాపితంగా జరుగుతున్నది. రైతాంగ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా ఉన్న బిల్లులపై కేంద్ర మంత్రివర్గంలో మాట్లాడే అవకాశం కూడా లభించలేదంటూ నిరసన గళం వినిపిస్తూ యన్.డి.ఏ. భాగస్వామ్య పార్టీ అకాలీదళ్ కు చెందిన‌ కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖా మంత్రి శ్రీమతి హర్సిమ్రాట్ కౌర్ బాదల్ తన పదవికి రాజీనామా చేశారు. రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నది. రైతు సంఘాలు ఈనెల 25న దేశ వ్యాపిత ఆందోళనకు పిలుపిచ్చాయి.

“ఒకే దేశం ఒకే మార్కెట్” విధానంతో దళారీ వ్యవస్థకు, కమీషన్ల వ్యవస్థకు అడ్డుకట్టవేస్తామని, రైతు తాను పండించిన పంటను దేశంలో ఎక్కడైనా, తనకు ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకోవచ్చంటూ ప్రధాన మంత్రి మోడీ తియ్యటి మాటలను వినసొంపుగా వినిపించారు. కనీస మద్ధతు ధరల వ్యవస్థ రద్దైపోతుందని, వ్యవసాయ మార్కెట్ల వ్యవస్థ ధ్వంసమవుతుందని, తద్వారా లోపభూయిష్టంగానైనా ఉన్న రక్షణ వ్యవస్థలు కనుమరుగైతే సంబ‌వించే దుష్పరిణామాలను తలచుకొంటూ రైతాంగం మనోవేధనకు గురౌతున్నది. కనీస ధరల నిర్ణాయక వ్యవస్థ, ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ యధాతదంగా కొనసాగుతాయంటూ దేశ ప్రధాని మోడీ బుకాయిస్తున్నారు. బడా వ్యాపారులు, కార్పోరేట్ సంస్థలు, రీటేల్ రంగంలో రాజ్యమేలుతున్న సూపర్ మార్కెట్ యాజమాన్యాలు కనీస మద్ధతు ధరలకు తక్కువ లేకుండా రైతుల నుండి వ్యవసాయోత్పత్తులను విధిగా కొనుగోలు చేయాలన్న నిబంధనను చట్టంలో పొందుపరచమంటే మాత్రం నిర్ధ్వందంగా తిరస్కరించారు. వ్యసాయోత్పత్తుల కొనుగోలుకు సంబంధించి రైతులతో వ్యాపార, వాణిజ్య సంస్థలు ముందస్తుగా చేసుకొనే ఒప్పందాలను ఉత్పత్తులు నాసిరకంగా ఉన్నాయనో, మార్కెట్లో గిరాకీ లేదనో, మరేదైనా సాకులు చెప్పి ఉల్లంఘిస్తే, కొనుగోలు సంస్థలు గుత్తాధిపత్యం చెలాయిస్తే, రైతాంగం ప్రయోజనాలను పరిరక్షించడానికి ఈ చట్టాల్లో ఉన్న రక్షణ నిబంధనలు ఏమిటో వివరించమంటే నోరు మెదపడం లేదు. నిత్యావసర సరుకుల నిల్వపై ఉన్న నియంత్రణలను తొలగిస్తే ప్రయివేటు వ్యాపార వర్గాలు అక్రమ నిల్వలు చేసి, కృత్రిమ కొరత సృష్టించి, ధరలను పెంచి, వినియోగదారులను దోపిడీ చేయడాన్ని ఎలా కట్టడిచేస్తారంటే పట్టించుకోలేదు. విదేశాల నుండి వ్యవసాయోత్పత్తులను ఇబ్బడిముబ్బడిగా దిగుమతి చేసి స్వదేశీ ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ లేకుండా చేసే ప్రమాదాన్ని ఎలా నియంత్రిస్తారో చెప్పరు. స్వేచ్ఛా విపణిలో మార్కెట్ శక్తుల దోపిడీ నుండి రైతాంగాన్ని రక్షించే వ్యవస్థలే లేని దుస్థితిలోకి నెట్టడానికి మాత్రమే ఈ చట్టాలు దోహదపడతాయన్న విమర్శలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పకుండా దగాకోరు పద్ధతులను అనుసరిస్తున్నది.

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న‌ వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకోవడానికి, రైతుల ఆత్మహత్యల నిరోధానికి అమలు చేయాల్సిన కార్యాచరణకు సంబంధించి లోతైన అధ్యయనం చేసి, తగిన సిఫార్సులు చేయమని ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రజ్ణులు డా.ఎం.ఎస్.స్వామినాధన్ అధ్యక్షతన రైతుల జాతీయ కమీషన్ ను 2004 నవంబరులో యు.పి.ఏ. ప్రభుత్వం నియమించింది. 2006 అక్టోబరులో కమీషన్ నివేదిక సమర్పించింది. 14 సం.లు గడచి పోయినా స్వామినాధన్ కమీషన్ సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. వ్యవసాయ ఉత్పత్తులన్నింటికీ కేంద్ర ప్రభుత్వం మద్ధతు ధరలను ప్రకటించడం లేదు. పెట్టుబడులు తడిసి మోపిడవుతున్నాయి, ప్రకటించిన మద్ధతు ధరల ద్వారా కొన్ని సందర్భాలలో వ్యవసాయ ఖర్చులు కూడా తిరిగి రావడం లేదు. వ్యవసాయ ఉత్పత్తులను అమ్మేటప్పుడు అత్యధిక సమయాలలో మద్ధతు ధరలకు కొనేవారే కరువవుతున్నారు. ప్రకృతి వైఫరీత్యాలు, ప్రభుత్వాల రైతాంగ వ్యతిరేక విధానాలు, ఇత్యాధి సమస్యలతో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టివేయబడింది. ఈ పూర్వరంగంలో ఉత్పత్తి వ్యయానికి అదనంగా కనీసం 50% కలిపి కనీస మద్ధతు ధరలను నిర్ణయించాలన్న అత్యంత కీలకమైన స్వామినాధన్ కమీషన్ సిఫార్సుకు సర్వసమ్మతి వెల్లడయ్యింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ సిఫార్సును అమలు చేయాలని డిమాండ్ చేసి, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ నివేదిక మొత్తాన్ని అటకెక్కించి, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ మార్కెట్ శక్తుల కబంధ హస్తాల్లోకి రైతాంగం భవిష్యత్తును మోడీ ప్రభుత్వం నెట్టివేస్తున్నది.

ఎనబై శాతంకుపైగా ఉన్న సన్న, చిన్నకారు, మధ్యతరగతి రైతులకున్న ఆర్థిక స్తోమత ఎంత? వాళ్ళు పండించిన పంటను దేశంలో ఎక్కడికైనా తీసుకెళ్ళి లేదా ఇ-మార్కెట్ విధానంలో అమ్ముకోగలిగిన నైపుణ్యం, శక్తిసామర్థ్యాలున్నాయా? సాంకేతికంగా మౌలిక సదుపాయాలు ఎంత మందికి అందుబాటులో ఉన్నాయి? ప్రభుత్వ నియంత్రణలో నిర్వహించబడుతున్న మార్కెట్ వ్యవస్థ అత్యంత లోపభూయిష్టంగా ఉన్న మాట వాస్తవం. ఆ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. రైతులను భాగస్వాములను చేసి, ప్రజాతంత్రీకరించి, అవినీతిరహితంగా, సమర్థవంతంగా నిర్వహించాలి. వ్యాపారుల, దళారుల బారి నుండి రైతాంగాన్ని కాపాడడానికి, రాష్ట్ర _కేంద్ర ప్రభుత్వాలు మూలధన నిధిని ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరకు పంటను కొని రైతులు నష్టపోకుండా పకడ్బందీ చర్యలను అమలు చేస్తామని వాగ్ధానాల మీద వాగ్ధానాలు చేశారు. అవి అమలుకు నోచుకోలేదు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి బయటపడవేయడానికి ఉపకరించే వివిధ కమీషన్లు చేసిన రైతాంగ అనుకూల సిఫార్సులను అమలు చేయకుండా అక్రమ సంపాదనే లక్ష్యంగా పరితపిస్తున్న కార్పోరేట్ సంస్థల నియంత్రణలో ఉన్న స్వేచ్ఛా మార్కెట్లోకి నెట్టివేస్తే లాభసాటి ధరలను బక్కచిక్కిన రైతులు పొందగలరా! సన్న, చిన్న, మధ్యతరగతి రైతులకు, కౌలు రైతుల్లో ఎంత మందికి బ్యాంకుల నుండి పంట రుణాలు లభిస్తున్నాయి? వడ్డీ వ్యాపారులు, ప్రయివేటు ఆర్థిక సంస్థల నుండి అధిక వడ్డీకి అప్పులు చేసి, పెట్టుబడి పెట్టి సేద్యం చేస్తున్న రైతులు రుణదాతల ఒత్తిళ్ళును తట్టుకొని పండించిన పంటను నిల్వ చేసుకొని, లాభసాటి ధర లభించే మార్కెట్ దేశంలో ఎక్కడున్నదో శోధించి, అమ్ముకోగలరా! అన్నది హిమాలయ పర్వతమంత ప్రశ్న. ప్రభుత్వ నియంత్రణలోని మార్కెట్ల వ్యవస్థ, కొన్ని వ్యవసాయోత్ఫత్తులకైనా ప్రభుత్వం కనీస మద్ధతు ధరలను ప్రకటిస్తున్న పూర్వరంగంలోనే మార్కెట్ శక్తులు, దళారులు, కమీషన్ ఏజెంట్ల దోపిడీకి రైతాంగం దారుణంగా బలైపోతుంటే ఆ దుష్టశక్తుల దోపిడీ నుండి కాపాడంటూ రైతాంగం సుదీర్ఘ కాలంగా వివిధ రూపాలలో ఉద్యమాలు చేస్తుంటే ఏ మాత్రం స్పందించని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాల ద్వారా సంపూర్ణంగా మార్కెట్ శక్తుల గుప్పెట్లోకి వ్యవసాయ రంగాన్ని నెట్టేస్తున్నదన్న భావన సర్వత్రా నెలకొన్నది.

రైతాంగానికి అనేక చేదు అనుభవాలున్నాయి. టమోటా, ఉల్లిపాయలు, పండ్లు వగైరా పండించిన రైతులు మహానగరమైన హైదరాబాదులో మంచి మార్కెట్ ఉంటుందని కొండంత ఆశతో తమ ఉత్ఫత్తులను తరలిస్తే రవాణా ఖర్చులు కూడా లభించక రోడ్డుపైనే పడేసి దిగాలుగా వెనుదిరిగి వెళ్ళిన ఉదంతాలెన్నో. చేసిన అప్పులు చెల్లించలేక అవమాన భారంతో కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వారిలో అత్యధికులు మెట్ట మరియు కరవు పీడిత‌ ప్రాంతాల రైతులు, అందులోనూ సన్న, చిన్న, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులే ఎక్కువ మంది ఉన్నారు. రైతుల ఆత్మహత్యలను అరికట్టడానికి అమలు చేయాల్సిన కార్యాచరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధే కొరవడింది. సేద్యం చేయడానికి ఎందుకు రైతాంగంలో అత్యధికులు నిరాశక్తత వ్యక్తం చేస్తున్నారో ఏనాడైనా ప్రభుత్వాలు శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాయా! ఆహార భద్రతకు ఏర్పడబోయే ముప్పు కోణంలో ఆలోచిస్తున్నాయా!

దోపిడీకి అవకాశం లేకుండా వ్యవసాయోత్ఫత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు ఏర్పాట్లు చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. మార్కెట్ యార్డుల సంఖ్యను పెంచాలి. యార్డులను మరింత పటిష్టం చేసి, పని తీరును మెరుగుపరచాలి. ప్రతి మండలానికి ఒక మార్కెట్ యార్డును విధిగా నెలకొల్పాలి. అవసరాన్ని బట్టి 5, 6 గ్రామాలకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మార్కెట్ కమిటీలను రైతులు తమకుతామే నిర్వహించుకోవాలి. మార్కెట్ కమిటీలకు అధ్యక్షుడిని, సభ్యులను నామినేట్ చేసే ప్రస్తుత పద్ధతికి తక్షణం స్వస్తి చెప్పాలి. మార్కెట్ కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలి. ఈ సంస్థల నిర్వహణను రైతుల అధీనంలో ఉంచడానికి తగిన మార్గదర్శకాలను, నియమావళిని రూపొందించి, అమలు చేయాలి. మార్కెట్ ఫీజు రూపంలో రైతుల నుండి వసూలు చేసిన నిథులను ప్రత్యేకించి మార్కెట్ యార్డులలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మాత్రమే వినియోగించుకోవాలి. సమాచార సాంకేతిక పరిజ్ణానాన్ని, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ రంగాలలో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని వినియోగించుకొని ప్రస్తుత మార్కెట్లను ఆధునీకీకరించడానికి కృషి చేయాలి. శీతల గిడ్డంగులను నెలకొల్పాలి. అనధికారికంగా కమీషన్లు వసూలు చేయడాన్ని అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. సరుకుల లావాదేవీలు జరిగిన రోజే కౌంటర్ లో రైతులకు డబ్బు చెల్లించాలి. సరుకులను గ్రేడింగ్ చేసి, గ్రేడింగ్ ఆధారంగా ధరలు నిర్ణయిస్తున్నందున ప్రతి మార్కెట్ యార్డులో లేబరేటరీ సౌకర్యంతోబాటు శిక్షణ పొందిన గ్రేడర్లను నియమించాలి. వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించాలి. వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతిక, మార్కెటింగ్ మద్ధతు తోడ్పాటునందించాలి. సరుకు నిల్వ‌ గోదాములు, రుణ సౌకర్యం కల్పించాలి. మన రైతుల జీవనోపాధికి రక్షణ కల్పించేందుకుగాను దిగుమతి ధరలు స్థిరంగా ఉండేందుకు కొన్ని వ్యవసాయోత్ఫత్తులకు పలు రకాల సుంకాలు విధించే విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. పరిమాణాత్మక ఆంక్షలు విధించాలి. భారత ఆహార సంస్థ(ఎఫ్.సి.ఐ.), ఇతర వ్యవసాయోత్ఫత్తుల సేకరణ సంస్థలను బలోపేతం చేయాలి. మార్కెట్ ధరల స్థిరీకరణ నిథిని ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్ధతు ధర రైతులకు తప్పనిసరిగా లభించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, రైతాంగ‌ కమీషన్ల నివేదికల్లో సిఫార్సులు నిక్షిప్తమై ఉన్నాయి.

సహకార వ్యవస్థను విస్తరించి, బలోపేతం చేసి, పటిష్టపరిస్తే చిన్న కమతాలపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులను సంక్షోభం నుండి బయటపడేయడానికి ఉపకరిస్తుంది. నేను ఇటీవల కాలంలో కృష్ణా జిల్లా వక్కలగడ్డ వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని, ఆ సంస్థ నిర్వహిస్తున్న బ్యాంకును, గిడ్డంగులను సందర్శించాను. దాని పుట్టుక, పెరుగుదల, అభివృద్ధి, కార్యకలాపాలు, నాయకత్వ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అడిగి తెలుసుకొన్నాను. రైతులకు పంట రుణాలే కాకుండా వారి పిల్లల చదువులకు రుణాలిస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులను అందజేస్తున్నారు. రైతులు తమ వ్యవసాయోత్ఫత్తులను నిల్వ చేసుకోవడానికి గిడ్డంగులను నిర్మించి, నిర్వహిస్తున్నారు. రైతుల నుండి తక్కువ అద్దెలను వసూలు చేస్తున్నారు. రైతులు తమ పంటను అమ్మాలనుకొన్నప్పుడే అమ్ముకోవచ్చు. ఆ సొసైటీనే కొంటుంది. రైతులు నిల్వ చేసుకొన్న సరుకు విలువలో 75% మొత్తాన్ని తక్కువ వడ్డీతో రుణంగా ఇస్తారు. సొసైటీ సభ్యులు అనారోగ్యానికి గురైతే ఆసుపత్రి ఖర్చులో 10% మొత్తాన్ని ఉచితంగా అందజేస్తారు. సభ్యులకు లక్ష రూపాయల జీవిత భీమాను ఏర్పాటు చేస్తున్న‌ది. సహజ మరణం చెందితే రు.22,000 సభ్యుడి కుటుంబానికి అందజేస్తుంది. కామన్ గుడ్ ఫండ్ నుండి గ్రామాభివృద్ధికి నిథుల తోడ్పాటును అందజేస్తున్నది. మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలిచ్చి వారి అభ్యున్నతికి సహకరిస్తున్నది. సొసైటీకి సమకూరే లాభాలను సభ్యులైన రైతులకే డివిడెంట్స్ రూపంలో పంపిణీ చేస్తున్నది. రైతు కుటుంబాల‌ సంక్షేమం, అభివృద్ధి పట్ల అంకితభావంతో ఆ సొసైటీ కృషి చేస్తున్నది.

ఇంతకంటే మెరుగ్గా, విస్తృతంగా, ఆదర్శవంతంగా రైతాంగానికి సేవలందిస్తున్న పేరు ప్రతిష్టలున్న సంస్థ‌ తెలంగాణ రాష్ట్రం, పాత కరీంనగర్ జిల్లాలోని ముల్కనూరు సొసైటీ అని విన్నాను. రైతాంగం యొక్క విశ్వాసాన్ని చూరగొంటూ, ప్రశంసలందుకొంటున్న వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనే కాదు, వివిధ రాష్ట్రాలలో సమర్థవంతంగా పని చేస్తున్న మంచి అనుభవాలున్నాయి. కేరళ రాష్ట్రం అమలు చేసిన గ్రామీణ రుణ విమోచన చట్టాన్ని ఆదర్శంగా తీసుకొని రైతాంగాన్నిఒక్కసారిగా రుణ విముక్తులను చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొంటే వ్యవసాయ సంక్షోభం నుండి రైతాంగాన్ని కాపాడుకోవచ్చు.

“స్వయం సమృద్ధి ఆర్థిక వ్యవస్థ” అంటూ జపం చేయడమే కానీ‌ రైతాంగ సహకార వ్యవస్థను ప్రోత్సహించి, బలోపేతం చేయాలన్న‌ ఆలోచనే చేయలేదు. వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని సంక్షోభం నుండి రక్షించుకోవడానికి, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక, కార్పోరేట్ – మార్కెట్ దోపిడీ శక్తుల అనుకూల విధానాల ప్రతిఘటనోద్యమాలలో ప్రజలు భాగస్వాములు కావాలి.
ప్రముఖ రైతు ఉద్యమ నేత అమరజీవి కొల్లి నాగేశ్వరరావు గారి సంస్మరణ సభ సెప్టంబరు 24న విజయవాడలో జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఐక్యంగా 25వ తేదీన దేశ వ్యాపిత ఆందోళనకు పిలుపిచ్చాయి. ఈ సందర్భాలను పురస్కరించుకొని ఈ వ్యాసాన్ని వ్రాశాను.

-టి.లక్ష్మీనారాయణ‌
సామాజిక ఉద్యమకారుడు
మొబైల్:9490952221