జగన్ ఇచ్చిన ఆయుధాన్ని ప్రయోగిద్దాం
బాబుకు హిందూ కార్డు అవకాశం ఇవ్వొద్దు
జమిలి ఎన్నికలు ఖాయం
బీజేపీ పదాధికారుల భేటీలో నిర్ణయం
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

తిరుమల డిక్లరేషన్ అంశంపై..  ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని హిందూ చాంపియన్‌గా అవతరించాలని  బీజేపీ నిర్ణయించింది. జగన్ తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇస్తే ఒక విధంగా, ఇవ్వకపోతే ఇంకో విధంగా వ్యవహరించాలన్న దానిపై,  బీజేపీ పదాధికారుల సమావేశం చర్చించింది. గత 15 నెలల నుంచి హిందూమతంపై జరుగుతున్న దాడులను ఆయుధంగా మలచి, తెలుగుదేశం పార్టీ కొత్తగా సంధిస్తున్న హిందూ కార్డును అడ్డుకుని, అది ఆ పార్టీకి ఎట్టి పరిస్థితిలోనూ ఆయుధం కాకుండా చూడాలని తీర్మానించింది. అసలు టీటీడీ హిందూ కార్డు ఎత్తుకోవడం వల్ల, రాజకీయంగా తమకు వచ్చే నష్టంపై  చర్చించింది.  అన్నింటికంటే మించి.. జమిలి ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలన్న సంకేతాలిచ్చింది.

తాజాగా విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల భేటీలో.. ఇకపై రాష్ట్రంలో హిందుత్వ కార్డును, పూర్తి స్థాయిలో వాడాలన్న నిర్ణయానికి వచ్చింది. అంతర్వేది ఘటన పై సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో.. రాష్ట్రంలో ఇప్పటి వరకూ దేవాలయాలకు సంబంధించి జరిగిన అన్ని ఘటనలనూ, అందులో చేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని నిర్ణయించింది. టీటీడీ డిక్లరేషన్ వ్యవహారంలో సీఎం జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా వ్యూహరచన చేయాలని బీజేపీ పదాధికారుల సమావేశం నిర్ణయించినట్లు సమాచారం.

బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్  తిరుమల రానున్న సందర్భంగా.. ఆయన తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్న డిమాండుకు, పదునుపెట్టాల్సిందేనని నేతలు స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: ఏమిటీ…డిక్లర్వేషాలు? అందులో భాగంగా, మంగళవారం చిత్తూరు-కడప జిల్లా పార్టీ నేతలు, టీటీడీ పరిపాలనా భవనం వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా.. జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేస్తే ఒకలా.. చేయకపోతే మరో విధంగా స్పందించాలన్న దానిపై చర్చ జరిగింది. ఒకవేళ సంతకం చేయకపోతే.. గతంలో జగన్ పాదయాత్ర ప్రారంభం-ముగింపు సంధర్భంలో తిరుమలకు వెళ్లిన జగన్ డిక్లరేషన్ ఇవ్వని వైనాన్ని, వీడియోల ఆధారంగా జనంలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. అంటే సంతకం పెట్టకపోతే జగన్‌ను క్రైస్తవ సీఎంగా జనంలోకి తీసుకువెళ్లాలని నాయకులు సూచించారు. ఒకవేళ సంతకంపెడితే. ఆయన క్రైస్తవుడయినందుకే సంతకం పెట్టినందున, తర్వాత తాము చేసే ప్రచారానికి సహజంగా సానుకూలత లభిస్తుందని విశ్లేషించారు. డిక్లరేషన్ క్రైస్తవ దొరలు పెట్టిందే

కాగా, అంతర్వేది ఘటన తర్వాత పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాయని, దానికంటే మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ‘నాని డిక్లరేషన్’పై నోరు విప్పరేమి?, ఇంకా బలంగా జనంలోకి వెళ్లాయని పలువురు నాయకులు, నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. టీటీడీ డిక్లరేషన్‌పై మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు ప్రతి హిందువునూ గాయపరిచాయని, దానితో హిందుత్వ భావన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోందని వెల్లడించారు. ఇది పార్టీకి కలసివచ్చే అంశమేనన్నారు. దీనిపై నాయకత్వం సరైన ప్రణాళిక రూపొందిస్తే, పార్టీ బలపడుతుందని సూచించినట్లు తెలుస్తోంది.

ఆరకంగా జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అయితే, బలమైన యంత్రాంగం ఉన్న టీడీపీ కూడా.. కొత్తగా హిందూ కార్డును ప్రయోగిసున్నందున వైనంపై చర్చ జరిగింది.  అది ఆ పార్టీకి లబ్ధి కాకుండా చూడాలని, నేతలు సూచించినట్లు తెలిసింది. అంతర్వేది నుంచి టీటీడీ డిక్లరేషన్ వరకూ.. మత సంబంధమైన  వ్యవహారంలో టీడీపీ దూకుడుగా వెళుతోందని పలువురు ప్రస్తావించినట్లు సమాచారం.

అయితే టీడీపీ దూకుడును అడ్డుకునేందుకు, గత బాబు ప్రభుత్వం అనుసరించిన పలాయన విధానాన్ని, అదే హిందూ సమాజంలో ప్రచారం చేయాలని నిర్ణయించారు. జగన్ తిరుమలకు వచ్చినప్పుడు, అప్పటి సీఎం చంద్రబాబు సర్కారు ఎందుకు అడ్డుకోలేదు? డిక్లరేషన్‌పై ఎందుకు కఠినంగా వ్యవహరించలేదన్న ప్రచారాన్ని, కింది స్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ అంశంలో టీడీపీకి ఎట్టి పరిస్థితిలో, రాజకీయ లబ్థి జరగకుండా చూడాలని నేతలు సూచించారు. కాగా సమావేశంలో మాట్లాడిన అధ్యక్షుడు సోము వీర్రాజు సహజంగానే వైకాపా కంటే టీడీపీ పైనే విమర్శలు కురిపించినట్లు సమాచారం.

కాగా, పదాధికారుల భేటీలో జమిలి ఎన్నికల సంకేతాలు, విస్పష్టంగా ఇచ్చినట్లు సమాచారం. పార్టీ జాతీయ సంఘటనా కార్యదర్శి సతీష్‌జీ,  ఆమేరకు నేతలకు సంకేతాలిచ్చారు. ఇంకా ఎన్నికలు చాలా ఏళ్లు ఉందనుకోవద్దని, జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం  ఉందని వెల్లడించినట్లు తెలుస్తోంది. దానికోసం అక్టోబర్3 నుంచి శిక్షణా తరగతులు ప్రారంభించాలని, అది మండల స్థాయి వరకూ నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner